బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొత్త తరం ప్రశ్న మొదలైంది...

16 గంటల క్రితం

jantarmantar - students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 05:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

నేను చాలా ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాను. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులతో కలిసి నిలబడ్డాను. అయినప్పటికీ జులై 20న జంతర్ మంతర్ దగ్గర గుమిగూడినంత జనాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇది రాజకీయ పార్టీలు లేదా పెద్ద సంస్థలు నెలల తరబడి క్షేత్ర స్థాయిలో చేసిన సమీకరణ ద్వారా ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేసిన ర్యాలీ కాదు. ఇది స్వచ్ఛందంగా జరిగిన సమీకరణ. దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల మంది వచ్చారు. జంతర్ మంతర్ మాత్రమే కాకుండా, మొత్తం సెంట్రల్ ఢిల్లీ అంతా జనంతో నిండిపోయింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

​నన్ను ఎంతగానో ఆకట్టుకున్న మరో అంశం ఆ జనసమూహం పొందిక. చాలా నిరసనలు బాధితులైన సమూహం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. వాటికి పౌర సమాజం, మేధావులు, ఉద్యమకారులు మద్దతుగా చేరుతారు. కానీ ఇది వేరు. అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాల ప్రజలు హాజరయ్యారు. విద్యార్థులు, కార్మికులు, నిపుణులు, తల్లిదండ్రులు ఉన్నారు.

​ప్రజాస్వామ్య హక్కుల ఆవిష్కరణ

​ ఇంతకు ముందెన్నడూ నిరసనల్లో పాల్గొనని యువత పెద్ద సంఖ్యలో రావడం అద్భుతంగా అనిపించింది. వారు నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణలు, నినాదాలు, పాటలు, ఐక్యతల ద్వారా వీధుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఆచరించవచ్చో వారు తెలుసుకుంటున్నారు. చాలామందికి, సమష్టి కార్యాచరణ ఎలా ఉంటుందో, అది నింపే ఆశ ఎలాంటిదో అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం ఇదే మొదటిసారి.

ఒక యువకుడు తాను రోజూ ఎదుర్కొంటున్న కుల వివక్ష గురించి, అస్పృశ్యతా ఆచారం కారణంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన నాటి నుండి తాను గుడులకు వెళ్లడం ఎలా మానేశాడో చెప్పాడు. మరొక విద్యార్థిని తన తండ్రితో జరిగిన గొడవను గుర్తుచేసుకుంది: "నేను నిరసనకు ఎందుకు వెళ్తున్నానని నాన్న ప్రశ్నించారు. మోడీ జీ మన కోసం చాలా చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత చూపమని చెప్పారు. ఇంతకీ ఆయన (మోడీ) మాకేం చేశారని నేను ఎదురు ప్రశ్నించాను. ఉద్యోగాలు లేవు. పరీక్షల వ్యవస్థ గందరగోళంగా ఉంది. ప్రభుత్వం ఖర్చు చేసేదంతా మన పన్నుల నుంచే వస్తోంది. వారేం మనకు ఉచితంగా ఉపకారం చేయడం లేదని నాన్నకి చెప్పాల్సి వచ్చింది" అని వివరించింది.

తరాల మధ్య రాజకీయ మార్పు

నేను విన్న ఈ సంభాషణ, ఇతర చర్చలు ఈ నిరసనలో పాల్గొంటున్న తరాల స్వభావాన్ని స్పష్టం చేశాయి. ఇది కుటుంబాలలో నెలకొన్న నిశ్శబ్ద రాజకీయ విభేదాలను బయటపెట్టింది. కుటుంబాలలో జరిగే రాజకీయ ప్రభావాల నుండి బయటపడటానికి, వాటిని ప్రశ్నించడానికి ఇవాళ్టి యువతరం ఆసక్తి చూపుతుంది.

ఈ చర్చ కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండును దాటి ముందుకు వెళ్లిపోయింది. విద్యార్థులు నిరుద్యోగం, విద్య ప్రైవేటీకరణ, విద్యా వ్యవస్థ నుండి పేద, అణగారిన వర్గాల మినహాయింపు, తగ్గుముఖం పడుతున్న ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని గురించి మాట్లాడుతున్నారు. వారు జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకుంటున్నారు. అసమానతను ప్రభుత్వ విధానాల నుండి వేరు చేయలేమని, ప్రతి సమస్య చివరికి రాజకీయ, ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నదని వారు అర్థం చేసుకోవడం ప్రారంభించారు.

​ఒకేసారి వేలాది నరాల అనుసంధానాలు ఏర్పడుతున్నట్లుగా ఉంది; ప్రతి సంభాషణ మరో జ్ఞానోదయ క్షణాన్ని రగిలిస్తూ, విప్లవ బీజాలను నాటుతోంది. కొత్త ఆలోచనలు, అభ్యుదయ భావాలు, విమర్శనాత్మక ఆలోచనలు వికసించే సమాజాలను వారు నిర్మిస్తున్నారు. కొత్త వేదికలు ఉద్భవిస్తున్నాయి, వాటితో పాటు కొత్త నాయకులు వస్తున్నారు.

