ప్రస్తుత పాలనా రంగానికి గ్రహణం పట్టిందా? వ్యవసాయానికి కీలకమైన భూముల్ని కర్తలైన రైతుల్ని పట్టించుకోని స్థాయికి పాలకులు చేరిపోయారు. 20వ శతాబ్దానికి ముందే గాంధీ, హోవార్డు (భారత సైన్స్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు) మనిషి తాను నిల్చున్న భూమిని తనకు ఆహారాన్నిచ్చే మట్టిని అశ్రద్ధ చేసే సంక్షోభాల నిలయంగా భారతదేశం మారుతుంది.`` అని వివరించారు. హోవార్డు భారతదేశ వ్యవసాయ ప్రత్యేకతను ప్రపంచానికి తెలిసేట్లు వివరించాడు. అలానే 2006-07లో ఫ్రొఫెసర్ స్వామినాథన్ తన విపులమైన జాతీయ రైతు కమిషన్ నివేదికలో భూముల్ని రక్షించుకోవాలని హెచ్చరించాడు. ముఖ్యంగా నదీ పరీవాహిక ప్రాంతాలను ప్రత్యేక వ్యవసాయ నిలయాలు (జోన్స్) గా రక్షించాలని స్పష్టంగా చెప్పారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు వందనా శివ, మేధా పాట్కర్ ‘‘సాయిల్ నాట్ ఆయిల్’’ అని, పెద్ద డ్యాముల వల్ల మట్టి కొట్టుకుపోయి, పేరుకుపోయే స్థితి ప్రమాదాన్ని హెచ్చరికగా వివరించారు. ప్రస్తుతం సునీతా నారాయణ్ వ్యవసాయ భూముల్ని ఖనిజాల కొరకు నాశనం చేసే వైఖరిని ఆదివాసీల మనుగడకు నష్టంచేసే వైఖరిని ఎండగట్టారు. అయినా మన పాలకులు వ్యవసాయాన్ని దిగజార్చే పరిశ్రమలు, హబ్బులు, ఆయుధాలు ఆకాశహర్మ్యాలు వరవడిలో పడి పెట్టుబడుల కోసం తలుపులు బార్లా తెరిచారు.. దేశదేశాలు తిరిగారు. పైగా "కాన్స్‌లైన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి)" లో పర్యావరణ పతనాన్ని ఆపుతామని కోతలు కోస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ఆశిస్తున్న ప్రపంచ నేలల ఉత్సవాలు జరిపి భూసారాన్ని కాపాడగలమా?
ఇంత హిపోక్రిసీని ఆభరణంగా ధరించిన నేటి పాలకులు మనకు అవసరమా?
ప్రపంచ ఆహార పురస్కారం(food prize) - 2022 తీసుకొన్న ప్రొ. రతన్‌లాల్ తన సుదీర్ఘ పరిశోధనలతో ప్రపంచ వ్యాపిత సర్వేలతో హరిత విప్లవం తెచ్చిన ముప్పు వివరించారు. బీజం(విత్తనం) రందిలో పడి భూమి సంగతి మర్చిపోయాము. అందుకే ప్రపంచ వ్యాపితంగా భూ సమస్యలు పెరిగాయి. జీవమున్న నేలల్ని నిర్జీవంగా మారుస్తూ వస్తున్నామని వివరంగా హెచ్చరిక ఇచ్చారు. ఆయన అవగాహనల్ని, పరిశోధనలను అభినందించి, అమెరికా బైడన్ సర్కార్ ప్రొ. రతన్‌లాల్‌ను తమ సలహాదారుగా పెట్టుకొంది. అలానే ప్రొ. ఎం.ఎస్. స్వామినాథన్ (మొదటి ఆహార పురస్కార గ్రహీత) తన దారి (విత్తన అభివృద్ధి) మార్చి, మట్టి (భూమి) రక్షణ పథకాల్ని విస్తరించారు. అయితే కాలం మించిపోయింది. పంజాబ్ , కోస్తా ఆంధ్ర, కావేరి డెల్టా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి భారతదేశ ప్రాంతాల్లో బయటపడుతూ వస్తున్న నేలల (మట్టి) సమస్యలు కళ్లు తెరిపిస్తున్నాయి. అయినా పాలకులు మందమతితో వాటిని పట్టించుకొనే స్థాయిలో లేరు. కేవలం ప్రకృతి వ్యవసాయ ప్రచార వరవడిలో పడ్డారు. అదెంతవరకు హేతుబద్ధం..? అనేది ఆలోచించాలి!
ముఖ్యమైన సూక్ష్మ జీవులు..
