దశుమంతు నాయుడి తోటలో ఒకటే కోలాహలం! తాజా మాజీల కొత్త కండువాల పండగ.. చూడలేక సిగ్గుపడి, కందగడ్డలా మొహం పెట్టుకొని, పడమటి తలుపేసుకున్నాడు సూరీడు. మండలానికో పండుగ ఎందుకని, పాత వైజాగ్ జిల్లా తాజా మాజీలైన జడ్పీటీసిలు, ఎంపీటీసీలకు కండువాలు మార్చే కార్యక్రమం నాయుడు తోటలో పెట్టాలని, పార్టీ పెద్దలు నిర్ణయించారు. కొత్త కండువాలు వేసుకోవడానికి వచ్చిన వాళ్ల మొహాలు, తుఫాన్ తర్వాత నిండిన ముడసర్లోవ లాగా కళకళ.. గత ఎన్నికల్లో వాళ్ళ చేతుల్లో ఓడిపోయిన వాళ్ళ మొహాలు, తుఫాన్ ముందు లోవ లాగా వెలవెల.. గతిలేక వచ్చిన పోల గంగలా ఉంది వాళ్ల పరిస్థితి!
" భలే మంచి రోజు.. పసందైన రోజు/కండువాలు మార్చే నేటి రోజు! మనసులోని కోరికలన్నీ/ మంగళగిరి మళ్లిన రోజు/మళ్లుతున్న ఆ కోరికలే/కొత్త గూడు చేరిన రోజు..భలే మంచి రోజు.. (చప్పట్లు) మేనమామ ఏడ్చినరోజు/ మేనల్లుడు నవ్విన రోజు/తొలి కండువ వెలిసిన రోజు/మలికండువ మెరిసిన రోజు/కొత్త కొత్త ఆశలన్నీ/మత్తు మత్తుగా పొంగిన రోజు.. భలే మంచి రోజూ.."(చప్పట్లు)
" అగ్రిగోల్డ్ ఘంటసాల .. కాకి బంగారయ్య గారికి ధన్యవాదాలు "-- మైకు లాక్కొని, ఆ పూట యాంకరింగ్ ఛాన్స్ కూడా లాక్కున్నాడు పరదేశి. బంగారయ్య మంచి గాయకుడు.. సందర్భాన్ని బట్టి ఆశువుగా సాహిత్యం కూడా అల్లేస్తాడు.. అగ్రిగోల్డ్ ఏజెంట్ గా ఆ ప్రాంతంలో ఒకప్పుడు మంచి పేరుండేది.
" బంగారయ్య గారు పాడినట్టు, ఈ రోజు.. మనందరికీ భలే మంచి రోజు.. మనకీ ఏడాదికి రెండు దసరాలు.. ఇది మొదటిది.. మా నాయుడుగారి స్పెషలూ.. రాజుల డిన్నర్ లాగా ఉంటాది!"-- పరదేశి చెబుతుండగానే, స్టేజి వెనక జరుగుతున్న వంటల షామియానా నుంచి, వేట మాంసం వాసన్ని, చిన్న పిల్ల గాలి స్టేజ్ ముందుకు మోసుకొచ్చింది.
" ఎంపీటీసీగా లేదా జడ్పిటీసిగా గెలిచి, అపోజిషన్ కుర్చీల్లో కూసోవడం ఎంత నరకమో.. ఇక్కడ ఎంపీపీ, జడ్పీ చైర్మన్ గా ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ మనది కానప్పుడు.. మరెంత నరకమో మీకు తెలియంది కాదు. మరొక రెండేళ్లు, సీలింగ్ ఫ్యాన్ గదిలో సికాకులు పడే కన్నా, ఏసీ గదుల్లో ఎంజాయమెంటు.. శానా మందికి తెలియంది కాదు "-- ఫిరాయింపు.. గొప్ప ఇంపూ సొంపూ అని వర్ణిస్తున్నాడు పరదేశి.
