'ఆర్థిక అభివృద్ధి అంటే ఉద్యోగాలు ఒక్కటే కాదు. స్వేచ్ఛ, భద్రత, గౌరవంతో కూడిన పని పరిస్థితుల్లో పని చేయటం' అని మోడీ ప్రభుత్వ కార్మికశాఖ 2025-2026 వార్షిక నివేదికలో పేర్కొంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలన్నింటా కార్మికులు ఈ మూడూ లేని పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరల స్థాయిలో వేతనాలు రావడం లేదు.
మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కనీస వేతనం (తాజాగా వచ్చే వి.డి.ఏ తో కలిపినా) రూ.12 లేదా రూ.13 వేల చుట్టే తిరుగుతోంది. మోడీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో 2017 తరువాత, ఆంధ్రప్రదేశ్‌లో 2006-07 తరువాత అరకొర ఎంప్లాయిమెంట్స్‌లో మినహా కార్మికుల వేతనాలను సవరించలేదు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను కూడా 2012 తరువాత సవరించలేదు. పంజాబ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కార్మికులు పోరాడాక ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల తరువాత రూ. 11 వేల నుండి కేవలం రూ.13 వేలకు పెంచి కార్మికుల పోరాటాన్ని ఉక్కు పాదంతో అణచివేసింది.
దేశమంతటా 8 గంటల పని విధానం అమలు కావటం లేదు. రోజుకి 10 నుండి 12 గంటలు పని చేయిస్తున్నారు. 8 గంటలు దాటిన కాలానికి రెట్టింపు వేతనం అమలు కావడం లేదు. కార్మికుల శ్రమతో సృష్టించిన సంపదలు కొద్ది మంది సంపన్నుల చేతిలోకి పోతున్నాయి. అంబానీ, అదానీ, జిందాల్, బిర్లా, మిట్టల్, కోటక్, మురళీ దివి, జియమ్మార్ తదితర కంపెనీలు రాష్ట్రంలోనూ, దేశమంతటా ఉన్నాయి. ఫార్ట్యూన్ ఇండియా అధ్యయనం ప్రకారం ఇటువంటి మొదటి 100 బిలియనీర్లు 2026లో రూ. 346 లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నారు. ఇండియా స్థూల జాతీయ సంపదలో ఈ వంద మంది వాటా 26.27 శాతం.
వీరి దగ్గర పని చేసే కార్మికులు మాత్రం బికారులవుతున్నారు. కనీస వేతనం లేక జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కంపెనీలకే మద్దతు తెలుపుతున్నాయి. వేలు, లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలను ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నాయి. రాష్ట్రంలోని అదానీ గంగవరం, కృష్ణపట్నం పోర్టు కార్మికుల పోరాటాలను కూటమి ప్రభుత్వం అణచివేసింది. గంగవరం పోర్టులో కనీస వేతనం రూ. 10 వేల నుండి రూ. 13 వేల వరకు ఇస్తుండగా కృష్ణపట్నం పోర్టులో రూ. 12,647 ఇస్తున్నారు. వేతనాలు పెంచకుండా కార్మికులను దోచుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదానీకి కల్పించింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి జూన్ వరకు కార్మికులు పెద్ద ఎత్తున తమ డిమాండ్లపై పోరాడారు. అన్‌స్కిల్డ్ వర్కర్ కనీస వేతనం రూ. 20 వేలు, 8 గంటల షిఫ్ట్, ఓవర్ టైమ్‌కు రెట్టింపు వేతనాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో మొదలైన ఈ పోరాటం హర్యానా, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల పారిశ్రామిక ప్రాంతాలకు పాకింది. ఈ రాష్ట్రాలన్నీ పంజాబ్ మినహా బిజెపి పాలిత రాష్ట్రాలే. కార్మికులు తమ శ్రమనంతా బి.ఎం.డబ్ల్యూ, మెర్సిడెజ్, కాల్విన్‌క్లీన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలకు కావాల్సిన విడి భాగాలకు ధారపోస్తున్నారు. ఎల్ అండ్ టి, మిట్టల్ స్టీల్‌ప్లాంట్, అదానీ పవర్‌ప్లాంట్, వేదాంతా పవర్‌ప్లాంట్, హోండా మోటార్ సైకిల్, స్కూటర్స్ ఇండియా, వోక్స్‌వేగన్, ఆడి, హోండా, సుజుకి, హోండాయ్ కంపెనీలు వీరి శ్రమతో సంపదలు కూడబెట్టుకుంటున్నాయి.
ఇరాన్ మీద అమెరికా చేసిన యుద్ధం జీవన వ్యయ సంక్షోభాన్ని తీవ్ర స్థాయికి పెంచింది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, విమాన ఇంధన ధరలు ఆకాశానికంటాయి. కార్మికుల జీవనం మరింత దుర్భరమైంది. భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కార్మికుల పోరాటాలు పెద్ద ఎత్తున చెలరేగటానికి ఇది కూడా ఒక కారణమైంది. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా అగ్నికి ఆజ్యం తోడయి కార్మికులు లక్షల్లో వీధుల్లోకి వచ్చారు.
