గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెట్టుబడుల పేరుతో వనరుల దోపిడీ

1 గంట క్రితం

tdp govt-cii copy.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 05:47 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

31వ సిఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సమ్మిట్‌ ను ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ఎప్పటివలె విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీలలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. సమ్మిట్‌లో 109 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, వీటి ద్వారా రూ. 9.02 లక్షల కోట్ల పెట్టుబడి, లక్షా 98 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సమ్మిట్‌కు ముందు ఐదు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ప్రాంతీయ సమ్మిట్లలో కుదుర్చుకున్న ఒప్పందాలతో కలిపి చూస్తే మొత్తం 303 ఒప్పందాలు, రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.48 లక్షల ఉపాధి అవకాశాలు రానున్నట్లు ప్రకటించారు.

ఈ సమ్మిట్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఒకటి రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు రక్షణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ పన్నుల రాయితీలు, సబ్సిడీలు, పెట్టిన పెట్టుబడులపై కొంత భాగం వయబులిటీ గ్యాప్‌ కింద తిరిగి ప్రభుత్వం చెల్లింపు, విద్యుత్‌, మంచినీటి చార్జీల మినహాయింపులు, భూములపై సర్వాధికారాలు ఇలాంటి అన్నింటిపై పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వ ప్రకటన ఉద్దేశం. ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలోని అన్ని అంశాలు కొనసాగేలా, వాటిని మార్చటానికి వీలు లేకుండా ఉండేందుకు ఉద్దేశించిన చట్టమది. అంతేగాక ఈ చట్టంలోనే కార్మిక సంఘాలు, కార్మిక హక్కులు, వేతనాలు వంటి వాటిని కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా, వారి దోపిడీ తీవ్రంగా సాగించుకునేందుకు చట్టబద్ధమైన అవకాశం కల్పించేందుకు అవసరమైన చర్యలు పొందు పర్చే ప్రమాదం కూడా పొంచి వుంది. ఒకవైపు రైతులు, కార్మికులు, ప్రజల రక్షణ హక్కులన్నింటినీ తొలగిస్తూ, పెట్టుబడిదారులకు ఊడిగం చేసే చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది.

రెండోది ప్రత్యేక ఎస్క్రో అకౌంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అకౌంట్‌ రాష్ట్ర బడ్జెట్‌లో భాగంగా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, పెట్టుబడిదారుల సంయుక్త అకౌంట్‌గా బ్యాంక్‌లో ఖాతా ఏర్పాటు చేస్తారు. ఈ అకౌంట్‌ ద్వారా పెట్టుబడిదారులకు ఒప్పందంలో ఇస్తామన్న అన్ని రకాల ప్రోత్సాహకాలు ఆటోమేటిక్‌ గా పెట్టుబడిదారుల అకౌంట్‌కు బదిలీ చేయబడతాయి. ఈ అకౌంట్‌కు నిధులు ఎలా వస్తాయి అన్నదే ప్రశ్న? పెట్టుబడిదారులు రాష్ట్ర ఖజానాకు చెల్లించే వివిధ రకాల పన్నులలో కొంత భాగాన్ని ఎస్క్రో అకౌంట్‌కు నేరుగా బదిలీ అయ్యేలా చేస్తారు. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాష్ట్ర ఖజానాకు జమకాకుండా నేరుగా ఎస్క్రో అకౌంట్‌ కు బదిలీ చేస్తారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి చెల్లించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం చెల్లించబోతున్నారు. పై పెచ్చు పెట్టుబడుల రక్షణ చట్టం, వారి ప్రోత్సాహకాల చెల్లింపు ప్రత్యేక ఎస్క్రో అకౌంట్‌లు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవని, ఆంధ్ర రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఇటువంటి చట్టాలను పార్లమెంట్‌లో కూడా చేయాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని నిస్సిగ్గుగా ప్రకటించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో పెట్టుబడిదారులతో పెనవేసుకు పోయిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇలాంటి ఎస్క్రో అకౌంట్‌లను అన్ని రకాల పిపిపి ప్రాజెక్టులకు వర్తింపజేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను ఐదు సర్కిళ్లుగా విభజించి హైబ్రిడ్‌ మోడల్‌ లో మంచినీరు, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన ప్రైవేట్‌ సంస్థల అధీనంలో చేపడుతున్నది. వీటన్నింటికి ఎస్క్రో అకౌంట్లు స్థానిక సంస్థలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. అంతేగాక విశాఖ, విజయవాడ వంటి మున్సిపల్‌ కార్పొరేషన్లలో వెడల్పు కలిగిన కొన్ని రోడ్లను కూడా పిపిపి హైబ్రిడ్‌ మోడల్‌లో ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్ల పెట్టుబడుల గ్యారంటీకి, చెల్లింపులకు ఈ రెండు నగర పాలక సంస్థలు ఎస్క్రో అకౌంట్లు తెరిచాయి. ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను ఆదాయంలో కొంత భాగాన్ని ఈ అకౌంట్లకు బదిలీ చేస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత ఆరు సార్లు పెట్టుబడుల సమ్మిట్‌లు నిర్వహించారు. 2024 వరకు 1860 ఒప్పందాలు, రూ.26.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 41.56 లక్షల ఉద్యోగాలొస్తాయని ఒప్పందాలు చేశారు. గడిచిన దశాబ్దంలో ఈ పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి? అనేవి ప్రభుత్వాలు చెప్పలేక నీళ్ళు నములుతున్నాయి.

