"ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే, అది మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే విద్యాలయమే" అంటారో విద్యావేత్త. అయితే, అక్షరాల వెలుగులు విరజిమ్మాల్సిన తరగతి గదుల్లో ఇప్పుడు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పిల్లల నవ్వులతో ప్రతిధ్వనించాల్సిన పాఠశాల ప్రాంగణాలు ఆక్రందనలతో దద్దరిల్లుతున్నాయి. పాఠశాల అంటే పిల్లలకు అక్షరాలు నేర్పించే చోటు మాత్రమే కాదు. భయంలేని బాల్యానికి, స్వేచ్ఛగా ఆలోచించే మనస్తత్వానికి, సమాజాన్ని అర్థం చేసుకునే చైతన్యానికి పునాది. అమ్మ ఒడి అంత సురక్షితంగా ఉండాల్సిన విద్యాలయాలు నేడు అభద్రతా వలయాలుగా మారుతుండటం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో పాఠశాల గుమ్మంలో వదిలి వెళ్తారు. కానీ ఆ పాఠశాల ప్రాంగణంలోనే ప్రాణాలకు ముప్పు ఏర్పడితే? తరగతి గదిలో పాఠం వినాల్సిన విద్యార్థులు… తమ కళ్ల ముందే రక్తపుటేరులు చూస్తే? చదువుకోవాల్సిన వయసులో ప్రాణ భయంతో వణికిపోతే? ఇంతకంటే విషాదం మరొకటి ఉంటుందా? బడులకూ భద్రత కరువైతే.. బాల్యం ఎక్కడ స్వేచ్ఛగా మనగలుగుతుంది? నిర్భయంగా ఆలోచించగలిగే, భయం లేని వాతావరణంలోనే నిజమైన విద్య సాధ్యమవుతుంది. విద్యాలయాలు భయానికి నిలయాలు కాకూడదు.. భవిష్యత్తుకు భరోసా కావాలి!
ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తరగతులు జరుగుతున్న సమయంలోనే ఓ యువకుడు ఏకంగా ఎలక్ట్రిక్ రంపంతో పాఠశాలలోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేయడం భద్రతా వైఫల్యానికి పరాకాష్ఠ. బయటి వ్యక్తి మారణాయుధంతో నేరుగా తరగతి గదిలోకి ప్రవేశించాడంటే, ఆ పాఠశాలలో భద్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. హర్యానాలోని పంచకుల జిల్లాలో ఒక పాఠశాలలో ఆరేళ్ల వికలాంగ చిన్నారిపై ఎనిమిదేళ్ల బాలుడు దాడి చేయడం, పాఠశాల సమయం ముగియకముందే ప్రిన్సిపాల్ వెళ్లిపోవడం, సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వంటి ఆరోపణలు యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. అంతకుముందు పూణెలో సోషల్ మీడియా వీడియోల వివాదంతో తొమ్మిదో తరగతి విద్యార్థి ఒక బాలికను కత్తితో పొడిచిన ఘటన మరువక ముందే ఈ వరుస దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేసే సమాజం తన భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టుకున్నట్లు అవుతుంది’ అంటారు నెల్సన్ మండేలా. దేశవ్యాప్తంగా అనేకచోట్ల జరుగుతున్న ఈ ఘటనలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలలకు ప్రహరీ గోడలు ఉన్నంత మాత్రాన భద్రత ఉన్నట్లు కాదు. ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులపై పర్యవేక్షణ ఉందా? వంటి అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టాలి. యునెస్కో నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 24.6 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు; మన విద్యా వ్యవస్థలో పొంచి ఉన్న ప్రమాదానికి నిదర్శనాలు. అందుకే అంటారు నోబెల్ పురస్కార గ్రహీత మలాలా-‘ప్రతి పాఠశాల కేవలం అక్షరాలు నేర్పే కేంద్రంగానే కాకుండా, ప్రతి బిడ్డకు కవచంలా నిలిచే సురక్షిత ఆలయంగా ఉండాలి’ అని.
విద్యార్థులకు రక్షణ కల్పించలేని పాఠశాల తన ప్రాథమిక బాధ్యతలో విఫలమైనట్లే! ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు తక్షణమే మేల్కొని ప్రతి పాఠశాలలో కఠినమైన భద్రతా ఆడిట్ నిర్వహించాలి. ప్రహరీ గోడలు, సీసీ టీవీ కెమెరాలను తప్పనిసరి చేయాలి. అదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా విస్మరించలేం. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడటం, వారి ఆలోచనలు, ఆందోళనలు తెలుసుకోవడం, వారికి ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకోవడంలో ప్రతి కుటుంబం భాగం కావాలి. పిల్లలు చెప్పే చిన్న ఫిర్యాదులను సైతం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా బాలికల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. బాలికలను వేధించడం, వెంటపడటం, ప్రేమ పేరుతో ఒత్తిడి చేయడం, దాడులకు తెగబడటం వంటి ధోరణులను మొదట్లోనే గుర్తించాలి. బాలికలు తమకు ఎదురవుతున్న వేధింపుల గురించి నిర్భయంగా ఫిర్యాదు చేయగల వాతావరణాన్ని పాఠశాలల్లో కల్పించాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ తగిన చర్యలు తీసుకోవాలి. ‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో/ ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో/ - ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు’ అంటారు టాగూర్. మన విద్యాలయాలు అలాంటి విజ్ఞాన మందిరాలుగా ఈ దేశం మార్పు చెందాలి.








కామెంట్లు (0)