ప్రపంచ బ్యాంక్ తాజాగా భారతదేశంలో ఉన్న పేదరికానికి సంబంధించిన అంచనాల లెక్కలను ప్రకటించింది. వాటి ప్రకారం 2011లో ‘నిష్ట దరిద్రులు’ లేదా ‘అత్యంత పేదరికంలో ఉన్నవారు’ 27.1 శాతం ఉండగా వారి సంఖ్య ఇప్పుడు 2.6 శాతానికి పడిపోయింది. 2022-23, 2023-24 సంవత్సరాలలో నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు చెప్తున్నారు.
ఇదే సర్వే ఆధారంగా ఈ మధ్య మోడీ ప్రభుత్వం మన దేశంలో నిష్ట దరిద్రులు 5 శాతానికి తగ్గిపోయినట్టు ప్రకటించుకుంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ లెక్కలు ఇంకా తక్కువ స్థాయికి పేదల శాతం తగ్గిపోయినట్టు చూపడంతో ప్రభుత్వం మరీ కాకిగోల చేస్తూ గొప్పలు పోతోంది. అయితే ప్రపంచ బ్యాంక్ లెక్కలు ఎందుకూ కొరగావు.
మొదటిది-2011లో నిర్వహించిన సర్వేలో అనుసరించిన పద్ధతికి, 2022, 2023 సంవత్సరాలలో అనుసరించిన పద్ధతికి చాలా తేడాలు ఉన్నాయి. అందుచేత ఈ రెండింటినీ సరిపోల్చి చూడడం తప్పు. ఉదాహరణకు-2011లో ఇంటి వద్ద సర్వే నిర్వహించినప్పుడు ఆ ఇంటికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేవారు. ఇప్పుడు ఒకే ఇంటికి మూడు వేరు వేరు సమయాల్లో వెళ్తున్నారు. ఎన్ని ఎక్కువసార్లు వెళ్తే అంత ఎక్కువగా ఆ ఇంటి వినిమయం నమోదు అవుతుంది. అలా ఆ ఇంటి వినిమయం పెరిగింది కనుక వారు పేదరికం నుండి బైట పడినట్టు పరిగణిస్తారు. 2011లో అనుసరించిన పద్ధతి వేరు కనుక పోల్చి చూసి నిర్ధారించడం సరైన పద్ధతి కాజాలదు.
రెండవది-ప్రపంచ బ్యాంక్ పేదరికాన్ని నిర్వచించిన విధానమే తప్పు. ఒకానొక వ్యక్తి గతేడాది ఏ యే వస్తువులను వినియోగించాడో అవే వస్తువులను అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఈ ఏడాది గనుక వినియోగిస్తే అప్పుడు అతగాడి స్థితి ఖచ్చితంగా మెరుగుపడిందని చెప్పవచ్చు. కాని గతేడాది వినియోగించిన వస్తువులలో కొన్నింటిని ఈ ఏడాది వాడడం మానివేసి, వేరే వస్తువులను కొన్నింటిని ఈ ఏడాది కొత్తగా వాడితే అప్పుడు అతడి స్థితి మెరుగుపడిందో లేక దిగజారిందో చెప్పడం సాధ్యం కాదు.
మామూలుగా పేదరికం అంచనాలను లెక్కించేటప్పుడు ఏ ఏడాదితో పోల్చి లెక్కించడం జరుగుతోందో ఆ ఏడాది ఉన్న ధరలు ఒకలా ఉంటాయి. ఇప్పటి ధరలు పెరిగిపోతాయి. అందువలన సరిపోల్చడానికి వీలుగా ధరల సూచీ ఎంత పెరిగిందో చూసుకుని ఆ మేరకు పాత ధరలను సవరిస్తారు. ఆ ప్రకారం పేదరికపు రేఖను నిర్ధారిస్తారు. ఆ రేఖకు దిగువ స్థాయిలో వినిమయం ఉన్నవారందరూ పేదరికపు రేఖకు దిగువన ఉన్నట్టు గుర్తిస్తారు. ఈ పద్ధతి పూర్తిగా శాస్త్రీయం కాకపోయినా ఏదో ఒక సూత్రాన్నైనా పాటిస్తున్నట్టు అనుకోవచ్చు. కాని 2011లో వాడిన వస్తువులు వేరు, 2024లో వాడిన వస్తువుల వేరు అయిపోయినప్పుడు వాటిని ఎలా సరిపోల్చగలుగుతారు?
