ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల సొమ్ము ప్రచారాలకా?

02 అక్టోబర్, 2026

sm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును ప్రచారాల పాలు చేయడానికి మరో పాలసీని తెచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతీ కార్యక్రమాన్ని పెద్ద ఈవెంట్‌గా నిర్వహించడం, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పత్రికల్లోనూ, ఇతర ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం చాలక సోషల్‌ మీడియాను కూడా ఉపయోగించుకోవడం కోసం 2026 సెప్టెంబర్‌ 23న రాష్ట్ర క్యాబినెట్‌ '' సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌ పాలసీ'' ని ఆమోదించింది.

నేడు అత్యధిక ప్రజల్ని సొంత మీడియా కంటే సోషల్‌ మీడియా బాగా ప్రభావితం చేస్తుందని భావించి ఈ పాలసీని తెచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ పాలసీ ఉద్దేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, ప్రజాప్రయోజన కార్యక్రమాలపై అవగాహన కల్పించడం కోసమని చెబుతున్నా అసలు ఉద్దేశ్యం వేరే అన్నది అర్ధమౌతున్నది. ఈ పాలసీ ప్రకారం సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లను గుర్తించి, వెరిఫై చేసి, ఎంపానల్‌ చేయడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫారాలు ద్వారా కవరేజీ ప్రతీ కార్యక్రమాన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్‌గా చిత్రీకరించడం, పోస్టులు చేయడం అత్యధిక మంది చూసే విధంగా తీర్చిదిద్దేందుకు కంటెంట్‌ క్రియేటర్లకు పారితోషకాలు కూడా నిర్ణయించింది. వారి ఫాలోవర్లను బట్టి రూ.2500 నుంచి రూ.1,50,000 వరకు పారితోషకాలు ఇవ్వనున్నట్లు ఈ పాలసీలో ప్రకటించారు.

ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం ఎంతవరకు సబబు ? ప్రజాధనం ప్రజల సమస్యల పరిష్కారానికా! ప్రభుత్వ ప్రచారానికా! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి! ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేయాలన్నా అప్పులపైనే ఆధారపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం దీనికోసం కోట్లాది రూపాయల నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తుంది? ఈ ప్రచారానికి మొత్తం బడ్జెట్‌ ఎంత? సంవత్సరానికి ప్రజలపై ఎంత భారం పడుతుంది? అనేది తెలియాల్సి ఉంది!

ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లో నిరుద్యోగ భృతి మూడు వేలు, 'ఆడబిడ్డ నిధి' పదిహేను వందలు, బి.సి.లకు 50 ఏళ్లకే పెన్షన్‌ పథకం ఇంకా అమలుకు నోచుకోనేలేదు! మరో పైవు ఉద్యోగుల జీతాలు, బకాయిలకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఇటువంటివాటి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం అవసరమా అనేది పెద్ద ప్రశ్నగా వుంది? పనిలో పనిగా ప్రభుత్వ ప్రచారంతో పాటు పార్టీ ప్రచారం కూడా దీంట్లో కలిసిపోతుందా అనేది చూడాలి.

ఇప్పటికే ఇటువంటి ప్రచార కార్యక్రమాలు బిజెపి పాలిత రాష్ట్రాలైన యు.పి, గోవా, హర్యానా, రాజస్థాన్‌, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి మరి!

- వి.వి. శ్రీనివాసరావు,

సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, సెల్‌: 9490098799.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్