బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రంప్‌ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !

16 గంటల క్రితం

America2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

అరవై రోజుల పాటు దాడుల విరమణకు ఒప్పందం చేసుకొని శాశ్వత అవగాహనకు రావాలని నిర్ణయించిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు ఉల్లంఘనకు పాల్పడ్డాడు. జులై నెలలో పదమూడు రోజుల పాటు ఇరాన్‌పై భీకరదాడులు జరిపాడు. శుక్రవారం నుంచి నిలిపివేశాడు. ఇరాన్‌తో '' మంచి స్నేహపూర్వక మాటలు '' మాట్లాడుతున్నట్లు సోమవారం చెప్పాడు. అయితే సంప్రదింపులు దీర్ఘకాలం సాగటం తనకు ఇష్టం లేదన్నాడు. పోరు నుంచి బయట పడేందుకు అమెరికా నానా తిప్పలు పడుతోందని టెహ్రాన్ వ్యాఖ్యానించింది.

ఇరాన్‌ మీద దాడులు ఆపకూడదు, కొనసాగించాలంటూ ఒత్తిడి తెస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు మంగళవారం అమెరికా పర్యటనకు వచ్చాడు. ఈ పర్యటన ఖరారైన తరువాతే దాడులకు అమెరికా విరామం ఇచ్చింది. ట్రంప్‌ ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాడు. ఇంక మాటల్లేవ్‌ చేతలే సమాధానం అన్నాడు. సలహాదారుల నివేదికల తరువాత గురువారం నుంచే ట్రంప్‌ వైఖరిలో మార్పు వచ్చి శుక్రవారం నుంచి దాడులు ఆపివేయించాడు. ఎందుకంటే చర్చలకు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. చర్చించేదేమీ లేదు, అమెరికా ఎన్ని రోజులు దాడులు ఆపితే మేం కూడా అదే విధంగా స్పందిస్తామని ఇరాన్‌ కూడా ప్రకటించింది.

అయితే వాషింగ్టన్‌ మరోసారి ఎందుకు దాడులకు తెగబడింది! తిరిగి చర్చలంటూ ఎందుకు నిలిపివేసిందన్నదే అసలు సమస్య. ఇరాన్‌ చేస్తున్నది ఆత్మరక్షణ, ఎదురుదాడులు తప్ప మరొకటి కాదు గనుక అది ఎందుకు ఆపిందో అందరికీ విదితమే. అమెరికాకు ఏమైంది! వస్తున్న వార్తలను బట్టి తగులుతున్న దెబ్బలే అని చెప్పవచ్చు. టెహ్రాన్ మీద ఎన్ని దాడులు చేసినా చేతి చమురు వదలటం తప్ప సాధించేదేమీ లేదని పెంటగాన్‌ అధికారులు కుండబద్దలు కొట్టి చెబుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు మిలిటరీ సిబ్బంది మరణాలు, గాయపడిన వారి సంఖ్య పెరగటం, గల్ఫ్‌ దేశాలు తెస్తున్న ఒత్తిడి కూడా ట్రంప్‌కు ఏం చేయాలో దిక్కుతోచకుండా చేస్తున్నాయి. జులై నెలలో జరిగిన దాడుల్లో దాదాపు వంద మంది గాయపడ్డారని వారిలో ఒక్క జోర్డాన్‌ సైనిక స్థావరాల్లోనే 50 మంది ఉన్నట్లు అధికారి చెప్పాడట. మువాఫాక్‌ సాల్టీ వైమానిక స్థావరంలో ముగ్గురు సైనికులు మరణించారు. కేవలం ఆరునెలల క్రితమే పని చేయటం ప్రారంభించిన కువైట్‌లోని అహ్మద్‌ అల్‌ జబర్‌ వైమానిక స్థావర రాడార్‌ వ్యవస్థ నాశనమైంది. ఇలా అనేక చోట్ల అమెరికా నష్టపోయినట్లు వార్తలు. సమాచారాన్ని దాచిపెడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో రక్షణ శాఖ సమాచార వ్యవస్థలో శుక్రవారం నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం అంతకు ముందువారంలో అదనంగా 140 మంది సైనికులు గాయపడినట్లు, నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. రక్షణశాఖ మీడియాకు అందచేస్తున్న వివరాలు, డిసిఎఎస్‌ (మిలిటరీ మరణాల విశ్లేషణ వ్యవస్థ) లో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్యను తగ్గించి చూపుతున్నారని దీనికి కారణాలు ఏమిటని పార్లమెంట్‌లోని సెనెట్‌ సాయుధ దళాల కమిటీలోని 12 మంది ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌కు ఒక లేఖ రాశారు. సమాచారానికి సంబంధించి తాత్కాలికంగా తలెత్తిన సమస్యల కారణంగా డిసిఎఎస్‌ వెబ్‌సైట్‌లో తేడాలు కనిపిస్తున్నాయని రక్షణ శాఖ మీడియా ప్రతినిధి జోయల్‌ వాల్‌డెజ్‌ సమర్ధించుకున్నాడు.

