జూన్ 8న స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో ఉన్నారు. పదవ తేదీ ఉదయం మరలా ఎస్‌ఎంఎస్-1లో ప్రమాదం జరిగింది. కార్మికులు ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ విస్ఫోటనానికి ముందు గతేడాది జనవరి నుండి జరిగిన ప్రమాదాల్లో 15 మంది మరణించారు. ఏ రోజు ఏది కూలిపోతుందో, ఏది పేలిపోతుందో తెలియని స్థితి. ప్లాంట్ కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్నారు. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.120 కోట్ల నష్టం జరిగిందని నిపుణుల అంచనా. పాత యంత్రాలు, నాశిరకం ముడిసరుకు, కార్మికులను తొలగించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ఎంత కాలం ఈ విధ్వంసం? ఇంకెందరు బలి కావాలి? పాలకులు సమాధానం చెప్పాలి.
పాలకుల నిర్లక్ష్యం
ప్లాంటులో యంత్రాలు 35 సంవత్సరాల కిందటివి. మెయింటినెన్స్ నిలిపివేశారు. కొత్త యంత్రాల ఏర్పాటు లేదు. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి గతేడాది జనవరిలో ప్లాంటును సందర్శించి ఈ యంత్రాలు మార్చాలన్నారు. కానీ ఇంత వరకు అతీగతి లేదు. ప్లాంట్‌లో భద్రత, ఉత్పత్తి, నిర్వహణకు సంబంధించి అధికారులు, కార్మికులతో కమిటీలు ఉండేవి. వీటిని గత 4 సంవత్సరాల నుండి పక్కన పడేశారు.
ముడిసరుకు కొనుగోలులో అవినీతి, అక్రమాలు ఉన్నాయి. నాశిరకం ముడిసరుకు దిగుమతి అవుతోంది. నాణ్యత తగ్గిపోతోంది. విశాఖ ఉక్కుకు మార్కెట్లో వున్న బ్రాండ్‌ను కాపాడుకోవాలి. క్వాలిటీ లేని రా మెటీరియల్ వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఆస్థి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదముంది. చర్యలు తీసుకోండని సిఐటియు తదితర కార్మిక సంఘాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇరవై మంది పని చేయాల్సిన చోట 11 మందితో చేయిస్తున్నారు. 2025 మార్చి 31న 1137 మంది, సెప్టెంబరు 30న 464 మంది, 2026 మార్చిలో 67 మంది అనుభవంగల పర్మినెంటు కార్మికులను వి.ఆర్.ఎస్ పేరుతో తొలగించారు. మరో 600 మంది ఉద్యోగ విరమణ చేశారు. కొత్త రిక్రూట్‌మెంట్ చేయలేదు. ఉన్న కార్మికులపై విపరీతమైన పనిభారం పెంచారు. ఆఫీసర్లతో క్లీనింగ్ పనులు చేయించారు. నైపుణ్యంగల కాంట్రాక్టు కార్మికులు 5500 మందిని తొలగించారు. వీరిలో ప్లాంటు కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులున్నారు. కార్మిక చట్టాలను కాలరాశారు. ఆర్.ఎం.హెచ్.పి, కోక్ ఓవెన్, బ్యాటరీలు, సింటర్ ప్లాంటు, ఎస్‌ఎంఎస్ తదితర కీలక విభాగాలను ముక్కలు చేసి ప్రైవేటుకిచ్చారు. ఈఓఐ పేరుతో ఆపరేషన్, మెయింటినెన్స్ మొత్తం ప్రైవేటుకు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులను నియమిస్తున్నారు. వీరికి స్టీల్‌ప్లాంట్ పనుల అనుభవం లేదు. విశాఖ ఉక్కుకు సంబంధించిన ప్రతి నిర్ణయం, ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికే వంత పాడుతోంది.
