ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యమ యోధ, ఉజ్వల మేధ - చుక్కా రామయ్య

21 గంటల క్రితం

chukka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 05:15 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

చుక్కా రామయ్య నూటొక్క జన్మదినం యావత్‌ ‌సమాజానికి సంబరంగా మారింది. ఆయన అసాధారణ జీవిత గమనమే అందుకు కారణం. ఆయనొక బోధకుడు, సాధకుడు మాత్రమే కాదు-చోదకుడు. తన సంపూర్ణ జీవితాన్ని సమస్త జనుల చైతన్యం కోసం, విజ్ఞానం కోసం సమర్పణ చేసిన సార్థక కృషీవలుడు. మనుషులు నమ్మిన బాటలో నిలబడటం నడిచి చూపించడం ఎలాగో నిరూపించిన యోధుడు రామయ్యగారు. వందేళ్లు దాటిన చుక్కా రామయ్యకు అధినేతల దగ్గర నుంచి శిష్య ప్రశిష్యుల వరకూ సగౌరవంగా సగర్వంగా ప్రణామాలు సమర్పిస్తున్నారు. వ్యక్తికి నిర్వచనం శక్తి అన్నట్టు పురోగమన శక్తులతో సదా కలసి అడుగేస్తూ వస్తున్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు...అన్నట్టు ఈ జ్ఞాన సూర్యుడు, కార్యశూరుడు సుదీర్ఘ యానంలో నిరంతర స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజాం నిరంకుశత్వ వ్యతిరేక యోధుడు, కార్పొరేట్‌ ‌చదువులకు దేశీయ ప్రత్యామ్నాయం చూపిన ధీరుడు, ప్రజా ప్రతినిధిగా స్వరం విప్పిన దీక్షా దక్షుడు, నిత్య జ్ఞాన పిపాసి, మానవీయ ప్రేమాన్వేషి.​

అలా మొదలై...​

చుక్కా రామయ్య గురించి మాట్లాడుకోవడమంటే ఒక విజ్ఞాన విప్లవ సర్వస్వం ఆవిష్యరించుకోవడమే. ‘‘నాటి అన్యాయాలు, అక్రమాలూ, పేదల ఆకలి బాధలు, పార్టీ కోసం ప్రజలు చేస్తున్న త్యాగాలు, అమ్మ నవల, ఇతర దేశాల పోరాట విశేషాలే తెలంగాణ విముక్తి పోరాటం వైపుగా నా దృష్టిని మరల్చాయి. నేనూ పేదరికంలో పుట్టినా మా అమ్మ త్యాగాల వల్ల చదువుకు నోచుకున్నాను. నాతోటి పిల్లోళ్లు దొరల దగ్గర కూలికి వుండేవారు. వారెందుకు చదువుకోడానికి రారో నాకు అర్థమయ్యేది కాదు. పిల్లలతో ఆడుకుంటూ వారి ఇండ్లలో తిరిగేవాణ్ని, వారి ఇంటి పరిస్థితులు చూశాక తెలిసొచ్చింది వారు పేదరికం వల్లనే చదవుకు దూరమయ్యారని...నాకూ ఆర్థిక ఇబ్బందులు వుండె. కానీ మా అమ్మత్యాగం వల్ల నేను విద్యావంతుడనైనా...’’. ‘వీర తెలంగాణ నాది’ కోసం చుక్కా రామయ్య ఇంటర్వ్యూ (2006) ఇలా మొదలవుతుంది.​

నాటి నల్గొండ ఇప్పటి జనగామ ‌జిల్లా గూడూరులో అనంత రామయ్య, నర్సమ్మ దంపతుల సంతానమైన రామయ్య దొరవారి గడిలోని బడిలోనే చదువుకున్నాడు. పెద్ద బాలశిక్ష పూర్తి చేశాక మాష్టారు తనతో ఉత్తరాలు చదివించేవారు. అప్పట్లో అత్యధికులకు చదువు రాదు గనక ఆ మాష్టారు అందరికీ ఉత్తరాలు రాసిపెట్టేవారు. మూడవ తరగతి తర్వాత బాండు పేపర్లు కూడా చదవడం, రాయడం నేర్పించారాయన. వాటిని రాస్తున్న వింటున్న రామయ్య జీవితమంటే ఏమిటో, జనం ఎన్ని బాధలతో బతుకుతున్నారో తిండికి కూడా తిప్పలు పడుతున్నారో తెలుసుకుంటూ మధనపడుతూ పెరిగారు. అసలు చదువు ఉత్తరాలు, బాండు పత్రాలు రాయడానికేమోననుకున్నారు. ఆయన చదువు కోసం వరంగల్‌ ‌వెళ్లడం తన వల్ల కాదని నాన్న భయపడితే తల్లి తన మెడలో నగ అమ్మి చదివిస్తానని పట్టుపట్టారు.

