శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొండంత కష్టం!

1 గంట క్రితం

Nalli New2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

" పోన్లే గుళ్ళు గోపురాలు ఉండటం వల్లే కదా ! ఆ కొండలైనా గుండెల మీద సెయ్యేసుకొని పడుకున్నట్టు ఉన్నాయని, సూసినప్పుడల్లా.. నా ప్రేణాలు సరదా పడీవీ. సల్లటి గాలీ.. గొల్లు, గొడవలు లేని ఏరియా.. అమ్మోర్లూ, అయ్యోర్లూ ప్రెశాంతంగా రాత్రులు పడుకుంటారని బాగా నమ్మేవోడిని. ఇదేటన్నగారూ! మన పంచదారల కొండల్ని కండసీమలు కొరుక్కు తినేస్తున్నాయట! "-- కసింకోట సిద్ధాంతితో పాటు వచ్చిన కొండగుడుల పూజార్లందరికీ తోటలో కూర్చునే ఏర్పాట్లు చేస్తూ, అన్నాడు పరదేశి.

" సింహాద్రి అప్పన్న కొండల్ని కూడా అదేదో డేటా సెంటరట! అదానీ వాటా కంపెనీకి ఇచ్చేసారట గదండీ! "-- సిద్ధాంతి గుర్తు చేశారు.

" వొంశపరంరంగా ఆ కొండలకి, దేవస్థానానికి ధర్మకర్త ఇజానగరం రాజుగారే. అసలు కొండకు.. ఎసరు పెడితే, అప్పుడు రంగంలోకి దిగుతాను. అది తప్ప ఏ కొండ కొట్టుకుంటే నాకేటి? అన్నారట! అటువంటి వాళ్లే అలా అనేస్తే, సిన్నా, సితక దేవుళ్ళ కొండల్ని, మన్లాంటోళ్లం ఏం కాపాడగలం?"-- వాలు కుర్చీలో చేరబడుతూ, నిట్టూర్చాడు దశుమంతు నాయుడు.

సిద్ధాంతితో పాటు, ఆ ప్రాంతం కొండల మీద ఉన్న గుడి గోపురాల పూజారులందరూ నాయుడి సాయం కోసం వచ్చారు. అందరికీ తోటలో, చల్లటి నీడలో కుర్చీలు, చల్లటి మజ్జిగలు ఏర్పాటు చేశాడు పరదేశి. అందరూ సర్దుకున్న తర్వాత," తాత తండ్రుల ఆస్తులకు వారసత్వం లాగా, ఆ ధర్మకర్త గౌరవం కూడా వచ్చింది కానీ, ఏడాదికి ఒకసారి చందనోత్సవం నాడు మొహం చూపించడమే తప్ప, భక్తుల కష్టాలు ఆయన ఏనాడైనా పట్టించుకున్నారా?"-- సిద్ధాంతి కూర్చున్నాడు.

" మా రావికమతం మండలంలో, దాదాపు ఐదు వేల ఎకరాలకు నీరందిస్తున్న కల్యాణపు లోవ మీద కూడా గ్రానైట్ తవ్వేస్తున్నారండీ!"-- ఆ ప్రాంతం పూజారి ఫిర్యాదు చేశారు.

" అసలు, ఒక్కసారి మన ఉత్తరాంధ్ర కొండల మీదే ఎందుకు పడిపోతున్నారో, నాకు అర్థం కావడం లేదు."-- సిద్ధాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

" వీక్ నెస్సండీ! ఎక్కడి నుంచో వచ్చినోళ్లకి, ఎంపి, ఎమ్మెల్యేలుగా గెలిపించేస్తున్నాం కదా! పార్టీ గుర్తులు తప్ప అభ్యర్థుల మొహాలు చూడరని వాళ్ళ ధైర్యం. లేకపోతే, అందమైన వొయిజాగు కొండలు సూడండి! అంచులు కత్తిరించీసిన, బరంపురం పట్టు సీరల్లా కనిపిస్తన్నాయి."-- పరదేశి పళ్ళు పటపట కొరికాడు. " వొయిజాగు కొండలు తినేస్తన్నా, కడుపులు సల్లారక, దేవుళ్ళ కొండలు కూడా, వొదలడం లేదు! " అన్నాడు మళ్ళీ.

" తిరుపతి దేవుడు లాగా మన దేవుళ్లకు పరపతి లేదు కదండీ? అప్పుడెప్పుడో, ఏడుకొండలనే మూడు కొండలు చేసినట్టు ప్రచారం జరిగితే, ఇప్పుడున్న మహా నాయకులందరూ వీరంగం వేశారు. వాళ్లకి తిరుపతి తప్ప మరే కొండ ఏమైపోయినా పర్వాలేదు!"-- సిద్ధాంతి ఆవేదన.

" ఎంపీగా గెలిపిస్తే, ఏదో ఉద్ధరిస్తాడనుకున్నాం. పేరు సివర సిఎం ఉందనుకుని, అంత పవర్ ఉన్నోడని ఆశపడ్డాం. ఈ పవరంతా, మన కొండల్ని, గుళ్ళు, గోపురాల్ని తినేయడానికే ఉపయోగిస్తాడని అనుకోలేదు."-- పరదేశి మాటల్లో పశ్చాత్తాపం. ఆ ఎలక్షన్లో బిజెపి ఏజెంటుగా అతడు కూర్చున్నాడు.

