శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition రాష్ట్రాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు, పర్యావరణ ముప్పు

10 గంటల క్రితం

price copy final.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 05:35 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

రాష్ట్రంలో నిరుద్యోగం ప్రబలిపోతున్నది. ఐ.టి పై ఆశలు పెట్టుకున్న యువత నిరాశకు గురవుతున్నది. ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, 65 వేల మంది డిప్లమా హోల్డర్లు చదువులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తే ఐ.టి ఉద్యోగం గ్యారెంటీ అన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి మరీ చదువులపై పెట్టుబడులు పెడుతున్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినా స్కిల్స్‌ లేవనే పేరుతో మరలా సర్టిఫికెట్‌ కోర్సులకు ఏ హైదరాబాదో, బెంగళూరో వెళ్ళి పిజి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు దాదాపుగా జరగడం లేదు. జరిగినా అప్పాయింట్‌మెంట్‌ లెటర్‌ రాదు. లెటర్‌ ఇచ్చినా బెంచిపై ఉంచడంతో నేర్చుకున్నది కూడా మర్చిపోతామని రాజీనామా చేసి మరోదారి వెతుక్కుంటున్నారు. ఐ.టి జాబ్‌ మార్కెట్‌లో కొద్దో గొప్పో ఓపెనింగ్స్‌ ఉన్నా ఏ.ఐ పేరుతో మధ్యంతర దశలో ఉన్న వేలాదిమంది ఉద్యోగులను తొలగించేస్తున్నారు. గత ఆరు మాసాల్లో దాదాపు 2 లక్షల మందిని ఇంటికి సాగనంపారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాపితంగా 60 వేల మందికి విఆర్‌ఎస్‌ ఇచ్చారు. అందులో 23 వేల మంది మన దేశీయులే. ఇంకొంత మందిని తొలగిస్తారని అంచనా. టిసిఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాక్సెంచర్‌ వగైరా కంపెనీలన్నీ ఫైర్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఓపెనింగ్స్‌లో కొత్తగా ఒకరిని తీసుకుంటే పాతవారిని పది మందిని తీసివేస్తున్నారు. ఒక ఉద్యోగం వస్తే పది మంది వారిపై ఆధారపడి బతుకుతారని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలంటూ చంద్రబాబు ఊదరకొడుతున్నారు. అదే ఒకరిని తీసేస్తే పదిమంది ఇంటికి పోతారని మాత్రం చెప్పడం లేదు. నేడు జరుగుతున్నదదే. అప్పులు చేసి చదువుకున్న నిరుద్యోగుల కథ కంచికి చేరుతున్నది. ఈ సంక్షోభంతో ఇంజనీరింగ్‌ చదివేవారి సంఖ్య తగ్గిపోయి సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. 65 శాతం ఇంటర్‌తోనే చదువు మానేస్తున్నారు.

ఉద్యోగాలు తీసేస్తే ఒకటి లేదా రెండు నెలలు జీతం ఇచ్చి పంపించేస్తున్నారు. అమెరికా లాంటి దేశాలకు వీసాలు దొరకడం బాగా తగ్గిపోయింది. అక్కడున్నవారు కూడా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియక, తిరిగి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి స్థితిలో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారింది. అందుకే నిరాశా, నిస్పృహల నుండి బయటపడి ఇప్పుడు పోరాట మార్గం పట్టారు. దాన్నే మనం ‘నీట్‌’ ఉద్యమ రూపంలోనూ ఇప్పుడు ‘సర్‌’ వ్యతిరేక పోరాటంలోనూ చూస్తున్నాం. మన దేశంలోనే కాదు ఫ్రాన్స్‌, సెర్బియా లాంటి యూరోపియన్‌ దేశాల్లో, మన ఇరుగు పొరుగు దేశాల్లోనూ అలాంటి పరిణామాల్నే చూస్తున్నాం.

