బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా క్రీడల్లో భారత్‌ ఎక్కడ!

23 గంటల క్రితం

asia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆదివారం నాడు జపాన్‌ లోని నగోయాలో 20వ ఆసియా క్రీడలు ముగిశాయి. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు నాలుగు వరకు జరిగిన క్రీడల్లో 45 దేశాలు, ఒక సంస్థ నుంచి 10,787 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు సగం మంది మహిళలు పాల్గొన్నారని అంచనా. చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించగా... భారత్‌ గతం కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకున్నా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. గతంలో జనాభా విషయంలో ముందున్న చైనాను మన దేశం వెనక్కు నెట్టింది. ఇరు దేశాలూ దాదాపు ఒకే సంఖ్యలో జనాభా కలిగి ఉన్నప్పటికీ చైనా తాజా ఆసియా క్రీడల్లో 169 బంగారు పతకాలతో సహా మొత్తం 341 గెలుచుకోగా మనం 21 స్వర్ణాలతో సహా అన్నీ కలిపి 85 మాత్రమే తెచ్చుకొని నాల్గవ స్థానంలో నిలిచాం. చిన్న దేశమైన ఉజ్బెకిస్తాన్‌ మనతో సమంగా 21 స్వర్ణాలు సాధించింది. ఆసియా క్రీడలు, ఒలింపిక్‌ పోటీలలో మన దేశ క్రీడాకారులు సాధించిన విజయాలను కచ్చితంగా అభినందిం చాల్సిందే. అనేక మంది అనుభవాలు, పట్టుదలను చూసినపుడు వారి స్వయంకృషి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పోల్చితే ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు తీరుతెన్నులను అంతే కరాఖండితంగా విమర్శించాల్సిందే.

మన దేశంలో ఏటా క్రీడలకు కేటాయిస్తున్న సొమ్ము 40 నుంచి 53 కోట్ల డాలర్ల వరకు ఉంది. అదే చైనాలో 2,000 నుంచి 3,300 కోట్ల డాలర్లు. ఇంత తక్కువ కేటాయిస్తే పోడియం సంగతి సరే! అసలు పోటీల్లో పాల్గొనేందుకు మనకు అర్హత వస్తుందా అన్నది ప్రశ్న. చైనాలో చిన్నా, పెద్ద స్టేడియాలు 1,70,000 ఉండగా మన దేశంలో వెయ్యి స్టేడియాలు, వాటిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నది కేవలం వంద చోట్ల మాత్రమే. పెద్ద మొత్తంలో రాబడి వచ్చే క్రికెట్‌ స్టేడియాల గురించి చెప్పనవసరం లేదు, పోనీ వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర క్రీడలకు వెచ్చిస్తున్నారా అంటే అదీ లేదు. చైనాలో నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న బాలబాలికలలో ఉన్న ప్రతిభను దేశవ్యాపితంగా గుర్తించి వారిలో జిమ్నాస్టులుగా ఎవరు పనికి వస్తారు? ఎత్తు అవసరమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి క్రీడలకు ఎవరు సరిపోతారు? అన్నది గుర్తించి వారిని ప్రత్యేకమైన క్రీడా పాఠశాలలకు పంపుతారు. క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారి గౌరవప్రదమైన జీవితాలకు చైనాలో ఎలాంటి ఢోకా ఉండదు. అక్కడి కోచ్‌లు పూర్తి కాలపు ప్రభుత్వ ఉద్యోగులు. వారు తయారు చేసే అధ్లెట్లను బట్టి వారికి వేతనాలు, ఉద్యోగోన్నతులు ఉంటాయి. ‘ఖేలో ఇండియా’ పథకాన్ని 2017లో ప్రారంభించారు. దేశాన్ని ప్రపంచ క్రీడాశక్తిగా మారుస్తామని చెప్పారు. అంతకు ముందున్న పథకాలన్నింటినీ దీనిలో విలీనం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రం. నిపుణులు, పార్లమెంటరీ కమిటీలు ఈ పథకం విఫలమైందన్న విమర్శల తరువాత 2026-31 సంవత్సరాల మధ్య రూ.36,441 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంతకు ముందు ఏటా వెచ్చిస్తున్నది రూ.1,300-రూ.1,600 కోట్లు మాత్రమే ఉంది. నిధుల కేటాయింపు లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రయోజనం లేదు. మన దేశంలో క్రీడలకు ఏటా తలసరి ఖర్చు కేవలం రూ.24 మాత్రమే. చైనా దీనికి ఎనిమిది రెట్లు, ఆస్ట్రేలియా 30 రెట్లు, అమెరికా అంతకంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. ఉదాహరణకు 2024-25లో మన దేశంలో కేంద్రం, రాష్ట్రాలు కేటాయించిన మొత్తం రూ.12,500-రూ.14,600 కోట్ల మధ్య ఉండగా చైనా రూ.85 వేల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయించింది.

