బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీలిరంగు జెర్సీలో మెస్సీ చివరి మెరుపు..

19 గంటల క్రితం

messi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 09:03 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- గోల్‌తో ఘన వీడ్కోలు

బ్యూనస్ ఎయిర్స్: ఆకాశ నీలం రంగు జెర్సీలో బంతితో పరుగెత్తిన ఆ మాయా పాదాలు ఇకపై అర్జెంటీనా జాతీయ జట్టుతో మైదానంలో కనిపించవు. దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా ముగించారు. ఆఫ్రికా దేశమైన బెనిన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ తన చివరి జాతీయ మ్యాచ్ ఆడాడు. బ్యూనస్ ఎయిర్స్‌లోని మాన్యుమెంటల్ స్టేడియంలో బెనిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించగా.. మెస్సీ ఒక గోల్ చేసి, మరో రెండు గోల్స్‌కు అసిస్ట్‌లు అందించారు.

అర్జెంటీనా తరఫున 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికిన మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. నికోలస్ ఒటమెండి, నికో పాజ్‌లు మెస్సీ అందించిన అసిస్ట్‌లను గోల్స్‌గా మలిచారు. అనంతరం 71వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన మెస్సీ.. జాతీయ జట్టు తరఫున తన గోల్స్ సంఖ్యను 126కు చేర్చుకున్నారు.

మెస్సీ చివరి మ్యాచ్ కావడంతో స్టేడియంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన జెర్సీ నంబర్ 10కు గుర్తుగా మ్యాచ్ 10వ నిమిషంలో ఆటను ఒక నిమిషం పాటు నిలిపివేశారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. బెనిన్ ఆటగాళ్లు ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. గ్యాలరీలోని అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో మెస్సీకి వీడ్కోలు పలికారు. బెనిన్ కెప్టెన్ సెస్క్ డి అల్మెయిడా ప్రత్యేక బహుమతిని అందజేశారు.

అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ప్రయాణం ఎన్నో చారిత్రక విజయాలకు వేదికైంది. 2005లో హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆయన.. ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్నారు. 2016 కోపా అమెరికా ఫైనల్ ఓటమి అనంతరం రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారు. 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టాన్ని అందుకున్నారు. ప్రపంచకప్‌తో పాటు రెండు కోపా అమెరికా టైటిళ్లు, ఫైనలిసిమా ట్రోఫీని కూడా గెలుచుకున్నారు.

అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 126 గోల్స్, 70 అసిస్ట్‌లతో అంతర్జాతీయ కెరీర్‌ను ముగించారు. ఎనిమిది బ్యాలన్ డి'ఓర్ అవార్డులు గెలుచుకున్న మెస్సీ.. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికినా క్లబ్ ఫుట్‌బాల్‌కు మాత్రం కొనసాగనున్నారు. ఇంటర్ మయామి తరఫున ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నారు.

ఒకప్పుడు ప్రపంచకప్ కోసం ఎదురుచూసిన అర్జెంటీనా.. చివరకు మెస్సీ చేతుల్లోనే ఆ కలను సాకారం చేసుకుంది. ఇప్పుడు అదే దిగ్గజం ఆకాశ నీలం-తెలుపు జెర్సీకి వీడ్కోలు పలికాడు. చివరి మ్యాచ్‌లో గోల్‌తో అభిమానులను మరోసారి అలరించి.. ఒక ఆటగాడిగా కాదు, ఒక యుగంగా మెస్సీ జాతీయ జట్టును వీడారు.


లియోనెల్ మెస్సీ.. చరిత్రలో నిలిచిపోయిన ఫుట్‌బాల్ దిగ్గజం

లియోనెల్ మెస్సీ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు. అర్జెంటీనా తరఫున 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మెస్సీ, క్లబ్ మరియు దేశం తరఫున అనేక రికార్డులు, టైటిళ్లు సాధించారు.

మెస్సీ కెరీర్ ముఖ్య ఘట్టాలు

  • 2004–05: బార్సిలోనా సీనియర్ జట్టులో అరంగేట్రం.

  • 2005: అర్జెంటీనా జాతీయ జట్టులో అంతర్జాతీయ అరంగేట్రం.

  • 2008: బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనాతో కలిసి బంగారు పతకం.

  • 2009: తొలిసారి బ్యాలన్ డి'ఓర్ అవార్డు.

  • 2014: ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు తీసుకెళ్లి గోల్డెన్ బాల్ అందుకున్నారు.

  • 2021: అర్జెంటీనాతో తొలి ప్రధాన సీనియర్ అంతర్జాతీయ టైటిల్‌గా కోపా అమెరికా గెలిచారు.

  • 2022: అర్జెంటీనాను ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిపారు. టోర్నమెంట్‌లో గోల్డెన్ బాల్ కూడా గెలుచుకున్నారు.

  • 2024: అర్జెంటీనాతో మరోసారి కోపా అమెరికా టైటిల్ సాధించారు.

ప్రధాన విజయాలు

  • ఫిఫా ప్రపంచకప్: 1 — 2022

  • కోపా అమెరికా: 2 — 2021, 2024

  • ఫైనలిసిమా: 1 — 2022

  • ఒలింపిక్ స్వర్ణం: 1 — 2008

  • బ్యాలన్ డి'ఓర్: రికార్డు స్థాయిలో 8 సార్లు

  • UEFA ఛాంపియన్స్ లీగ్: 4 సార్లు

  • లా లిగా: 10 సార్లు

  • కోపా డెల్ రే: 7 సార్లు

  • క్లబ్ వరల్డ్ కప్: 3 సార్లు

అర్జెంటీనా కోసం మెస్సీ

అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ప్రయాణం ప్రారంభంలో ఎన్నో నిరాశలు ఎదురయ్యాయి. 2014 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి, 2015 మరియు 2016 కోపా అమెరికా ఫైనల్ పరాజయాల తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2016లో అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆ తర్వాత 2021 కోపా అమెరికా, 2022 ఫైనలిసిమా, 2022 ప్రపంచకప్, 2024 కోపా అమెరికా విజయాలతో అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.

మెస్సీ ప్రత్యేకత

మెస్సీ కేవలం గోల్స్ చేయడంలోనే కాకుండా డ్రిబ్లింగ్, పాసింగ్, అసిస్ట్‌లు, ఫ్రీ కిక్స్, గేమ్‌ను నియంత్రించే సామర్థ్యంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రపంచకప్, కోపా అమెరికా, క్లబ్ టైటిళ్లు, బ్యాలన్ డి'ఓర్ వంటి వ్యక్తిగత అవార్డులు—ఇవన్నీ కలిపి ఆయన కెరీర్‌ను ఫుట్‌బాల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిపాయి. చిన్ననాటి బార్సిలోనా ప్రతిభ నుంచి ప్రపంచకప్ విజేతగా ఎదిగిన మెస్సీ ప్రయాణం.. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప కథల్లో ఒకటి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్