- వి. రాంభూపాల్
కమ్యూనిస్టులపై విద్వేషం చిమ్మడానికి పాత రోత అబద్ధాలనే కొత్త రాతలతో మరో స్వాములవారు వేంచేశారు. డా. దుగ్గరాజు శ్రీనివాసరావు రాసిన 'జాతీయభావం కరువైన కమ్యూనిస్టులు' పుస్తకం నిండా నిందలు, అబద్ధాలు గుమ్మరించారు. రచయిత తన సంపాదక స్వగతంలో 'అర్థవంతమైన, విలువైన చర్చ' కోసమే ఈ పుస్తకం అని చెప్పి 'ఈ పుస్తకాన్ని కమ్యూనిస్టులపై వాస్తవాలుగా స్వీకరించాల్సిందే' అనడం బెదరింపా? బరితెగింపా? అట్టపై వేసిన మూడు బొమ్మలు వీరి విజ్ఞతకు, విద్వేషానికి పరాకాష్ట. 'దశకంఠుల' (ఇందులో పదిమంది వ్యాసాలు వున్నాయి) వ్యాసాలతో డా. దుగ్గరాజు గారు పుస్తకాన్ని వేస్తే రాష్ట్ర బిజెపి ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు మాట్లాడుతూ 'స్వాతంత్య్ర భారతదేశం రామరాజ్యమవుతుంది అని గాంధీ చెప్పారు... కాని దురదృష్టమేమంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు, మూడు సంవత్సరాలకి ఆయన హత్యకి గురై నిష్క్రమించారు' అన్నాడు. ఆ మహాత్మను హత్య చేసింది ఎవరో చెప్పాలి కదా? ఆయనకు గుర్తులేకపోతే 'పరిశోధక' దుగ్గరాజు గారు గుర్తు చేయాలికదా?... వెనుకటికి తల్లి తండ్రిని హత్య చేసిన ఓ హంతకుడు తల్లి తండ్రి లేని అనాథనయ్యా కరుణించండి అని జడ్జీని వేడుకున్నట్లు, గాంధీ హంతకుడిని నిత్యస్మరణ చేస్తూ 'గాంధీ వుంటే'... అనగలుగుతున్న బిజెపి వారిలో 'ఏ భావం కరువైందో' డా. దుగ్గరాజు మరో పుస్తకం వేయడం సముచితం.
అక్కడ, ఇక్కడ, ఎక్కడా కమ్యూనిస్టులు లేరన్న ఈ 'పరిశోధకుడి'కి ఈ పుస్తకం వేయాల్సినంత అవసరం ఏమిటో? 'లేరు' అని లోకాన్ని నమ్మించడానికి అంటున్నామే కానీ, వున్నారన్నది, తిరిగి వస్తున్నారన్నది సత్యం. అందుకే ఇలాంటి రాతగాళ్లం బయలుదేరాం అంటారా, దుగ్గరాజుగారు... అది కదా సత్యం. వారి డియర్ ఫ్రెండ్ ట్రంప్ రాజధాని న్యూయార్క్, వారి ఆరాధ్యదైవం హిట్లర్ రాజధాని బెర్లిన్‌లలో ఎర్రజెండా ఎగురుతుంటే... ఢిల్లీ, ముంబాయి, పాట్నా ఇలా దేశవ్యాపితంగా లక్షల కోట్ల జెన్ జీ ప్రహ్లాదులు 'ఎందెందు వెతికినా అందందే కలడు' అన్నట్లు నినదిస్తుంటే 'ఎక్కడా' అని వీరు అడుగుతున్నారంటే అది హిరణ్యకశ్యప ప్రేలాపన వంటిదే! చీకటి మేఘాల చెరసాలను బద్దలు కొట్టుకుని, విశ్వమంతటా వెలుగు మధురిమల ఉదయభానుని సింధూర తిలకాన్ని చూసిన తర్వాత ఈ మాత్రం వణుకు ఉంటుందిలే!
