రాజకీయ పార్టీల నాయకుల, సినీ హీరోల కుటుంబాల్లోని మహిళలపై సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరమైన చర్చలు, ట్రోలింగ్స్ మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతుండడం ఆందోళనకరం. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది మహిళలు సోషల్ మీడియా ట్రోలింగ్ దాడులకు గురయ్యారు. పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో భర్త, తండ్రి ప్రాణాలను కోల్పోయిన మహిళలతో పాటు, సైనిక అధికారులు, రక్షణ శాఖ కుటుంబ సభ్యుల వరకు కాషాయ మూకల ట్రోలింగ్‌కు గురయ్యారు. ప్రముఖ రచయిత్రి స్వాతి చతుర్వేది రచించిన 'నేనొక అంతర్జాల పోకిరిని' పుస్తకంలో 'ఆన్లైన్లో కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దూషించడం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడం యాదృచ్ఛికంగా జరిగేవి కావు, వాటి వెనుక వ్యవస్థీకృత యంత్రాంగం ఉంది' అని పేర్కొన్నారు. మనువాద సిద్ధాంతం ఆధారంగా మహిళల వ్యక్తిత్వాన్ని, వారి స్వతంత్రతను గుర్తించకపోవడం కేంద్ర పాలకులు నమ్ముతున్న మనువాద సిద్ధాంతంలో భాగం. ప్రత్యర్థులకు చెందిన మహిళల మాన, ప్రాణాలను హరించడం ద్వారా ఆర్థిక, సామాజిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడం భూస్వామ్య సమాజ లక్షణం. ఆ భావజాలం నేటి పాలకులకు తల నిండుగా ఉంది. నోటితో మహిళా సాధికారికత గురించి మాట్లాడడం, ఆచరణలో వారి ఆత్మగౌరవాన్ని కించపరచడం నిత్యకృత్యమైంది. సిద్ధాంతాలు, విధానాలు, పాలనా లోపాలపై జరగాల్సిన రాజకీయ చర్చలు మహిళల ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరగడం సమాజాభివృద్ధికే పెద్ద ఆటంకం. కేంద్ర సహవాసంతో ఈ వికృత సంస్కృతి మన రాష్ట్రానికి వ్యాపించింది. దీన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద ప్రమాదంగా మారుతుంది.
మహిళలను కించపరచడమే లక్ష్యంగా
రాజకీయాలు వ్యాపారంగా మారేకొద్దీ సిద్ధాంతాలు, విలువలు కనుమరుగవుతున్నాయి. విధానపరమైన అంశాల ఆధారంగా ప్రజల విశ్వాసాన్ని పొందడం కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా, వారి కుటుంబ సభ్యులను ముఖ్యంగా తల్లులు, భార్యలు, కుమార్తెలను వివాదాల్లోకి లాగడం ద్వారా ఎదుటి పక్షాన్ని దెబ్బ కొట్టాలనే నీచ మనస్తత్వం మన రాష్ట్రంలో పెరుగుతున్నది. వ్యక్తిగత దూషణలతో ప్రారంభమై, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్ట్రాలు దాటి ఎక్స్ 'స్పేసెస్' ద్వారా మహిళలను ఇష్టారీతిన దూషించే స్థాయికి చేరుకున్నాయి. నకిలీ ఖాతాల నుంచి మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ద్వారా మహిళలను వేధించడం నిత్యకృత్యమైంది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని మహిళా రాజకీయ నాయకులు ఆన్లైన్లో తీవ్రమైన లైంగిక వేధింపులను, కుల మత ఆధారిత దూషణలను ఎదుర్కొంటున్నారని ప్రకటించింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు, చరిత్రకారులు, ప్రొఫెసర్లు, సినీ తారలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్యంగా మహిళలు ఈ తరహా దాడికి నిత్యం గురవుతూనే వున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో (మార్చి నుండి మే మధ్య) 95 మంది భారతీయ మహిళా రాజకీయ నాయకులను ఉద్దేశించి వచ్చిన 1,14,716 ట్వీట్లను విశ్లేషించగా, ప్రతి 7 ట్వీట్లలో ఒకటి (13.8 శాతం ) అసభ్యకరమైనవిగా వున్నట్లు తేలింది. ఒక మహిళా నేతకు సగటున రోజుకు 113 అసభ్యకరమైన ట్వీట్లు వచ్చినట్లు ఈ నివేదిక పేర్కొంది. మహిళలను అవమానపరిచే ట్వీట్లలో ప్రతి 5 ట్వీట్లలో ఒకటి నేరుగా వారి లింగం, శరీరాకృతి లేదా వ్యక్తిగత జీవితాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అలాగే మతపరమైన వేధింపులు ముఖ్యంగా ముస్లిం మహిళా రాజకీయ నాయకుల్లో 94.1 శాతం మంది మతపరమైన దూషణలకు గురయ్యారు. అణగారిన కులాలకు చెందిన మహిళా నేతలపై ఇతర కులాల నేతలతో పోలిస్తే 59 శాతం కంటే ఎక్కువగా కులపరమైన దూషణలు, అవమానాలు జరిగాయి.
