కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి దాదాపు ఆరేళ్లవుతున్నా ఇంకా నకిలీ నోట్లకు పూర్తి స్థాయిలో కళ్లెం వేయాలనుకున్న వారి లక్ష్యం నెరవేర లేదు. ఒక వైపు రిజర్వుబ్యాంకు వారే గత ఏడాది 102 శాతం మేర నకిలీ నోట్లు పెరిగాయని ప్రకటించడంతో నకిలీ నోట్లను అరికట్టడంలో కేంద్రం అనుసరించిన ఎత్తుగడ అంతగా సఫలీకృతం కాలేదనే పచ్చి నిజం మనందరికీ బోధపడుతూనే వుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా నకిలీ నోట్లు పుట్టుకొస్తూ మన ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతుండటం ఆందోళనకరమైన విషయం. ఇకపోతే పాత వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రెండు వేలు, ఐదు వందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టి...ఇక ఈ నోట్లకు నకిలీలు సృష్టించడం దాదాపు అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విర్రవీగింది. తీరా చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా చలామణి అవుతున్న నకిలీ నోట్ల బెడదను అరికట్టడం శక్తికి మించిన పనిగా, తల బొప్పి కడుతున్న వైనంగా పరిణమించడం ఎంతైనా ఆలోచించాల్సిన, తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిణామం. కేంద్రప్రభుత్వం నకిలీ నోట్లకు చెక్ పెట్టడానికి అనుసరించిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు బెడిసికొట్టి ...కొండను తవ్వి ఎలుకను పట్టిన చందగా తయారైందన్నది అర్థమవుతున్నది.
- బుగ్గన మధుసూదనరెడ్డి,
బేతంచెర్ల, నంద్యాల జిల్లా.








కామెంట్‌లు (0)