సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పసిడి వెలుగుల వెనుక.. చెమట చుక్కల గాథలు!

22 గంటల క్రితం

asian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 08:11 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ముగిసిన 20వ ఆసియా క్రీడల్లో సాధించిన 85 పతకాలు (స్వర్ణం 21, రజతం 27, కాంస్యం 37) మన దేశ క్రీడా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచాయి. అయితే ఆ త్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగురుతున్న క్షణాలను చూసిన కోట్లాది మందికి ఆ ఆనందాన్ని పంచడానికి ఆ అథ్లెట్లు ఎంతో కష్టాన్ని, ఎన్నో కన్నీళ్లను భరించారు. ఇది కేవలం పతకాల పట్టిక కాదు.. ఓటమి నుంచి విజయ శిఖరాలకు చేరిన కొందరి సాహసయాత్ర. అటువంటి స్ఫూర్తిదాయక నేపథ్యాలు ఉన్న రియల్ హీరోలు వీరు.


ఈ ఆసియా క్రీడల్లో పాల్గొన్న మనదేశ అథ్లెట్లలో కొందరికి ఇదే తొలి అంతర్జాతీయ పోడియం అనుభవం కాగా.. మరికొందరు కటిక పేదరికం, వెనుకబడిన తరగతులకు చెందినవారు. మరికొందరికి సాధనకు కనీస సౌకర్యాలు కూడా లేకపోయినా.. కఠోర సాధనతో ఈ క్రీడలకు సన్నద్ధమై పతకాలు సాధించారు. వీరిలో నీరూ దాండా (అథ్లెటిక్స్‌), తెలంగాణ రైతుబిడ్డ తానిపర్తి చికిత, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ)తో పాటు క్రికెట్‌లో శ్రీచరణి కూడా ఉన్నారు. రెండేళ్లక్రితం మహిళా క్రికెట్‌లో శ్రీచరణి పేరు ఎవరికీ తెలియదు. కానీ నేడు అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్‌లో ఆమె టాప్‌క్లాస్‌ బౌలర్‌. మహిళల క్రికెట్‌జట్టు స్వర్ణ పతకం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. అలాగే కబడ్డీ, హాకీ విభాగాల్లో డిఫెడింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. ఈసారి తమ బంగారు పతకాలను తిరిగి నిలబెట్టుకున్నా.. ముఖ్యంగా మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల తర్వాత బంగారు పతకాన్ని సాధించి, ఏకంగా 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. ఇక ముగింపు వేడుకల ఫ్లాగ్‌ బేరర్‌గా ఎంపికైన షూటర్‌ నీరూ దాండా, కోయంబత్తూరుకు చెందిన రన్నర్‌ విద్య రామ్‌రాజ్‌ పేర్లూ ఈ క్రీడలతోనే వెలుగులోకొచ్చాయి. గత క్రీడలకు భిన్నంగా ఈసారి మన మహిళా అథ్లెట్లు పురుష క్రీడాకారులతో సమానంగా 38 పతకాలు సాధించారు. పురుషులు ఏడు గోల్డ్ మెడల్స్ నెగ్గగా, మహిళలు ఏకంగా 11 పసిడి పతకాలను ముద్దాడారు.


pranavi

చరిత్ర మలుపు తిప్పిన ప్రణవి..

భారత గోల్ఫ్ చరిత్రను కొత్త మలుపు తిప్పిన ప్రణవి ఉర్స్ కథ కూడా అలాంటిదే. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. గోల్ఫ్ అనగానే ఏదో ఒక వర్గానికి, ఖరీదైన క్రీడగా ముద్ర పడిన ఆ రంగంలోకి వచ్చి, అసాధారణ ఏకాగ్రతతో ఆమె ఆడిన తీరు ఎంతోమంది యువతులకు స్పూర్తినిస్తుంది. చివరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో ఆమె చూపిన మానసిక స్థైర్యం వెనుక ఏళ్ల తరబడి పడిన ఏకాగ్రత సాధన, పట్టుదల ఉన్నాయి. వ్యక్తిగత స్వర్ణంతో పాటు దేశానికి టీమ్ రజతం దక్కడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.​​


chikta

పూట గడవడమే గగనం..

