మన కాలపు సామ్రాజ్యవాదాన్ని, కొనసాగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను అర్థం చేసుకోవడానికి వాటి మూలాలను 1917 నాటి రష్యన్ విప్లవంలో వెతకడం అవసరం. అక్టోబర్ విప్లవం ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్రాజ్యవాద వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యతిరేక విప్లవం. 1916 లోనే లెనిన్ సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొత్త మార్కెట్లను కనుగొనడానికి, వనరులను దక్కించుకునే సురక్షిత మార్గాల కోసం, పెట్టుబడుల ఎగుమతి కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి పెట్టుబడిదారీ శక్తులకు ఉన్న అవసరమే సామ్రాజ్యవాదాన్ని నడిపిస్తుందని ఆయన ప్రతిపాదించాడు. ఈ క్రమంలో పోటీ, సంఘర్షణ, ప్రపంచ దోపిడీలు చోటు చేసుకుంటాయని వివరించాడు.
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికవర్గ పోరాటాన్ని, వలస రాజ్యాలు, అర్ధ-వలస రాజ్యాల ప్రజల జాతీయ విముక్తి పోరాటాలను లెనిన్ సామ్రాజ్యవాద సిద్ధాంతం ఒకటిగా చేర్చింది. వలస రాజ్యాల ప్రజల విముక్తికి దారితీసే సామ్రాజ్యవాద వ్యతిరేక వైరుధ్యాలపై కూడా లెనిన్ కీలకమైన అవగాహనను అందించాడు. రష్యా కోసం లెనిన్ అభివృద్ధి చేసిన విప్లవాత్మక వ్యూహానికి ఈ సిద్ధాంతం మార్గనిర్దేశం చేసింది. దీనిని ఆయన సామ్రాజ్యవాద గొలుసులో అత్యంత బలహీనమైన లింకుగా అభివర్ణించాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని జార్ చక్రవర్తిపై అంతర్యుద్ధంగా మార్చాలని లెనిన్ పిలుపునిచ్చాడు.
ఈ చారిత్రక విప్లవం తర్వాత రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. మొదటిది, రష్యాలో సోషలిజం స్థాపన. తదనంతర కాలంలో ఇది సోవియట్ యూనియన్‌గా ఆవిర్భవించింది. ఇది సామ్రాజ్యవాదం, సోషలిజం మధ్య నెలకొన్న ఒక కొత్త ప్రపంచ వైరుధ్యాన్ని పరిచయం చేసింది. మొదటిసారిగా, ఒక విప్లవం విజయవంతం కావడం ద్వారా సోషలిజం భౌతిక వాస్తవ రూపం దాల్చింది.
రెండవది, ఇరవయ్యవ శతాబ్దపు రూపాన్ని మార్చిన విప్లవాల ఉప్పెన. ఈ విప్లవాలు వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. రష్యన్ విప్లవంతో ప్రారంభమైన ఈ క్రమం చైనా, వియత్నాం, కొరియా, క్యూబా విప్లవాలు విజయవంతం కావడం వరకు కొనసాగింది.
ఈ విప్లవాలలో సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా లేదా సామ్రాజ్యవాదానికి తొత్తుగా ఉన్న లేదా దానితో పొత్తు పెట్టుకున్న దేశీయ పాలకులకు వ్యతిరేకంగా జాతీయ విముక్తి పోరాటాలు జరిగాయి.
