రాజకీయాలెప్పుడూ సరళరేఖలా వుండవు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రస్తుత రాజకీయావరణంలో కనిపిస్తున్నన్ని వింత ట్విస్టులు మాత్రం గతంలో చూసి వుండం. దీనికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలు ఒక కారణమైతే ఇక్కడ ఎ.పి, తెలంగాణ పాలక వర్గాల అవకాశవాద విన్యాసాలు మరో కారణం. ఎప్పటికప్పుడు వీటి చుట్టూనే చర్చలు కేంద్రీకరింప చేస్తూ దేశానికి, రాష్ట్రాలకూ ప్రజలకూ సంబంధించిన మౌలికాంశాలు మరుగుపరుస్తున్న మీడియా మరో కారణం. మీడియా మాట అటుంచి నేరుగా కీలక నేతలు అధికారికంగా ఆయా పార్టీలూ ఇస్తున్న సంకేతాలు, చేస్తున్న వ్యాఖ్యానాలే వాటి ఇరకాటాన్ని ప్రతిబింబించేవిగా వుండటం తాజా పరిణామం. బహుశా ఇటీవల ఏ సందర్భాన్ని, సంఘటననూ తీసుకున్నా ఈ ద్వంద్వత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.
గతంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సమయంలో కొద్ది రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌నూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లనూ హైదరాబాద్‌లో వారి నివాసాలలో కలుసుకోవడం. తర్వాత జరిగిన ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తనతో చేతులు కలపాలని ఆహ్వానించడం. బిజెపి అసలైన మిత్రులెవరనే చర్చ రెండు రాష్ట్రాలలో ఒకేసారి మొదలవడం. దీనిపై రాజమండ్రి సభలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు మళ్లీ ఆయన హైదరాబాద్ యాత్రతో ముదిరి ఢిల్లీలో జరిపిన రాజకీయ సమావేశం. దాని కొనసాగింపులా లోకేశ్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు. ఈ మధ్యలో జగన్‌కు సంబంధించిన ఇ.డి కేసులలో ఉపశమనం. మరోవైపు వైసిపి నాయకులు సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి వినతిపత్రాలివ్వడం. ఎ.పి లో సాయికృష్ణ లాకప్ మృతిపై సిట్ వేయడంతో పాటు కుల చర్చలు పెరగడం. చివరగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక పగ్గాలు చేపట్టిన డి.కె.శివకుమార్ కలసి తుంగభద్ర గేట్ల బిగింపు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ దుమారం... వీటన్నిటి మధ్యలో ‘సర్’ ప్రక్రియ మొదలవడంతో దానిపైనా భిన్న సంకేతాలు... వంటివన్నీ కలిపి చూస్తే పాలక పార్టీల మల్లగుల్లాలు, వ్యూహాత్మక సమరాలు గోచరిస్తాయి. దేశవ్యాపితంగా కార్పొరేట్ హిందూత్వ కూటమి వివిధ ప్రాంతీయ జాతీయ పాలక పార్టీలపై బుల్డోజర్ నడిపించి సంలీనాలు, స్వాధీనాలు చేసుకుంటూ స్వైర విహారం చేస్తుంటే మరోవైపున తెలుగు నాట ప్రాంతీయ పార్టీలు స్వీయ అస్తిత్వం కోసం పడుతున్న పాట్లు విదితమవుతాయి.