నిరుద్యోగంలో ఆంధ్రాదే అగ్రస్థానం

దేశంలోనే నిరుద్యోగంలో మన రాష్ట్రం మొదటి లేదా రెండవ స్థానంలో ఉంది. జాతీయ స్థాయి నిరుద్యోగం రేటు 5.4 శాతం ఉంటే మన రాష్ట్రంలో 8.3 శాతం ఉంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాలతో సహా మన దేశంలోనూ నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరం యువతలో (జెన్‌-జి) నిస్పృహ పెరుగుతున్నది. పెట్టుబడిదారీ పోటీ ప్రపంచంలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసి మానవ శ్రమని తగ్గించుకుంటూ పోతుంటారు. ఏ.ఐ పరిణామ క్రమం కూడా అందులో భాగమే. దీనిని ఉద్యోగాల తొలగింపునకు ఉపయోగించొచ్చు లేదా ఉద్యోగాల నియామకానికి ఉపయోగించుకోవచ్చు. అది ఆయా దేశాల సామాజిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మనలాంటి దేశాల్లో ప్రభుత్వ రంగం బలహీనపడి ప్రైవేటు రంగం విస్తరిస్తున్న దశలో లాభాలే పరమావధిగా మానవ (శారీరక, బౌద్ధిక) శ్రమను దోచుకుంటున్నారు. ప్రభుత్వ విధానాలు, లేబర్‌ కోడ్స్‌ దీనికోసమే రూపొందించబడ్డాయి. సామూహిక బేరసారాలాడకుండా ఎవరికి వారు వారి జీతభత్యాల గురించి ఆలోచించే విధంగా ఉద్యోగ విధానాల్లో మార్పు తీసుకువచ్చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, డైలీ వేజ్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ వగైరావన్నీ ఇలాంటివే. ఏ ఉద్యోగమూ దొరకనివారు స్విగ్గీ, ఓలా లాంటి గిగ్‌ లేదా ప్లాట్‌ఫాం తరహా అస్థిరమైన వివిధ రకాల పనులు చేస్తున్నారు. క్రమంగా వాటికి కూడా డిమాండు పెరిగి నిరుద్యోగులు పోటీ పడుతుండడంతో హీనమైన వేతనాలకు కూడా గొడ్డుచాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీలు, మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

ఉద్యోగాలు కాదు భ్రమలు సృష్టిస్తున్నారు

యువతరంలో వస్తున్న ఈ అసంతృప్తిని పాలకవర్గాలు ఉపయోగించుకొని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ అధికారాన్ని కేంద్రీకరించుకుంటున్నాయి. అవిగో ఉద్యోగాలు, ఇదిగో ఉపాధి అంటూ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలిస్తామని భ్రమలు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్‌ విద్యాశాఖా మంత్రిగా రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు మరింతగా పెరిగాయి. కానీ ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రకటనలు, ప్రణాళికలు తప్ప ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఎం.ఒ.యు లు తప్ప పెద్దగా పెట్టుబడులూ వచ్చింది లేదు. ఇండస్ట్రియల్ పార్కులు, కారిడార్‌లు అంటూ దీర్ఘకాలిక ప్రణాళికలతో రోజూ మోత మోగిస్తున్నారు తప్ప అవి ఎప్పటికి వాస్తవ రూపం ధరిస్తాయో ఎవరూ చెప్పలేకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ఆఫర్‌లు ఇస్తున్నా భూములు, సబ్సిడీలు, రుణాలు తీసుకుంటున్నారు తప్ప పరిశ్రమలు పెట్టడం లేదు. తాజాగా హెచ్‌.పి కంపెనీ ఎస్‌.ఇ.జెడ్‌ నుండి ఉపసంహరించుకున్నది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సరైన ప్రోత్సాహం లేక మూత పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు రూ.5 వేల కోట్లు 4 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, నూలుమిల్లులు, డెయిరీలు మూత పడుతున్నాయి. టెక్స్‌టైల్స్‌ సంక్షోభంలో ఉంది. ఫలితంగా నిరుద్యోగం మరింత ఎక్కువగా పెరుగుతున్నది. రాష్ట్రంలో 29 చక్కెర ఫ్యాక్టరీలుండగా అందులో 27 మూతపడి 2 మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో మరొకటి ఎప్పుడైనా మూతపడొచ్చు. వీటిల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇప్పటికీ సరైన పరిహారం అందలేదు.

