గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజయ్‌ సావాస ‌సాహసం ​

15 గంటల క్రితం

Vijay’s Daring Adventure
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 05:03 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటివాడివో చెబుతానని సామెత. మదురై తిరుప్పరంకుండ్రం కొండ పైన నిన్న వెలిగిన దీపం చూశాక తమిళనాడులో దీన్ని ఇప్పుడు ఎక్కువగా చెబుతున్నారు. ఈ కొండపైన దీప మంటపం దగ్గర కార్తీక దీపం వెలిగించడం దశాబ్దాలుగా జరుగుతున్నది. దీపధూన్ అనే రాతిస్తంభంపై వెలిగించాలనేది హిందూత్వ శక్తుల వాదన. అక్కడ సికిందర్ దర్గా వుంది గనక మధ్యేమార్గంలో మంటపం దగ్గర వెలిగిస్తున్నారు. ఇప్పుడూ అదే చేశారు. కానీ ఇప్పుడు సనాతన రాజకీయం పెరిగాక మసీదు వివాదంతో నిమిత్తం లేకుండా అక్కడే దీపం పెట్టాలని హడావుడి ప్రారంభించింది సంఘ్‌ ‌పరివార్‌ ‌హిందూత్వ బ్రిగేడ్‌. పదే పదే కేసులు వేసింది. మళ్లీ మళ్లీ పేచీలు పెట్టింది. మదురై బెంచిలో వున్న జస్టిస్‌ ‌స్వామినాథన్‌ అందుకు అనుమతించడమేగాక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మధ్యనే ఈయన సిపిఎం ఎం.పి వెంకటేశన్ పైన కూడా నోరు పారేసుకుని చివాట్లు తిన్నారు. సరే మదురై ఆలయం విషయంలో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ లోగా డిఎంకె సర్కారు పోయి విజయ్‌ ‌టివికె సర్కారు ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ‌భాగస్వామిగా వుండగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బయిట నుంచి బలపరుస్తున్నాయి. కొండ మీద కొత్తగా దీపం వివాదం సరికాదని సర్కారు చెప్పినా వినిపించుకోకుండా ఒక్కసారికి మాత్రం అనుమతించాలని కోర్టు చెప్పింది. దీంతో సనాతన శిబిరం చెలరేగిపోయింది. కార్తీక మాసం పూజలూ దర్శనాలు అన్నీ సాగిపోతున్నాయి. అందుకోసం జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. దీన్ని హైకోర్టులో సవాలు చేయబోతే స్వీకరించలేదు. సాయంత్రం దీపం యథావిధిగా గతంలో వెలిగించే చోటనే వెలిగించారు తప్ప పరివార్‌ ఆందోళనకు తలొగ్గలేదు. ఇది కోర్టు ధిక్కారమని వారు గగ్గోలు పెట్టారు. విజయ్‌ ‌వామపక్ష లౌకిక శక్తులతో కలసి వున్నందువల్లనే ధైర్యంగా వ్యవహరించారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

అయితే, జిల్లా కలెక్టర్ ఈ రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, అందుకు దారితీసిన పరిస్థితులను వివరించారు. దీంతో కోర్టు కూడా తొందరపాటు చర్యలకు ఉపక్రమించబోమని స్పష్టం చేసింది.

