బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇదా.. నదీ ప్రక్షాళన?

18 గంటల క్రితం

yamuna river.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 05:54 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నదుల ప్రక్షాళనపై బిజెపి పాలకులు చేస్తున్న ప్రకటనలకూ, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకూ పొంతన లేకపోవడం ఆందోళనకరం. యమునా నది కాలుష్యంపై తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశంలోని నదీ పరిరక్షణ విధానాల వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టాయి. భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నా యమునా కాలుష్యం తగ్గకపోగా- మరింత పెరుగుతోందని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాలనాపరమైన వైఫల్యాలే యమునా దుస్థితికి కారణమని వ్యాఖ్యానించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవహించే క్రమంలో నది నీటి నాణ్యత దిగజారితే సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలను బాధ్యులుగా చేసి జరిమానాలు విధించాలని సూచించింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించడమే నదుల ప్రక్షాళన కాదని, కాలుష్యం నదిలోకి చేరకుండా మూలాల వద్దే అడ్డుకోవాలని స్పష్టం చేసింది. పారిశ్రామిక వ్యర్థాలతో నదులను కలుషితం చేస్తున్న బడా కార్పొరేట్లను నియంత్రించాలి. కానీ, వారితో కుమ్మక్కవుతున్న పాలకులు ఆ పని చేస్తారని ఆశించలేము. కాబట్టి ప్రజా చైతన్యం, విశాల ఉద్యమాలే పాలకులను లొంగదీయగలవు.

యమునా నదిలోకి రోజుకు సుమారు 966 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు చేరుతున్నట్లు ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికే వెల్లడిస్తోంది. వీటిని అడ్డుకోవడానికి 125 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మరో 20 కేంద్రాల సామర్థ్యం పెంపు ప్రతిపాదించారు. ఢిల్లీలోని శుద్ధి కేంద్రాలేవీ నిర్దేశిత ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని సుప్రీంకోర్టు పరిశీలనలో తేలింది. యమునా కాలుష్యానికి ప్రధాన బాధ్యత వహించాల్సిన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు నదుల ప్రక్షాళనపై చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకూ మధ్య తీవ్రమైన అంతరం కనిపిస్తోంది. ఢిల్లీలో యమునా ప్రక్షాళనను రాజకీయ ప్రచార అంశంగా మార్చి, నదిపై నురుగు కనిపించినప్పుడల్లా తాత్కాలిక చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? మురుగునీటిని అడ్డుకోకుండా, పరిశ్రమల వ్యర్థాలను నియంత్రించకుండా, శుద్ధి కేంద్రాలను సక్రమంగా నిర్వహించకుండా ఎన్ని ప్రాజెక్టులు ప్రకటించినా నది బాగుపడదు. నిధులు ఎంత ఖర్చు చేశారన్నది కాదు.. వాటి వల్ల నది నీటి నాణ్యత ఎంత మెరుగుపడిందన్నది కీలకం. గంగా నది ప్రక్షాళనలోనూ ఇదే వైఫల్యం కనిపిస్తోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం గంగా పవిత్రతను కాపాడతామని, నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని 'నమామి గంగే' కార్యక్రమాన్ని గొప్పగా ప్రకటించింది. రూ.43 వేల కోట్ల విలువైన 524 ప్రాజెక్టులను చేపట్టి, ఇప్పటివరకూ రూ.21,340 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతోంది. ఇంతటి భారీ ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ- గంగ ఇంకా కలుషిత కాసారంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ నుంచి తారిఘాట్‌ వరకు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య సమస్య కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నది స్నానయోగ్యంగా లేదని అధికారిక నివేదికలే చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదనే సాకులకు ఆస్కారం లేదు. కాషాయ పార్టీ గంగా ప్రక్షాళనను మతపరమైన భావోద్వేగాలతో ముడిపెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందటానికి చూపించే శ్రద్ధ, ఉత్సాహం నదీప్రక్షాళనలో చూపకపోవటం దారుణం. నదుల కాలుష్యానికి పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, పట్టణాల మురుగునీటి శుద్ధి విషయంలో ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం. మతపరమైన కార్యక్రమాలు, ఇతర మానవ కార్యకలాపాల ద్వారా చేరే వ్యర్థాల ప్రభావమూ తక్కువేమీ కాదు. గంగను పవిత్ర నదిగా భావించే కోట్లాది మంది విశ్వాసాల మాటున పూజా సామగ్రి, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను నదిలో వదిలేయడం, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దహనం కాని మృతదేహాలను నీటిలో విడిచిపెట్టడం వంటి చర్యలు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. అంత్యక్రియలు, పుణ్యస్నానాలు, సామూహిక ఉత్సవాల నిర్వహణలో పర్యావరణ ప్రమాణాలు పాటించకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. నదుల ప్రక్షాళన అనేది ప్రచార కార్యక్రమంగా, రాజకీయ ఆర్భాటంగా మారిపోయింది. ప్రక్షాళన పేరుతో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రకటించడం, ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నా నదుల పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదు.

ఒకవైపు నదులను తల్లులుగా పూజించే సంస్కృతి గురించి గొప్పలు చెబుతూనే, మరోవైపు అవి విషతుల్యమవుతుంటే పట్టించుకోకపోవడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి? పూర్తయిన ప్రాజెక్టుల వల్ల ఎంత మేరకు కాలుష్యం తగ్గింది? శుద్ధి కేంద్రాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా? అనే ప్రశ్నలకు ప్రభుత్వాలు స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు, స్థానిక సంస్థల వరకు బాధ్యతలను నిర్దేశించాలి. నదుల్లోకి చేరే వ్యర్థ జలాలను మూలాల వద్దే అడ్డుకోవాలి. పరిశ్రమల వ్యర్థాలపై కఠిన నియంత్రణ ఉండాలి. శుద్ధి కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, వాటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలైనా పాలకుల కళ్లు తెరిపించాలి. లేకపోతే నదుల ప్రక్షాళన పేరుతో సాగుతున్నది రాజకీయ ఆర్భాటమూ, ప్రజాధనం ఖర్చు చేసే తంతు మాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్