“ఆర్.ఎస్.ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వందేళ్లుగా మమల్ని రిజిస్టర్ చేయించుకోవాలని ప్రభుత్వం ఎప్పుడూ అడగలేదు”
- మోహన్ భగవత్ (ఆర్.ఎస్.ఎస్ చీఫ్)
ఆర్.ఎస్.ఎస్ అంటే హిందూ ధర్మమని-హిందూ ధర్మమంటే ఆర్.ఎస్.ఎస్- అనీ రాజ్యాంగంలో లేదే, పోనీ మధ్యలో రాజ్యాంగ సవరణ ఏమైనా చేశారా? లేదే- దేశంలోని హిందూ సమాజం యావత్తూ ‘ఆరెస్సెస్సే మా అధికార ప్రతినిధి’ అని ఏకకంఠంతో ఎప్పుడైనా ఎక్కడైనా నినదించారా? లేదే.
గతంలో ఆర్.ఎస్.ఎస్ మూడుసార్లు నిషేధానికి గురైన విషయం ఈ దేశ ప్రజలకు గుర్తుంది. నిజానికి గత ప్రభుత్వాలే పట్టుబట్టి ఆరెస్సెస్‌ను ఈపాటికి రిజిస్టర్ చేయించాల్సింది. చేయించక పోయినందువల్లనే ఇప్పుడు దేశంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను లేవనెత్తింది. ఈ సంస్థకు మినహాయింపులెందుకూ? ఇది జాతి నిర్మాణంలో ఏం పాలు పంచుకుందనీ ? దేశ స్వాతంత్య్రంలో పాలు పంచుకోని సంస్థ. బ్రిటీషు వారికి క్షమాపణా పత్రాలు రాసి బతుకు జీవుడా అని బతికి పోయిన సంస్థ. ఆర్.ఎస్.ఎస్ బిల్డింగులు కడుతూ ఉంది. నిధులు సేకరించుకుంటూ ఉంది. క్రయ విక్రయాలు చేస్తూ ఉంది. విరాళాలు సేకరిస్తూ ఉంది. తనదైన భావజాలం గలవారిని బ్యూరోక్రసీలోకి, న్యాయ వ్యవస్థలోకి పంపిస్తోంది. నేరుగా రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్ప్పుడు అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా? రిజిస్టర్ చేయించుకోకుండా దేశంలో ఏ చిన్న సంస్థ కూడా పనిచేయడం లేదు. మరి ఇంత పెద్ద సంస్థ అయ్యుండి, లావాదేవీల లెక్కలు చూపాల్సిన బాధ్యత, ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత వుండదా? ఇవన్నీ కాకుండా మోహన్ భగవత్-ఆర్.ఎస్.ఎస్ చీఫ్‌కు ఎక్కడికి వెళ్లినా జడ్ ప్లస్ రక్షణను ప్రభుత్వం ఎందుకు కల్పిస్తోంది? ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుంది? ఆయన ప్రభుత్వంలో భాగం కాదు. ఏ హోదా లేదు. మరెందుకీ జడ్ ప్లస్ రక్షణ?
ఎన్నో మైనార్టీ సంస్థల ఆర్థిక మూలాలను ధ్వంసం చేసి, వాటిని మూయించేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, తమకు వెన్నెముకగా ఉన్న సంస్థ లెక్కల చిట్టా మాత్రం ఎందుకు విప్పదూ? ఇది ఒకటి కాదా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలో ఇదీ ఒకటి కాదా? రూలు- అంటే, అందరికీ ఒకే రూలు వర్తిస్తుంది కదా? ఆర్.ఎస్.ఎస్ కు ఎవరు ఎప్పుడు మినహాయింపులిచ్చారూ? ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలి కదా ?
కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్.ఎస్.ఎస్ చీఫ్‌కు రాసిన ఉత్తరంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి- దేశంలోని ఏ సంస్థ అయినా, ఏ ఆలోచనా ధోరణికి చెందినదైనా చిన్నదైనా, పెద్దదైనా అది తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి! 1. అన్ని విషయాలు పారదర్శకంగా ఉండాలి. 2. ఆర్థిక వనరుల వివరాలు ప్రభుత్వానికి వెల్లడించాలి. టాక్స్ కట్టాలి. 3. జవాబుదారీతనం తప్పనిసరి!
ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఎన్నో సంస్థలు రిజిస్టర్ అయిన సంస్థలే. అవి పారదర్శకంగా కూడా ఉంటున్నాయి. ప్రజాస్యామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగుతున్నాయి.
