ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నిరంకుశ పక్షపాత వైఖరిపై చెలరేగిన దుమారం మోడీ 3.0 సర్కారు హయాంలో విశ్వసనీయత కోల్పోయిన వ్యవస్థలపై విస్ఫోటనమే. రాజ్యాంగ పరంగా సిఇసి కేంద్రంగా నడుస్తున్నప్పటికీ నిజానికి ఇది ఎన్నికల వ్యవస్థకూ దాన్ని రాజకీయ రాజ్యాంగ సాధనంగా చేసుకున్న కేంద్ర సర్కారు మొత్తానికి వర్తిస్తుంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ద్వారా ఇది బయటకు రావడమూ, వెనువెంటనే సుప్రీంకోర్టులో కూడా చర్చ కావడమూ, ఒక ఎత్తు. బిజెపి పట్ల మెతకగా వుంటాయని పేరున్న పార్టీలే పాలక ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలూ ప్రక్షాళన కోరడం మరో ఎత్తు. ‘సర్’ అమలుకు వచ్చిన నాటి నుంచి నూటికి నూరు పాళ్లు సమర్థిస్తున్న ఏకైక పక్షమైన బిజెపినే ఈ సమయంలో సిఇసి నీ ఎన్నికల వ్యవస్థనూ భుజాన వేసుకున్న ఏకైక పార్టీగా ముందుకు రావడం మరో కోణం. సిఇసి రాజీనామాకు డెడ్‌లైన్ విధించి జంతర్ మంతర్ 2.0 తప్పదని సిజెపి హెచ్చరించడం ఇంకో కోణం. ఈ సమయంలో అసలు మౌలిక ప్రజాస్వామ్య లక్షణాల పరిరక్షణ కోణంలోగాక సిఇసి నియామకం బిల్లు, ఇ.సి పని పద్ధతులు రాజ్యాంగ నిబంధనల వంటి అంశాలకే పరిమితమై మాటల గారడీ చేస్తున్న మీడియా కథనాలు మరో కోణం. ఎందుకంటే ఇంత సంచలనంలోనూ ఇ.సి నుంచి సాంకేతిక ప్రకటనలూ షరామామూలుగా విడుదలవుతుండటం గమనించదగింది.
దేశవ్యాపిత సంచలనం
ఈ వార్త దావానలంలా వ్యాపించడంలో మొదట చెప్పుకోవలసింది ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్టర్ రితికా చోప్రాను. బహుశా చాలా కాలం తర్వాత మీడియాలో ఒక షాకింగ్ కథనం వెలువరించిన ఘనత ఆమెకే దక్కుతుంది. గత కొంత కాలంగా ‘సర్’ పైన ఆమె వరుస పరిశోధన కొనసాగిస్తూ వచ్చింది. 10 నెలల్లో 14 సార్లు, ఒకే రోజు నాలుగుసార్లు సిఇసి జ్ఞానేష్ కుమార్ మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలు అభ్యంతరాలను తోసిపుచ్చారన్నది ఆమె బయటపెట్టిన అంశం. ఆధారాలతో సహా వెల్లడించిన ఈ వాస్తవాలను ఎవరూ కాదనలేరు. దాంతో భిన్నాభిప్రాయాలు సాధారణమేనన్న సమర్థనతో బయటపడటానికి సిఇసి తో పాటు బిజెపి నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ బయట ప్రతిపక్షాల ఉద్యమం, రాష్ట్రాలను పాలించే ప్రభుత్వాలూ మాజీ సిఇసి లు కూడా అదే విషయమై పోరాడుతున్న నేపథ్యం ఇక్కడ కీలకమైంది. యోగేంద్ర యాదవ్, పరకాల ప్రభాకర్ వంటి నిపుణులు అచ్చంగా ఆ అంశం పైనే అపారమైన అధ్యయనం చేస్తూ దేశమంతటా పోరాడుతున్నారు. సుప్రీం కోర్టులో ఒకటికి పదిసార్లు కేసులు నడిచాయి. పార్లమెంటులోనూ ప్రకంపనలు రేగాయి. సంధు, జోషీ లు అభ్యంతరం పెట్టిన అంశాలు బయట జరిగే పోరాటాలలో ప్రతిధ్వనిస్తున్నవే. రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత జ్ఞానేష్ కుమార్ నియామకం జరిగిన తీరే అభ్యంతరకరం. దానికి ముందు ఇ.సి లు అరుణ్ గోయల్, అశోక్ లావాసాలు ఆశ్చర్యకరంగా నిష్ర్కమించారు. సంధు, జోషీ లు కూడా పాలక కూటమి ఎంపిక చేసిన వారే. కనుక ఎన్నికల సంఘం కథ మొత్తం అడుగడుగునా మలుపులతోనే నడుస్తున్నది. సిఇసి ఎంపిక ప్రక్రియలో ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) వుండాలన్న కోర్టు సూచనను కూడా పార్లమెంటు పేరుతో ఏకపక్షంగా తోసిపుచ్చి ప్రధాని, ఆయన నియమించిన మరో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. వారే ఇద్దరున్నాక ప్రతిపక్ష నాయకుడు వున్నా అలంకారమన్నట్టే తయారైంది.
