ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమానవత్వానికి వేదికగా నిలవాలి

1 గంట క్రితం

156200064.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 11:04 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

​అక్టోబర్‌ 24న ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం

ఐక్యరాజ్యసమితి (UN) అనేది ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలను కాపాడటానికి, దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి 1945లో స్థాపించబడిన అత్యున్నత అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించడంలోనూ, మానవాళి సంక్షేమాన్ని పెంపొందించడంలో ఐరాస కీలకమైన పాత్ర పోషించాలి. ప్రస్తుతం ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. నేడు ఈ సంస్థ అమెరికా ఆధిపత్య చర్యలతో నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతోంది. అక్టోబర్‌ 24న ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

అంతర్జాతీయ వివాదాలను చర్చలు, సంప్రదింపులు, న్యాయపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలనే ఆలోచనకు ప్రతిరూపంతోనే 1945 అక్టోబర్‌ 24న ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. నేడు ప్రపంచం 1945తో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. వలస పాలన అంతమైంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. సోషలిస్టు దేశాల సమూహం ఒక దశలో ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగింది. సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు పాలనతో ప్రపంచ గతినే మార్చేసింది. ప్రత్యామ్నాయ విధానాలతో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ చేసింది. సోవియట్‌ పతనం తర్వాత అమెరికా ఏకధ్రువ ఆధిపత్యం కొంతకాలం బలపడింది. నేడు చైనా అన్ని రంగాల్లో ప్రజానుకూలంగా వ్యవహరిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధిలో ముందుపీఠిన దూసుకుపోతోంది. ఇప్పుడు రష్యా, భారత్‌ తదితర దేశాల ఎదుగుదలతో బహుళధ్రువ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. కానీ ప్రపంచం ఎంతగా మారినా ఐక్యరాజ్యసమితి నిర్మాణంలోని అనేక అంశాలు 1945 నాటి పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. ఇదే నేటి ప్రధాన సమస్య.

69a3b2f22cc41-us-israel-iran-attack-crude-oil-013052588-16x9.jpg

ఘర్షణలు నిలుపుదల చేయటంలో విఫలం

ఇటీవల గాజా, ఉక్రెయిన్‌, సూడాన్‌, కాంగో తదితర దేశాల్లో కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణలను నిలుపు చేయటంలో ఐక్యరాజ్యసమితి విఫలమయ్యింది. రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా బలంగా ఉంటూ వీటో అధికారం ఉన్న దేశాల వద్దే వాస్తవ అధికారం ఉందని అంతకంతకూ స్పష్టమవుతోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహణకు చెల్లించాల్సిన తమ వాటాలను సైతం నిరాకరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ న్యాయాన్ని కాపాడటం కోసం ఏర్పర్చిన ఐక్యరాజ్య సంస్థలనే చట్ట విరుద్ధంగా ప్రకటిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నింటికీ సమానంగా అధికారులు లేకపోవటం వల్లే అంతర్జాతీయ శాంతిని, భద్రతను పరిరక్ష‍ించటంలో ఐరాస విఫలమవుతోంది.

హమాస్‌ 2023 అక్టోబర్‌ 7న దాడిచేసిన అనంతరం ఇజ్రాయిల్‌ గత మూడేళ్లుగా గాజాపై దాడులకు పాల్పడుతూ జాతి హత్యాకాండకు పూనుకుంటోంది. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో వేలాదిమంది చనిపోయారు. లక్ష‍లాదిమంది గాయాలపాలయ్యారు. పిల్లలు, మహిళలు, స్కూలు, ఆసుపత్రులపై, ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న శరణార్థి శిబిరాలపైనా, నిరాయుధులైన పౌరులపైన సైతం నిత్యం బాంబుదాడులకు తెగబడి ఇజ్రాయిల్‌ బేఖాతరుగా అన్ని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అమెరికా మద్దతుతో పాలస్తీనాను ఇజ్రాయిల్‌ విధ్వంసం చేస్తూనే పశ్చిమాసియాలోని అనేక దేశాలపై దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయిల్‌ చర్యలు జాతి హత్యాకాండ కోవకు చెందుతాయని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమెరికా, ఇజ్రాయిల్‌ లెక్కచేయటం లేదు. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య శాంతి చర్చల పేరుతో ఉక్రెయిన్‌లోని కీలకమైన, అరుదైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవటానికి అమెరికా కుయుక్తులు పన్నుతోంది. రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన ఆర్థిక ఆంక్ష‍లు రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బతీయలేకపోయాయి. రష్యాకు అనేక వర్థమాన దేశాలతో ప్రత్యేకించి చైనా, భారత్‌లతో స్నేహ, వాణిజ్య సంబంధాలు ఉన్న కారణంగా ఆంక్ష‍ల ఉచ్చులో నుంచి తప్పించుకోగలిగింది. చైనాను అదుపు చేసి, ఒంటరి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతంలో అమెరికన్‌ నౌకాదళ, సైనిక బలగాల మోహరింపుతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ ప్రాంతంలో చైనా, ఉత్తరకొరియా, రష్యాలే అమెరికా కు ప్రధాన టార్గెట్‌గా ఉన్నాయి.