2011లో లభించిన సరుకులను, సేవలను (విద్య, వైద్యం, రవాణా వగైరా) అప్పుడు వినియోగించిన మేరకు 2024లో ఒకానొక వ్యక్తి వినియోగించకపోవచ్చు. ఆ వ్యక్తి ఆర్థిక స్తోమత పెరిగినందువలన అతడు వేరే సరుకులనో సేవలనో వినియోగించడానికి సిద్ధపడితే తప్పకుండా అతడు మెరుగైన స్థాయికి ఎదిగినట్టు ఒప్పుకోవచ్చు. కాని 2011లో లభించిన సరుకులు లేదా సేవలు 2024లో లభించనందువలన అతడు అనివార్యంగా వేరే సరుకులనో, సేవలనో వినియోగించవలసి వస్తే అప్పుడు అతడు పేదరికాన్ని అధిగమించాడని ఎలా నిర్ధారించగలం? ఉదాహరణకు వైద్యాన్నే తీసుకుందాం. 2011లో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉన్నందువలన వాటినే వినియోగించుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు 2024లో ఆ ప్రభుత్వ వైద్య సేవలు కొరవడినందువలన అనివార్యంగా ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించాడనుకుందాం. అప్పుడు అతడు చేసిన ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతమాత్రాన అతడి ఆర్థిక స్థితి మెరుగుపడినట్టు చెప్పలేం కదా? బహుశా ఆ ఖర్చు చేయడానికి అతడు అప్పు చేసి వుండవచ్చు కూడా. అంటే అతడి ఆర్థిక స్థితి 2011 కన్నా 2024లో బాగా దిగజారి వుండాలి. కాని ప్రపంచ బ్యాంక్ మాత్రం అతడి ఖర్చు పెరిగింది కనుక అతడు పేదరికం నుండి బైట పడ్డట్టే పరిగణిస్తుంది.
ఇదే విధంగా విద్య కోసం చేసిన ఖర్చునూ పరిగణిస్తుంది. గతంలో ఏయే సేవలనైతే ప్రభుత్వమే ఉచితంగానో, తక్కువ ఖరీదుకో అందించేదో, వాటిని ప్రభుత్వం అందించడం మానుకుని ప్రైవేటు రంగానికి విడిచిపెట్టడం వలన ప్రజల మీద భారం బాగా పెరిగిపోయింది. వారు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. కాని ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం వారు పేదరికం నుంచి బైట పడుతున్నారు! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యువత, విద్యార్థులు విద్య, వైద్యం సేవల బాధ్యతల నుండి ప్రభుత్వాలు తప్పుకోడాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కువ చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రాతిపదిక ఎంత తప్పో ఈ ఆందోళనలే రుజువు చేస్తున్నాయి.
కాలక్రమంలో ప్రజలు ఉపయోగించే వస్తువుల వినియోగం తీరులో మార్పులు రావని చెప్పలేం. మరి వినియోగంలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ పేదరికం లెక్కలు వేయడం ఎలా చేయాలి? ఈ ప్రశ్నకు 1973-74లో ప్రణాళికా సంఘం సమాధానంగా ఒక పద్ధతిని ప్రతిపాదించింది. ఉదాహరణకు మనం ఉపయోగించే ఆహార దినుసులలో మార్పులు ఉంటాయి. మనం తినే తిండిలో ఆహారధాన్యాల పాలు తగ్గి మాంసాహారం, పాల ఉత్పత్తుల వంతు పెరుగుతోంది. అటువంటప్పుడు సరిపోల్చడం ఎలా? గతంలో తీసుకున్న ఆహారంలో ఉన్న శక్తిని కేలరీలలో లెక్కించి, ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలోని శక్తిని కూడా అదే విధంగా లెక్కించి ఆ కేలరీలలో పెరుగుదల ఉందో, లేక తగ్గిపోతోందో నిర్ధారించవచ్చు. కేవలం కేలరీల లెక్కతోనే మొత్తం ఆర్థిక స్థితిని సమగ్రంగా అంచనా వేయలేకపోవచ్చు. కాని కొంతవరకైనా ఇది పోల్చి చూడడానికి తోడ్పడుతుంది.