స్వాముల ఫైటుకు వేళాయే....​

స్వాముల సేవకు వేళాయే అని వెనకటి పాట కాస్త మార్చి ఫైటుకు వేళాయె అని పాడుతున్నారు ఉత్తర ప్రదేశ్‌‌లో ఇద్దరు స్వాములు. ఒకరేమో ఘనమైన బాబా రాందేవ్‌. మరొకరు భాగేశ్వర్‌ ‌ధామ్‌ ‌స్వామి ధీరేంద్ర శాస్ర్తి. వీరిద్దరి ఫైటింగ్‌ ఇప్పుడు వేడి పుట్టిస్తున్నది. మొన్నటికి మొన్న కృష్ణుడి కన్నా రాముడే గొప్ప అని భాగేశ్వర్‌ ‌బాబా అనడం, దానిపై మండిపడాల్సిన బిజెపి నేతలు కూడా బలపర్చడం ఆసక్తి కలిగించింది. మరోవైపు ఇంకొంతమంది స్వాములు రాముడే గొప్ప అన్నారు. ఏతావాతా యు.పి రాజకీయాలను అయోధ్య రామ మందిరం అవినీతి వివాదంలో చిక్కింది గనక మధుర కృష్ణ మందిరం పైకి రాజకీయం మళ్లించే పథకమేదో నడుస్తున్నదని అందరూ అనుమానించారు. నిజంగానే ఈ లోగా సుప్రీంకోర్టు దానిపై విచారణ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా రాందేవ్‌ ‌బాబా భాగేశ్వర్‌ ‌బాబాలు ఒక సభా వేదికపై తలపడ్డారు. ఈ చిన్న బాబా వయస్సు మూడు పదులకు కాస్తే ఎక్కువట. ఈయన పైకి రావడం రాందేవులకు మింగుడు పడటం లేదు. దాంతో కావాలని ఈ పాత పంచాయితీ పైకి తీశారు. చిన్న బాబా వద్దంటున్నా వినకుండా దేవుళ్ల గొడవ తవ్వుతూ వెళ్లారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు బిజెపి సంతోషం కోసం కొత్త వివాదం పెంచడమేగాక తనకు పోటీగా పెరిగిపోతున్న ధీరేంద్ర స్వామిని తొక్కేయొచ్చన్న పాచిక కూడా ఇందులో వుంది మరి. ఇంతకూ అసలు బిజెపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథులే యోగులు కదా. ఇది తెలుసు గనకే అఖిలేష్‌ ‌యాదవ్‌ ఆయన మఠం వుండే గోరఖ్‌పూర్‌ ‌మఠం నుంచే రథయ్రాత మొదలెట్టారు. చెప్పాలంటే అటూ ఇటూ ఎవరి పాలిటిక్సు వారివే కదా...! యు.పి ఎన్నికల ప్రకటన నాటికి ఇలాంటి ప్రహసనాలు మరెన్ని చూస్తామో మరి.

మతములన్నిట మహిళా ద్వేషమేనయా!

మతాలన్నిటి మధ్యలో కామన్ పాయింట్ ఏదంటే మహిళా ద్వేషం అనొచ్చు. ఏ బట్టలు కట్టాలో, ఏ హద్దుల్లో వుండాలో శాసిస్తుంటాయి. ఉదాహరణకు గరికపాటి వారు మొన్ననే మత్తు పదార్థాలపైన మీటింగ్ లో మాట్లాడుతూ సమాన హక్కులంటూ మహిళలే ఎక్కువగా తాగుతున్నారని సెలవిచ్చారు. ఇదే బాపతుగా బీహార్ లో మజ్లీస్ ఎంఎల్ఎ అఖ్తరుల్ ఇమాన్ బురఖా వుండి తీరాలని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఆడాళ్ళు మరీ మొహం కనిపించేలా తిరుగుతున్నారని ఆయన ప్రసంగంలో చిందులు తొక్కిన వీడియో వైరలైపోయింది. ఇంతటితో ఆగక చాలా బూతులు వదిలారు. మగాళ్ల పౌరుషం చచ్చిపోయిందా? అలా తిరిగేది పందులేనంటూ పేలాడు. తమాషా ఏమంటే బిజెపి నేతలు ఈ వీడియోపై చాలా దాడి చేస్తున్నారు. ఈయన ఆఫ్ఘనిస్తాన్ పోవాలని వ్యాఖ్యానించారు. బానే వుంది గానీ వీళ్లు పిల్లలను కనడానికే పనికొస్తారని వాగిన బిజెపి మంత్రి మాటేంటి? ఛాందసం ఏ తరహాదైనా ఒకటే మరి.

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్