ఆశాజనకంగా బ్రిక్స్‌ దేశాల సదస్సు

అంతర్జాతీయ వైరుధ్యాలు తీవ్రస్థాయికి చేరిన నేపధ్యంలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు ప్రపంచ పరిణామాలపైనా, పలు కీలక అంశాలపై చర్చించింది. పశ్చిమాసియాలో యుద్ధాలు, ఏకపక్ష‍ ఆంక్ష‍లు, సుంకాల మోతలు, ఆర్థిక సమగ్రతను ఆయుధాలుగా మలచటం వంటి అంశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యంతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ అసమానత్వాన్ని బయటపెట్టాయి. ఈ సదస్సు ముగింపులో విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుళ పక్ష‍ వాణిజ్య వ్యవస్థలో సంస్కరణలు కావాలని పిలుపునిచ్చింది. బ్రిక్స్‌ ఫ్లస్‌లో ఉన్న పాశ్చాత్య దేశాలతో తీవ్ర ఒత్తిడికి గురౌతున్న రష్యా, ఇరాన్‌ వంటి దేశాలతోపాటు అవే పాశ్చాత్య దేశాలతో సన్నిహిత ఆర్థిక, భద్రతా సంబంధాలు కలిగి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలు కూడా ఉండటం విశేషం. బ్రిక్స్‌ ఫ్లస్‌ కొత్త ప్రపంచ సమతుల్యత వైపు పడిన అడుగులతోపాటు దానిలోని వైరుధ్యాలను కూడా ప్రతిఫలించింది. క్యూబా విప్లవానికి, పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయానికి మద్దతుగా నిలవాలనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

6658050.jpg

మదురో అరెస్టు.. సార్వభౌమత్వంపై ప్రశ్నలు

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా బలగాలు అరెస్టు చేసి అమెరికాకు తరలించిన ఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా నిలిచింది. అయితే ఒక దేశాధ్యక్షుడిని మరో దేశం సైనిక చర్య ద్వారా అదుపులోకి తీసుకెళ్లడం ఆ దేశ సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టం, ఐరాస చార్టర్‌ సూత్రాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇరాక్‌ ఘటన నుంచి మదురో అరెస్టు వరకు పరిణామాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో సామూహిక నిర్ణయాలకు, ఐక్యరాజ్యసమితి పాత్రకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

ఇరాక్‌ యుద్ధం.. బలహీనతకు ప్రతీక

అమెరికా నేతృత్వంలోని కూటమి 2003 మార్చి 19న ఇరాక్‌పై సైనిక చర్య ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆ యుద్ధానికి అనుకూలంగా అవసరమైన తీర్మానం ఆమోదం పొందలేదు. తర్వాత భద్రతా మండలి 1483, 1511 తీర్మానాల ద్వారా ఇరాక్‌లో యుద్ధానంతర పరిస్థితులు, పునర్నిర్మాణం, బహుళజాతి బలగాల పాత్ర వంటి అంశాలపై చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఐక్యరాజ్యసమితి నిర్ణయ ప్రక్రియను పక్కనపెట్టి సైనిక చర్యకు దిగగలిగితే, చిన్న దేశాల సార్వభౌమత్వానికి అంతర్జాతీయ వ్యవస్థ ఎంతవరకు రక్షణ కల్పించగలదన్న ప్రశ్న తప్పక తలెత్తుతుంది.

ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ..

సామ్యవాద, సోషలిస్టు భావాలతో ఉన్న దేశాలపై ఆంక్ష‍లు విధించటం అమెరికాకు పరిపాటిగా మారిపోయింది. సహజవనరులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేయటం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తుండటంపై క్యూబాపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. అమెరికా ఆధిపత్యానికి భిన్నమైన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను అనుసరించే దేశాలపై ఆంక్షలు విధించడం కూడా దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానమే. క్యూబా దీనికి ముఖ్యమైన ఉదాహరణ. 1959 విప్లవం తర్వాత క్యూబా సామ్యవాద మార్గాన్ని ఎంచుకుంది. అప్పటి నుంచే ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు క్యూబాపై కొనసాగుతున్నాయి. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రతి సంవత్సరం విస్తృత మెజారిటీతో పిలుపునిస్తోంది. 2025 అక్టోబర్‌ 29న కూడా అమెరికా క్యూబాపై విధించిన ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక ఆంక్షలను ముగించాలని కోరుతూ సాధారణ సభ తీర్మానాన్ని 165 దేశాలు అనుకూలంగా ఆమోదించాయి. క్యూబా, వియత్నాం వంటి దేశాలు కూడా అమెరికా విధానాలను సైనిక, రాజకీయ, ప్రజా ఉద్యమాల స్థాయిలో ప్రతిఘటించాయి. నేడు సోవియట్‌ యూనియన్‌ లేకపోయినా చైనా, రష్యా వంటి దేశాలు అమెరికా ఏకపక్ష ఆధిపత్యానికి బదులుగా బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థను సమర్థిస్తున్నాయి.

images.jpg

ప్రపంచ ప్రజల పోరాటాలు

అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అనే ఐదు శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. అమెరికా దురహంకారం, గాజా, ఉక్రెయిన్‌ వంటి సంక్షోభాల విషయంలో భద్రతా మండలిలో వచ్చిన విభేదాలు ఈ సమస్యను మరింత స్పష్టంగా చూపించాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు శరణార్థులు, ఆకలి, పౌరుల మరణాలు, ఇవన్నీ కొనసాగుతుండగా, భద్రతా మండలిలో సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్య చర్యలు ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరించే పరిస్థితి కాకుండా, ప్రపంచ దేశాలన్నీ సమానంగా చర్చించే వ్యవస్థ అవసరం. అంతర్జాతీయ చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి. ఇదే ఐక్యరాజ్యసమితి చార్టర్‌ స్ఫూర్తి. ఆధిపత్య రాజకీయాలకు వేదికగా కాకుండా ప్రజల శాంతి, స్వేచ్ఛ, సమానత్వానికి వేదికగా ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను తక్ష‍ణమే ప్రజాస్వామీకరించాల్సి వుంది. అదే ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం మనకు ఇచ్చే అసలైన సందేశం.​

mlc ks lakshmana rao

కె.ఎస్‌. లక్ష్మణరావు

మాజీ శాసనమండలి సభ్యులు,

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష‍ులు

97019 95551

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్