- బి. తులసీదాస్
ఆగస్టు తొమ్మిదవ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ సమితి జనరల్ అసెంబ్లీ 1994 డిసెంబర్ లో ప్రకటించింది. ప్రపంచంలోని 90 దేశాల్లో 47.6 కోట్ల మంది ఆదివాసీలున్నారని ఓ అంచనా! ప్రపంచ జనాభాలో ఆరు శాతంగా ఉన్న వీరు నిరుపేదల్లో 15 శాతం కావడం గమనార్హం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7,000 భాషలను మాట్లాడుతారని 5,000 విధాల సంస్కృతులు కలిగి వున్నారని అంటారు. ఆదివాసీ ప్రాంతాలు 28 శాతం భూ ఉపరితలం విస్తరించి ఉన్నాయని, 11 శాతం అడవి కలిగి వున్నాయని అంచనా. కాగా 'ఆదివాసీ మంత్రసానుల్ని (మిడ్ వైఫ్) గౌరవిద్దాం- జీవితాన్ని, క్షేమాన్ని (లైఫ్ అండ్ వెల్ బీయింగ్) కాపాడుకుందాం' అన్నది ఈ ఏడాది ఆదివాసీ దినోత్సవం థీమ్. ఆదివాసీ మంత్రసానుల్ని గౌరవించడం అంటే బిడ్డల్ని సంరక్షించడంతో సహా వారు అందించే సేవలను కొనియాడడం మాత్రమే కాకుండా వారికున్న సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గుర్తించడం, మరింతగా వినియోగించుకోవడం అని ఐరాస పేర్కొంది.
మన దేశంలో ఆదివాసీలు కేంద్రీకరించివున్న ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదు, ఆరవ షెడ్యూళ్లలో చేర్చారు. అక్కడ నివసించే వారికి భూమి ఇతర స్థిరాస్తులపై యాజమాన్య హక్కులతోపాటు ఇంకొన్ని ప్రత్యేక హక్కులను రాజ్యాంగం కల్పించింది. మైదాన ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ తెగలవారికి రిజర్వేషన్లు ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలు పూర్తిగా ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు కాగా మన్యం, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో కొన్ని మండలాలున్నాయి. ఇవిగాక శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లోని ఆదివాసీలు ప్రధానంగా గల 800 పైగా గ్రామాలు కూడా ఐదవ షెడ్యూల్ లో చేర్చవలసినవి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నాటినుండి గత నలభయ్యేళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులకు పట్టడం లేదు.
రాజ్యాంగపు ఐదవ షెడ్యూల్ దఖలు పర్చిన హక్కుల ప్రకారం ఆ ప్రాంతంలో భూమి స్థిరాస్తులు షెడ్యూల్డు తెగలవారివిగానే భావించాలి. 1963 డిసెంబర్ కంటే ముందు ఎవరైనా గిరిజనేతరులకు ఉంటె అవి తప్ప మిగిలిన భూములు, స్థిరాస్తులు గిరిజనులవే. అంతేగాక గిరిజనేతరులు ఎవరైనా తమ ఆస్తులు ఆదివాసీలకు మాత్రమే అమ్మాలి తప్ప గిరిజనేతరులకు కాదు. 1970 ఫిబ్రవరి 3 తరువాత భూమి అమ్మకం లేదా బదలాయింపు షెడ్యూల్డు తెగల వారికి మాత్రమే జరగాలి. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూ బదలాయింపు నిషేధ (ఎల్.టి.ఆర్) చట్టం చేశారు. దానినే ఆచరణలో 1/70 చట్టం అంటారు. ఈ చట్టాన్ని ప్రఖ్యాత సమత కేసులో సుప్రీం కోర్టు గట్టిగా బలపర్చింది. ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరుడిగానే పరిగణించాలని వ్యాఖ్యానించింది. ఇటువంటి చట్టాల మూలంగా ఆదివాసీలకు కొన్ని రక్షణలు కలుగుతున్నాయి. కానీ ఇప్పుడా చట్టాన్ని రద్దు చేయాలని కొందరు గిరిజనేతర పెత్తందార్లు కోర్టుకెక్కారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి కానీ కౌంటర్ దాఖలు చేసి చట్టాన్ని గట్టిగ సమర్ధించే పనికి పూనుకోవడం లేదు. అంటే ఏలినవారు ఆదివాసీ ప్రయోజనాలపట్ల పట్టనట్టున్నారు. దాంతో ఆదివాసీ గిరిజన సంఘం సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అయింది.
