గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారత ప్రజలమైన మేము.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం..

15 గంటల క్రితం

indian constitution final.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 05:24 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగ పరిషత్ దాదాపు 3 సంవత్సరాల పాటు కృషి చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించింది. డా.బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది. భారతదేశంలో భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని కాపాడవలసిన బాధ్యత రాజ్యాంగంపై ఉన్నదని డా. అంబేద్కర్ అప్పుడే పేర్కొన్నారు. గత 77 ఏళ్లుగా దాదాపు 106 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికి భారతదేశ భిన్నత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడటంలో రాజ్యాంగం ముఖ్య పాత్ర పోషించింది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్ ఆ‌ఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరిస్తూ ఫెడరలిజం, సెక్యులరిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, చట్ట సమానత్వం మొదలైన వాటిని పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, రాజ్యాంగ లక్ష్యాలకు ప్రస్తుత పాలకుల నుండి ముప్పు ఏర్పడింది.

భారత ప్రజలమైన మేము...

భారత రాజ్యాంగ పీఠిక ‘‘భారత ప్రజలమైన మేము’’ అని ప్రారంభమౌతుంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను తెలుపుతుంది. పీఠిక భారత దేశాన్ని ‘‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర’’ రాజ్యంగా ప్రకటించింది. ప్రజలందరికీ ‘‘ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని’’ సమకూర్చాలని పేర్కొన్నది. పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించాలని, జాతీయ సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వం ఉండాలని పేర్కొన్నది. పీఠికలో చెప్పిన అంశాలు దేశ పాలనకు, ప్రభుత్వ విధానాలకు, చట్టాల రూపకల్పనకు దిశా నిర్దేశం చేసే మౌలిక విలువలు, లక్ష్యాలు. అందువలన డా. బి.ఆర్. అంబేద్కర్ రాజకీయ సమానత్వంతోపాటు ఆర్థిక, సామాజిక సమానత్వం కూడా సాధించాలని చెప్పారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష‍త కొనసాగుతున్నంత కాలం ప్రజాస్వామ్యం బలహీనంగానే ఉంటుందని ఆయన చెప్పారు. సమకాలీన భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ పీఠికలో చెప్పిన లక్ష్యాలను దెబ్బతీసేవిగా వున్నాయి. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉన్నది.

ఇటీవల మేఘాలయ యానివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ కా‌న్వొకేషన్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌ ‌భుయాన్‌ మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులందరినీ ‘‘భారత దేశ ప్రజలమైన మేము’’ అని సమానంగా సంబోధించిందని, కానీ ఇటీవల కొంతమంది ‘‘ మనం - వారు’’ అని మత పరంగా వేరు చేసే విధంగా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. భారతదేశం బహుళత్వాన్ని గౌరవించాలని తెలిపారు.

ఎలక్ష‍న్ కమిషన్ - ‘సర్’ ప్రక్రియ

ఇటీవల హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన నివేదికలో ఎన్నికల కమిషన్ భారతదేశంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించిన విధానం ఏకపక్ష‍ంగా, పారదర్శకత లేకుండా, లోపభూయిష్టంగా జరిగిందని, దీనివలన పేదలు, మహిళలు, మైనారిటీలు నష్టపోయారని పేర్కొన్నది. రాజ్యాంగంలోని 324వ నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ ఏర్పడి ఒక ప్రధాన ఎన్నికల అధికారి, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిచే నియమించబడతారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభలో ప్రతిపక్ష‍ నాయకుడితో కమిటీ ఏర్పడాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినది. 2023లో పార్లమెంట్ లో చేసిన చట్టం ద్వారా మోడీ ప్రభుత్వం దానిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రి, ప్రతిపక్ష‍ నాయకుడు అని మార్పు చేసింది. జాతీయ ఎన్నికల కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి స్థాయి నుండి కేంద్ర ప్రభుత్వ సంస్థగా మారిపోయింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా మారిపోయారు. భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రత కోల్పోయింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన కథనంలో రితిక చోప్రా చెప్పినట్లు ఎన్నికల కమిషనర్ లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్‌ జోషీలు 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ కు తెలిపారు.

