దేశంలో నిరుద్యోగిత రేటు 2017-18లో 6.1 శాతం ఉండగా, 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అలాగే దశాబ్దాల తర్వాత తొలిసారిగా మహిళా కార్మిక భాగస్వామ్యం పెరిగిందని కూడా ప్రభుత్వ రికార్డులలో నమోదైంది. అయితే, ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను అడగాల్సిన సమయం వచ్చింది. ఇటీవలి కాలంలో దేశంలో ఎలాంటి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి? వాటిలో పని చేసే కార్మికుల పని పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది. ఉద్యోగం ఉండటం మాత్రమే ఒక వ్యక్తికి గౌరవం, భద్రత, స్థిరమైన జీవనోపాధిని కల్పించదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్వచనం ప్రకారం, సముచితమైన ఆదాయం, పని ప్రదేశంలో హక్కులు, సామాజిక భద్రత, గౌరవం కల్పించే ఉపాధే గౌరవప్రదమైన ఉపాధి. అందరికీ గౌరవప్రదమైన ఉపాధిని కల్పించాలని ఈ లక్ష్యం సూచిస్తుంది. ఈ ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తే, భారత్లో అసంఘటిత రంగ, అభద్రతతో కూడిన ఉపాధి అధికంగా ఉండటంతో పాటు, అసమానతలు కూడా పెరుగుతున్నాయి.
2017-18, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఆవర్తన కార్మిక శక్తి గణాంకాలను ఉపయోగించి చేసిన ఒక సర్వే ద్వారా భారత్లో ఉపాధి నాణ్యతను, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత అనే మూడు అంశాల ఆధారంగా బహుముఖ గౌరవప్రద ఉపాధి సూచీ రూపొందించారు. వ్యవసాయం, తయారీ, నిర్మాణం, టోకు-చిల్లర వ్యాపారం, రవాణా అనే ఐదు ప్రధాన రంగాలను ఈ అధ్యయనం పరిశీలించింది. మొత్తం గౌరవప్రద ఉపాధి సూచీ 2023-24లో 0.302తో ఆందోళనకరంగా తక్కువగా ఉంది. అంతేకాక, ఇది అన్ని రంగాలు, ప్రాంతాలు, లింగాలు, కుల సమూహాల్లో సమానంగా లేదు. ఉపాధి పరిస్థితులు మెరుగుపడిన రంగాల్లోనూ సామాజిక భద్రత పరిమితంగానే ఉంది. అత్యధిక మంది కార్మికులకు ఇప్పటికీ రాతపూర్వక ఉద్యోగ ఒప్పందాలు, వేతనంతో కూడిన సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు, బీమా సదుపాయాలు లేవు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్న రంగాల్లో కూడా కార్మిక రక్షణలు, ఉద్యోగ భద్రత అదే వేగంతో పెరగడం లేదు.
వ్యవసాయంలో అత్యల్ప నాణ్యత కలిగిన ఉపాధి
భారత్లో అత్యధిక సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో ఉద్యోగాల నాణ్యత అత్యంత తక్కువగా ఉంది. ఈ కాలంలో వ్యవసాయ రంగ ఉపాధి సూచీ 0.267 మాత్రమే ఉంది. వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువమంది స్వయం ఉపాధిపై ఆధారపడుతున్నారు. లేదా కుటుంబ వ్యవసాయ పనుల్లో వేతనం లేకుండా పనిచేస్తున్నారు. వారికి స్థిరమైన ఆదాయం, కార్మిక హక్కుల రక్షణలు లేవు. నిర్మాణ, చిల్లర వ్యాపార రంగాల్లో సమస్య కేవలం తక్కువ ఉత్పాదకత మాత్రమే కాదు. అసంఘటిత, అభద్రతతో కూడిన ఉద్యోగాలు పెరగడం కూడా ప్రధాన సమస్య. కార్మికులు తాత్కాలిక ఉపాధి, సబ్ కాంట్రాక్టుల గొలుసులు, అస్థిరమైన పని ఒప్పందాలపై ఆధారపడుతున్నారు. భవన నిర్మాణం వంటి కొన్ని రంగాలలో సంక్షేమ పథకాలు కాగితాలపై ఉన్నప్పటికీ, అమలులోని లోపాల కారణంగా లక్షలాది మంది కార్మికులకు వాటి ప్రయోజనాలు అందడం లేదు.