కాలుష్యంతోనే ఎల్‌నినో

భారతదేశం డంప్‌ యార్డుగా మారుతున్నది. ఉపాధి కల్పించలేని డేటా సెంటర్లకు పెద్దపీట వేస్తున్నదీ ప్రభుత్వం. ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమలు పెట్టి మన భూములు, విలువైన, అరుదైన ఖనిజాలు, నీరు, గాలి, సూర్యరశ్మి వగైరా సహజ వనరులను కార్పొరేట్‌ కంపెనీలు కొల్లగొడుతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి ఎనలేని ముప్పు ఏర్పడుతోంది. దాని దుష్ఫలితమే ఎల్‌నినో. వర్షాలు లేవు. పంటలు పండలేదు. కాన్సర్‌, కిడ్నీ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. మురుగు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. చిన్నపాటి వర్షాలు వచ్చినా పట్టణాలు మునిగిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు ముసురుకుంటున్నాయి. నదులు పారిశ్రామిక కాలుష్యంతో నిండిపోతున్నాయి. మంచినీరు దొరక్క కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మానవజాతి మనుగడకు నేడు పర్యావరణ పరిరక్షణ ముఖ్యమైన ఎజెండాగా మారింది. అందుకే డేటా సెంటర్లు, అణు విద్యుత్‌ కేంద్రాలు, రసాయన పరిశ్రమలకు వ్యతిరేకత పెరుగుతోంది.

ఆదాయ వ్యత్యాసాలే అసలు సమస్య

ఉన్న పరిశ్రమలు మూతపడడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, సర్వీసు రంగం వెనకబడడం, వ్యవసాయ సంక్షోభం తదితర కారణాలతో ప్రజలకొచ్చే ఆదాయ వనరులు బాగా తగ్గిపోయాయి. వేతనాలు పెరగడం లేదు. కొనుగోలు శక్తి పడిపోయింది. ఇంకోవైపు ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు సంక్షోభంలో పడింది. గ్రామీణ ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటి వరకు మార్కెట్‌ విస్తరణకు ఆలంబనగా ఉన్న గ్రామీణ ప్రాంతాలో ఆదాయాలు తగ్గి సంక్షోభంలో పడ్డాయి. వ్యవసాయోత్పత్తి దెబ్బ తినడంతో ఆహార ఉత్పత్తులను బ్లాక్‌ మార్కెట్‌కి తరలించి పెద్ద ఎత్తున నిల్వ చేసుకొని ఒక్కసారిగా ధరలు పెంచేస్తున్నారు. గత రెండు మాసాల్లోనే 50 శాతం ధరలు పెరిగాయి. ప్రాజెక్టుల కింద వరి విస్తీర్ణం తగ్గడంతో బియ్యం ధరలు కొండెక్కాయి. రెండు మాసాల క్రితం కిలో రూ.45 ఉన్న ఫైన్‌ వెరైటీ ఇప్పుడు రూ.65, సోనా రూ.70, ఫైన్‌ వెరైటీ రూ.80, సూపర్‌ ఫైన్‌ రూ.100 కు చేరుకుంది. ఉల్లిపాయలు 100 శాతం పెరిగాయి. పాలు, చక్కెర, నూనె, చింతపండు, పప్పులు, సబ్బులు వగైరా నిత్య జీవితావసరాలన్నీ అమాంతం పెరిగిపోయాయి. మందుల ధరలు పెరిగాయి. షుగర్‌, బిపి వ్యాధిగ్రస్తుల బడ్జెట్‌ పెరిగింది. ఆరు మాసాల క్రితం 4.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు నేడు 6.7 శాతానికి పెరిగింది. అంటే 50 శాతం ద్రవ్యోల్బణం రేటు పెరగడం అసాధారణమైన విషయం. ప్రజల ఆదాయాలు తగ్గి ధరలు పెరగడం వల్ల నిత్యావసరాలు కుదించుకోలేక అప్పులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు దీనిని భరించలేక పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ఇంతకు ముందు రైతు ఆత్మహత్యలే చూశాము. ఇప్పుడు చిన్న వ్యాపారుల, మధ్యతరగతి ప్రజల ఆత్మహత్యలు కూడా చూస్తున్నాము. అటు ర్యాంకుల కోసం ప్రైవేటు విద్యాలయాలు ఇటు తల్లిదండ్రులు ఒత్తిడి భరించలేక జీవితంపై విరక్తితో విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామం ఒక సామాజిక సమస్యగా మారింది.

