భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కును కల్పించింది. కులం, మతం, ప్రాంతం, భాష, లింగం అనే తేడాలు లేకుండా సమాన అవకాశాలు ఉండాలని స్పష్టం చేసింది. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగానికి పునాదులు. అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల్లోనే కులవివక్ష, సామాజిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? అందరికీ న్యాయం అందించాల్సిన న్యాయవ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకూ సమాన ప్రాతినిధ్యం లేకపోతే అణగారిన తరగతులకు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నలను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ దేశం ముందుంచారు. 2026 నవంబర్ 27న జస్టిస్ బి.ఆర్. గవాయ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ లేఖ ప్రతులను ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి కూడా పంపించారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో మెరిట్తోపాటు వైవిధ్యం, సమ్మిళితత్వానికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నిర్దిష్ట సామాజిక తరగతికి అధిక ప్రాతినిధ్యం ఉండగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ఒక సామాజిక వర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు.
2025 మార్చిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2018 నుంచి హైకోర్టుల్లో నియమితులైన 715 మంది న్యాయమూర్తుల్లో కేవలం 22 మంది ఎస్సీలు, 16 మంది ఎస్టీలు, 89 మంది ఓబీసీలు, 37 మంది మైనారిటీలకు చెందినవారు. ఈ గణాంకాలు న్యాయవ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు సమాన భాగస్వామ్యం ఉందా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. న్యాయమూర్తుల నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కొలీజియం వ్యవస్థ జవాబుదారీతనాన్ని కూడా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2)ను ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి గల రాజ్యాంగ బాధ్యతలను గుర్తుచేశారు.
విద్యా సంస్థల్లోనూ వివక్ష
న్యాయవ్యవస్థలోనే కాదు, విద్యారంగంలోనూ కులవివక్ష కొనసాగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశాన్ని కదిలించింది. ముంబైలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆదివాసీ వైద్యురాలు డాక్టర్ పాయల్ తడ్వీ సీనియర్ల కులవివక్షపూరిత వేధింపులతో 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి దర్శన్ సోలంకి 2023లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షపై చర్చకు దారితీసింది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ విద్యార్థులు కులపరమైన అవమానాలు, వివక్ష, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ కులవివక్ష, దళితులపై దాడులు కొనసాగుతున్నాయి. 2026లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో సుంకులమ్మ ఆలయంలోకి వెళ్లకుండా మాలతి అనే దళిత మహిళను అడ్డుకున్న ఘటన, పత్తికొండ మండలం జుటూరులో దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో దళిత కుటుంబాన్ని ఆలయంలోకి వెళ్లనివ్వలేదనే ఆరోపణలు ఇందుకు ఉదాహరణలు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నిర్వహించిన సామాజిక శంఖారావం కార్యక్రమంలో అనేక గ్రామాల్లో దళితులకు శ్మశానవాటికలు లేకపోవడం, ఆలయ ప్రవేశానికి అడ్డంకులు, తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనలో వివక్ష, కులం పేరుతో అవమానాలు వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఆలయ ప్రవేశం నుంచి ఆత్మగౌరవం వరకు దళితులు పోరాడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అమలులోనూ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఖాళీల భర్తీ ఆలస్యమవుతుండటంతో బ్యాక్లాగ్ పోస్టులు పేరుకుపోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోనూ సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
తక్షణ చర్యలు అవసరం
జస్టిస్ గవాయ్ లేవనెత్తిన ప్రశ్నల నేపథ్యంలో రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి. నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలి.
ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారు. సమానత్వం, విద్య, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, కార్మికులు, రైతులు, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా కులవివక్ష నిర్మూలన కోసం ఉద్యమించాలి. న్యాయవ్యవస్థలో సమాన ప్రాతినిధ్యం, విద్యలో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది.
- ఆండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం.
సెల్: 094903 00366)








కామెంట్లు (0)