" బిజెపి అభ్యర్థి కదా! సనాతన వాదానికి సాయం చేస్తాడని మేము కూడా నమ్మాము "-- ఓ వృద్ధ పూజారి గొణిగారు.

" అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీకి రైలు వేయిస్తానని, అంతా ఫ్రీ యేనని చెప్పడంతో కూడా, మనోళ్ళు చాలామంది ఓట్లు వేసేసారండీ!"- కుర్ర పూజారి కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవం చెప్పాడు.

" పంచదారల ధర్మలింగేశ్వరుడి కొండలు, పిండి చేసేసి, కాశీ యాత్ర చేయించడం చూస్తుంటే. నామాల నక్క, కోళ్ల ఫారానికి కాపలా ఉన్నట్టుంది! "-- చమత్కరించారు వృద్ధ పూజారి.

" ఏమైనా, ఉత్తర భారత దేశంలోని కొండల్లా మన కొండలు ఉగ్ర స్వరూపాలు కాదండీ! వాటికి కోపం వస్తే ఒక్కసారిగా విరిగిపడిపోతాయి. పాపాత్ములను లాక్కుపోతాయి. మన దక్షిణ భారతదేశపు కొండలు శాంతి స్వరూపాలు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!"-- కుర్రపూజారి వ్యాఖ్యానించాడు.

" తమరు కయిత్వం సెప్పకండి. మనల్నీ, మనం ప్రెతిష్టించిన దేవుళ్ళనీ మొయ్యడం తప్ప, కొండలేం సేస్తాయండీ?"-- బయటకు కనిపించకుండా, పరదేశి చిరాకుపడ్డాడు.

అంతా విని, దశుమంతు నాయుడు గొంతు సర్దుకుంటూ, కుర్చీలో నుంచి పైకి లేచి..

" కనీసం, మన అరుకు, పాడేరు కొండల మీద ఉన్న గిరిజన్లకు ఉన్నంత పౌరుషం మనకు లేదనిపిస్తుంది. తరాల నుండి వాళ్లకి కొండల విలువ, అడవుల విలువ బాగా తెలుసు. అవి నాశనమైతే, తమ బతుకులు కూడా నాశనమైపోతాయని, వాళ్లు తెగించి పోరాడుతున్నట్టుగా, మనం చేయలేకపోతున్నాం!" అన్నాడు.

" మనలాగా, వాళ్లు ఏ శాస్త్రాలు చదువుకున్నారని? వాళ్లకి అనుభవమే శాస్త్రం "-- అని కూడా అన్నాడు. వాతావరణం గంభీరంగా మారిపోయింది. అందరూ పైకి లేచారు.

" మనం, వాళ్ళలాగా విల్లమ్ములు పట్టుకోవక్కర్లేదు. గర్భగుడులు మూసేసి, మీరందరూ ఉద్యమం ప్రారంభించండి. దేవుడికి, భక్తులకి.. అనుసంధానకర్తలు మీరు. మీ వెనక భక్తులు ఎందుకు రారో, నేనూ చూస్తాను. మా వాళ్లమంతా మీ వెనకే నడుస్తాం."-- ప్రకటించాడు నాయుడు. పూజారులందరూ ముఖాలు చూసుకున్నారు. రకరకాల భావోద్వేగాలు వారి ముఖాల్లో! పూర్తిగా తవ్వేసిన కొండల్లా ఉన్నాయి కొందరి ముఖాలు.

' తమరన్నదీ బాగుంది. ఉద్యమం, తిరుగుబాటు అన్నది మా ధర్మం కాదు. కానీ, ధర్మో రక్షతి రక్షితః అని నమ్మిన వాళ్లం. ఈ ప్రాంతానికి తమరు కొండంత అండ.. కొండంత కష్టం మీకు చెప్పుకుంటే ఏదైనా మార్గం దొరకకపోదా ?అని వచ్చాం. తమరు ఇచ్చిన సలహా కూడా వినూత్నంగా ఉంది. ఆలయాలకు పోయి, భక్తులను సమావేశపరిచి, తమ సూచన వారికి తెలియజేస్తాం. ఫలిస్తే, అంతకన్నా కావలసినదేముంది బాబూ!"- సిద్ధాంతి అన్నారు అన్యమనస్కంగా!

వారంతా వెళ్ళిపోగానే.." అన్నా! వరుణ యాగం సెయకుండానే వర్షం పడిపోవచ్చునేమో గానీ.. ఇది జరిగే పనంటావా! "

" మనమేం చేయగలంరా! పర్వతాలనే తినేసినోళ్ళ ముందు, మనమెంత? నువ్వే చెబుతుంటావు కదా! పులులూ, సింహాలూ తినేసిన తర్వాత మిగిలింది పీక్కుతినే నక్కల్లాంటి వాళ్ళం!"

-- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్