సామ్రాజ్యవాదం, సోషలిజం మధ్య నెలకొన్న బలాబలాల పొందిక కారణంగా సోషలిస్టు రష్యా ఈ జాతీయ విముక్తి పోరాటాలను బలపరిచింది. సోషలిస్టు ఉద్యమం, జాతీయ విముక్తి ఉద్యమం మరింతగా పెనవేసుకుపోవడంతో సామ్రాజ్యవాద శక్తులు ఆక్రమించుకున్న వలస రాజ్యాలలో ఎక్కువ భాగం విముక్తి పొందడానికి దోహదపడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి కాలం అమెరికన్ సామ్రాజ్యవాద ఆధిపత్యంతో కూడుకుని ఉంది. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద వ్యవస్థ ప్రపంచంలో దాని స్థానాన్ని రక్షించుకోవడానికి, సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించింది. వలసవాద వ్యతిరేక ఉద్యమాలు, జాతీయ విముక్తి పోరాటాలు బలపడుతున్న సమయంలో, అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద కూటమి సోషలిస్టు బ్లాక్‌కు వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగించింది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడి
ఇరవయ్యవ శతాబ్దపు విప్లవాల వెల్లువలు గత రెండు దశాబ్దాలలో వెనుక పట్టు పట్టాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అపారమైన సంచయం, కేంద్రీకరణ, అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రకంగా నడిచే అభివృద్ధి, ఈ కాలపు కొత్త లక్షణంగా మారింది. ఇది క్రమంగా ఫైనాన్స్ పెట్టుబడి ఆధారిత ప్రపంచీకరణకు ఊతమిచ్చింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు నెట్టింది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడి పెరగడం, తూర్పు ఐరోపా దేశాలు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో సహా సోషలిస్టు బ్లాక్ పతనం సమాంతరంగా జరిగాయి. సోషలిస్టు బ్లాక్ పతనాన్ని వేగవంతం చేసింది.
అమెరికా సామ్రాజ్యవాద సాటిలేని ఆధిపత్యం
1990లలో అమెరికా నేతృత్వంలో సామ్రాజ్యవాదం విజయవంతంగా నెలకొన్నది. ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భావానికి దారి తీసింది. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదం దూకుడు ఎజెండాను చేపట్టింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో ట్విన్ టవర్స్ మీద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత సామ్రాజ్యవాదం "ఉగ్రవాదంపై యుద్ధం" ప్రకటించింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించింది. 2003లో ఇరాక్ ఆక్రమణ, విధ్వంసం చోటు చేసుకున్నాయి. తరువాత, లిబియా, సిరియా దేశాలలో సైనిక జోక్యాలకు తెగబడింది.
సైనిక జోక్యం ద్వారా ఎలాంటి ఫలితాలను సాధించకుండానే చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సేనలు నిష్క్రమించాయి. సైనిక బలాన్ని ఇష్టానుసారంగా వినియోగించడం ద్వారా ప్రపంచ రూపురేఖలు మార్చే అమెరికన్ విధానాల మూలంగా నయా-మితవాద శక్తులు రంగం మీదకు వచ్చాయి. అమెరికా సైనిక దళాల ఉపసంహరణ తర్వాత 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడం ఇందుకు ఒక ఉదాహరణ. సమకాలీన సామ్రాజ్యవాదం సైనిక జోక్యంతో మాత్రమే కాకుండా ఆర్థిక నిర్బంధం, ఆర్థిక యుద్ధం ద్వారా కూడా తన దోపిడీని కొనసాగించింది.
అమెరికా, దాని పశ్చిమ మిత్ర దేశాలు తమ ఆధిపత్యానికి ముప్పుగా భావించే లేదా అమెరికా డిమాండ్లకు అనుగుణంగా లేని ప్రభుత్వాలు ఉన్న దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తాయి. అటువంటి దేశాల మీద రాజ్య ప్రేరేపిత ఉగ్రవాద దేశాలుగా ముద్ర వేస్తాయి లేదా వెలివేయబడిన దేశాలుగా పరిగణిస్తాయి. అమెరికా, దాని మిత్ర దేశాలు విధించిన ఆంక్షల వల్ల క్యూబా, వెనిజులా, ఇరాన్, ఉత్తర కొరియా అత్యంత తీవ్రంగా నష్టపోయిన దేశాలలో ముందు వరుసలో ఉన్నాయి.
నయా-ఉదారవాద విధానాల మూలంగా అంతర్జాతీయ పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందింది. దీని మూలంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో, అలాగే ధనిక, పేద దేశాల మధ్య తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. ప్రకృతి వనరులను అపరిమితంగా దోచుకోవడం, లాభాలను గరిష్టంగా పెంచుకునే ప్రయత్నాల మూలంగా పర్యావరణ క్షీణతకు, గ్లోబల్ వార్మింగ్‌కు దారితీశాయి.