జ్ఞానేష్ నేపథ్యం
జ్ఞానేష్ కుమార్‌ను వివిధ శాఖల మధ్య వేగంగా పైకి నెట్టిన తీరు, హోంమంత్రి అమిత్ షా నమ్మకస్తుడైన అధికారిగా ఆయన నిర్వహించిన పాత్ర కూడా క్రమపద్ధతిలోనే నడిచాయి. మోడీ అమిత్ షాలతో కలసి సిఇసి కుట్ర పన్నారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించడానికి కారణమదే కావచ్చు. అయితే 2023లో పార్లమెంటు ఈ బిల్లు ఆమోదించిన రోజునే సభలోకి ఆగంతకులు వచ్చి పొగ వదలడం, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. సస్పెండ్ కాని రాహుల్ గాంధీ సభలో దీనిపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఒక మీడియా వ్యాఖ్యానం చేయడం కూడా చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నంగానే కనిపిస్తుంది. సిఇసి రాజీనామా చేయాలని ‘హిందూ’ సూటిగా సంపాదకీయమే రాసింది. ఇ.సి వివరణ ఇవ్వాలనీ, ప్రతిష్ట కాపాడుకోవాలని ‘ఈనాడు’ రాసింది. అసలు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఈ కథనాన్ని తీసుకురావడం కార్పొరేట్ విభజనలో భాగమేనని కూడా వాదనలున్నాయి. ఇద్దరు ఇ.సి లు ఒక నిర్ణయం తీసుకుని బయటపెట్టారంటే వారు కూడా భరించలేనంత దారుణంగా పరిస్థితి తయారైందని సిద్ధార్థ వరదరాజన్ వంటి మీడియా ప్రముఖులు వివరిస్తున్నారు. ఇదే పత్రిక రెండేళ్ల కిందట ‘సర్’పై విమర్శలను తూర్పారబడుతూ సంపాదకీయమే రాసింది. ఇప్పుడు కూడా ‘న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఈ కథనాన్ని తనదిగా స్వీకరించలేదు. పత్రికలూ వెబ్‌సైట్లు, చానళ్లలో కొన్ని అటూ ఇటూ తిప్పి దీన్ని తక్కువ చేయడానికి తంటాలు పడుతున్నాయి. అభిశంసన ప్రక్రియ చాలా జటిలమైంది గనక ఆయనకేమీ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది వారాల కిందట విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి దారి పట్టిన తీరును వీరు మర్చిపోతున్నారా? రాజకీయాలలో సాంకేతికాంశాలే ఎప్పుడూ కాపాడలేవు. ఇప్పుడు తమ భిన్నాభిప్రాయాలు బయటపెట్టినంత మాత్రాన తానేమీ మిగిలిన ఇద్దరు ఇసిలను వీరులుగా భావించడం లేదని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. గతంలో కమిషనర్‌గా వున్న అశోక్ లావాసా 2022లో సిఇసి అయివుండేవారు. పది సందర్భాల్లో ఆయన అప్పటి సిఇసి రాజీవ్ కుమార్ చర్యలకు అభ్యంతరం పెట్టారు. అయితే మాట చెల్లకపోవడంతో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వి.పిగా పదవి తీసుకుని నిష్క్రమించారు. ఒకవేళ జ్ఞానేష్ గనక వైదొలగితే సీనియారిటీని బట్టి సుఖ్‌బీర్ సింగ్ ఆ స్థానంలోకి రావలసి వుంటుంది.