కమ్యూనిస్టు పార్టీ బలహీనపడడానికి స్వయంకృతాపరాధం అనే విషయం పలువురితో చర్చించినప్పుడు రచయితకు 'ధృవీకరణ' అయిందట! వ్యాసకర్తలు వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను ఈ పుస్తకంలో వేసుకునే ముందు ఆ వ్యాసకర్తలతో కనీసం సంప్రదించారో లేదో ధృవీకరించుకోండి. జగమెరిగిన కమ్యూనిస్టులకు 'ఇదీ వాస్తవం అని' ఈయన అద్దంలో చూపుతారట! 12 ఏళ్ళ విద్వేషాలతో రంగరించిన అబద్ధాల అద్దం ముక్కలై, నిశ్శబ్దం బద్దలై, సత్యం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం మొదలైన 'వాస్తవాన్ని' రచయిత త్వరలో గుర్తిస్తారని ఆశిద్దాం! 'కమ్యూనిస్టుల మీద తగిన విధంగా పరిశోధన చేసే ప్రయత్నం ఇంతవరకు పెద్దగా జరగలేదట', అయ్యో పాపం! ఇంతకాలం ఈ పని ఏ 'కాషాయధారుడు' చేయకపోవడంతో దుగ్గరాజు రంగంలోకి దిగారు కాబోలు! అయితే ఆయన ఈ కర్తవ్య నిర్వహణలో పడి తన ముందరి తరాన్ని మరచిపోయాడో, లేదా కావాలనే దాచేశాడో తెలియదు. జర్నలిజం ముసుగులో జీవిత కాలంలో అత్యధిక కాలం కమ్యూనిస్టుల మీద ఇలాంటి 'పరిశోధనాత్మక' కాకమ్మ కథలు రాసి రాసి 'అలసి, సొలసి' తన మూలవిరాట్ల (ఆర్‌ఎస్‌ఎస్ వారి)కే ఎదురుతిరిగిన అరుణ్ శౌరి లాంటి స్వపక్షీయులను విస్మరించడం తగునా! చరిత్ర లేనివాడు, చరిత్రను తుడిపేయాలని చూస్తాడు అన్నట్లు బ్రిటీష్ వారిని పదేపదే క్షమాభిక్ష కోరిన తమ అధినాయకుడి చరిత్రను కప్పిపుచ్చుకునేందుకు కమ్యూనిస్టులకు జాతీయభావం కొరవడిందనే నింద రచయిత వేస్తున్నారు. జాతీయోద్యమంలో కమ్యూనిస్టు పార్టీది వీరోచిత పోరాటాల చరిత్ర. పార్టీ ఆవిర్భవించిన తొలి సంవత్సరాల్లోనే 'సంపూర్ణ స్వాతంత్య్రం' నినాదాన్ని ఇచ్చి, ఆ స్వాతంత్య్రం ఎలా ఉండాలో 1922లో గయలో జరిగిన కాంగ్రెసు జాతీయ ప్లీనరీ సమావేశానికి సమర్పించిన పత్రం జాతీయోద్యమ చరిత్రలో అజరామరంగా వెలుగొందుతోంది. దున్నేవానికే భూమి, కుల వివక్ష రూపుమాపడం, లింగ సమానత్వం, అందరికీ విద్య, వైద్యం లాంటి కీలకమైన విషయాల పరిష్కార అవసరాన్ని ఆ పత్రం పేర్కొంది. 'దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న భావమే కమ్యూనిస్టుల జాతీయ భావం. అందుకే కుల, మతాలకు అతీతంగా పశ్చిమ బెంగాల్ లో తెభాగ, మహారాష్ట్రలో వర్లీ, కేరళలో పున్నప్ర-వాయలార్, తెలంగాణ వీరోచిత పోరాటానికి సాటి ఏది? 1920లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్ ఇలా ఒక్క ప్రజా పోరాటాన్ని చెప్పుకోగలదా?
బిజెపి మాతృసంస్థకు స్వాతంత్రోద్యమ చరిత్ర లేదు కాబట్టే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులను అవసరానికి అరువు తెచ్చుకుని పరువు నిలుపుకోవడానికి తంటాలు పడుతూనే వున్నారు. ఆ సర్దార్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన సంగతి దాచినా దాగదు కదా! జాతీయోద్యమ చరిత్రలో కీలకమైన పరిణామాలన్నీ 1920వ దశాబ్దంలో జరిగాయి. జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. అప్పుడే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి మూడు పెద్ద కుట్ర కేసులను ఎదుర్కొని, కార్మిక, విద్యార్థి, రైతు, రచయితలు, కళాకారుల సంఘాలు ఏర్పాటు చేసి అసంఖ్యాక ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములను చేసింది. మత రాజ్య నిర్మాణ లక్ష్యంతో ముస్లిం లీగ్, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజల మధ్య విద్వేష బీజాలను నాటడం మొదలైంది కూడా ఆ దశాబ్దంలోనే.
స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర ఉంటే తొలి ప్రభుత్వంలో ఎందుకు వారు భాగస్వాములు కాలేదని డా. దుగ్గరాజు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా ఆ తొలి ప్రభుత్వంలో చేరలేదు, మరి ఆయన కూడా జాతీయోద్యమంలో పాల్గొనలేదంటారా!