ఆర్.ఎస్.ఎస్ చెప్పుకునేది ఏమంటే - అది రాజకీయ సంస్థ కాదని. స్వచ్ఛందంగా నడుస్తున్న ఒక సాంస్కృతిక సంస్థ అని! ప్రభుత్వం నుండి నిధులు ఏవీ తీసుకోవడం లేదని! ఏ ప్రయోజనమూ పొందడం లేదని! అందువల్ల, ఇతర సంస్థల మాదిరిగా దీన్ని చూడగూడదు - అని! వాళ్లు చెప్పుకోవడం బాగానే ఉంది గాని, అందులో నిజం లేదు. ఎందుకంటే, ఇది కేవలం సాంస్కృతిక సంస్థ కాదు - రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రభుత్వం నుండి ఏ ప్రయోజనమూ పొందడం లేదన్నది పూర్తి అబద్ధం. వందేళ్లుగా ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది. పైగా, దాని ఉనికే అక్రమం! ఇప్పటికైనా సక్రమం చేసుకుందామన్న స్పృహ లోకి రావడం లేదు. దౌర్జన్యపూరితంగానే కొనసాగుదామని అనుకుంటోంది. ఇవన్నీ నేరాలే. నేర చరిత్రగల పెద్ద సంస్థ ఆర్.ఎస్.ఎస్ -అని దేశ ప్రజలకు తెలిసిపోయింది.
‘ఆర్.ఎస్.ఎస్ తన ఆదాయం లెక్కలు వివరించాలి’ అని అడిగిన కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశిస్తూ బిజెపి ఎంపీ రమేష్ జిగజినాగి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు దళితుడివి. నీలాంటి దళితులకు ఆర్.ఎస్.ఎస్ ను ప్రశ్నించే హక్కు లేదు. ఆర్.ఎస్.ఎస్ ను ప్రశ్నించిన వాడు ఇంతవరకు జీవించి లేడు. నీకూ అదే గతి పడుతుంది’ అంటూ బెదిరించాడు. ఈ ప్రకటన అతడి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసిందేగానీ, భారత ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లుగా లేదు. అయినా కోర్టులు ఏం చోద్యం చూస్తున్నాయి? దాన్ని సుమోటోగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన్ను లోపల ఎందుకు వేయించలేదూ? గతంలో భారత ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్ ను మూడుసార్లు నిషేధించింది-అంటే అర్థమేమిటి? ఈ సంస్థ ప్రభుత్వ చట్టాలకు ఒదిగి ఉండాల్సిందేనని సామాన్యులకు కూడా అర్థమవుతోంది! అయితే ఆర్.ఎస్.ఎస్, బిజెపి మేధావులకు ఇలాంటి చిన్న విషయాలు అర్థం కావు. వారి స్థాయి ఏమిటో తెలుసు కోవాలంటే, ఇటీవల అయోధ్య రామాలయంలో జరిగిన వందల కోట్ల దొంగతనం గూర్చి తెలుసుకోవాలి. ఆ ఆలయం ప్రభుత్వ పరిధిలోకి రాదు. ట్రస్టీలే దాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఎంచక్కా దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్లు-రూ.200 నుంచి రూ.1400 కోట్ల దాకా అయోధ్య రాముడి గుడిలో దొంగతనం జరిగిందని వారి సభ్యుడే బయట పెట్టాడు. మరి ఈ దేశ చౌకీదారు, అతని సహాయకుడు యోగి ఏం చేస్తున్నట్లు? రాముడి పేరు చెప్పి లోపల్లోపల దండుకుంటున్నారా? అందుకే దేనికైనా రిజిస్ట్రేషన్- ప్రభుత్వ గుర్తింపు - పారదర్శకత-నైతికతతో కూడిన నడవడి అత్యవసరం!
గతంలో రాముడి పేరు చెప్పి, రథయాత్రలు చేసి, అమాయక ప్రజల్ని ప్రభావితం చేసి, ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చింది ఇందుకేనా? క్రమంగా వ్యవస్థల్ని నాశనం చేసి, మరోవైపు ఓట్ చోరి చేసి, ఇంకో వైపు ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నది ఇందుకేనన్నమాట! ప్రజారంజకంగా పరి పాలిస్తున్నామని తమకు తామే ప్రకటించుకుని, వేడుకలు చేసుకుంటూ అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నది ఎందుకో ఈ దేశ ప్రజలకు అర్థమైంది.
- వ్యాసకర్త: దేవరాజు మహారాజు,
కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త /









కామెంట్‌లు (0)