మొత్తం అవకాశవాదమే
బిజెపి కి సంబంధించినంత వరకూ కార్పొరేట్ హిందూత్వ రాజకీయ ప్రయోజనాలు తప్ప మిత్రులంటూ ఎవరూ వుండరు. కనుక తాత్కాలిక శాశ్వత విభజనేమీ పాటించరనడానికి తెలుగుదేశం అనుభవాలే ఒక ఉదాహరణ. అయినా రాజకీయావసరం కోసం కలుస్తూ విడిపోతూ చంద్రబాబు నాయుడు అదే తన చాణక్యం అని చెప్పుకుంటుంటారు. పవన్ కల్యాణ్ జనసేనతో కలవడం వల్లనే తాము గెలవగలిగామనీ, కేంద్రంలో బిజెపి తో నిలవడం వల్లనే అధికారంలో కొనసాగుతున్నామని ఆయన, ఆ పార్టీ అనివార్యంగా నమ్ముతున్నాయి. ఇటీవల కలయికలు, చేరికలతో మోడీకి బలం పెరిగాక తమపై ఆధారపడే పరిస్థితి మారిందన్న వాస్తవం కూడా వారిని కలవరపెడుతున్నదంటే ఆయన గురించి చంద్రబాబు వంటి వారికి వున్న గతానుభవమే కారణం కావచ్చు. తమపై వచ్చిన కొన్ని వార్తాకథనాల వల్ల అపోహలు కలగకుండా చేయడానికి స్వయంగా మోడీని కలిసి మాట్లాడినట్టు నారా లోకేశ్ ఇంటర్వ్యూలలో చెప్పడం దానికి ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ముంబాయిలో మాజీ ఉపరాష్ట్రపతిని (జగదీప్ ధంకర్ అని చెబుతున్నారు) ఒక వ్యాపార వేత్తను కలుసుకున్నట్టు వార్తలు వచ్చాయని మీడియా లోకేశ్‌ను అడిగింది. ఈ కథనం పదే పదే ఎందుకు చర్చకు వస్తుందో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చుతూనే ఆయన వివరణ ఇచ్చారు. దీని గురించి వివరణ ఇవ్వడానికే తాను అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ మోడీని కలిశానన్నారు. ఆ భేటీ ఏ పరిస్థితులలో జరిగిందో చెబితే విన్న తర్వాత మోడీ నవ్వి సరే నేను తెలుసుకుంటాను గానీ వీటిని బట్టి నీవు ఎవరినీ కలవడం మానొద్దని సలహా ఇచ్చారట. ఇక్కడ లోకేశ్ చెప్పిన తీవ్రతకూ మోడీ సాధారణ వ్యాఖ్యల తీరుకూ పొంతన కనిపించదు.
సర్వం పిపిపి నే
అయితే దీనిపైన వైసిపి వారు, వారి అనుకూల ఎన్‌డిఎ కు టిడిపికి బెడిసికొట్టిందని భారీ ప్రచార వ్యాఖ్యలు చేయడం, కథనాలు ప్రసారం చేయడం కూడా అంతే ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎన్‌డిఎ లో టిడిపి, బిజెపి ఎలా వుంటాయనేది వైసిపి కి సంబంధించిన విషయం కాదు. జగన్ తమ శాశ్వత మిత్రుడని ఎవరో అన్నట్టు వచ్చిన కథనాలపై వారు అంతగా ఆనందించవలసిన అవసరమూ కనిపించదు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విధంగా బిజెపి మెప్పు కోసం మోడీ, అమిత్ షా ల ఆశీస్సుల కోసం పాకులాడటం నిజంగానే విపరీతం. ఇదే ఇంటర్వ్యూలలో లోకేశ్ అమరావతికి కేంద్రం సహకారం గురించి చెబుతూనే తామే ప్రధానంగా ఎక్కువ నిధులు సమకూర్చుకోవలసి వచ్చిన వాస్తవం చెప్పడం గమనించదగింది. పోలవరం పైన కూడా కేంద్రం