తెలంగాణ నైజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన పోరాడి వేలమంది ప్రాణత్యాగం చేసిన చరిత్రకు మసి పూసేందుకు ఆనాటి నుండి కాషాయదళం చేయని ప్రయత్నంలేదు. నైజాంను లొంగదీసుకునే పేరుతో తెలంగాణలోకి వచ్చిన భారత సైన్యాలు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్ర ప్రాంతంలో చేసిన ఘోరాలు, దౌర్జన్యాలు డా. దుగ్గరాజు శ్రీనివాసులు లాంటి 'పరిశోధకు'డికి తెలియకపోవచ్చు, తెలిసినా ఒప్పుకునే నిజాయితీ లేదేమో! '1948 దౌర్జన్యాలు' అనే పుస్తకం ఇటీవల పునర్ముద్రణ అయ్యింది ఆయన ఈ పుస్తకాన్ని చదవడం మంచిది. దేశంలో విలీనం కాకుండా అడ్డుతగిలిన కాశ్మీర్ హిందూరాజుకు అండగా, గ్వాలియర్‌తో పాటు అనేకమంది సంస్థానాధీశులకు అండగా నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్ ఉలిపికట్టె దారి చరిత్రలో లిఖితమై వుంటే, కమ్యూనిస్టులది ఉలిపికట్టె దారి అని మీరంటే నవ్వరా దుగ్గరాజు గారూ!
స్వశక్తితో భారత్ ఎదగాలన్నది కమ్యూనిస్టుల విధానం. అది జరగాలంటే పరిశోధనలు జరగాలి, సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు లొంగకుండా నిలవాలి. సరిగ్గా ఇందుకు విరుద్ధమైనవి మోడీ ప్రభుత్వ విధానాలు. చమురుతో మొదలు వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాల వరకూ ట్రంప్ చెప్పినట్లు తందాన అనడం వల్ల ఏ దేశమైనా ఎదిగిందో ఈ 'పరిశోధకుడు' చెప్పగలడా? జీ టీవీ సుభాష్ చంద్ర లాంటి వారికి వేల కోట్లు, ఆదానీ, అంబానీ లాంటి దోస్తులకు ప్రభుత్వరంగ సంస్థలను, సహజ వనరులను దోచిపెట్టడమే దేశం ఎదగడమని మీరంటే, కమ్యూనిస్టులే కాదు దేశభక్తి కలిగిన ఎవరైనా కాదంటారు.
భిన్న జాతుల, భిన్న సంస్కృతుల, భిన్న భాషల, ఆచార, సాంప్రదాయాలకు నెలవు భారతదేశం. అనేక మతాల, జాతుల ప్రజలు కలిసి జీవించడమే నిజమైన భారతీయత. ఈ భావననే స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, మహాత్మా గాంధీ లాంటి ఎందరో విశ్వసించారు, అలాంటి భారతీయత కొనసాగడానికి కృషి చేశారు. దాన్నే నేడు కమ్యూనిస్టులు ముందుకు తీసుకువెళ్తున్నారు, దాన్ని ధ్వంసం చేసే ఏ శక్తులతోనైనా పోరాడి తీరుతారు. హిట్లర్ నుండి దిగుమతి చేసుకున్న ఆకారం, శిక్షణ, విద్వేషం ఈ దేశానికి సరిపడవు. శాస్త్రీయ సిద్ధాంతంగా ప్రపంచ విజ్ఞులందరి ప్రశంసలు అందుకుంటున్న మార్క్సిజాన్ని మతంతో పోల్చిన ఈ (అ)జ్ఞాన దృష్టికి జాలి పడడం తప్ప ఏమి చేయగలం!
చరిత్రపై అవగాహన లేకనో, లేదా నింద వేసే అలవాటులోనో నెహ్రూ, ఇందిర ల వల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం పెరిగిందని ఈ 'పరిశోధకుడు' తేల్చాడు. కేరళలో ఏర్పడిన ఇఎంఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది నెహ్రూ. బెంగాల్‌లో అర్ధ ఫాసిస్టు నిర్బంధాన్ని అమలు చేసి వేలమంది మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలను హతమార్చింది ఇందిరా గాంధీ. ఎమర్జెన్సీ కాలంలో తీవ్ర నిర్బంధానికి గురైంది మార్క్సిస్టు పార్టీ. ఈ సత్యం మీ దృష్టి లోపం వల్ల కనిపించకపోతే ఏమి చేయగలం? ఈ పుస్తకంలోనే టంకశాల అశోక్ గారు చెప్పినట్లు 'భారతదేశంలో గానీ, ప్రపంచంలోని ఇతర వర్థమాన దేశాల్లో కానీ, ఆ మాటకొస్తే ధనిక దేశాల్లో పేదలకు కొరత లేనందున అక్కడ గానీ, వామపక్ష భావజాల అవసరం తప్పక ఉంది'. ప్రపంచంలో గానీ, దేశంలో గానీ, జరుగుతున్న అనేక సంఘటనలు, పరిణామాలు కమ్యూనిస్టుల అవసరాన్ని చాటిచెబుతున్నాయి. కార్మికులు, కష్టజీవులు, ముఖ్యంగా యువతరం బిజెపి పాలకులను నిలదీసేకొద్దీ ఇలాంటి రోత రాతలు పుట్టుకొస్తూనే ఉంటాయి. తెలుగు ప్రజల చైతన్యమే వీటికి సరైన జవాబు చెబుతుంది.








కామెంట్‌లు (0)