- నేడు అర్జెంటీనా × స్పెయిన్ జట్ల మధ్య తుది పోరు
- అర్ధరాత్రి 12.30గం.ల నుంచి
న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు వేచిచూస్తున్నారు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో డిపెన్స్ కింగ్ స్పెయిన్ పోటీపడనుంది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన చేతుల మీదుగా విజేతలకు ప్రపంచకప్ టైటిల్‌ను అందజేయనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో వెల్లడించారు. తొలి సెమీఫైనల్లో స్పెయిన్ జట్టు 2-0తో ఫ్రాన్స్‌ను, రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. బలమైన డిపెన్స్‌కు పేరుగాంచిన స్పెయిన్ ఈ టోర్నీ మొత్తమ్మీద ప్రత్యర్ధి జట్టుకు కేవలం ఒకే ఒక గోల్ సమర్పించుకొని హాట్ ఫేవరేట్‌గా ఉంది. 2010 ఛాంపియన్ స్పెయిన్ రెండో టైటిల్‌పై గురి పెట్టింది. ఇక అర్జెంటీనా ఇంతకుముందు 1978, 1986, 2022లో ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకొని మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇదే చివరి ఫిఫా ప్రపంచకప్ అని అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇప్పటికే ప్రకటించడంతో అతనికి గుర్తుకు ఎలాగైనా టైటిల్ పట్టేయ్యాలని అర్జెంటీనా చూస్తోంది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా టైటిల్ కొడితే వరుసగా రెండోసారి అవుతుంది. దీంతో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్ కొడితే అర్జెంటీనా రికార్డుల్లోకెక్కనుంది. రెండో ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచి తన అద్భుత కెరీర్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చాలని భావిస్తున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మొత్తం ఈ మెగా ఫైనల్ పైనే ఉంది.
మిరాకిల్స్‌తో అర్జెంటీనా..
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో టైటిల్‌పై గురిపెట్టింది. పిఫా చర్రితలో అర్జెంటీనా వరుసగా రెండుసార్లు టైటిల్ కొట్టిన దాఖలాలు లేవు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను క్వార్టర్‌ఫైనల్లో స్విట్జర్లాండ్, ప్రీ క్వార్టర్స్‌లో ఈజిప్ట్, రౌండ్-32లో కాబోవెర్డేలపై అర్జెంటీనా తొలుత గోల్స్ సమర్పించుకొని మరీ గెలిచింది. లీగ్ దశలో నెమ్మదిగా ఆడిన అర్జెంటీనా.. నాకౌట్ ఛాంపియన్‌గా ఆడుతోంది. అర్జెంటీనా 1978, 1986, 2022 టైటిల్ సాధించగా.. 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది.
బలమైన డిఫెన్స్‌తో స్పెయిన్..
2010 ఛాంపియన్ స్పెయిన్‌నూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తోంది. దీని కారణంగానే ప్రత్యర్ధి జట్టుకు ఇప్పటివరకు ఒకే ఒక గోల్ ఇచ్చింది. సెమీస్‌లో 2022 రన్నరప్ ఫ్రాన్స్‌ను, క్వార్టర్ ఫైనల్లో బెల్జియం, ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్ వంటి టైటిల్ ఫేవరేట్ జట్లను ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. దాదాపు 16ఏళ్ల తర్వాత స్పెయిన్ జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
టికెట్ ధరలు భారీగా పెంపు...
ఫిఫా ప్రపంచకప్-2026 టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రీసేల్ ప్లాట్‌ఫామ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ ఒక్కో టికెట్ ధరను సగటున 11,327 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు) అమ్ముడయినట్లు ప్రకటించింది. అమెరికా క్రీడా చరిత్రలో ఏ క్రీడా ఈవెంట్‌కైనా నమోదైన అత్యధిక సగటు టికెట్ ధర ఇదే. అమెరికాలో అత్యంత ప్రజాదరణ ‘సూపర్ బౌల్’ టికెట్ ధర 9,411 డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) ఉండగా.. ఇప్పుడు ఫిఫా ఫైనల్ దానికంటే ఎక్కువ ధరతో సరికొత్త రికార్డు సృష్టించింది.








కామెంట్‌లు (0)