శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోల'గంగ ' !

5 గంటల క్రితం

data centre(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 05:18 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

'ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి వరదొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది '-- పాట పాడుతున్న కళాకారుల వాహనాన్ని రైతులు అడ్డుకుని, కళాకారులపై కేకలేస్తున్నారు.

పాయకరావు పేట గంగా హారతి కార్యక్రమానికి వెళ్తున్న ఊరేగింపును ఓవర్ టేక్ చేసి, గొడవ చూసి ఆగింది దశుమంతు నాయుడు కారు. తమ ప్రాంతం నుంచి జనాన్ని తరలించే కార్యక్రమం నాయుడికి అప్పగించారు నాయకులు. ఆగిన ఊరేగింపు అతనిదే. నాయుడు, ఆ వెనుక పరదేశి కారు దిగి, ఏమైందని అడిగారు.

ఒక నడి వయసు రైతు ముందుకొచ్చి-- " అయ్యా! సరైన వానల్లేక.. వరిసేలు లేక.. కాలవలు, సెరువులు ఎండిపోయీ, రైతులు పిల్లాపాపలతో గగ్గోలు పెడతుంటే.. ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తిందని పాటలు పాడతన్నారండి.. రైతులకు మరి కోపం రాదేటండీ!"

ఏమయ్యా.. అన్నట్టుగా కళాకారుల మొఖం చూసాడు కోపంతో నాయుడు. ఆర్కెస్ట్రాలో జిగేల్ డ్రెస్ వేసుకున్న ఒకడు ముందుకొచ్చి--

" పోలవరం నుంచి గోదారి వస్తుంది గదా సార్! అందుకనీ.." నసిగాడు.

" ఆకాశ గంగేదయ్యా? సరే.. గోదారి వరదొచ్చింది.. పొలాలకు తడిపెట్టడం కావాలి గానీ, మీరు కొంగుల్ని ముడిపెట్టిందని పాడడమేటీ!అయిదో తారీకు నుంచి అసలు మూర్తాలే లేవు. ఎవరి కొంగుల్ని ఎవరికి ముడిపెట్టేత్తారు? " కళాకారుడిని నిలదీసి

''పాట ఆపమనడం తప్పా.. నాయుడు గారూ" అన్నాడు అతడి వైపు తిరిగీ!

"మీరు ప్రొఫెషనల్స్.. మీరు మారరయ్యా! అక్కడుందే ఆ కళాకారుల వ్యాన్ ని ముందు పెట్టండ్రా!"-ఆదేశించాడు నాయుడు. మరెవరికో పురమాయించాడు పరదేశి. కొద్ది నిమిషాల్లో ఆ వ్యాన్ ముందుకొచ్చింది.

" అందుకొండ్రా"-కేకేశాడు పరదేశి. ' ఆకాశ గంగమ్మ ఆగిపోయింది, పాతాళ గంగమ్మ పైకి రానంది! అదిగదిగో వస్తోంది..మన పోలగంగ.. రైతు కూలీల్లారా మనకేమి బెంగ?"-- చప్పట్లు కొట్టారు రైతులు. నాయుడు కారు ముందు కదిలింది.. ఆ వెనుక ఊరేగింపు. " శుభమా, అని పెళ్లి చేసుకుంటే.. ఎన్నాళ్లీ కాపురాలు అని ఆర్కెస్ట్రా వాళ్ళు పాడితే ఎలాగుంటాది! సేసినోళ్లకీ, సేసుకున్నోళ్లకీ ఒళ్ళు మండిపోదేటి?"- నవ్వించాడు పరదేశి. ఇందాక, కారు దిగలేదు గానీ, కారులో ఉన్న సిద్ధాంతి, కొత్తగా నాయుడికి పరిచయమైన రిటైర్డ్ ఇంజనీర్ మబ్బు గంగాధర్ కూడా నవ్వారు.

"పదిహేను.. ఇరవై ఏళ్ల క్రితం కాలువలు తవ్వేశారు. అవి బాగా ఎండిపోయి, పగిలిపోయి ఒకపక్క శిథిలమైపోతున్నాయి. ఈ వచ్చిన నీరు.. సగం అవే తాగేస్తాయేమో!"-నాయుడు వెనక్కి తిరిగి ఇంజనీర్ మొహం చూస్తూ అన్నాడు.

