రాజమండ్రిలో ఆగస్టు 3న మద్యం మత్తులో ఉన్న యువకులు నడిపిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక దాదాపు వారం రోజుల పాటు కోమాలో ఉండి ఆగస్టు 9న మృతి చెందింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగిన బిడ్డ డాక్టర్ చదువుతుంటే తల్లిదండ్రుల కళ్లలో ఎంత వెలుగు ఉంటుంది! నీట్ పరీక్ష నుంచి వైద్య విద్య వరకు ఎన్నో కష్టాలు, లక్షలాది రూపాయల ఖర్చు, తల్లిదండ్రుల త్యాగం వెనుక ఒక భవిష్యత్తు కల ఉంటుంది. అలాంటి వైద్య విద్యార్థిని మద్యం మత్తులో వాహనం నడిపిన వారి నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ గుండెకోత జీవితాంతం బాధిస్తుంది. ఈ సంఘటన వెనుక ఇద్దరు యువకుల బాధ్యతారాహిత్యం, అమానవీయ ప్రవర్తనతో పాటు వాళ్లను ఉన్మత్తులుగా మార్చిన మద్యం పాత్ర కూడా ఉంది. రాజకీయ జోక్యం సంగతి సరేసరి. వాటి గురించి చర్చించడం, వాటిని నివారించడం నేడు చాలా అవసరం.
బాధ్యత ఎవరిది?
ఈ సంఘటనలో చట్టపరంగా బాధ్యత ఎవరిదో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. కానీ సామాజికంగా మనం అనేక ప్రశ్నలు వేసుకోవాలి. ప్రియాంకను బలిగొన్నది కేవలం నిర్లక్ష్యమైన డ్రైవింగేనా? మద్యాన్ని విచ్చలవిడిగా పారిస్తున్న సంస్కృతా? యువతకు సులభంగా చేరుతున్న మత్తు పదార్థాలా? ప్రజల కంటే ఆదాయానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ విధానాలా? మహిళల భద్రతను నిర్లక్ష్యం చేసే సామాజిక దృక్పథమా? పిల్లలను సక్రమంగా పెంచుకోలేకపోతున్న కుటుంబ వ్యవస్థా? లేక అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయిన మనందరమా? ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం లేదు. వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, ప్రభుత్వానికీ బాధ్యత ఉంది. ఈ ధోరణులకు మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్న ప్రభుత్వాల తీరు ఇందుకు ప్రధాన బాధ్యత వహించాల్సింది ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఒక ప్రధాన ఆదాయ వనరుగా చూడడం బాధాకరం. 2025–26లో రాష్ట్రంలో మొత్తం మద్యం అమ్మకాల విలువ 2024–25లోని రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు పెరిగి 6.11 శాతం వృద్ధి నమోదైంది. ఐఎంఎల్ అమ్మకాలు 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు, అంటే 14.59 శాతం పెరగగా, బీర్ అమ్మకాలు 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు, ఏకంగా 70.29 శాతం పెరిగాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.24,734 కోట్ల నుంచి రూ.25,727 కోట్లకు, 4.01 శాతం పెరిగింది. మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ.28,846 కోట్ల నుంచి రూ.29,042 కోట్లకు పెరిగింది. 2026–27 బడ్జెట్‌లో ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.30,067 కోట్లుగా అంచనా వేశారు. మద్యం అమ్మకాలు పెరగడం ప్రభుత్వ ఖజానాకు ఆదాయంగా కనిపించినా, ఆ డబ్బు వెనుక అనేక కుటుంబాల శ్రమ, ఆరోగ్యం, ప్రశాంతత, భవిష్యత్తు ఖర్చవుతున్నాయి. ప్రియాంకను బలిగొన్న మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ సమస్య ఎంత ప్రమాదకరమో చూపిస్తున్నాయి.
