నవంబరు 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం
మధుమేహం (డయాబెటిస్) ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యానికి
సవాలుగా మారుతోంది. ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటి కారణాలతో టైప్–2 మధుమేహం ముప్పు పెరుగుతోంది. అయితే వ్యాధిని ముందుగానే గుర్తించడం, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం, క్రమశిక్షణాయుతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా దుష్పరిణామాలను తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో నవంబరు 14న నిర్వహించే ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రజల్లో అవగాహన పెంచేందుకు కీలకంగా నిలుస్తోంది.
అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య(ఐడిఎఫ్) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహంతో జీవిస్తున్నారు. చాలామందికి తమకు వ్యాధి ఉన్న విషయమే తెలియదు. సకాలంలో నియంత్రణ లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కంటి చూపు దెబ్బతినడం, నరాల సమస్యలు వంటి తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు.
మధుమేహం అంటే ఏమిటి?
మన శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ రక్తంలోకి చేరిన తర్వాత కణాల్లోకి ప్రవేశించడానికి క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోయినా, శరీరం దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితినే మధుమేహం అంటారు. దీర్ఘకాలం చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

రెండు ప్రధాన రకాలు..
టైప్–1 మధుమేహం: శరీర రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడం వల్ల వస్తుంది. పిల్లలలో, యువతలో ఎక్కువగా కనిపించినప్పటికీ ఏ వయసులోనైనా రావచ్చు. బాధితులకు ఇన్సులిన్ చికిత్స అవసరం.
టైప్–2 మధుమేహం: శరీరం ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేకపోవడం, క్రమంగా
తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఏర్పడుతుంది. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబంలో మధుమేహ చరిత్ర, వయసు పెరగడం వంటి అంశాలు ప్రమాదాన్ని పెంచుతాయి. జీవనశైలిలో మార్పులతో దీని ముప్పును తగ్గించుకోవచ్చు.
గర్భధారణ మధుమేహం: గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరగడాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. వైద్యుల పర్యవేక్షణలో దీని గుర్తించి నియంత్రించాలి. భవిష్యత్తులో తల్లికి, బిడ్డకు టైప్–2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరగవచ్చు.
లక్షణాలు..
• తరచూ దాహం వేయడం
• పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లడం
• ఎక్కువగా ఆకలి వేయడం
• కారణం లేకుండా బరువు తగ్గడం
• నీరసం, అలసట ఎక్కువగా ఉండడం
• చూపు మసకబారడం
• గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం
• చేతులు, కాళ్లలో తిమ్మిర్లు లేదా మంటలు రావడం
టైప్–2 మధుమేహం ఉన్నవారిలో చాలాకాలం వరకు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కాబట్టి లక్షణాలు లేవని వ్యాధి లేదని భావించకూడదు. అనుమానం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. వాంతులు, కడుపునొప్పి, వేగంగా లేదా లోతుగా శ్వాస తీసుకోవడం. తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే అత్యవసర వైద్య సహాయం పొందాలి.
నివారణకు జీవనశైలిలో మార్పులు : టైప్–1 మధుమేహాన్ని నివారించే నిర్ధారిత పద్ధతి ప్రస్తుతం లేదు. అయితే టైప్–2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
సమతుల ఆహారం: ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు, పీచుపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లను తగిన మోతాదులో తీసుకోవాలి. చక్కెర కలిపిన పానీయాలు, అధిక తీపి పదార్థాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని పరిమితం చేయాలి.
వ్యాయామం: పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడక, సైక్లింగ్ వంటి మధ్యస్థాయి వ్యాయామం చేయడం మంచిది. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో కదలాలి. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వ్యాయామాన్ని ఎంచుకోవాలి.
బరువు నియంత్రణ: అధిక బరువు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహాతో క్రమంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. పోషకాహార లోపం కలిగించే ఆహార నియమాలకు దూరంగా ఉండాలి.
క్రమం తప్పని పరీక్షలు: కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, శారీరక శ్రమ తక్కువగా చేసేవారు, గతంలో గర్భధారణ మధుమేహం వచ్చినవారు వైద్యుల సలహాతో రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకోవాలి.
ఇవి పాటించటం మేలు..
• పొగాకుకు దూరంగా ఉండాలి.
• తగినంత నిద్రపోవాలి.
• ఒత్తిడిని నియంత్రించుకునేందుకు నడక మేలు.
• యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి.
ఈ అలవాట్లను పాటించటం ద్వారా ఆరోగ్యానికి తోడ్పడతాయి.