ఆర్థిక సహాయం వేగంగానూ తగినంతగానూ లేదని నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అన్నిటినీ మించి అప్పులు పెరిగిపోతూనే వుండటం, ఆస్తుల అమ్మకాలు పిపిపి నమూనాల కోసం పరుగులు పెట్టడం నిత్యకృత్యమైంది. అదానీకి విద్యుత్ రంగంతో సహా వరుస వరాలు కురిపించడం డబుల్ ఇంజన్ సర్కార్ లక్షణాలు చాటుతున్నది. ఒక వైపున పెట్టుబడుల ప్రవాహం వస్తున్నట్టు ప్రచారంతో వరుసగా భూములు, వనరులు కేటాయిస్తూ మరోవైపున కేంద్రం నుంచి రాని నిధులను భూతద్దంలో చూపిస్తూ కూటమి పడుతున్న పాట్లు విస్మరించరానివి. తాజాగా బంగారు గనుల గురించిన హైప్ మోత మోగింది గానీ దానివల్ల ప్రభుత్వానికి వచ్చేది మొదట రూ.50 కోట్లు, అత్యధికంగా రూ.147 కోట్లు మాత్రమేనన్న లెక్కలు వెక్కిరిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ తమ జనసేన జాతీయ ప్రవేశం గురించి చెప్పడానికి ఢిల్లీలో సందడి చేశారు గానీ డబుల్ ఇంజన్‌లో భాగంగా రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ వున్న సమస్యలను నామమాత్రంగానైనా ప్రస్తావించింది లేదు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబును అంటిపెట్టుకుని వుంటూ వామపక్షాలపై, లౌకిక రాజకీయాలపై దాడి చేయడమే తన కర్తవ్యవమని తేల్చుకున్నట్టు ఆయన మాటలు స్పష్టం చేశాయి. లోకేశ్ వారసత్వంతో తనకేమీ పేచీ లేదని ఆయన చెప్పారంటే...తెలుగుదేశం అంతర్గత విషయం గనక అర్థం చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా స్వయంగా చెప్పాక కూడా మోడీ భజనతో ఊగిపోవడమేమిటి? అసందర్భంగా వామపక్షాల ప్రస్తావనలు చేసి దూషించడం ద్వారా బిజెపి మెప్పు పొందాలని ఆరాటపడటం దేనికి? తాను ఒక కులం కోసం పార్టీ పెట్టలేదని పదేపదే ఎవరికి చెబుతున్నారు? అధికారిక సభల్లోనూ ఆఖరుకు విశాఖ ఘోర ప్రమాదం తర్వాత పరామర్శలోనూ పదేపదే ప్రతిపక్ష వైసిపి ని, వామపక్షాలనూ పేరెత్తి నిందారోపణలు చేయడం ఎవరి సంతోషం కోసం? సనాతనానికి తానే సంరక్షకుడినంటూ ఊగిపోయిన నాయకుడు తిరుమల తిరుపతి వ్యవహారాలపైన వీరంగం తొక్కారు గానీ అయోధ్య రాముడి నిధుల గల్లంతు, ఆకివీడులో గొంతేనమ్మ గుడి ధ్వంసం వంటి విషయాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అధికారిక సభల్లో ఆవేశంతో ఊగిపోయి ప్రతినలు పలికే ఉపముఖ్యమంత్రి పర్యావరణంలో ఘోర విపత్తులపై ఎందుకు నిశ్శబ్ద ముద్ర దాలుస్తున్నారు? విశాఖ ఉక్కు ప్రమాదం తర్వాత కూడా విశాఖలో వరుస ప్రమాదాలు చూడటం లేదా? రుషికొండ భవనాలపై అంత రభస చేసినవారు చివరకు పిపిపి కింద లగ్జరీ రిసార్టు పెట్టాలని నిర్ణయించడం దేనికి నిదర్శనం?