ఏ చోక్రా బుల్‌‌బులా...​

వరంగల్‌ ‌వెళ్లాక ప్రపంచం విస్తరించింది. అణా పుస్తకాల పేరిట వచ్చే దేశాల చరిత్రలు చదువుతూ చైతన్యం పెంచుకున్నారు. ఆంధ్ర మహాసభ నిర్వహించే వయోజన పాఠశాలల్లో చదవు చెప్పడం ప్రారంభించారు. వాళ్ల ఊళ్లో వున్న ‘సంఘం’ మల్లయ్య ప్రేరణతో వెట్టిచాకిరీకి, దొరల పీడనకూ వ్యతిరేకంగా పోరాటం వైపు చేరారు. అప్పటి నుంచి ఆయన ‘ప్రజాశక్తి’ చదవడమేగాక చదివి వినిపించడం మొదలు పెట్టారు. అక్కడ ‘అమ్మ’ నవల చదివి వినిపించడం ఆయన బాధ్యత అయింది. ఇంత కష్టపడి చదివిన రామయ్య నిజాం పోలీసులు రజాకార్ల దాడుల మధ్య1947 తర్వాత పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి దూకారు. సివిల్‌, ‌ మిలిటరీ విభాగాల మధ్య ఆయన సివిల్‌‌ విభాగంలో పనిచేశారు. నెత్తి మీద సైక్లో మిషన్‌‌ పెట్టుకుని ఊరూరా తిరుగుతూ కరపత్రాలు కాపీలు తీసి పంచడం ఆయన దళం పని. ఒకసారి వాళ్లను పోలీసులు వెంటాడితే పోలాల్లోకి పారిపోతూ మిషన్‌ అక్కడ పడేశారు. దాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు.18 ఏళ్ల వయసున్న చుక్కా రామయ్యను అరెస్టు చేసి విపరీతంగా కొడితే నాలుగు పళ్లు ఊడిపోయాయి. ఇప్పటికీ ఒక పన్ను సరిగా లేదని చూపిస్తారు. ఆయుధాలు ఎక్కడని పోలీసులు ఎంత కొట్టినా నోరు విప్పక పోగా ఎదురు ప్రశ్నలు వేశారు. దాంతో ఇన్‌‌స్పెక్టర్‌ ఏ చోక్రా బుల్‌‌బులా మాలుం హోతాహై (పిల్లాడే గానీ అతికం మనిషిలా వున్నాడు) అంటూ మిగతా ఖైదీల నుంచి విడదీసి ఒంటరిగా సెల్లులో పెట్టారు. నల్గొండ జైలుకు అక్కడి నుంచి చంచల్‌‌గూడాకు తర్వాత ఔరంగాబాద్‌ ‌జైలుకు పంపించారు. ఔరంగాబాద్‌ ‌జైలర్‌ ‌బిడ్డకు లెక్కలు చెబితే బయిటకు వెళ్లి విషయాలు చేరవేసే అవకాశం వస్తుందని నచ్చచెప్పడంతో ఒప్పుకున్నారు ఏడాదిన్నర జైలు జీవితం గడిపి బయిటకొచ్చారు.​

