అంతా అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఉచితాన్ని ఎత్తేసింది. చార్జీల్ని నిర్ధారించింది. అయితే ఒకేసారి కాకుండా ప్రస్తుతానికి కొంచెం మాత్రమే రుచి చూపింది. గత నెలలో డిజిటల్ లావాదేవీల చట్టానికి చిన్న చిన్న సవరణలు తెచ్చినప్పుడే అంతా అనుమానించారు. అయితే ఆర్థిక మంత్రి అబ్బే...అలాంటి ప్రతిపాదనే లేదంటూ కొట్టిపడేశారు. అందాకా పూర్తి ఉచితంగా ఉన్న డిజిటల్ నగదు లావాదేవీలపై ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్ ద్వారా చార్జీలు విధించవచ్చు అన్నది ఆ సవరణ. ప్రస్తుతం వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే చెల్లింపులు, చిన్న వ్యాపారస్తులకు ఉచితం ఉంటుంది. 2000 రూపాయలు దాటినప్పుడు వ్యాపారి 0.4 శాతం రుసుము కట్టాల్సి ఉంటుంది. కాబట్టి 96 శాతం లావాదేవీలపై కొత్త రుసుము ప్రభావం ఉండదని ప్రభుత్వపు వాదన. అయితే సదరు వ్యాపారులు ఆ రుసుముని తమ స్వంత జేబు లోంచి భరిస్తారా? ఏదో రూపంలో కొనుగోలుదారునికి వడ్డిస్తారు గానీ. చిన్నదైనా, పెద్దదైనా భారం చివరకు వినియోగదారుడి పైనే. నగదు చలామణి తగ్గించడానికి, డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తి ఉచితంగానే అవలంభించింది. సులభంగా, వెంటనే నగదు బదిలీ అవ్వడంతో చిరు వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ లు పెట్టుకున్నారు. సంవత్సరానికి లక్షలాది కోట్ల రూపాయల లావాదేవీలు సులభంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఫీజులు వసూలు చెయ్యడం మొదలెడితే మళ్లీ ఈ విధానం మందగించవచ్చు. గత నెలలో గడియ తీసిపెట్టి, ఈ నెలలో తలుపు కొంచెం తెరిచిన ప్రభుత్వం రానున్న రోజుల్లో బార్లా తెరవదన్న గ్యారంటీ లేదు కదా.
- డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం








కామెంట్‌లు (0)