నిత్య జీవితంలో పూట గడవడమే గగనమైన ఎన్నో మారుమూల గ్రామాల నుంచి, అథ్లెట్లు కావాలనే కలతో పెరిగిన యువతకు ఈ నగోయా వేదిక ఒక నిలువెత్తు సాక్ష్యం. అలాంటి వారిలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ ఆర్చర్ తానిపర్తి చికిత. ఈ పేరు ఆసియా క్రీడలకు ముందు ఎవరికీ తెలియదు. కానీ ఇంటివద్దే కఠోర సాధన చేసి, అంతర్జాతీయ పోడియంపై సంచలనం సృష్టించింది. కాంపౌండ్ విభాగం వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఏకంగా రెండు స్వర్ణ పతకాలు సాధించి, భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలిచింది. కూతురి క్రీడా భవిష్యత్తు కోసం ఆస్తులను విక్రయించి, భూమిని తాకట్టు పెట్టిన త్యాగం తండ్రి శ్రీనివాసరావుది.


పైసా ఇవ్వని ప్రభుత్వం...

ఆసియా గేమ్స్‌లో ఆర్చరీ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఘనత చికిత సొంతం. కూతురు చికిత నగోయాలో చరిత్ర సృష్టించిన క్షణాన తండ్రి శ్రీనివాసరావు పొలం పని చేసుకుంటున్నారు. కూతురు పాల్గొనే మ్యాచ్‌లను కనీసం టీవీల్లోనైనా వీక్షించలేకపోయారు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో టీవీ, స్మార్ట్‌ఫోన్‌ కూడా లేదు. సాధారణ నోకియా ఫోన్‌తోనే ఆయన ప్రపంచంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. చికిత పోటీని ఓ స్నేహితుడు చూసి, ఫోన్‌ చేసి ఫలితాలు చెప్పాడు. మొదటి స్వర్ణం గెలిచిందని ఫోన్‌ చేసిన కొద్దిసేపటికే మరో స్వర్ణం గెలిచిందని మళ్లీ ఫోన్‌ చేశాడు. దీంతో ఆయన మ్యాచ్‌ చూడలేకపోయానని చాలా బాధపడ్డారు. పొలంలో పని ఉందని శ్రీనివాసరావు చెప్పడం ఆయన సాధారణ జీవన విధానానికి అద్దం పడుతుంది. రెండు స్వర్ణాలు నెగ్గడంతో చికితపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ విల్లు, బాణం పట్టి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమెకు నయాపైసా సాయం అందలేదు. గత మూడేళ్లలో ఏడు పతకాలు గెలుచుకున్నా.. స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం తగిన ప్రోత్సాహక నగదు బహుమతులు లభించలేదు. ప్రభుత్వం ఇతర క్రీడాకారులకు నగదు పురస్కారాలు, ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినా.. తన కూతురును కనీసం పరిగణనలోకి తీసుకోలేదని శ్రీనివాసరావు వాపోయారు. కార్యాలయాల చుట్టూ తిరిగి, గంటల తరబడి వేచి చూసినా సరైన స్పందన రాలేదని చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఆయన కష్టాన్ని, చికిత ప్రతిభను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందేమో చూడాలి.


nneeru

డబుల్‌ ‌గోల్డ్‌ నీరూ..

షూటింగ్ రేంజ్‌లో తనదైన ముద్ర వేశారు నీరూ దాండా. రైతు కుటుంబం నుంచి వచ్చి, భారత సైన్యంలో సేవలందిస్తూ కఠిన శిక్షణ పొందిన ఆమె ప్రయాణం సామాన్యుల సాహస యాత్ర. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల వ్యక్తిగత ట్రాప్ విభాగంలో ఏనాడూ భారతదేశానికి ఆ స్థాయి పసిడి దక్కలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ నీరూ అద్భుతమైన ఏకాగ్రతతో ఆసియా రికార్డును బద్దలు కొట్టారు. కేవలం వ్యక్తిగత స్వర్ణ మే కాదు. మిక్స్‌డ్ టీమ్‌లోనూ పసిడి సాధించి ‘డబుల్ గోల్డ్’తో సంచలనం సృష్టించారు. ముగింపు వేడుకలో భారతదేశ పతాకధారిగా కూడా నీరూ దాండా వ్యవహరించారు.


anna

పడి లేచిన కెరటం

క్రీడాకారుల జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష పునరాగమనం. దానిని అద్భుతంగా సాధించి చూపించారు కుస్తీ యోధుడు అమన్ సెహ్రావత్. ఒలింపిక్స్ ఒత్తిడి, ఆ తర్వాత ఎదురైన తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక కుంగుబాటు.. ఇవన్నీ ఒక అథ్లెట్ కెరీర్‌ను ముగించడానికి సరిపోతాయి. కానీ అమన్ పట్టుదల వేరు. తన వైఫల్యాలను, శారీరక నొప్పులను సైతం ఓడించి, నగోయా రింగులో అడుగుపెట్టిన ఆయన.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. పడి లేచిన కెరటం ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఆయన ప్రయాణం మరోసారి నిరూపించింది.


vidya

అడ్డంకులు అధిగమించిన విద్య..