నిర్ధారణ ఎలా?
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలవడం ద్వారా మధుమేహాన్ని నిర్ధారిస్తారు. ఇందుకోసం ఉపవాస రక్త గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ (HbA1c), ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌బీఏ1సీ పరీక్ష గత రెండు, మూడు నెలల సగటు రక్త చక్కెర స్థాయిలపై అంచనా ఇస్తుంది.
సాధారణంగా ఉపవాస రక్త గ్లూకోజ్ 126 మి.గ్రా./డె.లీ. లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం. హెచ్‌బీఏ1సీ 6.5 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం మధుమేహ నిర్ధారణకు ఉపయోగించే ప్రమాణాలు. పరీక్షల ఫలితాలను వైద్యులు అంచనా వేయాలి. స్పష్టమైన లక్షణాలు లేని సందర్భాల్లో మరో పరీక్ష ద్వారా నిర్ధారణ అవసరం కావచ్చు.
చికిత్స, నిరంతర పర్యవేక్షణ ముఖ్యం
మధుమేహ చికిత్స వ్యాధి రకం, చక్కెర స్థాయిలు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి మారుతుంది. ఆహార నియంత్రణ, వ్యాయామంతో పాటు అవసరాన్ని బట్టి మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్–1 మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్ తప్పనిసరి. వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదును మార్చడం లేదా నిలిపివేయడం ప్రమాదకరం. వైద్యుల సూచన మేరకు రక్తంలో చక్కెర స్థాయులను పర్యవేక్షించాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాల పనితీరు, కంటి రెటీనా, పాదాల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. గాయాలు, వాపు లేదా ఇన్ఫెక్షన్ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మధుమేహాన్ని పూర్తిగా నయం చేస్తామని చెప్పే నిర్ధారణలేని మందులు, చిట్కాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు సూచించిన చికిత్సను కొనసాగించడం అత్యంత ముఖ్యం.
అవగాహనతోనే ఆరోగ్యకరమైన జీవితం
మధుమేహం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు; కుటుంబం, సమాజం, ప్రజారోగ్య వ్యవస్థపై ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధి. ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండటం, నడకకు అనువైన ప్రదేశాలు, వ్యాయామ సదుపాయాలు, అందుబాటు ధరల్లో పరీక్షలు, మందులు లభించడం వ్యాధి నివారణలో కీలకం. పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మధుమేహం ఉన్నవారిని నిందించకుండా కుటుంబం, సమాజం వారికి అండగా నిలవాలి.
ప్రపంచ మధుమేహ దినోత్సవం 2026 అందించే సందేశం ఒక్కటే.. మధుమేహాన్ని ముందుగానే గుర్తించాలి.. ప్రమాదాన్ని తగ్గించాలి.. చికిత్సను ఆలస్యం చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, సరైన చికిత్స, నిరంతర పర్యవేక్షణతో మధుమేహం ఉన్నవారు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు. భయంతో, నిర్లక్ష్యంతో కాకుండా అవగాహనతో ముందస్తు చర్యలతో ముందుకు సాగడమే ఈ దినోత్సవ లక్ష్యం.
ఈ ఏడాది థీమ్..
ప్రపంచ మధుమేహ దినోత్సవ 2026–27 ప్రచార ఇతివృత్తం మధుమేహంపై ముందస్తు చర్యలు (Early Action on Diabetes). వ్యాధిని సకాలంలో గుర్తించడం, ప్రమాదాన్ని తగ్గించడం, అవసరమైన వైద్య సేవలు పొందడం దీని ప్రధాన ఉద్దేశం. మధుమేహం ఉందని తెలిసిన తర్వాతే చికిత్స గురించి ఆలోచించకుండా, లక్షణాలు గుర్తించడం, ప్రమాద కారకాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.

డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి చైర్మన్,
విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ ఆసుపత్రి,
విజయవాడ.
9346796260








కామెంట్‌లు (0)