శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నియోజకవర్గాల పునర్విభజన, జనాభా, హిందూ రాష్ట్ర

1 గంట క్రితం

hindutva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 05:15 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

ఈ విశ్లేషణ మొదటి భాగంలో (8వ తేదీ సంచిక) ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, న్యాయ వ్యవస్థ సమతుల్యతను కాపాడే పాత్ర, సమాఖ్య వ్యవస్థ సంప్రదాయాలతో సహా భారతదేశ రాజ్యాంగ సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో మనం పరిశీలించాము. ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి సంబంధించిన ప్రతి సాధనాన్ని అయితే పక్కన పెట్టడం లేకుంటే విచ్ఛిన్నం చేస్తున్నారు. అయితే, అది కేవలం బయటికి కనపడే పరంజా మాత్రమే. ఈ రెండవ భాగంలో, ఆ పరంజాపై వాళ్ళు సాగిస్తున్న నిర్మాణం ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

చాలా మంది 'హిందూ రాష్ట్ర' అనే ఆలోచనను కేవలం తెల్లవారుఝామున జరిగే ఆర్ఎస్ఎస్ శాఖల్లో మాట్లాడుకునే ఒక సుదూర ఆకాంక్షగా భావించవచ్చు. కానీ వాస్తవానికి, ఇది చట్టబద్ధమైన, ఎన్నికల పరమైన, ప్రాంతీయ ఇంజనీరింగ్ ద్వారా నిరంతరం సాగుతున్న ఒక ప్రాజెక్ట్. ఇల్లు చక్కబెట్టే పేరిట పరిపాలనాపరమైన పనుల ముసుగులో జనాభా వర్గీకరణ చేస్తూ, ఈ ఆలోచనను ప్రజల్లోకి చొప్పించి సాధారణీకరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఒక లౌకిక గణతంత్ర రాజ్యానికి , బహిరంగ మతతత్వ వ్యవస్థకు మధ్య ఏకైక రక్షణగా ఉన్న రాజ్యాంగ సరిహద్దులపై నిరంతరం దాడి చేయడం ద్వారా ఇందుకు ఒడిగడుతున్నారు. మనం ఈ పని తీరును ఒకదానితో ఒకటి జత చేసి చూడవలసి ఉంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు - నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశించిన కీలుగుర్రం

​ మనం 2023 నాటి రాజ్యాంగ (106వ సవరణ) చట్టం, అంటే 'నారీ శక్తి వందన్ అధీనియం'తో ప్రారంభిద్దాం. లోక్ సభలో 454 ఓట్లతో, రాజ్యసభలో ఏకగ్రీవ మద్దతుతో అన్ని పార్టీలూ వేడుకగా ఈ బిల్లును స్వాగతించాయి. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే, ఈ చట్టం ప్రకారం, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యే వరకు మహిళలకు ఒక్క సీటు కూడా కేటాయించరు. అలాగే జనాభా గణన జరిగి, దాని డేటా ప్రచురించబడే వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాతే జనాభా గణన, పునర్విభజన జరుగుతాయని అప్పటి హోంమంత్రి అమిత్ షా సభలో ధృవీకరించారు. అయితే, 2021 జనాభా గణనను ఇప్పటికే నిరవధికంగా వాయిదా వేసిన విషయాన్ని ప్రభుత్వం తెలివిగా పార్లమెంటులో వెల్లడించలేదు.

2026 ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది – రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు. ఈ మూడు బిల్లులు లోక్‌సభ గరిష్ట స్థానాలను 550 నుండి 850 కు పెంచుతాయి. అంతేకాక 2021 జనాభా గణన ఇంకా పూర్తి కానందున, 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను నిర్వహించాలని ప్రతిపాదించారు. అందుకోసం మహిళా రిజర్వేషన్‌ను ఆకర్షణీయమైన తియ్యని పూతగా ఉపయోగించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్, ఎం.కె స్టాలిన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డిలతో సహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రక్రియపై, అది ప్రవేశపెడుతున్న తీరుపై తమ ఆందోళనలను వెలిబుచ్చారు. జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని, తమ తమ రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి కారణంగా పార్లమెంటు ప్రాతినిధ్యంలో సముచిత వాటా కోల్పోతున్నామని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు.

జనాభా లెక్క ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధిక జనాభా వృద్ధి ఉన్న హిందీ భాషా ప్రాంతాలు అనుచిత లబ్ధి పొందుతాయని, తద్వారా పార్లమెంటు లెక్కలనే శాశ్వతంగా మార్చేస్తుంది. ఇది జనాభాను నియంత్రించిన దక్షిణాది, తూర్పు భారతదేశ రాష్ట్రాల నుండి రాజకీయ బలాన్ని బిజెపి కీలక స్థావరాలుగా ఉన్న భౌగోళిక ప్రాంతాలకు బదిలీ చేస్తుంది. మహిళా రిజర్వేషన్‌ను ఒక ముసుగుగా వాడుకుని, దాని మాటున నియోజకవర్గాల పునర్విభజన అనే అసలు సరుకును చేరవేయాలని బిజెపి చూస్తోంది.