రాజ్యాంగపు ఐదవ షెడ్యూల్ ప్రాతిపదికనే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాలు వంద శాతం ఆదివాసీలకు రిజర్వ్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 3 జారీ చేసింది. పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకపోయినా టీచర్లు, హాస్టల్ వార్డెన్లు, కుక్, కామాటి వంటివి ఆదివాసీలకు దక్కాయి. కానీ కొందరు స్వార్ధపరులు కోర్టులకెక్కి దాన్ని రద్దు చేయించారు. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో జోక్యం చేసుకోకపోవడం వల్ల ఆదివాసీలకు తీవ్ర నష్టం జరిగింది. సరిగ్గా ఈ నేపథ్యం లోనే 2024 ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం వస్తే జీవో 3 పునరుద్ధరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. అధికారం వచ్చి రెండేళ్లు దాటిపోయినా జీవో త్రీ మాత్రం తిరిగి రాలేదు. అవే ప్రయోజనాలతో మరో జీవో తెస్తామన్నదీ జరగలేదు. అందుకనే గత ఆరేడు నెలలుగా ఆదివాసీలు 1/70 పరిరక్షణ జీవో త్రీ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఆగస్టు 8న ఏజెన్సీ బంద్ విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి ఈ రెండు డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నది వారి డిమాండ్ (అయితే గతంలో మైనింగ్ వంటి కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని 1/70 చట్టం రద్దు కోసం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించారన్నది ఆదివాసీల గుండెల్లో నాటుకొనివుంది.).
మన ఏజెన్సీ ప్రాంతాలు గనులు, వృక్ష సంపద తదితర సహజ వనరులకు పెట్టింది పేరు. వాటిని కాజెయ్యడానికి దేశ విదేశీ కార్పొరేట్లు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి కొమ్ము కాస్తూ ఆదివాసీలకు ద్రోహం చేస్తున్నాయి. పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల పేరిట అదానీ నవయుగ వంటి కంపెనీలకు ఏజెన్సీ భూములు ధారాదత్తం చేస్తున్నారు. ఆయా నదులు వాగుల్లోని నీటిని కూడా పంటలకు కాకుండా వారికే అప్పగించేస్తున్నారు. ఇందుకోసం 1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. మరోవైపు పీసా చట్టం ప్రకారం గ్రామసభల సమ్మతితోనే భూసేకరణ చేయవలసి ఉండగా అదీ చేయడం లేదు. అన్నివిధాలా రాజ్యాంగాన్ని, చట్టాలను, కోర్టు తీర్పులను తొత్తడం చేసి కార్పొరేట్లకు ఏజెన్సీ సంపదను ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయి.
ఆదివాసీల జీవితానికి అడవి ఎంతో ముఖ్యం. యుపిఎ ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి మూలంగా వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ప్రతి ఆదివాసీ కుటుంబానికి పది ఎకరాల వరకు అటవీ భూమి ఇవ్వవలసి ఉండగా ఆ పని చేయడం లేదు. సామూహిక హక్కుల విషయమూ అలాగే వుంది. కొన్ని చోట్ల అయితే అటవీ హక్కు పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఫారెస్టు అధికారులు మొక్కలు నాటడం అడ్డుకున్న ఆదివాసీలపై కేసులు బనాయిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల మూలంగా నలిగిపోతున్నది కూడా ఆదివాసీలు కావడం మరింత బాధాకరం.
విద్య వైద్యం విషయం గురించి అసలు మాట్లాడలేం. నేడు మన రాష్ట్రంలో కిలోమీటర్ల పాటు డోలీల్లో బాలింతల్ని, రోగుల్ని ఆసుపత్రులకు తీసుకురావడం మార్గ మధ్యంలోనే కొందరు మరణిస్తున్న దుస్థితి నెలకొంది. మాతా శిశు మరణాల రేటు అత్యధికం కాగా పౌష్టికాహార లేమి మరింత తీవ్రంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు స్వల్ప వేతనాలిస్తున్నారు. ఆశా వర్కర్లుగా నియమించాలన్న వారి డిమాండ్ నెరవేర్చడం లేదు. ప్రాథమిక స్థాయి నుండీ విద్య అందనిదిగానే ఉంది. ఇక ఆదివాసీల భాషలను గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న భాషా వాలంటీర్లను తొలగించేయడమో లేక వారికీ ఎలాంటి భద్రతా లేకుండా గాలిలో ఉంచడమో చేస్తున్నారు.
ఏ విధంగా చూసినా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది. అడవి, భూమి, ఉపాధి ఇలా ఏది పరిశీలించినా అంతే! రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను పాలకులు ఒక్కొక్కటిగా గుంజేస్తున్నారు. మరో వైపున ఏజెన్సీ సహజ సంపదను దేశ విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడం ప్రభుత్వాల నిత్యకృత్యంగా ఉంది. అందుకే ఆదివాసీలు పోరుబాట పడుతున్నారు. తమ బతుకులు కాపాడుకోవడానికి అదే మార్గం. బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి యోధులు చూపిన మార్గం అదే! ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా ఆ దారిలోనే !








కామెంట్‌లు (0)