ఇటీవలి కాలంలో వివిధ అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారుల రికార్డులు పేలవంగా ఉన్నాయి. అది యుపిఏ పాలన అయినా ఎన్‌డిఏ ఏలుబడిలో కూడా అదే తీరు. చైనా విషయానికి వస్తే 2010 నుంచి ఆసియాలో ప్రథమ, ఒలింపిక్స్‌లో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. అమెరికాను అధిగమించాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. మన దేశం బంగారు పతకాలకు సుదూరంగా ఉండటమే కాదు, ఇతర పతకాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌ను తయారు చేయాలంటే పది-పన్నెండు సంవత్సరాలు పడుతుంది. పది నుంచి పదిహేనువేల గంటలపాటు సాధన చేయాల్సి ఉంటుంది. ఇది చిన్నతనం నుంచే సాధ్యం. ఇందుకయ్యే ఖర్చు కూడా ఎక్కువే. ప్రభుత్వాలు భరిస్తే తప్ప మనవంటి దేశాల్లో సామాన్యులకు సాధ్యం కాదు. క్రీడల నుంచి రిటైరైన తరువాత గౌరవప్రదమైన వేతనంతో కూడిన ఉపాధి లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరమే. మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే వారిలో 35 నుంచి 40 శాతం వరకు పంజాబ్‌, హర్యానాల నుంచే ఉంటున్నారు. వాటి జనాభాతో పోలిస్తే ప్రాతినిధ్యం చాలా ఎక్కువ. ఇతర రాష్ట్రాలు వాటి మాదిరి ఎందుకు ప్రోత్సహించటం లేదన్నది ప్రశ్న.

ఉన్నంతలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ ముందున్నాయి. విషాదం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిఇటి లను నియమించకుండా, ప్రైవేటు పాఠశాలలకు క్రీడా స్థలాలు లేనప్పటికీ అనుమతిస్తున్న పాలక పార్టీల పెద్దలు ఉట్టికి ఎగరలేకపోయినా స్వర్గానికి తీసుకుపోతామన్నట్లుగా ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధన టీచర్లు, పియిటిలు ఎందరుండాలో నిర్దేశించారు. సి.బి.ఎస్‌.ఇ అనుబంధ స్కూళ్లలో ప్రతి దశ ప్రైమరీ, సెకండరీ, సీనియర్‌ సెకండరీలకు ఒక్కో పియిటి ఉండాలి. ప్రతి ఐదు వందల మంది విద్యార్థులకు ఒక పియిటి నియామకం జరగాలి. వంద మంది విద్యార్ధులున్నా ఒక పియిటి నియామకం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు నిబంధనలను పాటిస్తున్నాయి. ప్రతి ఏడు వందల మందికి ఒక పియిటి నియామకం అంటూ తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు మారిస్తే అక్కడ తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లకు ఆటస్థలాలు లేకపోయినా తల్లిదండ్రులు ఎగబడి వాటిలో పిల్లల్ని చేర్చటం చూస్తున్నాం. తాజా యుడిఐఎస్‌ఇ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) 2025-26 నివేదిక ప్రకారం దేశంలో 14 లక్షల 66 వేల స్కూళ్లున్నాయి. మిడిల్‌, సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్కూళ్లు 5-6 లక్షల ఉన్నాయనుకుంటే కనీసం అంతే సంఖ్యలో పియిటి లు అవసరం. పది లక్షలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు ఉన్నట్లు అంచనా. ఉదాహరణకు ఒక గ్రామంలో రెండు లేదా మూడు ప్రా‌థమిక పాఠశాలలు ఉంటే వాటన్నింటికీ కనీస ఒక పియిటి అయినా నియమించాలి. విషాదం ఏమిటంటే అసలు ఎందరు పిఇటి లు కావాలనే లెక్కలే మన దేశంలో లేవు. అయినా ఒలింపిక్స్‌ గురించి మాట్లాడతాము. విద్యారంగ నిపుణుల అంచనా ప్రకారం ప్రైవేటు లేదా ప్రభుత్వ స్కూళ్లలో 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు పియిటి లు ఉన్నారు. అయితే కనీసంగా 5.5 నుంచి ఆరు లక్షలు అవసరం. మోడీ ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ వంటి ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణలో అదేమీ కనిపించటం లేదన్నది స్పష్టం!


- ఎం. కోటేశ్వరరావు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్