మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రీడా భారత్‌ ఎలా?

21 గంటల క్రితం

sports.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 05:50 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఆసియా క్రీడా సంరంభం ఆదివారం అట్టహాసంగా ముగిసింది. జపాన్‌‌లోని నగోయా నగరంలోని పాలోమా నిజుహో స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలను హంగు ఆర్భాటాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్వహణ ప్రశంసలు పొందింది. ‌తదుపరి ఖతార్‌ ఆతిథ్యమివ్వబోతోంది. ఆసియా క్రీడలంటే ప్రపంచం మొత్తానికీ అమితాసక్తి. ఈసారి 14 రోజులు, 46 దేశాలు, 43 క్రీడాంశాలు, 469 పసిడి పతకాలు, పది వేల మంది క్రీడాకారులు పాల్గొన్న భారీ కోలాహలం అయినందునే యావత్‌ ప్రపంచానికీ తీరని ఉత్కంఠ. నాలగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల ఆతిథ్య బాధ్యతను జపాన్‌ ‌స్వీకరించింది. తొలుత సదుపాయాల విషయంలో కొంత చర్చ జరిగినా ఎలాంటి అవాంతరాలూ లేకుండా 2026 ఆసియా క్రీడలను నిర్వహించడం గొప్ప విషయం. ఆరంభ, ముగింపు వేడుకల్లో జపాన్‌ ‌సంస్కృతి, సంప్రదాయ సంగీత, నృత్యాలు, ఆసియా ఐక్యతను ఇనుమడిస్తూ చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వరుసగా పన్నెండవ సారి చైనా మొత్తం 341 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశం 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్య పతకాలు సాధించింది. ఆతిథ్య జపాన్‌ 83 స్వర్ణ, 95 రజత, 91 కాంస్యాలు వెరశి 269 పతకాలతో ‌రెండవ స్థానం కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా 39 స్వర్ణ, 43 రజత, 68 కాంస్యాలతో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 85 పతకాలతో భారత్‌ ‌నాల్గవ స్థానం దక్కించుకుంది. మన దేశానికి 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్య పతకాలు లభించడం ఊరట. పతకాలు సాధించి దేశం పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపింపజేసిన విజేతలకు అభినందనలు.

భారీ అంచనాలతో నగోయాలో అడుగు పెట్టిన భారత క్రీడాకారులు ఆ మేరకు ప్రతిభ కనబరచకపోవడం అభిమానుల్లో నిరుత్సాహం కలిగించింది. హాంగ్జౌలో 2023 కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకొని ఆ స్థాయికి సైతం చేరుకోలేదు. అప్పుడు మొత్తం 106 పతకాలు సాధించగా ఈ మారు 85 పతకాలకే పరిమితం అయ్యారు. గతం కంటే 21 పతకాలు తగ్గాయి. ఉజ్బెకిస్తాన్‌‌కు, మనకు ఒకే మాదిరిగా 21 స్వర్ణాలొచ్చినా, మిగతా పతకాలను ఎక్కువ భారత్‌ ‌సాధించినందున నాల్గవ స్థానాన్ని నిలబెట్టుకుంది. అథ్లెటిక్స్‌, షూటింగ్‌‌లలో వైఫల్యం వలన మనకు పతకాలు తగ్గినట్లు విశ్లేషణలొస్తున్నాయి. 30 మంది షూటర్లు పాల్గొనగా 3 స్వర్ణ, 8 రజత, 4 కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. హాంగ్జౌలో వరుసగా 7, 9, 6 పతకాలు భారత్‌‌కు వచ్చాయి. మహిళల ఎయిర్‌ ‌పిస్టల్‌‌లో ఒక్క పతకం కూడా రాలేదు. ట్రాప్‌‌లో నీరూ ధండా మూడు పతకాలతో మెరవడం సంతృప్తినిచ్చింది. హైదరాబాదీ షూటర్‌ ‌చెనాయ్‌ ఆకట్టుకున్నారు. ఆర్చరీలో మన వాళ్లు అంచనాలను అందుకున్నారు. టీనేజ్‌ ‌సంచలనం కుంకుమ్‌ ‌రికర్వ్‌ ‌వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం సాధించి రికార్డు సృష్టించగా ఓవరాల్‌‌గా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు.. మొత్తం 9 పతకాలు సాధించారు. గతంలోనూ మనకు 9 పతకాలే వచ్చాయి. భారత్‌ ‌ప్రాతినిధ్యం ఉన్న స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ ‌వంటి పలు క్రీడాంశాల్లో ఒక్క పతకం కూడా రాలేదు. ఉత్తమ క్రీడాకారిణి అవార్డు కుంకుమ్‌, ఉత్తమ క్రీడాకారుడి అవార్డు సుజీత్‌ ‌కల్కాల్‌ ‌గెలుచుకున్నారు. హాకీలో మనకు రెండు స్వర్ణ పతకాలు రాగా 44 ఏళ్ల తర్వాత మహిళల విభాగంలో హాకీలో పతకం రావడం గొప్ప విషయం.

2047 నాటికి వికసిత భారత్‌ నినాదం ఎత్తుకున్న మోడీ ప్రభుత్వం 2036లో జరిగే ఒలింపిక్స్‌‌లో మన దేశాన్ని టాప్‌-10‌లో నిలబెతామని ప్రకటించింది. అది ఆశల పల్లకీయేనని ఆసియా క్రీడల్లో భారత్ ప్రదర్శన అనిపిస్తుంది. క్రీడాకారులను అన్ని విధాలుగా సన్నద్ధం చేసేందుకు రూ.702 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. భారత్‌ ‌క్రీడా శక్తిగా ఎదగాలంటే గ్రామీణ, పాఠశాల స్థాయి నుంచీ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. బడ్జెట్‌‌లో నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలి. ఆ పని చేయకుండా భారత్‌‌ను క్రీడల్లో అగ్రగామిగా నిలబెడతామంటే కుదిరే వ్యవహారం కాదు. రెజ్లర్లపై లైంగిక వేధింపులు పెట్టిన సొంత పార్టీ ఎంపిని ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. ఒలింపిక్స్‌ పతకాలు వెనక్కి ఇచ్చేస్తామని నిరసనలు తెలిపినా వినిపించుకోలేదు. ఐపిఎల్‌, బిసిసిఐ, అసోసియేషన్లలో అవినీతి, రాజకీయ జోక్యం సరేసరి. ఈ పరిస్థితుల్లో భారత్‌ను క్రీడల్లో వికసింపజేస్తామనడం పెద్ద జోక్‌!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్