తొలగిపోతున్న భ్రమలు- వాస్తవాల గ్రహింపు

కానీ వారు ఒక చేదు వాస్తవాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసు లాఠీలు, టియర్ గ్యాస్ మన కోసం కాదని వారిలో చాలామంది భావించి ఉండవచ్చు. అవన్నీ జె.ఎన్‌.యు లోని "దేశద్రోహి" విద్యార్థుల కోసం, "ఖలిస్తానీ" రైతుల కోసం, "అర్బన్ నక్సల్స్", "మావోయిస్ట్ ప్రొఫెసర్లు", పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారుల కోసమని భావించి ఉంటారు. పకడ్బందీగా అల్లిన తప్పుడు కథనాలు, ప్రచారాల ద్వారా "ఇతరుల"పై హింసను సమర్థించడాన్ని చూస్తూ వారు పెరిగారు.

​జులై 20న, న్యాయబద్ధంగా పరీక్షల నిర్వహణ, సమ్మిళిత విద్యా వ్యవస్థ, చదువుకునే హక్కును డిమాండ్ చేసినందుకు తాము కూడా ఎంత త్వరగా "ఇతరులుగా" మారిపోవచ్చో ఇప్పటికే చాలామంది గ్రహించారు. వారి ముఖాల్లో అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. "చివరకు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు" అని గ్రహించిన క్షణాలు అవి. ఇప్పటివరకు వాళ్ళు ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, రైతులు అణచివేతను ఎదుర్కోవడం సురక్షితమైన దూరం నుండి చూశారు. కొందరు దాన్ని సమర్థించడానికి ఉపయోగించిన కథనాలను అంగీకరించి ఉండవచ్చు కూడా.

అకస్మాత్తుగా వారు కూడా అదే ముద్రలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించి ఉండరు. నీట్ పరీక్ష పేపర్ ఎందుకు లీక్ అయిందో తెలుసుకోవాలని కోరే ఒక శాంతియుత విద్యార్థిని, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించినంతనే ఎంత సులభంగా "దేశద్రోహి"గా, "పాకిస్తానీ"గా చిత్రీకరించవచ్చో వారు గ్రహించారు. పరిపాలనా లోపాల గురించి సాధారణ ప్రశ్నలు అడిగినందుకు తమను ఎందుకు కొడుతున్నారో అర్థం చేసుకోవడానికి వారు తీవ్రంగా శ్రమించారు. వారు ప్రజాస్వామ్యం అని నమ్మినది కేవలం ఒక సన్నని ముసుగు మాత్రమేనని, ప్రశ్నలు అడిగి జవాబుదారీతనం కోరిన మరుక్షణమే అది తొలగిపోతుందన్న మరొక నిజం నెమ్మదిగా వారిలో ఇంకుతున్నట్లు కనిపించింది.

పటాపంచలైన "విశ్వగురు" ఇమేజ్

ఈ విద్యార్థులలో చాలామందికి ప్రస్తుత ప్రభుత్వమే వారికి తెలుసు. అది అధికారంలోకి వచ్చినప్పుడు వారు పసిపిల్లలు. తప్పులు చేయని, దయామయమైన నాయకత్వం అన్న ఇమేజ్ వారి రాజకీయ అవగాహనలో భాగంగా మారింది. జంతర్ మంతర్ వద్ద చాలామంది మొదటిసారిగా ఆ ఇమేజ్ ను తిరస్కరిస్తున్నట్లు కనిపించారు. తొలిసారిగా వారు తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. ఆ తిరుగుబాటుతో పకడ్బందీగా ఇన్నేళ్లుగా పెంపొందిస్తూ వచ్చిన "విశ్వగురు" ఇమేజ్ చెదిరిపోనారంభమైంది.

​నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, రోజంతా పోలీసుల హింస, దౌర్జన్యాలు, నిర్బంధాల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి వేళ నేను దూరంగా ఉండలేక మళ్లీ నిరసన స్థలానికి చేరుకున్నాను. నేను జంతర్ మంతర్ వైపు నడుస్తుండగా, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు అక్కడికి వెళ్లడం చూశాను. కొందరు కుతూహలంతో, మరికొందరు కేవలం మద్దతు తెలిపేందుకు వచ్చారు. వారు సీనియర్ ఉద్యమకారుల్లా లేదా ప్రతి ప్రదర్శనలో కనిపించే తెలిసిన ముఖాల్లా కనిపించలేదు. కొద్ది గంటల క్రితమే పోలీసుల క్రూరత్వం జరిగిన స్థలానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్న సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లా కనిపించారు. నేను ఆ ప్రదేశానికి చేరుకునేసరికి కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే విద్యార్థుల ప్రవాహం కూడా ముంచెత్తుతోంది. వారికి పెట్టిన పేరుకు తగినట్లే, బొద్దింకల్లా వారు మళ్లీ తిరిగి వచ్చారు.