ఎన్డీఎలో ప్రకంపనలు
సిఇసి కి సంబంధించి కీలకమైన రాజకీయ పార్టీల నుంచి వస్తున్న స్పందనలు కూడా అదే అభిప్రాయం కలిగిస్తాయి. ఎన్‌డిఎ లో భాగస్వామ్య పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జె.పి రామ్ విలాస్), తెలుగుదేశం, రాష్ర్టీయ లోక్‌మోర్చాల నేతలు పలు రూపాల్లో విభిన్న స్పందనలు వెలిబుచ్చారే గానీ బిజెపి లా పూర్తిగా సమర్థించేందుకు సిద్ధపడలేదు. ఎన్నికల ప్రక్రియలపై సిఇసి జ్ఞానేష్ వెంటనే సమగ్రమైన, సవివరమైన వివరణ ఇవ్వాల్సిందేనని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ గట్టిగా కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రమైన రాజ్యాంగ సంస్థ కాబట్టి వాస్తవాలు చెప్పకపోతే విశ్వసనీయత దెబ్బ తింటుందన్నారు. గతంలోనూ జెన్ జి ఆందోళనలపై నిర్బంధం విషయంలో సామ్రాట్ చౌదరి విధానాలను పాశ్వాన్ తప్పుబట్టారు. మరో పెద్ద భాగస్వామ్య పార్టీ జెడియు ఎకరూప పౌరస్మృతి విషయంలో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చింది. ఇక తెలుగుదేశం లోక్‌సభాపక్ష నాయకుడు లావు కృష్ణదేవరాయలు కూడా వివరణ ఇవ్వాలని కోరారు. కాకపోతే ‘సర్’ ప్రక్రియ ఏపి వరకూ సక్రమంగా జరిగిందని ఆయన కితాబునివ్వడం కొసమెరుపు. ఆర్.ఎల్.ఎం కు చెందిన కేంద్రమంత్రి కుష్వాహా కూడా ఇ.సి వివరణ కోరారు. ఇప్పటివరకూ ఇ.సి పేరిట అధికారిక ప్రకటనలు వస్తున్నా అవి ఎవరు ఇచ్చిందీ స్పష్టత లేదు. ఒక విధంగా ఏకపక్ష ధోరణికి కొనసాగింపుగానే వుంటున్నాయి.
జగన్, నవీన్‌ల విమర్శ
వైసిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సిఇసి విశ్వసనీయత, పారదర్శకత కాపాడుకోవాలని కోరారు. 2023 సిఇసి నియామక చట్టాన్నే పున:సమీక్ష చేయవలసి వుందని గట్టిగా సూచించారు. ఇక ‘సర్’ ప్రక్రియకు సంబంధించి ఎ.పి లో తమ అభిమానుల లక్షల ఓట్లు తొలగించబడ్డాయని కూడా విమర్శించారు. దీని కొనసాగింపుగా మాట్లాడిన వైసిపి నాయకులు సిఇసి నిరంకుశంగా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. వైసిపి నేతలు అందులోనూ జగన్ కేంద్రం నిర్ణయాలపై, సమస్యలపై ఇంత సూటిగా మాట్లాడటం అరుదు. కొద్దిరోజుల కిందట కూడా జెన్ జి ఆందోళనలు, బొద్దింకలు పుట్టుకు రావడం వంటి అంశాలు ఆయన ప్రస్తావించడం పరిశీలకులను ఆకర్షించాయి. బిఆర్‌ఎస్ కూడా ‘సర్’లో సామూహిక ఓట్ల తొలగింపును ప్రస్తావిస్తూ సిఇసి పై విమర్శలు చేసింది. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ కూడా సిఇసి నిర్వాకాలను నిలదీశారు. ‘సర్’లో ఓట్ల తొలగింపును తప్పుబట్టారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మొదటిసారిగా ఈ పరిణామం తర్వాత సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీకి ఫోన్ చేసినట్టు మీడియా నివేదించింది. తాజా పరిణామం ఎంత ప్రభావం చూపుతున్నదో ఈ ఉదాహరణలన్నీ చెబుతున్నాయి. ఏది ఏమైనా తాము అందరినీ కలుపుకుని అభిశంసన దిశలో వెళతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సిఇసి రాజీనామా చేయకపోతే గాంధీ జయంతి నుంచి జంతర్ మంతర్ 2.0 ప్రారంభిస్తామని సిజెపి అధ్యక్షుడు అభిషేక్ దీప్కే ప్రకటించడం కూడా ఆసక్తి కలిగించింది (కాకపోతే ‘సర్’ విరమించే వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలని ఆయన అన్నమాటకు ఎలాంటి మద్దతు రాలేదు సరికదా కొంత అభ్యంతరం వ్యక్తమైంది.).
తీవ్ర ఉద్యమం దిశగా...
ఇన్నిటి మధ్యనా బిజెపి మాత్రం సిఇసి ని ‘సర్’నూ సమర్థించేందుకు అనుకూల మీడియాను పురికొల్పడమేగాక కొన్ని కథనాలు వదులుతున్నప్పటికీ ఈ సునామీ చల్లారే అవకాశం కనిపించడం లేదు. సిఇసిని మాత్రమేగాక మొత్తం ఎన్నికల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని వామపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. దేశవ్యాపిత ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సర్కారు ఎజెండాకు కూడా ఈ సునామీకి దారితీస్తే ఆశ్చర్యపోవలసింది లేదు. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థ పార్లమెంటు చట్టసభలు, మీడియా...అన్నిటా ఇంత తీవ్ర సంఘర్షణలు ప్రజ్వరిల్లుతుండడం యువత, వివిధ వర్గాల ప్రజలూ రంగంలోకి వస్తుండడం అందుకు నిదర్శనం.








కామెంట్‌లు (0)