తన అద్భుతమైన పరుగుతో యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది విద్య రామ్‌రాజ్. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ (అడ్డంకుల పరుగు) ఫైనల్ రేసులో ఆమె కేవలం 54.75 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో సరిగ్గా 42 ఏళ్ల క్రితం భారత అథ్లెటిక్స్ దిగ్గజం పిటి ఉష సృష్టించిన చారిత్రక జాతీయ రికార్డును (55.42 సెకన్లు) ఆమె బద్దలు కొట్టింది. 400 మీటర్ల హర్డిల్స్‌ను 55 సెకన్లలోపు పూర్తిచేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించి ఆసియా వేదికపై దేశం గర్వపడేలా చేసింది. కోయంబత్తూరులోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన విద్య తండ్రి ఓ డ్రైవర్. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా, క్రీడలపై తన కవల కుమార్తెలు విద్య, నిత్యకు ఉన్న మక్కువను చూసి.. ఆ తండ్రి అప్పు చేసి మరీ వారికి మొదటి రన్నింగ్ షూస్ కొనిచ్చాడు. ఆ తండ్రి పడిన శ్రమే ఆమె కాళ్లకు అంతులేని బలాన్నిచ్చింది. జపాన్ క్రీడల్లో వ్యక్తిగత పతకంతో ఆగకుండా, ఆ తర్వాత జరిగిన మిక్సెడ్ రిలేలో రజతం, అలాగే మహిళల 4x400 మీటర్ల రిలే విభాగంలో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించడంలో విద్య కీలకపాత్ర పోషించింది.


లక్ష్యం వైపు అడుగులు

ఎలాంటి క్రీడా నేపథ్యంలేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల కుంకుమ్ మోహడ్ ప్రయాణం ఎవరినైనా కదిలిస్తుంది. చిన్నతనంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చేతిలో విల్లు పట్టుకుని లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన ఆమె, ఏమాత్రం భయపడకుండా ఒత్తిడిని జయించింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రత్యర్థులను వెనక్కినెట్టి, మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అరుదైన చరిత్ర సృష్టించింది. ఆ క్షణంలో ఆమె కళ్లలో మెరిసిన ఆనంద భాష్పాలు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి.


joti

ఆర్చరీ @ జ్యోతి సురేఖ

ఆర్చరీ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది వెన్నెం జ్యోతి సురేఖ పేరు. ఆసియా క్రీడల్లో వరుసగా పతకాలు సాధిస్తూ పలు రికార్డులను నెలకొల్పింది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ ఈసారి ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్‌ ఆర్చరీలో స్వర్ణ పతకంతో మెరిసింది. 2014 దక్షిణ కొరియా ఆసియన్ క్రీడల్లో కాంస్యం, 2018లో ఇండోనేషియా జకార్తాలో రజతం సాధించింది. ఈ క్రమంలోనే 2023లో చైనా హాంగ్‌జౌ క్రీడల్లో వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్‌ విభాగంలో మూడు స్వర్ణాలు సాధించింది.


ఇలాంటి ఎంతోమంది అథ్లెట్ల విజయాల వెనుక రకరకాల పోరాటాలు ఉన్నాయి. కొందరు ఆర్థిక ఇబ్బందులను జయిస్తే, మరికొందరు తీవ్రమైన గాయాలను ఓడించి బరిలోకి దిగారు. వీరందరినీ ఒక్కచోట చేర్చింది కేవలం దేశంపై ఉన్న ప్రేమ, పతకం సాధించాలన్న తపన మాత్రమే. నగోయా వేదికపై వీరు ఎగరేసిన పతాకం కేవలం విజయానికి ప్రతీకే కాదు.. కష్టాల కడలిని ఈది గమ్యానికి చేరిన సామాన్యుల అసాధారణ విజయ గాథలు!


- సంతోష్‌, భాషా : 8919999289


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్