పరిహారం-ఉద్యోగం
జూన్ 8న విశాఖ ఉక్కు జనరల్ ఆసుపత్రి మార్చురీ దగ్గర గుర్తు పట్టలేని విధంగా వున్న మృతుల్లో తమ వారున్నారేమోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు వుంటే...మృతదేహాలను కెజిహెచ్ కు తరలించుకుపోవడానికి పోలీసులు తెగ ఆరాటపడ్డారు. ఉక్కు అధికారులు వచ్చి మృతులు, గాయపడిన వారి పేర్లు ప్రకటించాలి. ఉద్యోగం, పరిహారం విషయం తేల్చాలని మృతుల కుటుంబీకులు ఆందోళన చేయాల్సి వచ్చింది. వీరికి సిఐటియు, సిపిఎం నాయకులు, ఇతరులు అండగా నిలిచారు. అర్థరాత్రి 12 గంటలకు ఉక్కు అధికారులు వచ్చి మృతుల, గాయపడినవారి పేర్లు ప్రకటించారు. నష్టపరిహారం తమ చేతిలో లేదని నిష్క్రమించారు. బాధితుల ఆందోళన ఉధృతమైంది. మృతుల కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం, రూ.25 లక్షల నష్టపరిహారం, గాయపడినవారికి రూ.10 లక్షల పరిహారం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇస్తుందని అర్థరాత్రి ఒంటిగంటకు ప్రకటించారు. స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రూ.కోటి పరిహారం ప్రకటించండని బాధితులు బతిమాలారు. నిలదీశారు. మంత్రి లోకేష్ వచ్చి ప్రకటిస్తారంటూ వెళ్లిపోయారు. ఆందోళన చేయకుంటే ఉద్యోగం, పరిహారం ప్రకటించే పరిస్థితి నాడు లేదు.
పరిహారం ప్రకటింపులోనూ వివక్షత
విశాఖ ఎల్.జి పాలిమర్స్‌లో 2020 మే7న విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో మృతులకు నాటి వైసిపి ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించింది. 2024 ఆగస్టులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలిపోయింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు చంద్రబాబు ప్రభుత్వమే ప్రకటించింది. కాని ఇప్పుడో! రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి బాధుతులను ఓదార్చారు. అండగా వుంటామని నోటి మాటగా చెప్పారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన పరిహారాన్నే నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. రూ.కోటి పరిహారం ప్రకటించమని కార్మిక సంఘాలు, వామపక్షాలు కోరితే 'చనిపోయిన వారు మీ వాళ్ళు కాదు కదా. మీకేం పోయింది. మీరు కోటి అడుగుతార'ంటూ ఆగ్రహించారు. దీని వెనుక మిట్టల్, అదానీ, పారిశ్రామికవేత్తల ఒత్తిడి ఏమైనా ఉందా! స్టీల్‌ప్లాంట్ కార్మికులకు కోటి రూపాయిలు ఇస్తే తమకూ ఇది వర్తిస్తుందని మంత్రి లోకేష్‌పై వీరేమైనా ప్రభావం చూపారా? పరిశీలించాల్సి ఉంది. ఉపముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి ఉక్కు కార్మిక సంఘాలపై నాలుగురాళ్ళు వేశారు. పర్మినెంటు కార్మికులకు రూ.1.72 కోట్లు, కాంట్రాక్టు కార్మికులకు రూ.45 లక్షలు పరిహారం వస్తుందని లెక్కలు చెప్పారు. ఇవి కార్మికులు దాచుకున్న డబ్బులు. చట్టపరంగా వచ్చేవి. ఈ లెక్కలు కార్మికులకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎందుకు ప్రకటించలేదన్నది చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు.
జ్యుడిషియల్ విచారణ
జూన్ 8 విస్ఫోటన దుర్ఘటనపై విచారణకు సెయిల్ (బొకారో) స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ప్రియరంజన్, చీఫ్ జనరల్ మేనేజర్ జితేంద్ర కుమార్, పూర్వ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్‌సింగ్ లతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం వేేసింది. నాసిరకం ముడిసరుకు కొనుగోలుతో సంబంధం ఉందని జూన్ 12న 22 మంది ఉక్కు అధికారులను సస్పెండ్ చేశారు. స్టీల్ మంత్రిత్వ శాఖ, రాజకీయ పెద్దల పాత్ర లేకుండా ముడిసరుకు కొనుగోళ్లు జరగవు. ఇవి నిగ్గు తేలాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు దోషులను పట్టించాలి. 2017 సెప్టెంబరులో జరిగిన హెచ్.పి.సి.ఎల్ విస్ఫోటనంలో నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించింది. ఈ నివేదికలో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. స్టీల్‌ప్లాంట్ ఘటనపైన జ్యుడిషియల్ విచారణ అవసరం. నాసిరకం ముడిసరుకులో అక్రమాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. అయితే, ఈ ఘోర ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితేగాని ప్రభుత్వం పట్టించుకోలేదు.
