శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

1/70 చట్టాన్ని కాపాడుకుందాం...

21 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

షెడ్యూల్డ్ తెగల వారికి భూమిపై హక్కులను రక్షించే చట్టం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్-1970. దీన్నే మనం సంక్షిప్తంగా, 1/70 యాక్ట్ అంటాం. రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయకూడదని, అమ్మకాలు, కొనుగోళ్లు గిరిజనుల మధ్యే జరగాలని, ఈ చట్టం చెబుతోంది.1982 నుంచి ఈ చట్టాన్ని సడలించి, తమ భూముల లావాదేవీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వ్యక్తులుగా కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, 2024 మధ్య ఐదు కేసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, 2025 మధ్య పది కేసులు నమోదయ్యాయి. గిరిజనేతరుల దోపిడీ, చట్ట విరుద్ధ లావాదేవీల నుండి గిరిజనులను రక్షించడానికి ఇదొక కీలక చర్యగా భావిస్తూ, ఈ చట్టం రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు 1988లో ధ్రువీకరించింది. 1997లో ' సమత ' కేసులోనూ స్పష్టం చేసింది. అయినా తాజాగా ఎర్రంశెట్టి సత్యనారాయణ, మరో 1672 మంది దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, ఉభయ రాష్ట్రాల గవర్నర్లకు, ప్రభుత్వాలకు, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఆదివాసీ గిరిజన సంఘం ఈ కేసులో ఇంప్లీడ్‌ అయింది (కేసు నెం: 16069/2026). రాజ్యాంగం పరిధిలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక అధికారాలు గవర్నర్లకు ఉన్నాయి. వాటిలో గిరిజనుల భూ రక్షణ ఒకటి. వడ్డీ వ్యాపారాల నియంత్రణ అధికారం కూడా ఉంది. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసే అధికారం కూడా వారిదే. అందుకే, గవర్నర్లకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

గిరిజన రక్షణ చట్టాలు, వారి పోరాట ఫలాలు తప్ప, ప్రభుత్వాల దానధర్మాలు కాదు.1/70 చట్టానికి ముందు, షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీల చట్టం-1949 అమల్లోకి వచ్చింది. దీనికి పునాది, బ్రిటిష్ ఇండియా హయాంలోనే తెచ్చిన, ఏజెన్సీ ప్రాంతాల పరిరక్షణ, భూ బదిలీల చట్టం ( 1937 ). బస్తర్ గిరిజనుల తిరుగుబాటు ( 1910 ), ఛోటా నాగపూర్ లో బిర్సాముండా తిరుగుబాటు (1899-1900 ) తర్వాత, నిజానికి ,ఇది 1917లోనే పరిశీలనకు వచ్చింది. అంతకు ముందు, గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడీ, సంప్రదాయ హక్కుల అణచివేత కొనసాగిస్తూనే, షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్ యాక్ట్ -1874 తెచ్చి, చట్టం పరిధిలోకి గిరిజన ప్రాంతాలను ' ఏజెన్సీ'లుగా, కొన్ని అడవులను ' రిజర్వ్ ' గా ప్రకటించింది. ఏజెన్సీలను పాలించే బాధ్యత ఏజెంట్లకు అప్పగించింది. దేశంలో ప్రకటించిన, 52 ఏజెన్సీల్లో గంజాం, వైజాగ్ కొండ ప్రాంతాల ఏజెన్సీలు కూడా ఉన్నాయి (ఇప్పటికీ, మన్యప్రాంతాలను ' ఏజెన్సీ'లనే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. వీటికి కలెక్టర్లు ఏజెంట్లు). బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం శిస్తులు, పన్నులు వసూలు చేసే అధికారం స్థానిక జమీందారులకు అప్పగించింది. రిజర్వు అటవీ ప్రాంతాల్లో పోడు సాగు, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణలపై నిషేధాలు విధించింది‌. వీటికి వ్యతిరేకంగా, బీహార్ లో సంతాల్, ఒరిస్సాలో భూయన్, జువాంగ్ తెగలు, గోదావరి ప్రాంతాల్లో కోయ తెగల తిరుగుబాట్లతో, బ్రిటిష్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ, 1917 ప్రతిపాదనను చట్టంగా తీసుకురావడానికి తటపటాయించింది. నల్లమలలో చెంచుల తిరుగుబాటు ( 1921-27 ), అల్లూరి రంప పితూరీ ( 1922-24 ) ఒత్తిళ్లకు తల వంచి, 20 ఏళ్ల తర్వాత, 1937 చట్టం తెచ్చింది. దీనికి కూడా, రైతు, కూలీలు, గిరిజనులు సంతృప్తి చెందలేదు. వామపక్ష శక్తులు బలమైన ఉద్యమాలను నిర్మించాయి. శ్రీకాకుళం జిల్లా, మందస జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో, గున్నమ్మ అనే సామాన్య మహిళ ప్రాణ త్యాగం దేశంలోనే పేరెన్నికగన్నది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, స్వదేశీ పాలకులపై జమీందారుల ప్రభావం కొనసాగింది. చివరకు, 1937 బ్రిటిష్ చట్టాన్ని సవరించి, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1949 చట్టం , దానికి మరి కొన్ని సవరణలు చేసి 1/59, 1/70 చట్టాలను తీసుకురాక తప్పలేదు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో చేర్చిన, గిరిజన గ్రామాలకే ఈ చట్టం వర్తిస్తుంది. ఐదో షెడ్యూల్ లో చేర్చడానికి అన్ని అర్హతలున్న గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ( ఉమ్మడి) దాదాపు 800 ఉన్నట్టు, ఆనాటి గిరిజన శాఖ మంత్రి రెడ్యా నాయక్, 2007లో శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో 312 గ్రామాలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే, 181 ఉండటం గమనార్హం. వీటిని షెడ్యూల్ ఏరియాలో చేర్చాలన్న డిమాండ్ పై ప్రభుత్వాలు కాలయాపన చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అటవీ సంరక్షణ నియమాలు, షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయతీ విస్తరణాధికారాల చట్టం ( పెసా) స్ఫూర్తినీ, గిరిజన హక్కులను కాల రాస్తున్నాయి. గ్రామసభల అధికారాలను, తీర్మానాలను గౌరవించకుండా, మైనింగ్, హైడ్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేశారు. కార్పొరేట్ల కోసం ఏనాడో, సిద్ధం చేసిన రెడ్ కార్పెట్లను కొండకోనల్లో పరిచే ప్రయత్నాలు ప్రారంభించారు.