అసంఘటిత రంగ ఉపాధి విస్తరణ
అంతర్జాతీయ కార్మిక సంస్థ, మానవాభివృద్ధి సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, భారత్లోని మొత్తం కార్మిక శక్తిలో 90 శాతం మందికి పైగా అసంఘటిత రంగ ఉపాధిలో ఉన్నారు. 2019 తర్వాత ఈ వాటా బాగా పెరిగింది.
కులం, లింగం ఆధారంగా అసమానతలు
నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ఉద్యోగాల కాంట్రాక్టీకరణ, అసంఘటితీకరణ పెరగడం వల్ల కాలక్రమంలో గౌరవప్రదమైన ఉపాధి కల్పన తగ్గుతోంది. 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల గౌరవప్రద ఉపాధి ఫలితాలు క్షీణించాయి. దీనిని బట్టి భారత కార్మిక మార్కెట్లోని అసమానతలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కావని, అవి కుల, లింగ ఆధిపత్య వ్యవస్థల్లో లోతుగా పాతుకుపోయాయని స్పష్టమవుతోంది. ఇక్కడ ఒక తీవ్రమైన విధానపరమైన సమస్య ఉంది. పని చేసేవారికి మెరుగైన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత కల్పించక పోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. నాణ్యత లేని ఉపాధి ఆర్థిక వృద్ధినీ దెబ్బతీస్తుంది. సామాజిక భద్రత లేని కార్మికులు తక్కువగా ఖర్చు చేస్తారు, తక్కువగా పొదుపు చేస్తారు. ఆర్థిక సంక్షోభాలు ఎదురైనప్పుడు వారు మరింతగా నష్టపోయే ప్రమాదముంది.
అసలైన అభివృద్ధి మార్గం
వికసిత్ భారత్ లక్ష్య సాధన జరగాలంటే ప్రభుత్వ విధానాలు సమూలంగా మారాలి. అందరికీ సామాజిక భద్రత కల్పించాలి. గిగ్ కార్మికులు, స్వయం ఉపాధిదారులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లతో సహా అన్ని వర్గాలకూ సామాజిక రక్షణ అందాలి. వారు ఏ ఉపాధిలో ఉన్నా, ఉద్యోగ స్థితి మారినా, సులభంగా పొందగలిగేలా, అవసరమైనప్పుడు తమతో పాటు తీసుకెళ్లగలిగేలా ఆ సదుపాయాలు ఉండాలి. వ్యాపార సంస్థలను నమోదు చేయడమే అధికారిక లక్ష్యం కాకూడదు. కార్మికుల పని పరిస్థితుల మెరుగుదల కూడా దాని ప్రధాన లక్ష్యం కావాలి. పన్ను రాయితీలు, సబ్సిడీలు పొందే సంస్థలకు రాతపూర్వక ఉద్యోగ ఒప్పందాలు, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత వంటి కార్మిక రక్షణలను తప్పనిసరిగా అమలు చేసే నిబంధనలు విధించాలి.
కార్మికుల అవసరాలు, హక్కులకు ప్రాధాన్యం
కార్మిక సంస్కరణలు వ్యాపార నిర్వహణా వ్యయాన్ని తగ్గించడానికే ప్రధానంగా ఉద్దేశించకూడదు. కార్మికుల అవసరాలు, హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా వాటిని రూపొందించాలి. ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు కార్మిక కోడ్లు ఈ సమస్యలను మరింత పెంచేలా అసంఘటిత రంగాన్ని, కాంట్రాక్టీకరణ విధానాలను చట్టబద్ధం చేశాయి. ఈ లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయకుండా ‘వికసిత్ భారత్’ వంటి నినాదాలతో ప్రభుత్వం ఎంత డబ్బాలు కొట్టుకున్నా శ్రామికులకు మాత్రం అన్యాయమే జరుగుతుంది.
దేశాన్ని ఈ ప్రమాదం నుండి గట్టెక్కించడానికే లేబర్ కోడ్ల రద్దు, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన ఉపాధి వంటి ప్రధాన డిమాండ్ల సాధనకై దేశ రాజధాని వేదికగా డిసెంబరు 1,2,3 తేదీలలో మరో సమరశీల పోరాటానికి కార్మికవర్గం సన్నద్ధమవుతోంది.
వ్యాసకర్త : ఎ. అజ శర్మ
సెల్: 94900 98790








కామెంట్లు (0)