ఎన్నికల ప్రయోజనాల కోసం బిజెపి నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయంగా వాడుకోవడం బహిరంగ రహస్యమే. అయితే, దీని పరిధిలో జరిగే 'గెర్రీమాండరింగ్' అనే అత్యంత ఖచ్చితమైన వ్యూహాత్మక అంశంపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. గెర్రీమాండరింగ్ అంటే ముందే అనుకున్న ఎన్నికల ఫలితాలను సాధించడం కోసం నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడం. పునర్విభజన ద్వారా బిజెపి మొత్తం సీట్ల సంఖ్యను నిర్ణయించాలనుకుంటే, గెర్రీమాండరింగ్ ద్వారా ఆ సీట్లపై తమ అక్రమ విజయాలను నిర్ధారించుకోవాలని చూస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా నిష్పత్తుల పట్ల కనీసం ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనం ఉంటుంది. కానీ గెర్రీమాండరింగ్ అనేది ఉద్దేశపూర్వకంగానే కోర్టుల పరిధికి వెలుపల ఉండేలా రూపొందించబడింది. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఆదేశాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయడానికి వీల్లేదు. ఆ మినహాయింపే గెర్రీమాండరింగ్‌ను ఇంత ఘోరమైన రాజకీయ ఆయుధంగా మారుస్తుంది.

అస్సాం 2023లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చవిచూసింది. ఇది గెర్రీమాండరింగ్‌కు ఒక ప్రయోగశాలగా పనిచేసింది. రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఈ ప్రక్రియలో ఉపయోగించిన వ్యూహాలను "కమ్యూనల్ గెర్రీమాండరింగ్" (మతపరమైన నియోజకవర్గాల మార్పు) అని పిలిచారు. ముస్లిం మెజారిటీ ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ముస్లిం జనాభాను హిందూ మెజారిటీ నియోజకవర్గాల్లోకి విస్తరించడం ద్వారా దాదాపు 35 నుండి 20 కి తగ్గించింది. మిగిలిన ముస్లిం ఓటర్లను కొన్ని సీట్లలోకి కుక్కి, హిందూ పాకెట్లను నిర్ణయాత్మక మెజారిటీలుగా మార్చింది. అంతకు ముందు ఉన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఏ బ్లాక్ లేదా తహసీల్‌ను విభజించకూడదు. కానీ, ఈ సందర్భంలో డీలిమిటేషన్ కమిషన్ గ్రామాన్ని అత్యంత చిన్న యూనిట్‌గా మార్చింది, ఇది పంచాయతీ స్థాయి వరకు మార్పులు చేయడానికి వీలు కల్పించింది. అస్సాంలో ఈ ప్రక్రియ వల్ల సిపిఎం నేరుగా నష్టపోయింది. జమ్మూ కాశ్మీర్‌లో, 2020 పునర్విభజన ద్వారా సృష్టించబడిన ఆరు కొత్త స్థానాల్లో ఐదు హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఆరింటిలో ఐదింటిని గెలుచుకుంది. ఇవి మతతత్వ భౌగోళిక రాజకీయ నమూనా ఫలితాలు. ప్రతిపాదిత జాతీయ నియోజకవర్గాల పునర్విభజన ఈ ప్రాజెక్ట్‌కు 300 కొత్త సీట్లతో సరికొత్తగా మరింత భారీ పరిధిని కల్పిస్తుంది.

సర్‌ ( ఎస్‌.ఐ.ఆర్ ): 'పౌరసత్వ' వడపోతగా ఓటర్ల జాబితా

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమ్రగ పరిశీలన (సర్) అనేది నియోజకవర్గాల పునర్విభజన అనే సుదీర్ఘ ఆటలో తక్షణ కార్యాచరణ సాధనం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూన్ 2025లో బీహార్‌లో ‘సర్’ చేపట్టారు. ధృవీకరణ తర్వాత దాదాపు 47 లక్షల మంది ఓటర్లు (బీహార్ మొత్తం ఓటర్లలో దాదాపు 5 నుండి 6 శాతం) జాబితా నుండి తొలగించబడ్డారు. ఆ తర్వాత ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరించారు. నవంబర్ 2025 నుండి ‘సర్’ ఫేజ్ 2 తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేసింది. కాగా మే 2026లో ప్రకటించబడిన ఫేజ్ 3, 16 రాష్ట్రాలు, మరో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేస్తుంది.​

సుప్రీంకోర్టు మే 2026 నాటి తీర్పులో ఈ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు ఖచ్చితమైన ఓటర్ల జాబితాలు పునాది అని, ఆర్టికల్ 324 కింద ఈ ప్రక్రియను కొనసాగించడానికి ఎన్నికల సంఘానికి విస్తృతాధికారం ఉందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అలాగే మనం నిర్లక్ష్యం చేయకూడని ఒక ముఖ్యమైన పరిశీలనను కూడా చేసింది. సందేహాస్పద పౌరసత్వం ప్రాతిపదికన తొలగించబడిన వారి పేర్లను పౌరసత్వ చట్టాల కింద నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇది అధికారికంగా ఓటర్ల జాబితా సవరణను పౌరసత్వ నిర్ధారణతో ముడిపెట్టింది. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుండే దీని గురించి అనేక ఆందోళనలు, హెచ్చరికలు వెలువడ్డాయి.

సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను మినహాయించేలా ‘సర్’ కు అవసరమైన డాక్యుమెంట్లు రూపొందించబడ్డాయి. 2003 తర్వాత ఓటరుగా నమోదైన వారు ఎన్నికల సంఘం పేర్కొన్న 11 పత్రాలలో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నిర్ణీత గడువు లోగా తమ తల్లిదండ్రుల గుర్తింపును నిరూపించవలసి ఉంటుంది. ప్రారంభంలో, ఈ జాబితా నుండి ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డుల వంటి పత్రాలను కూడా మినహాయించారు. మన దేశంలో పేదరికం, వలసలు, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత అనేవి కోట్లాది మంది ప్రజలకు పెట్టని ఆభరణాలు. అందుకే ఇటువంటి ప్రమాణాలు, ప్రక్రియల ముసుగులో ఉంటూనే ప్రజలను మినహాయించడానికి ప్రాతిపదికగా మారతాయి.

కర్ణాటకలో, జూన్ 2026లో ప్రారంభం కావాల్సిన ఫేజ్ 3 ‘సర్’ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల ఓట్లను తొలగించడానికి రూపొందించబడిందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

పశ్చిమ బెంగాల్ అనుభవాన్ని పూర్తి పర్యవసానాలతో మనం గుర్తు చేసుకోవాలి. ‘సర్’ని అనుసరించి పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుండి సుమారు 91 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. ఈ ‘సర్’ తమ పౌరసత్వాన్ని లాగేసుకుంటుందేమోననే భయంతో ఆ రాష్ట్రంలో మరణాలు, ఆత్మహత్యలు, ఒత్తిడికి సంబంధించిన మరణాలు సంభవించాయి. పౌరసత్వాన్ని ఒక రాజ్యాంగ హక్కుగా కాకుండా తాత్కాలిక మంజూరుగా భావించడం వల్ల జరిగిన మానవ నష్టం ఇది.

పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి నాయకులు ‘సర్’ ద్వారా మినహాయించబడిన హిందూ వలసదారులతో...మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఊరడింపు మాటలు చెప్పారు. కానీ ఎన్నికల సంఘం అలాంటి ప్రకటన చెయ్యలేదు. అంతేకాదు, సి.ఎ.ఎ చట్టం ప్రకారం చాలా మంది వలసదారులకు తాము సమర్పించలేని పత్రాలు అవసరమవుతాయి. ‘సర్’ పేర్లను తొలగిస్తుంది. సి.ఎ.ఎ ఒక మతానికి చెందిన కొందరికి షరతులతో కూడిన పునరుద్ధరణను అందిస్తుంది. ఎన్ఆర్‌సి అనేది అంతిమ లెక్కింపు. వీటన్నింటినీ ఒక క్రమంలో పెట్టి పరిశీలిస్తే, ఈ సి.ఎ.ఎ అనుసంధానం అనేది బిజెపి-ఆర్ఎస్ఎస్ హిందూత్వ ప్రాజెక్ట్ స్పష్టమైన రూపకల్పన అని తెలుస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ తర్కాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. మహిళల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ పథకం 'అన్నపూర్ణ యోజన' లబ్ధి పొందాలంటే, ఆధార్, రేషన్ కార్డులు, ఓటర్ ఐ.డి, పాన్ (పి.ఎ.ఎన్‌), జీఎస్టీ రికార్డులు, ఆస్తి యాజమాన్యం, సి.ఎ.ఎ స్థితిని అనుసంధానించే పది పేజీల ఫారమ్ అవసరమవుతుంది. ఒక విశ్లేషణ ప్రకారం ఇది భవిష్యత్తులో మినహాయింపులు, రాజకీయ ప్రొఫైలింగ్ కోసం ఒక డిజిటల్ నిఘా వ్యవస్థను నిర్మిస్తోందని అర్ధం చేసుకోవచ్చు. ఈ పథకానికి అనర్హతను ‘సర్’ తొలగింపులతో కూడా ముడిపెట్టారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే హక్కుల ప్రయోజనాలు నెమ్మదిగా ధృవీకరించబడిన గుర్తింపునకు బహుమతులుగా మారుతున్నాయి, ఇక్కడ రాష్ట్రానికి తన గుర్తింపును నిరూపించుకోలేని వారు పూర్తిగా మినహాయించబడుతున్నారు.


- వ్యాసకర్త: ఎం ఏ బేబీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి

(ముగింపు రేపటి సంచికలో)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్