తెలంగాణ వివాదాలు
ఇక తెలంగాణకు వస్తే కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ రాజకీయాలు ఒకవైపు... జనసేన, టిడిపి, వైసిపి ల బంధాలు మరోవైపు కనిపిస్తున్నాయి. జగన్ మళ్లీ లోటస్ పాండ్‌లో కార్యకలాపాలు పెంచబోతున్నారని, తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలపై ప్రభావం చూపించబోతున్నారని చెబుతున్నారు. బిఆర్‌ఎస్ తో వైసిపి ఇంకా చెప్పాలంటే కెసిఆర్ కుటుంబంతో జగన్ అనుకూలత బహిరంగమే. అదే సమయంలో రేవంత్ రెడ్డి కి చంద్రబాబుతో వున్న బంధంపై బిఆర్‌ఎస్ దాడి చేస్తుంటుంది. ఇది రాజకీయాలకే పరిమితం చేయకుండా తెలంగాణ ప్రయోజనాలు ఎ.పి కి కట్టబెడుతున్నారనేది వారి నిరంతర ఆరోపణ. కానీ బిఆర్‌ఎస్ కే బిజెపితో లోపాయికారీ అవగాహన వుందనేది కాంగ్రెస్ విమర్శ. ఈ త్రికోణ రాజకీయ విమర్శలు ఆగడమే లేదు. కాళేశ్వరం వంటి వాటిపై సిబిఐ విచారణ జరపడం లేదని రేవంత్ సర్కారు అంటుంటే ‘గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తి’ అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ దాడి. రాయదుర్గం దగ్గర ఎస్‌బిఐ కి కేటాయించిన స్థలం వేలం వేయడంపై మొదలైన లీగల్ తగాదా వెనక కూడా బిఆర్‌ఎస్ వుందని ప్రభుత్వం సందేహించింది. అందుకు విరుగుడుగా ఎస్‌బిఐ లో ఖాతాల ఉపసంహరణకు సిద్ధమైంది. మెట్రో రైల్ మలిదశకు సంబంధించిన వివాదంలో మొదట కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి పరస్పరం తిట్టుకోవడం, ఆ తర్వాత ఉభయులూ కలిసి కేంద్రంలో చర్చలలో పాల్గొనడం తమ వాదనకు మద్దతుగా బిఆర్‌ఎస్ చెబుతున్నది. చివరకు ఈ మొత్తం రెండు దశలపై అధ్యయనానికి స్టేట్‌బ్యాంక్ బృందానికే అప్పగించడంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా తగాదా మాయమైంది. వాస్తవానికి ఈ మొత్తంలో లాభపడేది కార్పొరేట్ వర్గాలు మాత్రమే కాగా పారదర్శకత అసలు లేకుండా పోయింది.
తుంగభద్ర గేట్ల ప్రారంభ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనడం విశేషమే గానీ అసాధారణం కాదు. అయితే ఇద్దరు కాంగ్రెస్, ఒకరు కూటమి సి.ఎం లు వుండగా కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ దీనంతటికీ నాయకత్వం వహించినట్టు పొగడ్డం మాత్రం శ్రుతి మించింది. తుంగభద్ర జలాలపై మూడు రాష్ట్రాల కమిటీ వేయడం కూడా మంచిదేగానీ శ్రుతి మించిన పరస్పర పొగడ్తలు మళ్లీ సందేహాలు పెంచాయి. మతతత్వంపై రాజీ లేని పోరాటం చేసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కే బిజెపి తో సంబంధాల ముద్ర వేసిన కాంగ్రెస్ నేతలకు తమపై వచ్చిన ఆరోపణను ఖండించే నైతిక హక్కు ఎక్కడుంటుంది? కేంద్రం సక్రమంగా వుంటే అంతర్రాష్ట్ర నదీజలాల సమస్యలు రావణ కాష్టంలా కొనసాగాల్సిన అవసరమేముంటుంది? కనుక ఈ సన్నివేశం తెచ్చిన సందేహాలు కొట్టివేయదగినవి కావు. కానీ దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాలకు, భాషా ప్రయోగాలకు సంబంధించి మళ్లీ వివాదాలు పెంచాలని కొందరు చేస్తున్న ప్రయత్నం కూడా వాంఛనీయం కాదు. విధాన నిబద్దత, విశ్వసనీయత లోపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి పదేపదే వస్తున్నది.

- తెలకపల్లి రవి









కామెంట్‌లు (0)