నిర్వాసితుల ఆందోళన
ప్లాంటు కోసం సర్వస్వం ధారపోసిన నిర్వాసితులలో 8500 మందికి నేటికీ ఉద్యోగాలివ్వలేదు. ప్లాంటు ప్రభుత్వ రంగంలో వుంటుందా! వుండదా! వుండకపోతే మా జీవితాలు ఏం కావాలనే ఆందోళన వీరిలో తీవ్రమైంది. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు మారారు. ఎన్నికల్లో అందరూ హామీలిచ్చేవారే! అధికారం చేపట్టి హామీలను వదిలేస్తున్నవారే! ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నవారే! ప్లాంటులో 5 వేల పోస్టులు ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ ఖాళీలు నింపితే వీరికి ఉపాధి దక్కుతుంది. ఉద్యోగులపై పని భారం తగ్గుతుంది. ప్లాంటు అభివృద్ధి బాటపడుతుంది. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు. ప్రభుత్వం అంగీకరించిన ప్రకారం సంస్థలో 18 వేల మంది ఉద్యోగులుండాలి. కానీ నేడు 9000 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులు 15,000 మంది ఉండాలి. నేడు 8000 మంది మాత్రమే ఉన్నారు.
కూటమి ప్రభుత్వ వాగ్ధానాలు - ఆచరణ
విశాఖ ఉక్కుకు సొంత గనులకై చంద్రబాబు ప్రభుత్వం నోరు విప్పడంలేదు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంటుకు గనులు సాధించి పెట్టారు. రాష్ట్ర గనులను జిందాల్ స్టీల్‌కు కట్టబెట్టారు. విశాఖ ఉక్కు, కార్మికుల అభివృద్ధే మా లక్ష్యమన్నారు. కేంద్రం విధ్వంసం చేస్తుంటే జై కొడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తామన్నారు. కార్మికుల నిరసనలకు, ధర్నాలకు, దీక్షా శిబిరాలకు అనుమతించడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర పోలీసులను ప్లాంటు లోపలకి పంపి కార్మికులను, నాయకులను బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
ఉధృత పోరాటమే మార్గం
స్టీల్‌ప్లాంట్ అమ్మకం నిర్ణయమైపోయింది. మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గదు. టిడిపి కూటమి, వైసిపి ప్రభుత్వాలు కేంద్రంతో చేతులు కలిపాయి. మోడీని ఎదిరించలేరు. స్టీల్‌ప్లాంటు అమ్మకాన్ని ఎవరూ ఆపలేరు...అనే ప్రచారం పెద్దఎత్తున సాగింది. వాస్తవానికి ఒక సంవత్సరంలో ప్లాంటును వంద శాతం అమ్మాలని కేంద్రం చూసింది. 6 సంవత్సరాలవుతున్నా ప్లాంటు అమ్మకాన్ని నిలువరించింది కార్మికులు-ప్రజల ఐక్య పోరాటమే. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు రెండూ ప్రైవేటీకరణ విధానాలు అమలు చేసేవే. అలాంటిది వీరు కూడా స్టీల్‌ప్లాంటుకు అనుకూలంగా మాట్లాడవలసిన, కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ పోరాటమే. దీనిని మరింత ఉధృతం చేయాలి. విశాఖ ఉక్కు విధ్వంసం ఇంకెంతవరకు? దీనిని నిలువరించాలి. ప్లాంటును, కార్మికుల ప్రాణాలను రక్షించుకోవాలి. ఇందుకు 'నేను సైతం' అంటూ పిడికిలి బిగించడమే దేశభక్తియుత పౌరుల కర్తవ్యం.
వ్యాసకర్త : ఎం. జగ్గునాయుడు
స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు /








కామెంట్‌లు (0)