ఉరకలెత్తుతున్న జెన్‌-జి చైతన్యం

ఈ స్థితిలో కొత్త తరం జెన్‌-జి ఆకాశం నుండి భూమికి దిగుతున్నది. రానున్న నవతరం (జెన్‌-ఆల్ఫా) కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నది. ఈ అసమ్మతి నుండే సిజెపి ఆవిర్భవించింది. విద్యార్థి సంఘాల నుండి సమరశీల నాయకత్వం ముందుకొచ్చింది. కొత్త తరంలో వస్తున్న చైతన్యాన్ని దెబ్బకొట్టి వారిని నిరాయుధుల్ని చేయడానికి ఓటు హక్కును లాగేసుకుంటున్నారు. ‘సర్‌’ పేరుతో జరుగుతున్న తతంగంలో మైనారిటీలు, వలస కూలీలే కాదు...కొత్త తరం ఓటర్లు సైతం తొలగించబడుతున్నారు. కర్ణాటకలో తాజాగా 64 లక్షల మంది ఓటర్లను తొలగిస్తే అందులో 38 లక్షల మంది 30 సంవత్సరాల లోపు వారు కావడం గమనార్హం. మన రాష్ట్రంలో ఇంత వరకు లెక్కలే ప్రకటించలేదు. యువతరంలో వస్తున్న అసమ్మతిని భరించలేని మోడీ, చంద్రబాబు డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఆందోళనలపై బుల్డోజర్లు తోలుతున్నది.

ఒకవైపు నిర్బంధం మరోవైపు మనువాద, మతోన్మాద భావజాలంతో యువతరాన్ని బ్రెయిన్‌ వాష్‌ చేయడానికి మోడీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయి. కేంద్రానికి లొంగిపోయిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు కూడా వీరికి భజన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం విజయవంతమైనా, ‘నీట్‌’ వ్యతిరేక పోరాటం ద్వారా ధర్మేంధ్ర ప్రధాన్‌ రాజీనామా చేసినా, ప్రస్తుత ‘సర్‌’ వ్యవహారంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలిస్తున్నా ప్రజా ఉద్యమాల ఒత్తిడి ఫలితమే. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి యువతే కాకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబాల్లోని యువతీ, యువకులు కూడా ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. ప్రభుత్వ నిర్బంధాలు, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ లాంటి భయాల నుండి బయటపడుతున్నారు. ధైర్యంగా ఉద్యమిస్తున్న యువ తరానికి కార్మిక, కర్షక తదితర కష్టజీవుల నుండి సంఘీభావం వ్యక్తమవుతున్నది. అనేకమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఉద్యమాల్లోకి పంపడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇదొక కొత్త పరిణామం. గత 35 సంవత్సరాల్లో రాజకీయ రహితం కావించబడ్డ తరానికి భిన్నమైన కొత్త తరం కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నది. ఈ మార్పును ముందుకు తీసుకుపోవడమే నేడు ప్రగతిశీల శక్తుల ముందున్న కర్తవ్యం.

vsr.jpg copy.jpg

వ్యాసకర్త : వి. శ్రీనివాసరావు
సిపియం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్