ఆహార భద్రత, పోషకాలు, ఆహార సురక్ష లాంటి అంశాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 60 కోట్ల (10 మందిలో ఒకరు) మంది బయటి ఆహారం తిని అనారోగ్యాలపాలు కావడంతో పాటు 4.2 లక్షల మంది మరణిస్తున్నట్లు తెలుస్తున్నది. అసురక్షిత ఆహారం తిన్న తర్వాత వైద్య ఖర్చులకు ప్రతి ఏటా 110 బిలియన్ డాలర్ల వ్యయం అవుతున్నది. కలుషిత ఆహారం తిన్న ఐదేళ్ల లోపు పిల్లలు 40 శాతం వ్యాధుల బారిన పడడం, 1.25 లక్షల మరణాలు నమోదు కావడం గమనించారు. అసురక్షిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధుల వ్యాప్తి జరిగి సాంఘిక ఆర్థిక అభివృద్ధి, ప్రజారోగ్య వ్యవస్థలు దెబ్బతినడంతో దేశ ఆర్థిక స్థితి, టూరిజమ్, వాణిజ్యం ప్రభావితం అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తినే ముందు ఆలోచించి ముద్దను మింగాలి. బయటి ఆహారం తినడాన్ని పూర్తిగా తగ్గించాలి. వీధి ఆహారానికి ఆమడ దూరం జరగాలి. కలుషిత ఆహారం తిన్న వెంటనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల ఆహారం తీసుకోవడం కూడా తగ్గించాలి. ఇంట్లో వండిన వంటలే అమృతమని భావించాలి. ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా ఆరోగ్యమే. బయట ఖరీదైన మాంసాహారం తిన్నా అనుమానమే. వ్యక్తిగత శుభ్రత, పారిశుధ్యం మన ఆరోగ్యానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. బయటి రుచులకు లొంగి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవద్దు.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,
సెల్: 9949700037








కామెంట్‌లు (0)