అమెరికాలో ‘‘వాటర్ గేట్ కుంభకోణం’’ జరిగినట్లు భారతదేశంలో ‘‘జ్ఞానేష్ కుంభకోణం’’ జరుగుతున్నదని అనేక మంది నిపుణులు పేర్కొంటున్నారు. బీహార్ లో ప్రారంభమైన ‘సర్’ ప్రక్రియ బెంగాల్ ను దాటి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో 13 కోట్ల ఓట్ల తొలగింపునకు కారణమైంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ఇండియా వేదిక పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ‘సర్‌’పై నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నారా? ప్రధాన ఎన్నికల అధికారి ఒక్కరే తీసుకున్నారా? ఇతర కమిషనర్లు అభ్యంతరం తెలిపారా? లేదా? ఓట్ల తొలగింపు అధికారం ఎవరిది? ఫారం-6లో మార్పులు ఎవరు చేశారు? వీటికి ఇంతవరకు సమాధానాలు లేవు.

ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ నల్సార్ లా యూనివర్శిటీలో మాట్లాడుతూ ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే అని పేర్కొన్నారు. మూకుమ్మడిగా ఓట్లు తొలగించటం రాజ్యాంగంలో‌ని ఆర్టికల్ 14, ఆర్టికల్ 326 లకు విరుద్ధమని తెలిపారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ-నిరసన హక్కు

ప్రజాస్వామ్యాలలో ప్రజలకు ప్రశ్నించే హక్కు, నిరసన హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం పౌరుడికి 6 రకాల స్వేచ్ఛలను కల్పించింది. కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా వేలాది మందిని ‘‘ఉపా’’ చట్టం కింద అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఉమర్ ఖలీద్ గత ఆరేళ్లగా బెయిల్‌ లేకుండా, విచారణ లేకుండా జైలులోనే ఉన్నాడు. శాంతియుత నిరసనలు రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగం. జెన్ జీ ఉద్యమాల తరువాత జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిషేధించడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం. పాత్రికేయులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రముఖ పాత్రికేయులు ప్రణయ్‌‌ రాయ్‌, ప్రబీర్ పురకాయస్థ మొదలగు వారిని వేధింపులకు గురిచేసింది. 2015 ఏప్రిల్‌ ‌నుంచి 2025 ఫిబ్రవరి వరకు రాజకీయ నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 193 కేసులు పెడితే వాటిలో రుజువైంది రెండు మాత్రమే. ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థులను శ్రీశంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ నుంచి సస్పెండ్‌ ‌చేసిన కేసును విచారించిన కేరళం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌కున్హి కృష్ణన్‌... ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును గౌరవించాలని, సస్పెండ్‌ ‌చేసిన 16 మందిని ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థులను వెంటనే యూనివర్శిటీలో చేర్చుకోవాలని తీర్పు చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు బిల్కిస్‌ ‌బానో కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌ ఇవ్వడం న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను, న్యాయ వ్యవస్థపై ఒత్తిడిని తెలియచేస్తున్నది.

భారత సమాఖ్య - రాష్ట్రాల హక్కులు

భారత రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్‌ ‘‘యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’’ అని పేర్కొన్నది. కేంద్రం ఎంత ముఖ్యమో, రాష్ట్రాలు కూడా అంతే ముఖ్యం. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో కేంద్ర, రాష్ట్రాల మధ్య కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని అధికారాల విభజన జరిగింది. కాని గత 12 ఏళ్లుగా కేంద్రం రాష్ట్రాల హక్కులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తున్నది. జి.ఎస్‌.టి, వ్యవసాయ చట్టాలు, నూతన విద్యా విధానం-2020 మొదలైనవన్నీ రాష్ట్రాల హక్కులపై కేంద్రం చేసిన దాడులే. రాష్ట్రాలలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు, వివిధ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలను చీల్చివేయడానికి కేంద్రం చేస్తున్న ఎత్తుగడలు సమాఖ్య హక్కులకు పూర్తి విరుద్ధం. జమిలి ఎన్నికల కోసం ప్రయత్నించడం ప్రజాభిప్రాయాన్ని చీల్చడానికి ప్రయత్నించడమే. ఇపుడు డీలిమిటేషన్‌-‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవడానికి వివిధ పార్టీలను ప్రలోభపెడుతున్నది. వాస్తవంగా డీలిమిటేషన్‌-‌మహిళా రిజర్వేషన్‌ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్‌ 17‌న వీగిపోయింది. దీనిని ఆమోదింపచేసుకోవడానికి 100 రోజులుగా పార్లమెంటును ‘ప్రోరోగ్‌’ చేయకుండా కొనసాగిస్తున్నది. డీలిమిటేషన్‌ ‌బిల్లుపై ఏకాభిప్రాయం సాధించకుండా ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడానికి ప్రయత్నించడం రాష్ట్రాల హక్కులను హరించడమే.

