బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇది కేవలం ఆరంభం మాత్రమే...

20 గంటల క్రితం

gen z
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:47 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువత సాధించిన విజయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి నిరంకుశ పాలన అంతానికి ఇది ఆరంభాన్ని సూచిస్తోంది.కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీసి, సిజెపి ఆవిర్భావానికి కారణమయ్యాయి. మొదట ఆన్‌లైన్‌లో వ్యక్తమైన యువత, విద్యార్థుల ఆగ్రహం నీట్ పేపర్ లీక్ కావడం, దాని పర్యవసానంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో వీధుల్లోకి వెల్లువెత్తింది.

ప్రభుత్వ అణచివేతను అధిగమించడం

ఈ నిరసనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల మార్గాలను ఎలా ఉపయోగించిందో ప్రపంచమంతా చూసింది. నిరసన జరుగుతున్న ప్రదేశం, దాని పరిసర ప్రాంతాలలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పార్లమెంట్ మార్చ్ రోజున వేలాదిగా జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్న విద్యార్థులు, యువతపై పోలీసులు దారుణంగా దాడి చేసి, వేదికను ధ్వంసం చేశారు. పాలకులే హింసను ప్రేరేపించినప్పటికీ కేసులు మాత్రం నిరసనకారులపై బనాయించారు. అయినా సరే వెరవకుండా నిరసనకారులు మరుసటి రోజే మళ్లీ భారీ సంఖ్యలో తిరిగొచ్చారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రయాణాలపై ఆంక్షలు విధించినా, ముఖ్యంగా మెట్రో స్టేషన్లను మూసివేసినా, జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు.

వాస్తవానికి, ఢిల్లీ నిరసనకు మద్దతుగా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నిరసనకారులకు అన్ని వైపుల నుండి వైద్య, న్యాయ సహాయం లభించింది. బాధ్యతాయుత పౌరులు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీటిని అందజేశాయి. ఎస్. ఎఫ్.ఐ, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.ఎస్.ఎ విద్యార్థి సంఘాలు దేశ నలు మూలల నుండి ఉద్యమానికి మద్దతును సమీకరించాయి. సి.జె.పి ఆన్‌లైన్ ప్రచారాల ద్వారా సాధారణ ప్రజల్లో విస్తృత మద్దతు కూడగట్టింది.

అంతిమంగా, ఈ ఉద్యమాలు, ప్రజల సమూహం కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్ల పైకి తెచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకురావడంలో సఫలమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ చివరకు లొంగిపోవాల్సి వచ్చినప్పటికీ, దేశ విద్యా రంగంలో భారీ అవినీతి, నాసిరకం నిర్వహణకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ ను కాపాడటానికి మొదట శాయశక్తులా ప్రయత్నించారని మనం మరచిపోకూడదు. ఈ విజయం నేడు భారతదేశాన్ని పాలిస్తున్న నిరంకుశ కార్పొరేట్- మతతత్వ కూటమిని ఓడించవచ్చనే నమ్మకాన్ని, ఆశను ప్రజాస్వామ్య, లౌకికవాదులందరిలో చిగురింపచేసింది.

అభ్యుదయ విద్యార్థి సంఘాలు - వామపక్ష పార్టీలు

మన దేశ విద్యా రంగానికి సంబంధించి, జాతీయ విద్యా విధానం (ఎన్.ఇ.పి) 2020ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. విద్య కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ అనే ముప్పేట దాడికి ఆ విధానమే మూల కారణం. ఇది విద్యా రంగంలో తీవ్ర అవినీతికి, నిర్వహణా లోపాలకు దారితీస్తోంది. అందుకే, విద్యా సంస్కరణల కోసం ఎస్.ఎఫ్.ఐ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. బీహార్‌లోని నలందలో ఇటువంటి నిరసనకు నాయకత్వం వహించిన ఎస్.ఎఫ్.ఐ బీహార్ రాష్ట్ర అధ్యక్షురాలు కాంతి కుమారి, ఆమె సహచరులు నిన్నటి వరకు జైలులోనే ఉన్నారు. కాబట్టి, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసిన ఈ ఉద్యమంలో ఎస్.ఎఫ్.ఐ భాగస్వామ్యం కావడం సహజం.

ఈ ఆందోళన ఆరంభమైన నాటి నుంచే వామపక్ష, అభ్యుదయ విద్యార్థి సంఘాలు సిజెపి తో కలిసి పనిచేశాయి. ఎస్.ఎఫ్.ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ సాజి, జాయింట్ సెక్రటరీ ఐషీ ఘోష్...అభిజీత్ దీప్కేతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఈ పోరాట విజయం తర్వాత, ఎస్.ఎఫ్.ఐ తదితర విద్యార్థి సంఘాల మద్దతు, మార్గదర్శకత్వాన్ని సిజెపి అధికారికంగా గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. అశుతోష్ రాంకా ట్వీట్ చేస్తూ, "ఈ ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు" అని పేర్కొన్నారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామా కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు నిరసనకారులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలి. మన విద్యార్థులు, యువతపై దారుణంగా దాడి చేసిన పోలీసు అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి. నీట్ కుంభకోణం బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. చివరిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. అలాగే ఎన్.ఇ.పి -2020ని వెనక్కి తీసుకోవాలి. పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, ఎస్.ఎఫ్.ఐ తో సహా వామపక్ష, అభ్యుదయ విద్యార్థి సంఘాలు ఈ డిమాండ్లపై ఒత్తిడి తెస్తున్నాయి.