బ్యాక్టీరియాలు: సాధారణంగా బ్యాక్టీరియాలు తటస్థభూముల్లోగానీ, క్షార స్వభావం ఉన్న నేలల్లోగానీ ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాల్లో ఎంతో వైవిధ్యముంటుంది. ఒక గ్రాము మట్టిలో కొన్ని వేల రకాల బ్యాక్టీరియాలుంటాయి. బ్యాక్టీరియాలు నత్రజని మొక్కలకు అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కలుగాని, జంతువులుగాని గాలిలో ఉన్న నత్రజని వాయువుని ప్రత్యక్షంగా వినియోగించలేవు. మట్టిలోని సేంద్రీయ పదార్థంలోని నత్రజనిని మొక్కలు గ్రహించలేవు. కారణం అవి మొక్కలకు అందాలంటే అమ్మోనియం, నైట్రేట్ వంటి అకర్బన రూపాలకు మార్చబడాలి. అవి బ్యాక్టీరియాల నిర్వహణ, నత్రజని ఖనిజీకరణ జరుపుతాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు గాలి నుంచి నత్రజనిని గ్రహించి, దానిని మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలోకి మారుస్తాయి. మొక్కలు ఈ నత్రజనిని ఉపయోగించి అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులను తయారు చేసుకుంటాయి. అజోస్పైరిల్లమ్ (Azospirillum), అజటోబాక్టర్ (Azotobacter) వంటి బ్యాక్టీరియాలు కొన్ని మొక్కల వేళ్లతో సంబంధం కలిగి ఉండటంతో పాటు, మొక్కల పెరుగుదలకు దోహదపడే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. రైజోబియం (Rhizobium) అనే బ్యాక్టీరియా పప్పుజాతి మొక్కల వేరు బుడిపెల్లో నివసిస్తూ, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది. ఆక్టినోమైసెట్స్ (Actinomycetes) అనే బ్యాక్టీరియా సమూహం నేలలోని సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలను, లిగ్నిన్ వంటి పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆక్టినోమైసెట్స్‌కు బ్యాక్టీరియా లక్షణాలతో పాటు శిలీంధ్రాల (ఫంగస్) మాదిరిగా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ, వీటిని బ్యాక్టీరియా సమూహంలోనే ప్రత్యేకమైన వర్గంగా పరిగణిస్తారు. మరో ముఖ్యమైన సూక్ష్మజీవుల సమూహం నీలి-ఆకుపచ్చ శైవలాలు (Blue-green algae). వీటిని సైనోబ్యాక్టీరియా (Cyanobacteria) అని కూడా అంటారు. ఇవి బ్యాక్టీరియా సమూహానికి చెందినవే అయినప్పటికీ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. వీటిలో కొన్ని వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఆక్సిన్ వంటి మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి.
అలాగే అనేక రకాల శిలీంధ్రాలు (Fungi), ఆల్గేలు (Algae), ప్రోటోజోవాలు (Protozoa) వంటి సూక్ష్మజీవులు నేల పర్యావరణ వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు చిన్న, మధ్యస్థ పరిమాణంలో ఉండే నేల జంతువులు కూడా నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైనవి. వాటిలో వానపాములు ప్రధానమైనవి. వానపాముల ప్రత్యేకతలు, నేలకు అవి చేసే మేలు గురించి చార్లెస్ డార్విన్ సహా అనేక మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి వివరించారు. నేల సారాన్ని పెంచడంలో, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో, నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో వానపాములు కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే కుందేళ్లు, పాములు, మోత్స్ (Moths) వంటి జీవులు నేల పర్యావరణ వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో నష్టం కలిగించినప్పటికీ, మరికొన్ని విధాలుగా ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
నేలల్లో జంతువులే కాకుండా మొక్కలు కూడా ప్రయోజనకరమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కొన్ని పంటల వేర్ల చుట్టూ ఉండే రైజోస్పియర్ (Rhizosphere) పొరల్లో వేర్లు నేల స్వభావాన్ని బట్టి మైకోరైజా (Mycorrhiza) శిలీంధ్రాలతో పాటు ఎన్నో సూక్ష్మజీవులు నివసిస్తూ మొక్కల పెరుగుదలకు, పోషకాల లభ్యతకు దోహదపడతాయి. అలాగే కొన్ని మొక్కలు క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరంలను గ్రహించి, అది పంటమొక్కలకు అందిస్తాయి. భూమి చదునుతేలి ఉంటే మొక్కల వేళ్లు పెరగవు. అలాంటి నేలల్లో వేర్ల కుళ్లకు కారణమైన జీవులు, పి.హెచ్ ఎక్కువగానీ, తక్కువగా ఉండటం వలన ఇతర రకాల సమస్యలు ఏర్పడతాయి. ఇందుకు భిన్నంగా మొక్కల వేర్లు కూడా మట్టి నాణ్యతను నిర్దేశిస్తాయి. మొక్కల చూట్టూ ఉన్న ప్రాంతాల్లో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ఇది వేళ్ల స్రాహాలపై జీవిస్తూ నేలలో ఉన్న ప్రాంతంలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతూ పోతుంది. వేళ్ల చుట్టూ మృత పదార్థాల విచ్ఛిన్నాన్ని వేగవంతం చేస్తూ పోషకాల విడుదలకు సాయపడుతున్నాయి. వేళ్ల చుట్టూ ‘మ్యూసిజెల్’’ (Mucigel) అనే జిగురు పొర నేలలలోని సూక్ష్మజీవుల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. వేరులపై ఉండే సన్నని వెంట్రుకల వంటి వలయం ద్వారా నీరు పోషకాలను గ్రహించే వీలవుతుంది.
