"ఈ బొద్దింకల గోల భరించలేకపోతున్నాను. వీటిని భూమి మీద లేకుండా చేసేయాలి " విసుక్కుంటూ అంది మా ఆవిడ.
" నీ వల్ల కాదు." నవ్వుతూ అన్నాను.
బొద్దింకల్ని చూసిన చూపు కన్నా తీవ్రంగా నన్ను చూసి ఏం అన్నట్టు ముఖం పెట్టింది.
" ఎందుకంటే అవి డైనోసార్ల కన్నా భూమ్మీద ముందు పుట్టిన జీవులు. అంత పెద్ద డైనోసార్లు పిచ్చుకల కన్నా దారుణంగా అంతరించాయి కానీ ఇవి మాత్రం నిలదొక్కుకున్నాయి."
ఆపుతావా నీ జ్ఞాన బోధ అన్నట్టు చూసింది కానీ మనం వాటిని పట్టించుకొనే రకమా? అందుకనే కొనసాగించాను.
" అవి 32 కోట్ల సంవత్సరాల నుండి ఉన్నట్టు శాస్త్రవేత్తలు రుజువులు చూపిస్తున్నారు.మనుషులు పుట్టి అరకోటి సంవత్సరాలైనా కాలేదు.అటు తిప్పి ఇటు తిప్పి చూస్తే 38 లక్షల సంవత్సరాలు."
" ఎందుకలా?"
" అదేమి ప్రశ్న. నీకు నువ్వెలా గొప్పో, వాటికవి గొప్ప. వేడిలో ఉండగలవు. చలిలో ఉండగలవు. తిని ఉండగలవు. నీకన్నా బాగానే తినకుండా ఉండగలవు. అంతెందుకు..తల తీసేసినా కొన్ని రోజులు బతకగలవు."
" మహానుభావా, ఆ జాతి మనుగడ, గొప్పదనాల గురించి తర్వాత చెప్దురు గానీ ముందు మన ఇంట్లో ఈ సమస్య గురించి మాట్లాడండి. వీటిని ఎలా అదుపు చెయ్యాలో చూడండి."
" సరేలే అయితే. ముందు చెప్పు. ఏమిటి సమస్య?"
" బొద్దింకలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. అదుపు చెయ్యలేక పోతున్నాను."
" నన్నేం చెయ్యమంటావు?"
" ఇలాంటి జ్ఞానబోధలు పక్కన పెట్టి ఏ హిట్టో, ఫట్టో పట్టుకు రమ్మంటాను."
" అలా అయితే పూర్తిగా అవి పోతాయా?"
" అవెక్కడికి పోతాయి. రెండ్రోజులాగి మళ్ళీ తయారౌతాయి."
" అర్థమైంది కదా. అసలు సమస్య నువ్వు చూడడం లోనే ఉంది. చూసే దృష్టి మారాలి. సమస్య బొద్దింకలు కాదు. వాటిని పెంచే పరిసరాలు. అపరిశుభ్ర వాతావరణం.పగిలిన సింకులు. మూత వెయ్యని డ్రెయిన్లు. మూత పెట్టని డస్ట్ బిన్లు."
శ్రద్ధ గా వింటోంది. ముచ్చటేసి ఉత్సాహంగా చెప్పాను
" ఆ వాతావరణాన్ని సరి చేస్తే బొద్దింకలు వాటికవే మాయమవుతాయి. అపరిశుభ్రత లేకపోతే చస్తే మన వైపు రావు.వచ్చినా ఒకటో, రెండో. గుంపులుగా అయితే రావు. వాటిని ఈజీ గా మేనేజ్ చేయొచ్చు."
' అర్థమైంది ' అన్నట్టు ఆవిడ హిట్ సంగతి వదిలి, ప్లంబర్ కోసం నెంబర్ వెదకడం మొదలు పెట్టింది..పగిలిన సింక్ మార్చాలి కదా!
( ఢిల్లీలో నిరసన చేద్దామన్న బొద్దింకల పార్టీ పిలుపు ఎందుకు విజయవంతమైంది? వ్యవస్థలో అవినీతి, అపరిశుభ్రత, బాధ్యతారాహిత్యం పెరిగింది కనుక. పాలకులు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసినా, చేస్తున్నట్లు కనబడినా, ఆ నమ్మకం కలిగినా బొద్దింకల (పిలుపులకు) ప్రభావం ఉండదు. అలా చెయ్యడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత కూడా. సమస్యనను చూసే దృష్టి మారితేనే పరిష్కారాలు కళ్లకు కబడతాయి.)
- డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం.








కామెంట్‌లు (0)