ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమోడీ సర్కారుకు లబ్ధి చేకూర్చేందుకే ‘సర్‌’

23 గంటల క్రితం

vote chori.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 05:12 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

వంద కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత దేశంలో పౌరులు తమ ఓటు హక్కు నిరూపించుకునే పత్రాలు చూపాల్సిన దుస్థితికి నెట్టబడ్డారు.

ప్రధాన మంత్రి మోడీ నియమించిన ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలు, డూప్లికేట్ ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 13 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించింది.

ఆల్గారిధం ఆధారంగా 10 కోట్ల మంది ఓటర్ల సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నాయనే పేరిట జాబితా నుండి తొలగింపునకు గురయ్యారు. వాళ్ల అప్పీళ్ళు ట్రిబ్యునళ్లలో పరిష్కారానికి నోచుకోలేదు. ఈ ఏడాది హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో వారు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. కొంత మంది మరణించారంటూ వారి పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించారు. ‘మేం బతికే ఉన్నాం’ అని వారే స్వయంగా మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు.

ఈ ప్రక్రియ మొత్తం అధికారంలో ఉన్న హిందూత్వ జాతీయవాద పార్టీకి చెందిన మోడీ సర్కారుకు లబ్ధి చేకూర్చేందుకే చేపట్టినట్లు ఒకటొకటిగా అనేక సాక్ష్యాలు వెలువడటంతో ప్రజాగ్రహం మిన్నంటి భారీ నిరసన కార్యక్రమాలకు దారితీశాయి.

గత వారం జరిగిన ఒక సదస్సులో మాజీ సొలిసిటర్ జనరల్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయిన రోహింటన్ నారిమన్ ప్రసంగిస్తూ మన ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి ఓటు హక్కు ఇవాళ పెను ప్రమాదంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు.

గత వేసవి కాలంలో ఒక రాష్ట్రంలో మొదలు పెట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ విస్తరించడం ద్వారా గత డెబ్భై ఏళ్లుగా ఎన్నికల సంఘం పట్ల ఉన్న విశ్వసనీయత, సమగ్రత ఘోరంగా దెబ్బతినిపోయాయని అనేక మంది ఎన్నికల సంఘం మాజీ అధికారులు, సామాజిక విశ్లేషకులు నిర్ద్వంద్వంగా చెప్పుకొస్తున్నారు. ఎన్నికల సంఘం లోని మరో ఇద్దరు అధికారులు ఈ ప్రక్రియపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినా జ్ఞానేష్ కుమార్ లెక్క చెయ్యలేదన్న విషయం వెల్లడి కావడం, ఫారం 6 సవరణలను తాము ఆమోదించలేదని సుప్రీం కోర్టు స్పష్టం చెయ్యడంతో ఓట్ల చోరీపై ప్రజాగ్రహం మరింత ఉధృతమైంది. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎన్నికల తొత్తడం సాగుతుంది కాబట్టి ఆయన రాజీనామా చెయ్యాల్సిందే అన్న డిమాండు ఊపందుకుంది.

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టక ముందు దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో కొన్ని అస్పష్టతలు ఉండొచ్చు. అది కూడా లక్షలాది మంది ఏటా ఉపాధి కోసం పరాయి ప్రాంతాలకు వలస పోవడం ఆనవాయితీగా సాగుతూ వస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొద్ది మంది మోసానికి పాల్పడి ఉండొచ్చు. అయినా స్థానిక సంస్థల ఎన్నికల నుండి, సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి సారీ ఈ జాబితాను సవరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మీద ప్రజల విశ్వాసం ఏనాడూ సడలలేదు. ఆ ఓటర్ల జాబితాల ఆధారంగానే గత మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ఆధిక్యం సాధించి, మూడు సార్లూ మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు.

సర్ ప్రక్రియ చేపట్టాక ఇవాళ హఠాత్తుగా ఆ జాబితాలోని 2 కోట్ల మంది ఓటర్లు జీవించి లేరని, మరో 9 కోట్ల మంది ఓటర్లు ఆ చిరునామాలో లేరని తదితర కారణాలతో ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగించారు. అలాంటప్పుడు గత మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అవకతవకలు జరిగినట్లే కదా? అసలు నిజం ఏమిటంటే రాబోయే ఎన్నికలలో గట్టెక్కడానికి అధికార బిజెపి ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుని ఈ దుర్మార్గానికి తలపడిందని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికలలో బలహీనమైన ఫలితాలు సాధించిన బిజెపి సర్ ప్రక్రియ చేపట్టిన ప్రతి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం యాదృచ్ఛికం కాదు. పెద్ద రాష్ట్రమైన బెంగాల్ లో మునుపెన్నడూ అధికారం దాపులకైనా రాని పార్టీ సర్ ప్రక్రియ తర్వాత అక్కడ అత్యధిక సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఆరు నూరైనా గెలిచి తీరడం కోసమే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరు సీనియర్ బిజెపి రాజకీయ వ్యూహకర్తలు తమ పేర్లు బయటపెట్టకూడదనే షరతు మీద ఇదంతా మా పార్టీ ఎన్నికల లబ్ధి కోసం చేపట్టినదే అని అంగీకరించారు. మాకు ఉన్న విస్తృతమైన పార్టీ యంత్రాంగం ద్వారా మా పార్టీకి ఓట్లు వెయ్యరనే అనుమానం ఉన్న ఓటర్ల పేర్లు తొలగించడానికీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఫెడరల్ స్వభావ రీత్యా అన్ని రాష్ట్రాల్లో స్థానిక అధికారులు మా పార్టీ లబ్ధి కోసం పని చేస్తారని లేదుగా, అయినా మా ప్రయత్నం ఏదో ఒక మేరకు ఫలిస్తుంది అని వారిలో ఒకరు వివరించారు. ​

తాజాగా జరిగిన ఎన్నికలలో సాధించిన గెలుపు మా అసలు ప్రాధాన్యత కాదు, విశాలమైన మా సైద్ధాంతిక లక్ష్యాన్ని సాధించడమే మా తొలి ప్రాధాన్యత అని రెండవ వారు చెప్పుకొచ్చారు. ముస్లిం అక్రమ చొరబాటుదారులను ఏరివెయ్యడం హిందూత్వ పార్టీ అసలు లక్ష్యం. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా అది సాధించేందుకు ప్రయత్నించి విఫలమైంది.

పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు తీసుకు వస్తేనే ఓటు హక్కు నిరూపణ సాధ్యపడుతుందని ఎన్నికల సంఘం తాఖీదులు ఇవ్వడాన్ని మాజీ ఎన్నికల సంఘం అధికారులు, సామాజిక విశ్లేషకులు తప్పు పడుతున్నారు. దేశంలో మెజారిటీ పౌరులకు (వాళ్ళు ముస్లింలు కావచ్చు, హిందు వులు కావచ్చు) ఈ పత్రాలు సమర్పించడం అసాధ్యం. అందునా లక్షలాది మంది పేదల దగ్గర జనన ధృవీకరణ పత్రం ఉండడం కూడా అనుమానమే అంటున్నారు.

సర్ ప్రక్రియ ద్వారా లెక్క తేల్చిన అక్రమ చొరబాటుదారుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. కాబట్టి సర్ ప్రక్రియ ఉద్దేశ్యం అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు తొలగించడం అన్న వాదనా నిలబడదు. ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రాన అటువంటి వారికి అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగవని బిజెపి నాయకులు ఊరడింపు మాటలు చెబుతున్నారు.

ఓటు హక్కు తిరిగి పొందడం కోసం రోజువారీ కూలి చేసుకుంటే కానీ కుటుంబం గడవని లక్షలాది మంది జనం కాళ్లరిగేలా ఎన్నికల అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.

ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని మోడీ దెబ్బతీసి వాటిని తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటున్నాడని ప్రధాన రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. 2023 లోనే దీనికి పునాది పడిందని, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ప్రభుత్వంలో ఒక మంత్రితో ఆ ఖాళీ భర్తీ చెయ్యడం, ఎన్నికల కమిషనర్లపై చట్టపరంగా ఎటువంటి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా చట్టాన్ని సవరించడం ఈ పథకంలో భాగమేనని విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.

వివిధ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ ఓట్ల తొలగింపు, అనుమానాస్పద రీతిలో ఓట్ల చేర్పుల గురించి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. కానీ ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఇక ఓటర్ల జాబితా నుండి ఫలానా వాళ్ల పేర్లు తొలగించాలని థర్డ్ పార్టీ సమర్పించిన ఫారం 7 ఆధారంగా ఇంకొన్ని లక్షల మంది పేర్లు తొలగించారు.

దక్షిణ కర్ణాటక లోని ఒక శాసన సభ నియోజక వర్గంలో గత నెలలో ఒకే రోజున ఇలాంటివి 2000 ఫారాలు సమర్పించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక సమీక్షలో తేలింది. ఇందులో సగం కేవలం ఐదుగురు వ్యక్తులు సమర్పించారు. ఇవన్నీ ఎక్కువ భాగం ముస్లిం ఓటర్లవి కావడం గమనార్హం. ఈ ఫారాలన్నీ ఫిర్యాదుదారు సంతకం మినహా అన్నీ ముందుగా ముద్రించబడి ఉన్నాయి. ఇది పక్కా ప్రణాళికతో చేపట్టిన ఓట్ల తొలగింపుకాక మరేమిటని సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలలో గతంలో ఎన్నడూ అధికారం దరిదాపుకు రాని మోడీ పార్టీ ఈ సారి సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికలం సంఘం 90 లక్షల ఓట్లు తొలగించడంతో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపట్టింది.

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఓట్లు గల్లంతయిన వారి అభ్యర్థనలను పెడ చెవిన పెట్టి ఎన్నికల ప్రక్రియ జరపడానికి పచ్చ జెండా ఊపింది. ఇప్పటి వరకు లక్ష అప్పీళ్లను ట్రిబ్యునళ్లు పరిష్కరించాయి. మెజార్టీ అప్పీళ్ళు తొలగింపుకు గురైన వారు అసలైన ఓటర్లుగా నిర్ధారించాయి.

207 శాసన సభా స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 82 స్థానాలలో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజార్టీ కన్నా తొలగించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా మోడీ పార్టీకి అధికారం దక్కిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు మళ్ళా ఎన్నికలు జరిపించమని ఆదేశాలు ఇమ్మంటారా అని న్యాయమూర్తులు బాధ్యతారహితంగా వ్యాఖ్యానించారు.

​ సుప్రీం కోర్టు నియమించిన న్యాయాధికారులు 16 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చమని ఆదేశిస్తే ఎన్నికల సంఘం ఆ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిందే తప్ప వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చలేదు. ఎన్నికల సంఘం లోని ఇద్దరు కమిషనర్లు సర్ ప్రక్రియపై తాము లేవనెత్తిన అభ్యంతరాలను ప్రధాన ఎన్నికల కమిషనరు ఖాతరు చెయ్యలేదని స్పష్టం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. ఓటు హక్కును కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఈ విధంగా పౌరుల ఓటు హక్కును ఎలా తృణీకరిస్తుందని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ప్రశ్నిస్తున్నారు.

(‘న్యూయార్క్ టైమ్స్’ సౌజన్యంతో )

Screenshot from 2026-10-10 22-53-35.png

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్