‘జెన్‌ జీ’ ఉద్యమాలు - యువత

అత్యధిక యువ జనాభా కలిగిన భారత దేశంలో యువత తీవ్ర అసంతృప్తితో వున్నది. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి, జీవన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది. ఇటీవల ప్రధానమంత్రి ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలపై అసహనం, అసంతృప్తి వ్యక్తంచేశారు. తాను పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా కార్పొరేట్‌ ‌పన్నులు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి, ఇతర సౌకర్యాలు కల్పించినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఇపుడే ప్రధానమంత్రి ఈ విషయాన్ని కనిపెట్టినట్లు మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఉపాధి సమస్య ఏర్పడి మొత్తం నిరుద్యోగ రేటు 5.1 శాతం నమోదయింది. పట్టణ ప్రాంతాలలో 6.8 శాతం వున్నది. అదే సమయంలో 15-29 సంవత్సరాల యువతలో నిరుద్యోగ రేటు 15.3 శాతం నమోదైంది.

ఈ నేపథ్యంలో కాక్రోచ్‌ ‌జనతా పార్టీ స్థాపన, జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఉద్యమం జరిగాయి. జంతర్‌ ‌మంతర్‌ ఉద్యమంలో యువతతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ, ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా డిమాండ్లు, రాజీనామా చేయడం ఉద్యమ విజయాలే అయినప్పటికీ... యువతలో నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగాలు కావాలనే డిమాండ్‌ అంతర్లీనంగా వున్నది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాలలో, ప్రాంతాలలో నిరసన, యువజన ఉద్యమాలు జరగడం దీనికి తార్కాణం. యువత ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ప్రభుత్వాలను నిలదీయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య కాదు. నిరసన ఉద్యమాలు చేసే హక్కులను యువతకు రాజ్యాంగమే కల్పించింది. యువత సమస్యలు పరిష్కరించలేని పాలకులే అసంతృప్తికి బాధ్యత వహించాలి.

లౌకిక వాదానికి సవాళ్లు

భారత రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలలో లౌకికవాదం ముఖ్యమైనది. గత 12 సంవత్సరాలుగా లౌకిక వాదాన్ని దెబ్బకొట్టే విధంగా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. జమ్ము-కాశ్మీర్‌ ‌రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిన 370 నిబంధన రద్దు చేయడమే కాక రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ) చేసి పౌరసత్వాన్ని కూడా మత ప్రాతిపదికన ఇవ్వడానికి యత్నించారు. అస్సాం వంటి రాష్ట్రాలలో లక్షలాదిమంది పౌరసత్వాన్ని కోల్పోయారు. మణిపూర్‌‌లో కుకీలు, మెయితీల మధ్య విబేధాలు సృష్టించి మతపరంగా లబ్ధి పొందటానికి ప్రయత్నించారు. పాఠ్య పుస్తకాలలో కూడా చరిత్ర పాఠాలపై దాడి చేస్తూ మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల క్రైస్తవ చర్చిలపై కూడా దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షణ అంటే ప్రజలు హక్కుల పరిరక్షణ. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు. కాని దానిని అమలు చేసేవారు చెడ్డవాళ్లయితే అది సక్రమంగా పని చేయదు.’’ అని 1949 నవంబర్‌ 26న డాక్టర్‌ ‌బి.ఆర్‌.అంబేద్కర్‌ ‌పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ రూపంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై, రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలపై దాడి జరుగుతున్నది. పైగా ఆధునిక భారత రాజ్యాంగ లక్ష్యాల స్థానంలో ప్రాచీన మనుస్మృతి లక్ష్యాలను ప్రతిష్టించడానికి సంఘ్‌ ‌పరివార్‌ ‌వ్యూహాత్మక ఎత్తుగడలతో పని చేస్తున్నది. ఈ ఎత్తుగడలను ఓడించడానికి విస్తృతమైన ప్రజా మద్దతు, ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ కృషిని కొనసాగించాలని నవంబర్‌ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతినబూనదాం.

4పేజీ - కె.ఎస్‌.లక్ష్మణరావు 25.11.26 image 2

వ్యాసకర్త : కె.ఎస్‌.లక్ష్మణరావు
శాసనమండలి మాజీ సభ్యులు,
సెల్‌: 8309965083

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్