ఇరవయ్యవ శతాబ్దం తొలి నాళ్ళలో, అమెరికన్ సామ్రాజ్యవాద శక్తి శిఖర సమానంగా చలామణి అయ్యింది. ఇది దాని మిత్రదేశాల బలాన్ని, ముఖ్యంగా జి7, నాటో శక్తిని ఉపయోగించుకుంటూ... దాని ఆర్థిక, సైనిక ఆధిపత్యం ద్వారా అడ్డూ అదుపు లేని నియంత్రణను చెలాయించింది. కానీ అదే శతాబ్దపు మొదటి దశాబ్దంలో పరిస్థితులలో మార్పులు సంభవించాయి.
అమెరికన్ సామ్రాజ్యవాదం ముందున్న సవాళ్లు
సమకాలీన సామ్రాజ్యవాదం, దాని చోదక శక్తి అయిన అమెరికా మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. నయా-ఉదారవాద సంక్షోభం, చైనా బలీయమైన ఆర్థిక, సాంకేతిక శక్తిగా ఆవిర్భవించడం, బహుళ ధ్రువ ప్రపంచ విస్తరణ. ఈ పరిణామాలు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. దీర్ఘకాలంలో అమెరికా ప్రాబల్య సాపేక్ష క్షీణతను ప్రతిబింబిస్తున్నాయి.
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నయా-ఉదారవాద విధానాల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అప్పటి నుండి, నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ఆ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోయింది. ఈ ప్రతిష్టంభన పరిష్కారానికి నోచుకోలేని దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టంభన నుండి బయటపడే మార్గం లేక పాలక వర్గాలు వలసదారులు, మతపరమైన లేదా జాతిపరమైన అల్ప సంఖ్యాక వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి నయా-ఫాసిస్ట్ శక్తులను ఆశ్రయిస్తున్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా అనేక దేశాలలో మితవాద, నయా-ఫాసిస్ట్ శక్తుల పెరుగుదలను మనం గమనించవచ్చు. యూరప్ ఖండ దేశాలైన ఫ్రాన్స్‌లో నేషనల్ రాలీ, జర్మనీలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, స్పెయిన్‌లో వోక్స్, ఇంగ్లాండ్ లో రిఫామ్ తదితర రూపాల్లో అత్యంత నాటకీయంగా ముందుకు వచ్చాయి.
లాటిన్ అమెరికా ఖండంలో అర్జెంటీనా, చిలీ, కొలంబియా, బ్రెజిల్ దేశాలలో ఈ శక్తులకు ట్రంప్ అధికార యంత్రాంగం మద్దతు ఇవ్వడంతో మితవాదం గణనీయమైన పురోగతి సాధించింది. తన ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా సామ్రాజ్యవాదం ఈ మితవాద, నయా-ఫాసిస్ట్ పాలనలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇజ్రాయిల్ చరిత్రలో అత్యంత తీవ్రమైన మితవాద నెతన్యాహు ప్రభుత్వం, ట్రంప్‌నకు గట్టి మద్దతుదారుగా ఉంది. గాజాపై జరిగిన జాతిహనన దాడికి అటు బైడెన్, ఇటు ట్రంప్ అధికార యంత్రాంగం నుండి పూర్తి మద్దతు లభించింది.
చైనా ఎదుగుదల
చైనా సాధించిన వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణల సామర్థ్యం దాని రాజకీయ, అంతర్జాతీయ ప్రభావాన్ని గణనీయంగా పెంచాయి. చైనాను అమెరికా తన ఆధిపత్యానికి , ప్రస్తుత సామ్రాజ్యవాద వ్యవస్థకు వ్యూహాత్మక సవాలుగా పరిగణిస్తుంది.
కృత్రిమ మేధస్సు (ఎ.ఐ), క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో చైనా వేగంగా పురోగతి సాధిస్తోంది. అనేక రంగాలలో, ఇది అగ్రగామి శక్తిగా ఆవిర్భవించింది. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. చైనా అధునాతన సాంకేతికతలను పొందకుండా లేదా అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం చేసిన అన్ని ప్రయత్నాలు ఇప్పటివరకు విఫలమయ్యాయి.