స్వయం కృషి..సంఘంతో సమరాలు..​

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని లెక్కల మాష్టారయ్యారు. అప్పుడే పిల్లలకు సరైన తిండి లభించని పరిస్థితులు గమనించి విద్యార్థులే సమిష్టిగా నిర్వహించుకునే హాస్టళ్లు ప్రవేశపెట్టారు. టీచర్‌‌గా పనిచేస్తూనే పి.జి పూర్తి చేసి లెక్చరర్‌‌గా మారారు. 1983లో నాగార్జున సాగర్‌ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్‌‌గా పనిచేసి మరెవరికైనా అవకాశం ఇవ్వవచ్చని కాస్త ముందుగానే పదవీ విరమణ చేశారు. జీవితమంతా ఉపాధ్యాయ సంఘాలతో ముడిపడిన చుక్కా రామయ్య 1984లో యు.టి.ఎఫ్‌ ‌తరపున శాసనమండలికి పోటీ చేశారు. పి.ఆర్‌.టి.యు అభ్యర్థి ధర్మారెడ్డిపై ఓడిపోయిన రామయ్య మళ్లీ వివిధ సంఘాల మద్దతుతో 2007లో ఆయన పైనే గెలవడం ఆసక్తికరమైన విషయం. సుప్రసిద్ధుడైన చుక్కా రామయ్యను గవర్నర్‌ ‌కోటాలో నామినేట్‌ ‌చేయడానికి అవకాశమున్నా తాను ఎన్నికల ద్వారానే వెళ్లాలని భావించారు. అనేకమంది ముఖ్యమంత్రులతో, ప్రభుత్వాలతో పనిచేశారు. విద్యారంగ సంస్కరణలు, ఉపాధ్యాయులు అధ్యాపకుల హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలపైనా ముందుండి పోరాడారు. ఉమ్మడి రాష్ర్ట శాసనమండలిలో పీపుల్స్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ‌చైర్మన్‌‌, అందులో వున్న సభ్యులందరూ తనకన్నా చిన్నవారైనా అందరినీ కలుపుకుంటూ అత్యంత క్రమశిక్షణగా వ్యవహరించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వెనకబాటును స్వయంగా చూసిన ఆయన తెలంగాణ ఏర్పాటుతో విధానాలు మారాలనీ వికాసం జరగాలని బలంగా కోరుకున్నారు.

ఐ.ఐ.టి కి చుక్కానిగా...​

విద్యా పరంగా చూస్తే కుమార్తె ఐ.ఐ.టి లో సీటు తెచ్చుకున్నప్పుడు తెలుగువారు చాలా తక్కువగానే ఐ.ఐ.టి ని చేరుకుంటున్నట్టు చుక్కా రామయ్య గమనించారు. అంటే అచ్చంగా తన చిన్నతనంలో చదువుకోలేని పిల్లలను చూసినప్పుడు కలిగిన భావనే కలిగిందన్నమాట. దాంతో ఐ.ఐ.టి శిక్షణ మొదలుపెట్టారు. నిజానికి 1970 లలోనే కోచింగ్‌ ‌సెంటర్లు మొదలైనాయి. అవి నెమ్మదిగా ప్రైవేటు కాలేజీలుగా యూనివర్సిటీలుగా మారాయి. ఇవన్నీ చూస్తున్న చుక్కా రామయ్య అందుకు భిన్నమైన పంథాలో సామాన్యులకు సాంకేతిక విద్యా విజ్ఞానాలు అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. రామయ్య ఇన్‌‌స్టిట్యూట్‌ ఐ.ఐ.టి కి పర్యాయపదంగా మారింది. మిగిలింది అందరికీ తెలిసిన చరిత్రే. తెలుగునాట ఏ ఊరికి వెళ్లినా ఆయన దగ్గర చదువుకున్న వారు ఉన్నత పదవుల్లో , సంస్థల్లో కనిపిస్తారు. ఆయన మాత్రం తను బయిలుదేరిన నాటి ఆశయాలకు, ఆచరణకే కట్టుబడి సాగుతున్నారు. జీవితంలో బాగా విజయాలు సాధించిన చాలామంది ఉద్యమాలలో కొనసాగే వారిని మరీ ముఖ్యంగా కమ్యూనిస్టులను గురించి తెలిసీతెలియని మాటలు వినిపిస్తుంటారు. కానీ జీవితాన్ని కాచి వడబోసిన చుక్కా రామయ్య మాత్రం ఉద్యమాలను అత్యంత గౌరవంగా చూస్తారు. తాను కమ్యూనిస్టు భావజాలం అనుసరించినా ప్రజాస్వామిక శక్తులను వ్యక్తులను మరీ ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం బాధ్యతగా చేసుకున్నారు. పిల్లలనైతే వదలిపెట్టరు. మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలనుబట్టి గాక మనుషుల సహజ ప్రతిభను వెలికితీయాలనేది ఆయన వరవడి. తను కూడా వయసుతో నిమిత్తం లేకుండా నిత్య నూతనోత్సాహంతో నేర్చుకుంటూ నేర్పుతూ క్రియాశీలంగా గడపడమే ఆయనను ఇంత అరుదైన వ్యక్తిగా చేసింది.

బలమైన భావాలతో...​

ఇంత మృదువైన రామయ్య నియమ నిబంధనల విషయంలో... తన సంస్థ ప్రవేశాలలోనైనా తన ఆశయాల నిబద్దతలోనైనా రాజీ పడటం వుండదు. కొన్ని వ్యక్తిగత నమ్మకాలను ఆయన వదులుకోలేదు.

అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రాహ్మణ సమాజం వారి కుటుంబాన్ని వెలివేసినా జంకలేదు. కొంతమంది భావిస్తున్నట్టు సంప్రదాయం పట్ల గౌరవం గలవారు సామ్యవాద భావజాలం పాటించకూడదనేమీ లేదు. నిజమైన సంప్రదాయం సమానత్వం కోరుతుందంటారాయన. తన భావాలు ఎవరి మీద రుద్దకుండా సమరాంగణంలో చదువుల్లో ఎన్ని వేల మందిని నడిపించారో ఎన్ని వందల సంస్థల ప్రారంభానికి ప్రేరణ అయ్యారో చెప్పలేము. ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా సహాయపడే మనస్తత్వం మరీ ముఖ్యంగా మహిళల పట్ల గౌరవాభిమానాలు ఆయన సహజ లక్షణాలు. ఇటీవలి దాకా కూడా సభలూ సమావేశాలకు ఓపిగ్గా హాజరవడం అందరితో కలసి మెలసి వుండటానికే. అలా అని తన పరిచయాలను పలుకుబడిని స్వంతానికి ఎన్నడూ ఉపయోగించిన దాఖాలాలూ వివాదాలు అస్సలుండవు. వ్యక్తిగతంగా మా కుటుంబ మిత్రులు కూడా. ఇంత గొప్ప ఉపాధ్యాయుడైన రామయ్య మా నాన్న నరసింహయ్యను కలిసినప్పుడు ఆయన మొదట్లో చెప్పిన అర్థశాస్ర్త పాఠాలు గుర్తు చేసి వినయం చాటుకున్నారు. ఇంత అనుభవం వున్నా ఫోన్‌ ‌చేసి ఫలానా రెఫరెన్స్‌ ‌కావాలని సమాచారాలు సేకరించుకుని వెళ్లిన సందర్భాలెన్నో. చుక్కా రామయ్య సతీమణి కీ.శే లక్ష్మీబాయి, వారి కుమారులు శ్రీనివాస్, అచ్యుత్, కుమార్తెలు ఉమ, రాజేశ్వరి కూడా ఆయన కృషికి అమోఘంగా సహకరించడం అందరికీ తెలుసు. ఈ మొత్తం కృషిలో సంస్థలు, వ్యక్తిగత సహాయకులు, కొందరు మిత్రులు తనకు ఎంతో ప్రేమగా సేవలందిస్తున్నారనేది గుర్తుంచుకోవాల్సిందే.​

లివింగ్‌ ‌లెజండ్‌...​

‘ప్రజాశక్తి’ పత్రికతో (తర్వాత ‘నవ తెలంగాణ’తో), పుస్తక ప్రచురణాలయంతో చుక్కా రామయ్య అనుబంధం సుదీర్ఘమైంది. నలభైలలో అది మొదలై నేటికీ నడుస్తున్నది. ఆమూలాగ్రం చదవడం, విధానాలు తెలుసుకుంటూ కాస్త సందేహం వచ్చినా నివృత్తి చేసుకోవడం ఆయన నైజం. ఏదైనా తేడా వుంటే సూటిగా చెప్పేసి నిర్ణయాలకు కట్టుబడి నిష్కర్షగా వ్యవహరిస్తారు. ‘ప్రజాశక్తి’లోనే గాక అన్ని పత్రికల్లోనూ కాలమ్స్‌ ‌రాశారు. టీవీలు, చానళ్లు వచ్చాక చర్చలలో పాల్గొంటూ విలువైన విశ్లేషణలు, అనుభవాలు అందిస్తుంటారు. వాటిలో సామాజిక అంశాలు, గణితం కూడా వుంటాయి. ఎక్కడకు వెళ్లినా ముందు విద్యాలయాలు పరిశీలిస్తారు. దేశదేశాల విద్యా విధానాలు ఆయన ప్రత్యేకాసక్తి. అవన్నీ రాశారు. పుస్తకాలుగా వచ్చాయి. తెల్లటి దుస్తులతో వినమ్రంగా నమస్కారం చేసి పలకరిస్తారు. ఇప్పుడు వయోభారంతో మాట్లాడటం బాగా తగ్గించినా నమస్కారంగా ఆహ్వానించడం మాత్రం మానలేదు. అందుకే అన్ని విధాల చుక్కా రామయ్య గారు ఒక లివింగ్‌ ‌లెజండ్‌. మన కాలపు మహోదాత్త మూర్తి. మహత్తర స్ఫూర్తి.


- తెలకపల్లి రవి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్