అధ్యక్షుడికి ఉన్న అసాధారణ అధికారాల ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా 60 రోజుల పాటు మిలిటరీ చర్యకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ విధంగా ఫిబ్రవరి 28 నాటి ఆదేశాలు మే ఒకటో తేదీతో ముగిశాయి. దీన్ని సాకుగా చూపి మరోసారి కొత్తగా ఆదేశాలు జారీ చేసినట్లు, దానికీ దీనికీ సంబంధం లేదని ట్రంప్‌ యంత్రాంగం భాష్యం చెబుతోంది. ట్రంప్‌ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని అధికార, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు కొందరు విమర్శించారు. ఇరాన్‌పై దాడుల ప్రభావం పరిమితమే, ఇంతకు మించి చేసేదేమీ లేదని, ఆయుధాలు కూడా నిండుకుంటున్నాయని అమెరికా ఉన్నత మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడుల ప్రభావానికి పరిమితులు ఏర్పడ్డాయని, హర్మూజ్‌ ప్రాంతంలో ప్రత్యేకించి వైమానిక దాడుల కొనసాగింపు వల్ల ఫలితం లేదని మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ అధికారి అడ్మిరల్‌ బ్రాడ్లే కూపర్‌ సిఫార్సు చేసినట్లు ఆదివారం వార్తలు వచ్చాయి. ట్రంప్‌ పౌర, మిలిటరీ సలహాదారులు కూడా దీన్ని బలపరిచినట్లు చెబుతున్న కారణంగానే ట్రంప్‌ దాడులు నిలిపివేయించాడు. రెండు వారాల దాడుల తరువాత నౌకల మీద దాడి చేసే శక్తిని ఇరాన్‌ కోల్పోయిందని అందువలన దాని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం లేదని కూపర్‌ నివేదించినట్లు చెబుతున్నారు. జాయింట్‌ చీఫ్స్ ఆఫ్‌ స్టాఫ్ చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కేన్ కూడా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌, ట్రంప్‌తో మాట్లాడుతూ ఇరాన్‌ వైపు నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకొనే పేట్రియాట్‌, తోమహాక్‌ క్షిపణుల వంటి వాయు రక్షణ ఆయుధాలకు కొరత ఏర్పడితే అమెరికా సైనికులు, ఆ ప్రాంతంలోని మద్దతుదారులైన గల్ఫ్‌ దేశాలను రక్షించటం కష్టం అవుతుందని చెప్పారని సమాచారం. కేన్ హెచ్చరికల గురించి సాక్షాత్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే ప్రకటించింది. దాని మీద వివరణ కోరగా అధ్యక్షుడికి ఇచ్చిన సలహా రహస్యం గనుక వ్యాఖ్యానించేది లేదని అధికార ప్రతినిధి స్పందించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులు జరుపుతారా అన్న ప్రశ్నకు ఒక టీవీ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి మైక్‌ వాల్జ్‌ మాట్లాడుతూ దాని గురించి తాను ఎక్కువగా చెప్పలేనని, అధ్యక్షుడి ముందు అన్ని ప్రతిపాదనలూ ఉన్నాయన్నాడు. అధికారికంగా ధృవీకరించనప్పటికీ తెర వెనుక అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో సంబంధాల్లో ఉన్నారు. మరోవైపు హర్మూజ్‌ జలసంధిపై అదుపు తమదేనని, రాకపోకలు సాగించే నౌకలు పన్ను చెల్లించాలని కోరుతున్న ఇరాన్‌ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఒప్పందం చేసుకొనేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందని తాను అనుకోవటం లేదని అయితే తాను వింటానని వైట్‌ హౌస్‌ విలేకర్ల విందులో ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అణు, క్షిపణుల నియంత్రణ మీద కేంద్రీకరించాలని ఇజ్రాయిల్‌ ఒత్తిడి చేస్తుండగా తమకు హర్మూజ్‌ జలసంధిని తెరిపించటమే ముఖ్యమని అమెరికా చెబుతోంది. మరోవైపున బ్రిటన్‌ నూతన ప్రధాని ఆండీ బర్న్ హామ్ అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి జలసంధిలో నౌకల రక్షణకు సంబంధించి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ఇరాన్‌పై దాడులు చేసేందుకు తమ వైమానిక స్థావరాన్ని వినియోగించుకొనేందుకు ఇప్పటివరకు అమెరికాకు బ్రిటన్‌ అనుమతి ఇవ్వలేదు.

గత నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ ను దెబ్బతీసి తమ అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా చేయని యత్నం లేదు. దానికి గల్ఫ్‌ దేశాలు, ఐరోపాలోని పెద్ద దేశాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి. తమ మిలిటరీ శక్తి, ఆంక్షలు, ఒంటరిపాటుతో టెహ్రాన్ పై పట్టు సాధించాలన్న అమెరికా పథకం పారలేదు. ఇటీవలి దాడులతో దాని బలహీనతలు ఏమిటో ప్రపంచానికి వెల్లడయ్యాయి. అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్‌ దాడులతో తమ పౌరులు, ఆస్తులు కూడా ప్రభావితం అవుతున్నప్పటికీ ఏ ఒక్క గల్ఫ్‌ దేశమూ యుద్ధంలోకి దిగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సాగించిన అన్ని దుర్మార్గ చర్యలకూ మద్దతు లేదా స్వయంగా భాగస్వాములైన ఐరోపా, ఇతర మిత్రదేశాలు కూడా తాజా పరిణామాల్లో అమెరికాకు బాసటగా నిలిచేందుకు నిరాకరించటం ఒక పెద్ద పరిణామం. రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే !

mkr

ఎం. కోటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్