బహుళ ధృవ ప్రపంచం
దక్షిణార్ధ గోళంలోని పెట్టుబడిదారీ దేశాలలో, అమెరికాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న అనేక దేశాలు తమ జాతీయ ప్రయోజనాల సాధనలో మరింత స్వతంత్రంగా వ్యవహరించాలనే ధోరణిని పెంపొందించుకుంటున్నాయి. ఈ ధోరణి బ్రిక్స్ విస్తరణలో, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలలో ప్రతిబింబిస్తుంది. చైనా, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహన బలోపేతం కావడం మరో కీలకమైన అంశం.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ - ఈ రెండూ అమెరికా ఆధిపత్యంతో కూడిన ప్రపంచ క్రమానికి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణలో పరస్పర సహకారం కోసం తగిన కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.
బహుళ ధృవ ప్రపంచం వైపు పయనం అనేది ఆయా దేశాల మధ్య వైరుధ్యాలను తొలగించదు. లేదా వాటన్నిటికీ సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్పథం ఉందని అర్థం కాదు. అయినప్పటికీ, ఈ పరిణామాల మూలంగా అంతర్జాతీయ బలాబలాల పొందిక మరింత సంక్లిష్టంగా మారుతోంది. ప్రపంచంలో గతంలో మాదిరి సామ్రాజ్యవాదం తిరుగులేని ఏకైక ఆధిపత్య శక్తిగా కొనసాగడం దుర్లభంగా మారుతుంది.
ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి బాధ్యతారహితమైన చర్యలు
అమెరికాలో ట్రంప్ దృక్పధాన్ని మనం ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అమెరికా ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని సంరక్షించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఆయన నినాదాలైన "అమెరికా ఫస్ట్", "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అమెరికా పాలక వర్గ ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోల్పోవడాన్ని తిప్పికొట్టే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
అమెరికన్ పాలక వర్గాలు తమ ఆర్థిక శక్తిని, ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవడానికి మార్గాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ జనవరి 2025లో అధికారంలోకి వచ్చారు. ఆయన "అమెరికా ఫస్ట్" నినాదం ఆచరణలోకి మలచబడుతోంది.
అమెరికా తన మిత్ర దేశాలతో సహా వివిధ దేశాల మీద నిర్బంధ సుంకాలు విధింపు, అమెరికాలో వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేలా వాటిని ఒప్పించే ప్రయత్నాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవే. పశ్చిమార్ధ భూగోళం అమెరికా ఆధిపత్యం కింద ఉండేలా చూసేందుకు వీలుగా అనేక చర్యలు చేపడుతున్నది. వీటిలో మన్రో సిద్ధాంతం పునరుద్ధరణ, దక్షిణ అమెరికా అంతటా మితవాద శక్తుల పాలనలను ఏర్పాటు చేయడం వంటి కొత్త రూపాలు ఉన్నాయి. ఈ వ్యూహానికి ఆర్థిక కోణం కూడా ఉంది, ముఖ్యంగా వెనిజులా చమురు వనరుల నియంత్రణకు సంబంధించి.
గత పద్దెనిమిది నెలల్లో చిలీ, హోండురాస్, కొలంబియాలతో సహా ఏడు అధ్యక్ష ఎన్నికలలో మితవాద అభ్యర్థులకు ట్రంప్ ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచి మరీ ప్రగతిశీల అభ్యర్థులను ఓడించాడు. మొదటి రౌండ్లో జైర్ బోల్సనారో కంటే వెనుకబడిన తర్వాత లులా అసాధారణ విజయాన్ని సాధించిన బ్రెజిల్ ఇందుకు మినహాయింపు.
