శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చట్టం ఉంది.. రక్షణ ఎక్కడ?

4 గంటల క్రితం

sc st
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎస్.సి-ఎస్.టిలపై అత్యాచారాలను నిరోధించేందుకు దేశంలో అత్యంత కీలకమైన చట్టాల్లో ఎస్.సి-ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం -1989 ఒకటి. ఈ చట్టం కేవలం కేసులు నమోదు చేయడానికి మాత్రమే కాదు. అత్యాచారాలను ముందుగానే అరికట్టడం, బాధితులకు తక్షణ రక్షణ కల్పించడం, న్యాయం జరిగేలా చూడటం, పరిహారం–పునరావాసం అందించడం, బాధితుల్లో విశ్వాసం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.

అయితే సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చూస్తే చట్టం ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

2023 నుంచి 2026 జులై వరకు సుమారు 7,500 కేసులు నమోదయ్యాయి. 2026 జులై వరకు 810 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో 1,476 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది.

ఇక కోర్టుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. 2023 చివరికి 7,712 కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2024లో పెండింగ్ కేసులు 7,930 వుండగా, 2025లో 8,214కు చేరాయి. 2026 జులై నాటికి 8,475 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేక కోర్టులు ఉన్నప్పటికీ కేసులు పేరుకుపోతున్నాయంటే వాటి పనితీరుపై సమీక్ష అవసరం. 2026 జులై వరకు 827 కేసులు నమోదైతే కేవలం 26 కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది న్యాయవ్యవస్థపై విమర్శ చేయడం కాదు. కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్, సాక్షుల రక్షణ, విచారణ వేగం వంటి అంశాలను సమీక్షించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

విజిలెన్స్ కమిటీలు ఎందుకు?

అత్యాచారం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదు. అత్యాచారం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం కూడా బాధ్యతే.

2023 నుంచి 2026 వరకు 26 జిల్లాల్లో 364 సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా 229 మాత్రమే జరిగాయి. 2026లో రెండు త్రైమాసికాల్లో 56 సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా 31 మాత్రమే అయ్యాయి. ఆరు జిల్లాలు 2026లో ఒక్క డి.వి.ఎం.సి సమావేశానికి కూడా నోచుకోలేదు.

కమిటీలు కేవలం సంఖ్య కోసమే సమావేశాలు నిర్వహించకూడదు. ప్రతి సమావేశంలో నమోదైన కేసుల దర్యాప్తు, బాధితులకు పరిహారం, పెండింగ్ కేసులు, సాక్షుల పరిస్థితి, సామాజిక బహిష్కరణ, అంటరానితనం వంటి అంశాలను సమీక్షించాలి.

పున్నయ్య కమిషన్ స్ఫూర్తి ఏమైంది?

డాక్టర్ కె. పున్నయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం 25 జి.ఒలు జారీ చేసినట్లు సమావేశంలో పేర్కొంది. అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని 24 గంటల్లో కలెక్టర్, ఎస్.పి సందర్శించాలి. బాధితులకు తక్షణ సహాయం అందించాలి. ప్రత్యేక అధికారులను నియమించాలి వంటి సూచనలు ఉన్నాయి.

కాగితాలపై ఉన్న ఆదేశాలు గ్రామస్థాయిలో అమలయ్యేలా చేయడమే అసలు పరీక్ష. ఎస్.సి-ఎస్.టిల రక్షణను సంక్షేమ పథకాలతో మాత్రమే కొలవలేం. విద్య, ఉపాధి, ఇళ్లు, మౌలిక వసతులు ఎంత అవసరమో... కులవివక్ష, అంటరానితనం, అత్యాచారాల నుంచి రక్షణ కూడా అంతే అవసరం. ప్రభుత్వం గణాంకాలను ప్రకటించడం స్వాగతించదగినదే. కానీ ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం అందినప్పుడే వాటికి అర్థం ఉంటుంది.


వ్యాసకర్త: అండ్ర మాల్యాద్రి

కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

సెల్: 9490300366/


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్