శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయువ శక్తిని గుర్తించాలి...​

1 గంట క్రితం

Cockroaches
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దేశవ్యాప్తంగా యువత చేపట్టిన పోరాటాలు విజయవంతం అవుతున్నాయి. మొన్న జంతర్ మంతర్ వద్ద జెన్ జి యువత నిరసనలతో కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చెయ్యాల్సి రాగా, నిన్న రాంచీలో యువత పోరుతో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పంతం వీడి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకాల్ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం...అవీ వేర్వేరు పక్షాల ఏలుబడిలో ఉన్నవి మెడలు వంచాల్సి రావడం యువత సాధించిన విజయమే. అయినా జరగాల్సిన న్యాయం మిగిలే ఉంది. యువతకు అవకాశాలు తగ్గుతున్నాయి. నాణ్యమైన విద్య ఖరీదైనదిగా మారింది. కృత్రిమ మేధస్సు విస్తృతి, అంతర్జాతీయ పరిణామాలు వారిలో భవిష్యత్తు పట్ల ఆందోళనను పెంచుతున్నాయి. ఉన్న కొద్ది అవకాశాలు కూడా ప్రభుత్వ నిర్వహణలోని అసమర్ధత వల్ల, అవినీతి వల్ల దూరం కావడమంటే అది తట్టుకోలేని అన్యాయంగా తయారౌతుంది. ఈ నేపథ్యంలోనే యువత పోరుబాట పట్టాల్సి వస్తుంది. పైగా తమ ఆవేదన, ఫిర్యాదులోని నిజాయితీని గమనించకుండా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించడం వారికి పుండుమీద కారం జల్లినట్టు అనిపిస్తుంది. అందుకనే తెగిస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్రం వివాదాలకు మూలమైన భ్రష్టుపట్టిన పరీక్షా విధానాన్ని సమూలంగా సంస్కరించాలి. జార్ఖండ్ లో 2024 నుండి వివాదాస్పదమైన ఉద్యోగ నియామకాల్ని రద్దు చెయ్యడం బాగానే ఉంది కానీ, అక్కడి కోర్టు తీర్పు ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 2 వేల మంది భవిష్యత్ డోలాయమానంలో పడింది. ప్రభుత్వం తప్పుకి వారంతా బలి కాకూడదు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు పారదర్శక విధానాన్ని, సమర్ధవంతమైన నిర్వహణా వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. ఇది కనీస బాధ్యత. యువత అధికంగా ఉన్న దేశం మనది. వారి శక్తియుక్తులను గుర్తించి సంపూర్ణంగా వాడుకోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది.

​- డా. డి.వి.జి. శంకరరావు,

మాజీ ఎంపీ, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్