మట్టిలోని సూక్ష్మజీవుల్లో వైవిధ్యం పెరగటానికి సాయపడే సాగు పద్ధతుల్ని అవలంబిస్తే నేల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివిధ కుటుంబాలకు చెందిన మొక్కల్ని (పైరుల్ని) మార్చి మార్చి పండిస్తే భూ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేల తక్కువగా కదిలించడం, భూమి కప్పి ఉంచే పంటల్ని సాగు చేయడం తటస్థ స్థాయిలో ఉదజని (పిఎస్) సూచికను ఉంచటం, సేంద్రీయ పదార్థాలతో నేల ప్రతి సంవత్సరం కలపటం ద్వారా మట్టిలోని సూక్ష్మజీవుల వైవిధ్యం పెరుగుతుంది.
ఈ సంస్కరణలను నిబద్ధతతో ఆచరించి, విత్తనం మీద ఉండే శ్రద్ధ భూమి మీద పెరిగినప్పుడే అసలైన హరిత విప్లవం.. నిరంతర హరిత విప్లవంగా మారుతుంది. మన వ్యవసాయం నిలబడుతుంది. అదే ప్రొ. రతన్‌లాల్, స్వామినాథన్, వందనాశివ, సునీతా నారాయణ్ వంటి వారు కోరుకున్నది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి! (Soil Not Oil or Arms!)
ఎందుకు మట్టి(నేల) విలువైనది?
మట్టిలో జీవమున్నది. అందులో ఉన్న కొన్ని కోట్ల జీవులు ఒక ఆరోగ్యకరమైన నేలకు తద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు ప్రేరణ కలిగిస్తుంది. ఒక గుప్పెడు మట్టిలో కోట్లాది బ్యాక్టీరియాలు, ఫంగస్ (బూజు) ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. అవి మట్టిని జీవమున్న వనరుగా మారుస్తాయి. ఒక ఎకరం నేలలో ఐదారు అంగుళాల వరకున్న మట్టితో 3-4 శాతం సేంద్రీయ (ఆర్గానిక్) పదార్థం ఉంటుంది. ఇందులో వుండే జీవుల బదులు 1-1.5 టన్నులు ఉంటుందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మట్టిలోకి సూక్ష్మజీవులు తమ పెరుగుదల కోసం సేంద్రీయ పదార్థం నుండి ఆహారం తీసుకుంటూ మొక్కల వేరుల్లాగా శ్వాస తీసుకొంటూ వదులుతాయి. కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలివేస్తాయి. మొత్తం పంటపొలాన్ని ఒక జీవమున్న శక్తిగా పరిగణింపజేస్తాయి. భూమిలోని సూక్ష్మజీవులు అనేక పనులు చేస్తాయి. మనకు ఆసక్తి ఉన్న ముఖ్యమైన అంశం అవి సేంద్రీయ వ్యర్థాలను చివికిపోయేలా చేస్తాయి. మట్టిలోని సూక్ష్మజీవులు సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి, పోషకాలను విడుదల చేయడమేగాక నేల నిర్మాణాన్ని సరిచేస్తాయి. సేంద్రీయ పదార్థం చిద్రమై పోషకాలను విడుదల చేస్తూ ‘‘హుమస్’’ను తయారుచేసి, మట్టిరేణువుల సముదాయాన్ని ఏర్పరిచి నీరు (తేమ) ప్రవేశంచడానికి దారుల్ని ఏర్పరుచుతుంది. నేలపై ఉన్న వ్యర్థాలను మట్టిలోనికి తీసుకొని వెళ్లడం, గాలి చొరబడటానికి ఖాళీ పెరగడం సేంద్రీయ పదార్థం ద్వారానే జరుగుతుంది. మట్టిలోని సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో మొక్కల వేర్లకు దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ‘‘రైజో స్పియర్’’ అంటారు. వేర్లు విడుదల చేసే రసాయనాలు విడివడిన కణాలు సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. రైజో స్పియర్‌కు ఒక అంగుళం కింద ఉన్న మట్టిలో ఉండే సూక్ష్మజీవుల కన్నా వెయ్యి రెట్లు జీవులు రైజో స్పియర్ లో ఉంటాయి. ఇవి ప్రాథమికంగా సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అంతేగాక అది నత్రజనిని బంధించి, వేర్లకు అందించి, మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేగాక అవి కొన్ని నష్టకరమైన రసాయనాలను అదుపుచేస్తాయి. అనగా అవి మొక్కలకు రోగాలు కలిగించే జీవులను అణిచివేస్తాయి. మనుషులకు వచ్చే జబ్బులను నివారించే యాంటీబయాటిక్స్ ఈ సూక్ష్మజీవుల నుండి తయారవుతాయి.

ప్రొ. ఎన్. వేణుగోపాలరావు
9490098905








కామెంట్‌లు (0)