" ఆ మధ్యన రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు వేసిన శిలాఫలకాల పరిస్థితి చూశానండి. చుట్టూ తుప్పలు, డొంకలు బలిసిపోయాయి. ఆకు తెగులు పట్టినట్టు, అక్షరాలు అరిగిపోయాయి"- అన్నాడు గంగాధర్.

" రామపాదం .. రాతిని నాతిని చేసినట్టు, ఈ జలసిరి తగిలి ఆ ఫలకాలు ఏమైపోతాయో!"-నవ్వుతూ

అన్నాడు సిద్ధాంతి. సంతోషం అక్కడితో ఆపేశారన్నట్టుగా అతని మొహం చూశాడు పరదేశి.

" శ్రీరామ పాదసాగరమల్లా పోయీ.. ఇందిరా సాగరం పోయీ.. ఎ.టి.ఎం పోయీ.. ఏటేటో అయిపోయీ.. ఇన్నేళ్లు లేనిది ఇప్పుడేటీ! మన బాబుకి సడన్ గా అనకాపల్లికి పోలవరం నీరు తెచ్చీయాలని ఆరాటం పుట్టింది? రైతుల మీద ఏటింత ప్రేమ పుట్టుకొచ్చింది? లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమా!?"-పరదేశికి మనసులో ఏదో అనుమానం.

"ఇంకా ఏముందని రైతుల దగ్గర? సాగు చేయడానికి! ఈ ఆరాటమంతా మీకోసం కాదండి.. ఆ డేటా సెంటర్ల కోసం!"-అన్నాడు ఇంజనీర్ చిన్నగా నవ్వుతూ.

"ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తున్నారు. వాటికి కడుపునిండా నీళ్లు ఉండాలట కదా!"-నాయుడుకి అవగాహన ఉంది.

"ఏడాదికి మూడు టి.ఎం.సిల నీరు వాటికి కావాలి. ఒక టి.ఎం.సి నీటితో, రైతులు వరి పంటయితే,10-12 వేల ఎకరాల్లో పండించ్చొచ్చు. అదే, చెరుకైతే 13-15 వేల ఎకరాలు, మిరప, వేరుశనగ, మొక్కజొన్న లాంటి పంటలైతే 16-24 ఎకరాలు సాగు చేయొచ్చు!"-వివరించాడు ఇంజనీర్.

" అందుకే ముందు రైతుల దగ్గర భూములు లాగేసి, కంపెనీలకి ఇచ్చేస్తన్నారు. దుక్కీ, ఊడుపూ లేకుండా!"- పరదేశి మాటలు పూర్తికాకముందే, గంగా హారతి ప్రదేశం వచ్చేసింది. కారు దిగీ దిగగానే, ఎదురుగా కళ్ళు పట్టనంత సైజులో పే..ద్ద కటౌట్ కనిపించింది.

అది చదివి-" అన్నా! ఇక్కడా ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అన్నారు. ఆ దిగువన అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకని సిన్నక్షరాలతో రాశారు. పూర్వం ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు కూడా నీరిస్తామన్నారు కదా! ఆ రెండు జిల్లాల పేర్లు లేవేటి?"-మంచి పాయింటే కనిపెట్టాడు పరదేశి. మిగిలిన వాళ్ళు కూడా నిశితంగా పరిశీలించారు..నిజమే అనిపించింది. నాయుడు నిట్టూరుస్తూ, పరదేశి వైపు తిరిగి-

" కలలకు రెక్కలు అనే క్లియర్ గా రాశారు కదరా! ఇంకేటి నీకు డౌటు?"

" అది కాదన్నా ఆ రెండు జిల్లాల సంగతేటీ అని!"

" ఎగరాలంటే ఎన్ని రెక్కలుండాలి?"

" రెండు"

" ఆ రెండే అనకాపల్లి, విశాఖపట్నం.. డేటా సెంటర్లు"

గంగా హారతి జరిగిపోతున్నట్టుంది.. మంగళ వాద్యాలు.. వేదమంత్రాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోతుంది. ఇక, ఒకరు మాట్లాడింది మరొకరికి వినపడటం లేదు.

- ' నల్లి' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్