2026 భారత పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం మహిళపై సైబర్ నేరాలు 239 శాతం పెరిగాయి. ఇందులో డీప్ ఫేక్‌లు, ఆన్లైన్ వేధింపులు ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు పెద్ద సవాలుగా మారాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్లైన్ వేధింపులు, వ్యక్తిత్వ హననం కారణంగా భారత దేశంలో సుమారు 38 శాతం మంది మహిళలు ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉంటున్నారని నివేదిక పేర్కొంది. రాజకీయాల్లోకి కొత్తగా రావాలనుకునే మహిళలను ఈ ట్రోలింగ్స్ తీవ్రంగా నిరుత్సాహ పరుస్తున్నాయి.
చట్టసభల్లో అతి తక్కువ మహిళా ప్రాతినిధ్యం
స్వాతంత్య్రానంతరం మహిళలకు ఆధునిక విద్య, వివిధ వృత్తుల్లోకి ప్రవేశం లాంటివి రావడంతో అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో వీరి పాత్రను పాలక పార్టీలు విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే గత రెండు దశాబ్దాలుగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పథకాలను రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మహిళలను అత్యంత నమ్మకమైన ఓటర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. జనాభాలో సగ భాగంగా వున్న మహిళలు చట్టసభల్లో అతి తక్కువగా ఉంటున్నారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికలలో 48.09 శాతం వుండగా, 2024 నాటికి 48.6 శాతానికి పెరిగింది. ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక ప్రకారం 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన మొత్తం 51,708 మంది అభ్యర్థుల్లో కేవలం 5,095 (10 శాతం) మంది మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,666 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలలో కేవలం 464 మంది (10 శాతం) మాత్రమే మహిళలు ఉన్నారు. 2025 సెప్టెంబరు నాటికి వున్న 4,664 మంది పురుష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో 855 మంది అంటే 18 శాతం మంది వంశపారంపర్యంగా పదవుల్లోకి రాగా, 539 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో 251 మంది అంటే 47 శాతం మంది వారసత్వ కుటుంబాల నుండి వచ్చారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో వంశ పారంపర్య ప్రాతినిధ్యం రెండింతల కంటే ఎక్కువగా ఉంది.
ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం మహిళల శక్తిసామర్థ్యాలు, లింగ సమానత పట్ల తరాల నాటి నుండి వున్న తేలిక భావం. మరో ప్రధాన అంశం మహిళల భద్రత. రాజకీయ పార్టీలలో మహిళల భద్రత విషయంలో నమ్మకం లేకపోవడం వల్ల, ఎలాంటి రాజకీయ అనుబంధం లేని అర్హతగల మహిళలు రాజకీయాల్లో చేరడానికి వెనుకాడతున్నారు. ''రాజకీయాల్లో మహిళలపై హింస'' పై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం జరిపిన అధ్యయనం భారత దేశంలో భౌతిక, మానసిక హింస మహిళలు రాజకీయాల్లో చేరాలనే సంకల్పాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొంది. 2013లో వచ్చిన లైంగిక వేధింపుల నిరోధక, నిషేధ నివారణ చట్టం ప్రకారం 10 అంతకంటే ఎక్కువ మంది మహిళలు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రధాన రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి మినహాయింపు పొందడంలోనే వీరి ద్వంద్వ స్వభావం స్పష్టమవుతుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సిపిఎం తప్ప ఏ పార్టీ ఇలాంటి అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయలేదని మహిళా కమిషన్ ప్రకటన గమనార్హం.
మహిళలను కించపరిచే ధోరణి ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు, రాజకీయ లబ్ధి కోసం పాలక పార్టీలన్నీ ఇలాగే వ్రవరిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన మహిళలను నీచంగా మాట్లాడడాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన వారే, తమ కుటుంబ సభ్యులపై ఇలాంటి దాడి జరిగినప్పుడు గగ్గోలు పెడుతున్నారు. మహిళలపై వికృత దాడులకు తెగబడుతున్న వారిని రాజకీయాల నుండి బహిష్కరించడం ద్వారా తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. మహిళల హక్కులు, వారి వ్యక్తిత్వంపై జరుగుతున్న నీచమైన దాడులను యువతతో పాటు ప్రజాతంత్రవాదుల తీవ్రంగా నిరసించాలి. పాలక పార్టీల ద్వంద్వ స్వభావాన్ని ప్రజల్లో ఎప్పటికప్పుడు బట్టబయలు చేయడం ద్వారానే మహిళల గౌరవాన్ని, రాజకీయాల్లో వారి పాత్రను కాపాడుకోగలం.
-వి. రాంభూపాల్








కామెంట్లు (0)