తాజాగా, 1/70 చట్టానికి తూట్లు పొడిచే కుట్ర పురుడు పోసుకుంటుంది. పాలకులు, తమ బుర్రల్లోని ఆలోచనలను, వివాదాస్పద ప్రకటనలకు మారుపేరైన మంత్రులు లేదా ఇతర ప్రముఖుల ద్వారా విడుదల చేస్తారు. వివాదం, విమర్శలు ముదిరితే " అటువంటి ఆలోచన లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వానికి సంబంధం లేదు" అనేసినా, అసలు సందేశం జనాల్లోకి చొచ్చుకు పోతుంది. ఉదాహరణకు, బీచ్ లో భార్యాభర్తలు కలిసి విహరిస్తున్నప్పుడు, భర్తకు ఒక బీరు తాగే స్వేచ్ఛ లేకపోతే, విశాఖని మరో గోవాగా ఎలా మార్చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఏమైంది? అలా అన్న, కొద్ది నెలలు తిరగక ముందే సాక్షాత్తు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ' బీచ్ షాక్స్ ' ప్రకటించి, విశాఖ తీర విహార లోకానికి షాకిచ్చారు. ఇదే అయ్యన్న పాత్రుడు, గత ఏడాది ఓ సందర్భంలో, 1/70 చట్టం సవరించకపోతే, గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగదని ప్రకటించిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆయన ఒక పార్టీ నాయకుడు మాత్రమే కాదు; శాసనాలకు రూపకల్పన చేసే సభాధ్యక్షుడు. ఈ నేపథ్యంలోనే, గిరిజనేతరులు సమిష్టిగా లీగల్ పోరాటం ప్రారంభించడం, ఇప్పటికే, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అల్లూరి జిల్లాలో హైడ్రో ప్రాజెక్టులకు, అనేక చట్టాలను ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని గమనించాలి. ఆయా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గిరిజనులు సాగిస్తున్న పోరాటాలు, 1/70 చట్టం రక్షణ కోసం ఉద్యమాలను జమిలి చేస్తున్నారు. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో, కొండ, కోనల దిగి వేల సంఖ్యలో గిరిజనులు వచ్చి మహాప్రదర్శన నిర్వహించారు. రంపచోడవరంలోను, ఏలూరు జిల్లా కె.ఆర్‌.పురం ఐటిడిఎ వద్ద భారీ ఆదివాసీ సమీకరణలు జరిగాయి. 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, జీవో నెం 3కి ప్రత్యామ్నాయం తెచ్చి అమలు చేయాలనీ సర్కారును నిలదీశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు మన్య వీరుడు అల్లూరి పేరు పెట్టి హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అల్లూరి ఎవరికోసం తెల్ల దొరలతో పోరాడి, ప్రాణ త్యాగం చేశారో, అతని పేరుతో ఉన్న జిల్లా గిరిజనులు చేస్తున్న ఉద్యమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.


- రచయిత : నల్లి ధర్మారావు

సీనియర్ జర్నలిస్ట్,

సెల్‌:76609 67313)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్