అందరికీ అందుబాటులో ఉండే ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యను మేము విశ్వసిస్తున్నందున సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు మొదటి నుండి అండగా నిలిచాయి. విద్యార్థుల సమస్యపై పార్లమెంట్‌లో చర్చించాలని ముందుగా మేమే డిమాండ్ చేశాం. ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే మన నాయకులు, ఎంపీలు వారిని సందర్శించి మద్దతు, సహానుభూతి తెలిపారు. ఈ ఆందోళనలో వామపక్షాల జోక్యం ఎంత తీవ్రంగా ఉందంటే, 'ది వైర్' వంటి పోర్టళ్లు, 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వంటి పత్రికలు ఈ నిరసన విజయవంతం కావడంలో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు పోషించిన పాత్రను ప్రస్తావించాల్సి వచ్చింది. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఈ ఆందోళనకు విస్తృతమైన ప్రజాదరణను తెచ్చిపెట్టడంలో గణనీయమైన సహకారం అందించింది. క్రీడలు, కళలు, సినిమా, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ముందుకు రావడం శుభపరిణామం.

ప్రతిఘటనా వెల్లువలు

ఈ పోరాటం ద్వారా లభించిన అతి పెద్ద ఫలితం భయాన్ని వీడటం. భయపడే కాలం, పోరాటాలకు పెడగా ఉండే రోజులు ముగిశాయని జెన్ జి నిరూపించింది. ఐక్య పోరాటాలే విజయాన్ని సాధిస్తాయనేది ఈ ఆందోళన నేర్పిన మరొక ముఖ్యమైన పాఠం.

ఐదేళ్ల క్రితం సుమారు 700 మంది ప్రాణాలు అర్పించిన రైతులు, వ్యవసాయ కార్మికుల చేపట్టిన చారిత్రాత్మక పోరాటం కూడా ఇదే నిరూపించింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను అదే పార్లమెంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఐక్య పోరాటాల ద్వారా వ్యక్తమైన ప్రజాగ్రహానికి '56 అంగుళాల ఛాతీ' లొంగిపోవాల్సి రావడం అది మొదటిసారి. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా రెండవ ఉదాహరణ.

పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు పోరాటాలు నిర్వహిస్తున్నాయి. రెండు నెలల క్రితమే ఉత్తర భారతదేశ వ్యాప్తంగా కార్మికుల నిరసనలు ఉప్పొంగిన సంగతి తెలిసిందే. దానికి ముందు, సిపిఎం చొరవతో ప్రజల జీవనోపాధి సమస్యలను లేవనెత్తుతూ ఉత్తర భారతదేశంలోని 13 రాష్ట్రాల్లో 'జన్ ఆక్రోష్ జాతాలు' నిర్వహించారు. అంతకు ముందే, సంయుక్త కిసాన్ మోర్చా మద్దతుతో కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతంగా నిర్వహించాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆర్‌.ఎస్‌.ఎస్-బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత అంతా ముందుకు వస్తున్న పోరాటాల వెల్లువను నేడు దేశం చూస్తోంది.

పోరాట మార్గంలో ఉన్నవారందరి ఐక్యతను కాపాడుకోవడానికి, మరింత మందిని, సామాజిక శక్తులను పోరాటంలోకి తీసుకురావడానికి, కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బిజెపిని గద్దె దించేందుకు లక్ష్యిత ఉద్యమాలను నిర్వహించడానికి ఇది సరైన సమయం. ప్రజల ఐక్యతను దెబ్బతీయడానికి ఆర్‌.ఎస్‌.ఎస్, బిజెపి లు తమ పాత విచ్ఛిన్నకర వ్యూహాలను ముందుకు తెస్తాయి. ఈసారి విద్యార్థి లోకాన్ని విభజించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ కుట్రల పట్ల జెన్ జి అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా నిలబడాలి. తగిన అవకాశాలు లేకపోవడానికి పరిష్కారంగా మరిన్ని సీట్లు, ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయాలి. అదే సమయంలో, భారతీయ సమాజాన్ని, ముఖ్యంగా విద్యా, సాంస్కృతిక రంగాలను ప్రక్షాళన చేయడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమం అవసరం. అంతిమంగా, ఈ కొత్త ఉద్యమాలే నయా-ఫాసిస్టులను మోకాళ్ళ దండ వేయిస్తాయి.

ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ చారిత్రాత్మక నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన వారికి , దీనిని దేశం నలుమూలలకూ విస్తరింపచేసిన వారందరికీ విప్లవాభినందనలు.


-వ్యాసకర్త సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్