మద్యం మత్తులో ముప్పు
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ “రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా–2023” నివేదిక ప్రకారం దేశంలో 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగి 1,72,890 మంది మరణించారు. మద్యం, మాదకద్రవ్యాల ప్రభావంలో వాహనం నడపడంతో సంబంధం ఉన్న 9,143 ప్రమాదాల్లో 3,674 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19,949 ప్రమాదాలు జరిగి 8,137 మంది మరణించగా, మద్యం కారణంగా 130 ప్రమాదాలు, 70 మరణాలు నమోదయ్యాయి. ఇవి అధికారికంగా నమోదైన గణాంకాలు మాత్రమే! నమోదు కాని ప్రమాదాలు ఇంకొన్ని ఉండొచ్చు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ గణాంకాల ప్రకారం డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు 2023లో 21,376 కాగా, 2024లో 33,707కు పెరిగాయి. అంటే ఏడాదిలో 58 శాతం పెరిగాయి. రూ.11.05 కోట్ల జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇవన్నీ కలిపి చూస్తే మద్యం సేవించి వాహనం నడపడం వ్యక్తిగత తప్పిదంగా మాత్రమే కాకుండా తీవ్రమైన సామాజిక సమస్యగా చూడాల్సిన అవసరం స్పష్టమవుతుంది. మద్యం ఒక్కటే కాదు; డ్రగ్స్, గంజాయి, సింథటిక్ మత్తు పదార్థాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, వేగంపై మోజు, హింసాత్మక సంస్కృతి యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కుటుంబాలను, సమాజాన్ని చెదలులా నాశనం చేస్తున్న విషయాన్ని పాలకులు గుర్తించాలి.
బీచ్‌లో మద్యం అమ్మకాలా?
ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసి మద్యం విక్రయించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆందోళన కలిగిస్తోంది. పర్యాటక అభివృద్ధి అంటే కుటుంబాలు, మహిళలు, పిల్లలు, యువత సురక్షితంగా గడిపే ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయడమా, లేక మద్యం అందుబాటును పెంచడమా? ఒకవైపు డ్రంకెన్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కేసులు నమోదు చేస్తూ, మరోవైపు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరే బీచ్‌లలో మద్యం అందుబాటును పెంచడం ఎందుకు? మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. బీచ్‌లు సురక్షితమైన కుటుంబ ప్రదేశాలుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. మద్యం అందుబాటును విస్తరించే ప్రతి విధానాన్ని ప్రజారోగ్యం, మహిళల భద్రత, యువత భవిష్యత్తు, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి అంశాలతో కలిపి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ప్రతి విషాదం తర్వాత కొద్దిరోజులు బాధపడటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. ప్రశ్నించే పౌరులు, స్పందించే ప్రభుత్వం, బాధ్యతాయుతమైన సమాజం కలిసి పనిచేయాలి. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను ఆదాయ వనరులుగా చూస్తున్న ప్రభుత్వాలను నిలదీయాలి. రాజమండ్రి సంఘటనలో వేగవంతమైన, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకోవాలి. యువతకు ఉద్యోగాలు, క్రీడలు, గ్రంథాలయాలు, సాంస్కృతిక వేదికలు, సామాజిక సేవా కార్యక్రమాలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అవకాశాలు కల్పించాలి. వ్యసనాల ప్రమాదం, రోడ్డు భద్రత, లింగ సమానత్వం, రాజ్యాంగ విలువలు, చట్టాల పట్ల గౌరవం, డిజిటల్ బాధ్యత వంటి అంశాలు విద్యలో భాగం కావాలి. కుటుంబాల్లో పిల్లలతో మాట్లాడే సమయం పెరగాలి. ఈరోజు ప్రియాంక కోసం బాధపడటం మాత్రమే కాదు; రేపు మరో కుటుంబం ఇదే గుండెకోతను అనుభవించకుండా చూడటమే ఆమెకు నిజమైన నివాళి.
- ఆర్.ఎన్. మాధవి,
ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షురాలు, సెల్: 70363 56294








కామెంట్‌లు (0)