బంగ్లాదేశ్ గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పెద్ద ఎత్తున నవంబర్ నెలలో తమ వేతనాల పెంపు కోరుతూ సమ్మె చేశారు. గార్మెంట్ కార్మికుల శ్రమను బంగ్లాదేశ్ కాంట్రాక్టర్ల ద్వారా స్పెయిన్, స్వీడన్, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా దేశాలకు చెందిన బహుళజాతి కార్పొరేషన్లు జారా, హెచ్ అండ్ ఎం, లెవీస్, ప్యూమా, నైక్, యాంగాన్ అతి చౌకగా దోపిడీ చేస్తున్నాయి. తమ వేతనాలను నెలకు ప్రస్తుతం వస్తున్న రూపాయల్లో 9,583 నుండి రూ. 23 వేలకు పెంచమని కార్మికులు కోరుతున్నారు. పాలక పార్టీలు కార్మిక పోరాటాల తదుపరి వేతనాలను అరకొరగా పెంచి బహుళజాతి కంపెనీలకు మేలు చేస్తున్నాయి.
జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కార్మికులు తమ కోర్కెల పరిష్కారం కోరుతూ చేస్తున్న పోరాటాలకు యూరప్ దేశాలు కేంద్రకంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా అధిక జీవన వ్యయం, నివాస ఖర్చులు, పాలకుల విద్యా విధానాలు యూరప్ అంతటా సమ్మెలు, ప్రదర్శనలకు పురికొల్పాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, స్వీడన్, అల్బేనియా, సెర్బియా దేశాల్లో లక్షలాది కార్మికులు సమ్మెలు చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలు అన్ని ఖండాలకు పాకాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, నైజీరియా, ఇధియోపియా, ఈజిప్టు, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బొలీవియా దేశాల్లో కార్మికులు సమ్మెలు చేశారు. కొన్ని దేశాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతను కోరుతున్నారు. జీవన వ్యయ పెరుగుదల, తక్కువ వేతనాలు, బడ్జెట్ కోతలను నిరసిస్తున్నారు. కార్పొరేట్ల మీద, సంపన్నుల మీద పన్నులు పెంచాలని, ప్రజోపయోగ సర్వీసులు, విద్యకు నిధులు పెంచాలని, కార్మికుల కొనుగోలు శక్తి పెంచాలని సమ్మెలు చేస్తున్నారు.
అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలకే కాక తన స్వంత దేశంలోని ప్రజలకు కూడా హానికరంగా మారింది. ఇరాన్‌తో యుద్ధం, వివిధ దేశాల నుండి దిగుమతులపై ట్రంప్ విధించిన అధిక సుంకాలు అమెరికన్ ప్రజల జీవన వ్యయాన్ని విపరీతంగా పెంచాయి. కానీ దానికి తగ్గట్టుగా వేతనాలు పెరగలేదు. ఫలితంగా అనేక రంగాల్లో సమ్మెలను ఈ కాలంలో అమెరికా చవిచూసింది. చివరకు మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
అమెరికన్ పార్లమెంట్లో డెమోక్రాట్లు ఉభయ సభల్లోనూ మెజార్టీ సాధించిన సందర్భంగా డెమోక్రాట్లను ఉద్దేశించి డెమోక్రటిక్ సోషలిస్టు సెనేటర్ బెర్నీ శాండర్స్ చేసిన ఉపన్యాసం కేవలం అమెరికాకు మాత్రమేగాక మొత్తం ప్రపంచ దేశాలకు మంచి ఉపదేశం ఇచ్చింది. ప్రభుత్వాలు బిలియనీర్ల కోసం పని చేయటం మానుకుని ప్రజల కోసం, కార్మికుల కోసం పని చేయాలని చెప్పారు. బిలియనీర్ల సంపద మీద 5 శాతం పన్నువేసి ప్రజలకు అవసరమైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. మూలధన లాభాల మీద, డివిడెండ్ల మీద పన్ను వేయాలని, డేటా సెంటర్ల నిర్మాణం మీద మారటోరియం విధించాలని కోరారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయాల్ని మన దేశంలోని వామపక్ష కార్మిక సంఘాలు, పార్టీలు సూచిస్తున్నాయి. ఇటువంటి ప్రత్యామ్నాయాలు అమలు కాకుండా భారతదేశంలోగానీ, మరే ఇతర పెట్టుబడిదారీ దేశాల్లోగాని కార్మిక సమస్యలు పరిష్కారం కావు. కార్పొరేషట్ల ప్రయోజనాల కోసం యుద్ధాలను ప్రజల మీద రుద్దుతున్న సామ్రాజ్యవాదానికి అడ్డుకట్ట వేయాలి. కార్మిక పోరాటాలు ప్రబలంగా జరుగుతున్న కారణంగా మితవాద శక్తులు ఇతర దేశాల్లో ఎలా ఓటమి పాలవుతున్నాయో, అదే విధంగా దేశంలోని మతతత్వ శక్తులను ఓడించాలి.
వ్యాసకర్త: పి.అజయకుమార్
- సిఐటియు ఉపాధ్యక్షులు








కామెంట్‌లు (0)