రాష్ట్ర పెట్టుబడుల సమ్మిట్‌లను మనం నిశితంగా పరిశీలిస్తే, జరిగిన ఒప్పందాల్లో ఎక్కువ భాగం వాస్తవ రూపం దాల్చటంలేదు. చాలా సంస్థలు భూములు తీసుకొని నిర్మాణాలు చేపట్టడంలేదు. అవసరానికి మించి రెండు మూడు రెట్లు భూములు తీసుకుంటున్నాయి. ఇలాంటివి మనకు రాష్ట్రంలో అనేకం కనిపిస్తున్నాయి. సంస్థలు ప్రకటించే పెట్టుబడుల విలువను మూడు, నాలుగు రెట్లు ఎక్కువ చేసి ప్రకటిస్తున్నాయి. భారీగా ప్రభుత్వ పెట్టుబడి రాయితీలు, బ్యాంకుల నుండి ఎక్కువ రుణాలు పొందటానికి ఈ మోసానికి పాల్పడుతున్నాయి. ఇక ఉద్యోగాల కల్పన అంకెలన్నీ పచ్చి మోసం. 10 నుండి 15 రెట్లు ఎక్కువ చేసి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమలకు అవసరమైన రోడ్లు, రైల్వే, విద్యుత్‌, నీరు వంటివి అన్నీ సదుపాయాలు ప్రభుత్వ ఖజానా నుండే ఖర్చు చేసి సమకూరుస్తున్నది. పర్యావరణ నిబంధనలన్నింటినీ గాలికొదిలేశారు. కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు.

యువ కార్మిక వర్గాన్ని అతి తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా, కనీస కార్మిక చట్టాలు కూడా అమలు లేకుండా ఇష్టమొచ్చినట్లు శ్రమ దోపిడీ చేసుకోవటానికి పెట్టుబడి శక్తులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రజా వనరులను, అరుదైన ఖనిజాలను, సముద్ర తీరాన్ని, అటవీ ప్రాంతాలను, ప్రభుత్వ పెట్టుబడితో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, మౌలిక సదుపాయాలు, ప్రజల ఉమ్మడి ఆస్తులను ఆఖరికి పౌర సేవలను కూడా వివిధ పేర్లతో ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రభుత్వాలే ఈ సంస్థలకు అవసరమైన పెట్టుబడులను ప్రైవేట్‌ బ్యాంకుల నుండి అతి తక్కువ వడ్డీకి రుణాలను కూడా మంజూరు చేయించడంతో పాటు వారికి కేటాయించిన భూములను కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవటానికి, అమ్ముకోవడానికి కూడా హక్కులు కల్పిస్తున్నారు.

ఉదాహరణకు ఇటీవల రాష్ట్రంలో విశాఖపట్నం దగ్గర భోగాపురంలో జి.ఎం.ఆర్‌ సంస్థ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి 4 వేల కోట్ల పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వం కేవల 10. 25 శాతం వడ్డీకి రుణం ఇప్పించింది. దీని లాభాల కోసం విశాఖ ప్రభుత్వ ఎయిర్‌ పోర్టును శాశ్వతంగా మూసేశారు. 20 ఏళ్లు రాష్ట్ర జీఎస్టీ, 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ షేర్‌ ఇవ్వనవసరం లేదు.

s0ఇదే ప్రజల ఆస్తులు, వనరులను ప్రభుత్వ మద్దతుతో కొల్లగొట్టడమంటే. ఈ తరహా విధ్వంసకర అభివృద్ధి రాష్ట్ర ప్రజా వనరులను, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టటమే గాక పెద్దఎత్తున ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వలసలు పెరుగుతాయి. సంపద, వనరులు కేంద్రీకరణకు దారితీస్తాయి. ఇప్పటికే ఈ నయా క్రోనీ దోపిడీ క్రమం రాష్ట్రమంతా విస్తరిస్తున్నది. వీటిని ప్రతిఘటించడమే రాష్ట్ర ప్రజల ముందున్న కర్తవ్యం.


వ్యాసకర్త : డా. బి. గంగారావు

సెల్‌: 94900 98792


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్