అతని పిలుపు కోసం చూడకుండా, చాలా ఉత్సాహంగా ఉన్న నాయుడు, స్టేజి పైకొచ్చి చేతులూపుతూ.. అందర్నీ పలకరించాడు. పరదేశి చేతిలో మైక్ లాక్కొని " అందరికీ నమస్కారం " అన్నాడు (చప్పట్లు). ఈరోజు మన స్పెషల్ గెస్ట్.. విజయనగరం చిట్టపులి.. స్టేట్ లో కొత్త కండువాల పండక్కి బోణీ కొట్టిన చిట్టి నాయుడు గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను"- చిట్టి నాయుడు వచ్చి, పలకరిస్తున్నట్టు చేతులూపి, నమస్కారం పెట్టాడు. (చప్పట్లు)
నాయుడు అందించిన మైకు తీసుకొని" నేనెందుకు పార్టీ మారానో, ఈ స్టేజి ద్వారా మన స్టేట్ కి కారణాలు చెప్పవలసిన అవసరం ఉంది".
జల్ జీవన్ పైపుల కాంట్రాక్టు బిల్లుల బకాయిలు, ఏవో కేసులు భయం వల్ల, పార్టీ మారినట్టు చాలా ప్రచారం జరిగింది. అందువల్ల, ఏం చెబుతాడోనని వినడానికి అందరూ చెవులు రిక్కించారు.
" మనం రాజకీయాల్లోకి ఎందుకొచ్చాం? గెలవాల.. పదవీ, పది పైసలు సంపాదించాల.. పరక మనం తినాల.. ఎనక తిరిగినోళ్ళకి మరో పరక ఖర్సు పెట్టాల.. మళ్లీ ఎలక్షన్లకి నాలుగు పైసలు దాయాల.. అంతే కదా! నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను.. మా మామ లాగా.. కడుపులో ఒకటి.. బయటకొకటి కాదు" (చప్పట్ల జోరు పెరిగింది)
" ఒక పార్టీ లీడర్ అంటే ఎలాగుండాలి? ఇక్కడ.. అంటే జిల్లాల్లో..నమ్ముకున్నోళ్ళకి నయా పైసా లేకుండా, ఎక్కడో ఒక కోటరీ పెట్టీసి..శాండూ.. లేండూ.. వైను.. మైను.. అంతా నొల్లుకు పోతే, ఇక్కడ జెండాలు మోసి.. బేనర్లు కట్టినోళ్ళ పరిస్థితేటి? మీరు తినండి.. మమ్మల్నీ తిననివ్వండీ.. ఇదీ నా పద్ధతి..తప్పా?"-అడిగాడు.
" లేదు.. లేదు"- దిగువ నుంచి కేకలు.
" అసలు ఒక పార్టీకి లీడర్ అంటే ఎలా ఉండాలి? మల్ల గెలిసినట్టు ప్రెభుత్వంలో ప్లేనింగుండాల!..
" ఇప్పుడు మన లీడర్ సూడ్డానికి అగ్గి.. గేమాడితే..సాపకింద వాటర్! అలగుండాల!.. ఇప్పుడు.. ఢిల్లీ సపోర్టు.. ఇక్కడ కొత్తగా అగ్గికి తోడు..గాలీ.. సుడిగాలి..గాలంటే..ఎవరు?"- ప్రశ్నించాడు.
పరదేశి పూనకం వచ్చినట్టు" టైగర్..పులీ..పులిగాలీ..పవన పులీ "-కేకలు వేస్తూ స్టేజి మీద గంతులేశాడు. పరదేశి మాటలు, గంతులు అర్థమై.. చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
నాయుడు సంతోషంగా ముందుకొచ్చి, చిట్టి నాయుడ్ని కౌగలించుకున్నాడు.
"సర్..సర్రొచ్చీసిన తర్వాత మనకు ఇంకా ఎదురేటండీ! "- చెవిలో గొణుగుతూ, పెద్దగా నవ్వాడు.
- 'నల్లి' కుట్టు








కామెంట్లు (0)