ఆ విధంగానే ప్రణాళికా సంఘం పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తి ఒక్కరికి రోజుకు కనీసం 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలుగుతుంటే ఆ వ్యక్తి పేదరికంలో నుంచి బైట పడ్డట్టేనని, అదే గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యక్తి రోజుకు 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలుగుతుంటే ఆ వ్యక్తి పేదరికంలో లేనట్టేనని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ ప్రకారం చూస్తే 1993-94 నాటికి పట్టణాల్లో 57 శాతం జనాభా, గ్రామాల్లో 58 శాతం జనాభా పేదరిక రేఖకు దిగువన ఉన్నట్టు నిర్ధారణ అయింది. అదే ప్రాతిపదికన 2011-12 లో పట్టణాల్లో 65 శాతం, గ్రామాల్లో 68 శాతం పేదరికంలో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఐదేళ్ళ తర్వాత జరిగిన సర్వేలో గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో ఉన్నవారు 80 శాతం దాటినట్టు వెల్లడైంది. దాంతో మోడీ ప్రభుత్వం ఆ సర్వేనే ఏకంగా రద్దు చేసేసింది. అంతటితో ఆగకుండా సర్వేకు అనుసరించే పద్ధతిని, పాటించే ప్రమాణాలను కూడా మార్చివేసింది. దాంతో ఆ తర్వాత చేపట్టిన సర్వేలలో వెల్లడైన గణాంకాలను పాత గణాంకాలతో సరిపోల్చడానికి వీలు లేకుండా పోయింది.
పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఏ పద్ధతినైనా విమర్శించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే, భారతదేశంలో పేదరికం దాదాపు అదృశ్యం అయిపోయిందని చెప్పడం అంటే బొత్తిగా అర్ధం లేదు. ఇప్పుడు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచితంగా ఆహారధాన్యాలను పంచుతున్నా, దాదాపు 80 కోట్లమంది భారతీయులు ఆకలిగొని జీవిస్తున్నట్టు ప్రపంచ ఆకలి సూచిక వెల్లడించింది. ఆకలిని లెక్కించిన 122 దేశాలలో మన దేశం 100వ స్థానంలో ఉంది. ఇది చాలదన్నట్టు ప్రభుత్వం త్వరలోనే ఉచిత ఆహారధాన్య పంపిణీని నిలిపివేయనున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించింది. అదే గనుక అమలులోకి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా దిగజారుతాయి. ఒకవైపు ప్రజలు ఇలా నిస్సహాయంగా ఆకలికి విలవిలలాడుతూ వుంటే మరోవైపు ప్రపంచ బ్యాంక్ మాత్రం మన దేశంలో పేదరికం దాదాపు అంతరించిపోయినట్టు ప్రకటిస్తోంది !
మన ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ లెక్కల్ని స్వాగతిస్తోంది కాని మరోపక్క ప్రపంచ ఆకలి సూచిక లెక్కల పట్ల మాత్రం అభ్యంతరాలు తెలుపుతోంది! ఆకలి సూచికను లెక్కించేటప్పుడు చిన్నపిల్లల్లో ఉండే పోషకాహార లోపానికి ఎక్కువ వెయిటేజీ ఇచ్చినందువల్ల సూచిక ఎక్కువ చూపిస్తోందని వాదిస్తోంది! అయితే చిన్న పిల్లల ఆకలి తీర్చడానికే మన దేశంలో మొదటి ప్రాధాన్యతనిస్తారు. వారిలో పోషకాహార లోపం పెరుగుతోంది అన్నప్పుడు అంతకన్నా ఆకలిని లెక్కించడానికి వేరే ప్రమాణం ఏముంటుంది?
నయా ఉదారవాదాన్ని పూర్తిగా బలపరిచేది ప్రపంచ బ్యాంక్. అందుచేత నయా ఉదారవాద విధానాల అమలు వలన మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవడం దానికి అవసరం. అందుకోసం వాస్తవ పరిస్థితి బాగులేకున్నా, దానిని అందంగా చిత్రించడానికి అది తయారౌతుంది. ఇటువంటి వైఖరినే ఆక్స్ఫర్డ్ బహుళ ప్రమాణ సూచిక (మల్టీ డైమన్షనల్ ఇండెక్స్) తీసుకుంది. ఆధునిక పద్ధతులను పాటించడం అంటే పేదరికాన్ని అధిగమించినట్టేనని అది వాదిస్తుంది (ఆ వాదన ప్రకారం సెల్ ఫోన్ వాడేవాళ్ళంతా పేదలు కారు!). ఇటువంటి వాదనలను మనం తప్పకుండా తిప్పికొట్టాల్సిందే.
( స్వేచ్ఛానుసరణ )

- ప్రభాత్ పట్నాయక్








కామెంట్లు (0)