ట్రంప్ యంత్రాంగం క్యూబాలో అధికార మార్పిడిని లక్ష్యంగా పెట్టుకుంది. క్యూబాపై విధించిన ఇంధన దిగ్బంధం, తదితర శత్రుపూరిత ఆర్థిక ఆంక్షలతో పాటు, ఆ దేశ ప్రజలను తీవ్రమైన ఇక్కట్లకు గురిచేస్తోంది, క్యూబా సోషలిస్ట్ వ్యవస్థ ఉనికిని దెబ్బ తీసేందుకు చూస్తుంది. గాజాలో జరుగుతున్న మారణహోమం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణలకు ట్రంప్ అండదండలు అందించాడు.
కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి - వ్యూహాత్మకంగా అమెరికన్ సామ్రాజ్యవాద బలం దీర్ఘకాలంలో క్షీణిస్తోంది. రెండు - అదే సందర్భంలో అమెరికా తన దగ్గరున్న అపారమైన సైనిక, ఆర్థిక పాటవాన్ని ప్రదర్శించగలదు.
ఇక్కడే మనకు మావో జెడాంగ్ సూక్తి సందర్భోచితంగా అనిపిస్తుంది. "వ్యూహాత్మకంగా, మనం మన శత్రువులందరినీ తక్కువగా చూడాలి, కానీ సాంకేతికంగా, మనం వారిని చాలా తీవ్రంగా పరిగణించాలి" అంటాడు మావో. అమెరికన్ సామ్రాజ్యవాదానికి దీనిని వర్తింపజేస్తే, "వ్యూహాత్మకంగా, మనం అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని తక్కువగా చూడాలి, కానీ సాంకేతికంగా, మనం దానిని చాలా తీవ్రంగా పరిగణించాలి".
దీని అర్థం అమెరికన్ ఆధిపత్య దీర్ఘకాలిక పరిమితులు మన గమనంలో ఉండాలి, అదే సందర్భంలో సైనిక జోక్యం, ఆర్థిక దిగ్బంధనం, రాజకీయ అస్థిరత ద్వారా నష్టం కలిగించే దాని నిరంతర సామర్థ్యాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి.
పెరుగుతున్న ప్రతిఘటన
సామ్రాజ్యవాద దూకుడు, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన కూడా పెరుగుతోంది. గాజాపై ఇజ్రాయిల్ ఒడిగట్టిన యుద్ధానికి , పాలస్తీనా ప్రజలపై సాగిస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరిగిన నిరసనలలో లక్షోపలక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. లండన్, పారిస్, రోమ్, ఇతర యూరోపియన్, లాటిన్ అమెరికన్ రాజధాని నగరాలు భారీ ప్రజా నిరసనలకు సాక్ష్యంగా నిలిచాయి.
అదేవిధంగా, మెరుగైన విద్యా సౌకర్యాలను డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో నిరసనలకు పూనుకున్న విద్యార్థులకు, కార్మిక సంఘాలు మద్దతుగా నిలవడంతో ఇటీవలే యూరప్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయం, గృహ వసతి కొరత, విద్యా సౌకర్యాల లేమి తదితర అంశాలకు వ్యతిరేకంగా స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, జర్మనీలలో కూడా భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. హంగేరీలో విక్టర్ ఓర్బన్ పార్టీ ఓటమిపాలు కావడం, సెర్బియాలో విద్యార్థి ఉద్యమం విజయం సాధించడం మితవాద ఆధిపత్యానికి వ్యతిరేకత పెరుగుతోందనడానికి తార్కాణాలు.
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మోడీ పాలకవర్గం బలమైన మద్దతుదారుగా ఉన్న భారతదేశంలో, హిందుత్వ-కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం అనేది విస్తృత సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగమే. సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో శ్రామికవర్గం, రైతాంగం, యువతరం, అట్టడుగు వర్గాలను పెద్ద ఎత్తున సమీకరించాలి
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వ్యతిరేకంగా సాగే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అక్టోబర్ విప్లవం (1917) రగిలించిన స్ఫూర్తి నేటికీ సజీవంగా ఉంది.
- వ్యాసకర్త: ప్రకాశ్ కరత్
సి.పి.యం పూర్వ ప్రధాన కార్యదర్శి








కామెంట్లు (0)