- జె.వి. రత్నం
సూపర్ ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో పశుపక్ష్యాదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉంది. రోజు రోజుకూ ప్రకృతిలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో అనిశ్చితి, కరువు పరిస్థితులు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ ఎల్నినో వల్ల కలిగే వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పశుపక్ష్యాదులు, అడవి జంతువులు, ఇతర మూగజీవాల సంరక్షణకు ఇప్పటి నుంచే తగిన రక్షణ చర్యలు చేపట్టాలి.
ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే అసాధారణమైన పెరుగుదలకు సంబంధించిన వాతావరణ అంశం. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాత నమూనాలు, ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, నీటి లభ్యతపై తీవ్రంగా ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బలమైన ఎల్నినో పరిస్థితులను సాధారణంగా 'సూపర్ ఎల్నినో' అని వ్యవహరిస్తారు. పరిస్థితులను నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో శీతోష్ణస్థితి వేడెక్కకుండా పలు చర్యలు చేపట్టాలి. ఇళ్ల ఆవరణల్లో, బాల్కనీల్లో, చెట్ల నీడలో పక్షుల కోసం శుభ్రమైన నీటిని పాత్రల్లో ఉంచాలి.
గ్రామాలు, పొలాలు, తోటలు, పశువుల కొట్టాల దగ్గర పశువులకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలి. అడవి జంతువులకు నీరు అందించే చర్యలను అటవీ శాఖ అధికారుల సమన్వయంతో చేపట్టాలి. నీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, నీటిని మార్చాలి. నీటి వృథాను అరికట్టి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలి.
పశువులకు, పక్షులకు మేత అందుబాటులో ఉంచాలి. వర్షాలు సరిగా కురవకపోతే పచ్చిక బయళ్లు ఎండిపోవచ్చు. పశువులకు పచ్చి మేత, ఎండు మేత లభ్యత తగ్గవచ్చు. అడవుల్లో సహజ ఆహార వనరులు తగ్గినప్పుడు వన్యప్రాణులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల రైతులు, పశుపోషకులు ముందుగానే మేతను నిల్వ చేసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పశుగ్రాస పంటలను సాగు చేయాలి. పొలాల్లో పంట అవశేషాలను సురక్షితంగా వినియోగించుకోవాలి. పశువులకు సరిపడా నీరు, సమతుల ఆహారం, నీడ అందించాలి.
కొండల మీద, కొండ వాలు ప్రాంతంలో, మైదానాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తీరంలో చిరుధాన్యాలు, గడ్డి విత్తనాలు విరివిగా చల్లాలి. తద్వారా అనేక రకాల పక్షులు, జంతువులు జీవించడానికి అవకాశం కలుగుతుంది. పక్షుల కోసం తగిన ప్రదేశాల్లో నీటి పాత్రలు, స్థానిక పక్షులకు అనుకూలమైన ఆహార వనరులు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. పక్షులకు ఉప్పు, మసాలాలు కలిపిన ఆహారం, పాడైన పదార్థాలను, బిర్యాని , ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి పదార్థాలు, బిస్కెట్లు పెట్టకూడదు.
రైతులు, పశు పోషకులు ముందుగానే మేతను నిల్వ చేసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పశుగ్రాస పంటలను సాగు చేయాలి. పొలాల్లో పంట అవశేషాలను సురక్షితంగా వినియోగించుకోవాలి. పశువులకు సరిపడా నీరు, సమతుల ఆహారం, నీడ అందించాలి. చెరువులు, కుంటలు, పచ్చిక బయళ్లు, సహజ అడవులను పరిరక్షించడం ద్వారా అనేక జీవులకు ఆవాసాలు, ఆహారం, నీరు అందించవచ్చు.
వేడి వాతావరణం తగ్గించేందుకు విస్తారంగా మొక్కలు నాటి పెంచాలి. ఇళ్ల పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలి. దీని వల్ల మూడు లాభాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. రెండు మిద్దె తోట ఉన్న ఇంట్లో శీతోష్ణస్థితి రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. మూడు వర్షాభావ పరిస్థితిలో సరిగ్గా పంటలు పండక ధరల భారం పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన ఇంటి పంటతో మునకు లాభం కలుగుతుంది. అలాగే ఇంటి పై కప్పు మీద పక్షుల కోసం నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలి.
చెట్లు కేవలం మనుషులకు మాత్రమే కాదు, పక్షులకు, జంతువులకు కూడా జీవనాధారం. చెట్లు నీడను అందిస్తాయి. పండ్లు, విత్తనాలు, పువ్వులు అనేక జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. చెట్లతో కూడిన పచ్చని ప్రాంతాలు స్థానిక పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతానికి అనువైన దేశీయ జాతుల మొక్కలను నాటి, అవి బతికేలా సంరక్షించాలి. ముఖ్యంగా మర్రి, రావి, వేప, నేరేడు, ఉసిరి వంటి స్థానిక పరిస్థితులకు అనుకూలమైన చెట్లను తగిన ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తి కాదు, వాటికి నీరు పోసి, రక్షణ కల్పించి, పెద్ద చెట్లుగా ఎదిగే వరకు సంరక్షించాలి.
సూపర్ ఎల్నినోని దృష్టిలో ఉంచుకుని చెరువులు, కుంటలు, పచ్చిక బయళ్లు, సహజ అడవులను పరిరక్షించడం ద్వారా అనేక జీవులకు ఆవాసాలు, ఆహారం, నీరు అందించవచ్చు. ఇందుకు సమాజమంతా భాగస్వాములు కావాలి.
పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు కలిసి వేసవి కాలంలో పశుపక్ష్యాదుల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో, కొండల్లో , గుట్టల్లో నీటి లభ్యతను పరిశీలించాలి. నీరు అందుబాటులో ఉంచాలి. పశువులకు మేత కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. వన్య ప్రాణులకు నీరు, ఆహారం అందించే చర్యలను అటవీ శాఖ మార్గదర్శకత్వంలో నిర్వహించాలి.
వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల సంరక్షణ, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మూగజీవాలు తమ సమస్యలను మనకు చెప్పలేవు. వాటి అవసరాలను గుర్తించి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనం. ఎల్ నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే అంశంతో సంబంధం లేకుండా, వేసవి వేడి, నీటి కొరతను ఎదుర్కొనేందుకు మనమందరం సిద్ధంగా ఉండాలి.
"మేమంతా మా ఇంటి దగ్గర పశుపక్ష్యాదులు కోసం నీరు, ఆహారం కోసం పాత్రలు ఏర్పాటు చేస్తాం. పశువులకు తాగు నీరు, మేత అందేలా చూస్తాం. చెట్లు నాటి, వాటిని సంరక్షిస్తాం. నీటిని వృథా చేయకుండా పొదుపు చేస్తాం. విద్యుత్తు వాడకం తగ్గిస్తాం, ప్రకృతి వనరులను, వన్యప్రాణులను, జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం" అని విద్యా సంస్థలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలి.
ఈ ప్రతిజ్ఞ ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగి పశుపక్ష్యాదులకు నీరు, ఆహారం అందుబాటులో ఉంచేందుకు అవకాశం ఉంది.
- వ్యాసకర్త సామాజిక, పర్యావరణవేత్త







కామెంట్లు (0)