పోలీసులు, ప్రత్యేక రిజర్వ్ సాయుధ దళాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ విచిత్రంగా అక్కడ ఉన్న జనం ఎవరూ భయపడుతున్నట్లు కనిపించలేదు. అక్కడ నవ్వులు, పాటలు, నినాదాలు సాగుతున్నాయి. నినాదాల్లో తీవ్రమైన ఆక్రోశం రూపంలో పొంగిపొర్లుతున్న తీవ్ర ఆగ్రహం కూడా ఉంది. అంతకుముందు రోజు జరిగిన పోలీసుల క్రూరత్వం గురించి అసహ్యంతో చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి దాటినా జనం పెరుగుతూనే ఉన్నారు. పురుషులు, మహిళలు, పిల్లలు వర్షం అయినా ఆ ఆందోళనా స్థలిని విడిచి వెళ్లడానికి సిద్ధపడలేదు. ఈ నిరసన వారిలో చాలామందికి జీవితంలో ఒక లక్ష్యాన్ని చూపినట్లు అనిపించింది.

అమ్మానాన్నలూ ప్రశ్నించేలా...

నా స్వంత తరం, ఆర్థిక వర్గానికి చెందిన పెద్ద విభాగానికి సంబంధించి నాకు పెద్దగా ఆశ లేదని ఒప్పుకుంటున్నాను. మతపరమైన ప్రయోజనాలు నెరవేరుతున్నంత కాలం, కలుషితమైన గాలి, కూలిపోతున్న ప్రజా మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం, అవినీతి, వ్యవస్థల క్షీణతను సహించడానికి చాలా మంది అలవాటు పడిపోయారు. కానీ ఈ విద్యార్థులు మాత్రం ఇంటికి తిరిగి వెళ్ళాక ఈ సంభాషణలను తమ భోజనం బల్లల వరకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. వారు కష్టమైన ప్రశ్నలు అడుగుతారని, తమ కుటుంబాల మూఢనమ్మకాలను సవాలు చేస్తారని, ప్రస్తుత పరిస్థితిని ప్రశ్నించేలా తమ తల్లిదండ్రులను ఒప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. బహుశా ఈ ఉద్యమం ఊరేగింపుగా వచ్చిన వారిని మాత్రమే కాకుండా, ఇంట్లో వారి కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా మారుస్తుంది.

నేను సావిత్రీబాయి పూలే పోస్టర్ పట్టుకుని ఊరేగింపుగా వెళ్తుండగా, ఒక విద్యార్థుల బృందం నన్ను ఆపి ఆమె ఎవరని అడిగారు. దళితులకు విద్యను అందించడం కోసం ఆమె చేసిన పోరాటం, ఆమె జీవితం గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాము. ఆ క్లుప్త సంభాషణలో కూడా నేర్చుకోవడం అనేది ఉభయత్రా జరుగుతుందని నేను గ్రహించాను. నేను వాళ్ళకి చరిత్రను పరిచయం చేస్తే వాళ్ళు నాలో మనోధైర్యాన్ని నింపారు.

​ ఈ ఉద్యమం నిలబడుతుందా, జావగారిపోతుందా అనే జోస్యం నేను చెప్పబోవడం లేదు. ప్రతి ప్రజా ఉద్యమం ఎదుర్కొనే ప్రశ్నే ఇది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఈ యువతరంలో రాజకీయ చైతన్యం రగులుకుంది. వాళ్ళ జీవితాల్లో ఇది గొప్ప రాజకీయ పాఠంగా మిగిలిపోతుంది. సమిష్టిగా ప్రశ్నించడంలో ఉన్న శక్తి ఏమిటో వాళ్ళు గ్రహించారు.

ఆ రాత్రి జంతర్ మంతర్ అంతటా ఒక కొత్త ఆశ మోసులెత్తింది. చాలా చాలా కాలం తర్వాత నేను ప్రత్యక్షంగా ఆ ఆశను చూశాను. ​పోలీసు దాష్టీకానికి గాయపడిన ప్రతి ఒక్కరికి, బలవన్మరణాల పాలయిన విద్యార్థుల తల్లిదండ్రులకు, జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా మనః పూర్వక సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా.

​ /‘లెఫ్ట్ వ్యూస్’ వెబ్ పత్రిక నుండి /

Monami Sinha

వ్యాసకర్త : మోనామి బసు

కమలా నెహ్రూ కాలేజీ-ఢిల్లీ యూనివర్సిటీలో అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్