మనదేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే భావజాలాలను నాటి అభివృద్ధి చేస్తున్నది భారత రాజ్యాంగమే. రాజ్యాంగం భారతదేశపు అత్యంత ప్రాధాన్యత కల్గిన గొప్ప సజీవ రచన. విభిన్నమైన విశ్వాసాలను, కులాలను, సంస్కృతులను, భాషలను, నమ్మకాలను వైఖరులను, అలవాట్లను, భావజాలాలను నడిపిస్తున్నది భారత రాజ్యాంగమే. అందువలన, మన భవిష్యత్తు తరాలు క్షేమంగా జీవించడం కోసం రాజ్యాంగాన్ని దానితోపాటుగా దాని లక్ష్యాలను మనం కాపాడుకోవాలి. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలలో సెక్యులరిజం ముఖ్యమైనది. భిన్నత్వం, బహుళత్వం గల భారతదేశంలో మత సామరస్యం మౌలిక అంశమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. సెక్యులరిజం అంటే మతాన్ని రాజకీయాల నుండి విడదీసి నిర్వహించడం. ప్రభుత్వం సొంత మతాన్ని కలిగి ఉండరాదు. రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను కల్పించింది. మైనారిటీల హక్కుల పరిరక్షణకు అనేక నిబంధనలు చేర్చింది. బ్రిటీష్ పాలనలో హిందువులు-ముస్లింల మధ్య ఐక్యత దెబ్బతీయడానికి బ్రిటీష్ ప్రభుత్వం విభజించు-పాలించు సిద్ధాంతాన్ని అనుసరించింది. అది చివరకు దేశ విభజనకు దారితీసింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 76 ఏళ్ల తర్వాత నేడు రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లను ఎదుర్కొని ఓడించకపోతే అది ఇచ్చిన ప్రజాతంత్ర పరిపాలనా వ్యవస్థను, హక్కులను కాపాడుకోవటం సాధ్యంకాదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సంరక్షించుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని అరాచకం ఆక్రమిస్తుంది. నవంబర్ 26 – భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అట్టమీది కథనం.
ప్రస్తుతం దేశంలో సంఘపరివార్ ఆలోచనలకు అనుగుణంగా బిజెపి ప్రభుత్వం హిందువులు-ముస్లింల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. మతపరమైన విభజన చేసి మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకు చేస్తున్న నిర్ణయాలు ప్రజల్లో మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. జమ్ముకాశ్మీర్‌కు గల 370వ ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), ప్రస్తుతం అమలుచేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) మొదలగునవన్నీ దీనిలో భాగమే. దేవాలయాలు, విగ్రహాల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలకు నరేంద్రమోడీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే మతం మొదలగు నినాదాలతో భారతదేశ బహుళత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలి లాంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలన్నింటినీ శాసిస్తూ, బహుళత్వంతో కూడిన మన సంస్కృతిని బిజెపి కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని బిజెపి పాలకులు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరూ ప్రశ్నించాల్సిందే. అసహనం, చీలికతత్వం, అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకపోవడం, పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తుండటం దుర్మార్గం.
పేరు జాతీయవాదం : చేసేది అరాచకం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో ప్రజాస్వామ్య సంస్థల పనితీరు, రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తి, పౌరుల హక్కుల పరిరక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయవాదం పేరుతో మతతత్వ రాజకీయాలు బలపడటం, పాలనా వ్యవస్థలో కేంద్రీకరణ పెరగడం, ఆర్థిక విధానాల్లో కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత లభించడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే ప్రజలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల చర్చలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తరణ వంటి అంశాలు భారతదేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత, పార్లమెంటరీ చర్చల నాణ్యత, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలు ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రశ్నలుగా ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరుపుకునే రాజ్యాంగ దినోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని కేవలం ఒక చారిత్రక పత్రంగా కాకుండా ప్రజల హక్కులకు, ప్రభుత్వ బాధ్యతలకు, దేశ ఐక్యతకు మార్గదర్శకంగా అర్థం చేసుకోవాలి.
రాజ్యాంగం : స్వాతంత్య్ర పోరాట వారసత్వం
భారత రాజ్యాంగం ఒకరోజులో రూపుదిద్దుకున్న పత్రం కాదు. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, రైతాంగ, కార్మిక, విద్యార్థి పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు, మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాల అనుభవాల సమాహారమే భారత రాజ్యాంగం. భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలు, ప్రాంతాలు కలిగిన ప్రజలందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థ కింద సమాన పౌరులుగా నిలబెట్టే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించారు. 1946 డిసెంబరు 9న రాజ్యాంగ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాదాపు మూడేళ్ల పాటు విస్తృత చర్చలు, సంప్రదింపులు, వాదోపవాదాల అనంతరం 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కృషి చిరస్మరణీయం. అయితే రాజ్యాంగం రూపుదిద్దుకోవడంలో రాజ్యాంగ సభలోని సభ్యులందరి చర్చలు, వివిధ సామాజిక వర్గాల ఆకాంక్షలు, స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల ఆలోచనలు కూడా కీలకంగా నిలిచాయి. రాజ్యాంగ పీఠికలో భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, మతం, ఆరాధనలో స్వేచ్ఛ; హోదా, అవకాశాల్లో సమానత్వం; వ్యక్తిగత గౌరవం, జాతీయ సమైక్యతను పెంపొందించే సౌభ్రాతృత్వం కల్పించాలని సంకల్పించుకున్నాం. ఇవి కేవలం పీఠికలోని అలంకార పదాలు కావు. దేశ పాలనకు, ప్రభుత్వ విధానాలకు, చట్టాల రూపకల్పనకు దిశానిర్దేశం చేసే మౌలిక విలువలు. అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యంతోపాటు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే రాజకీయ సమానత్వం సాధించినంత మాత్రాన సమాజంలో సమానత్వం వచ్చినట్లు కాదని హెచ్చరించారు. కులవ్యవస్థ, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష కొనసాగుతున్నంతకాలం ప్రజాస్వామ్యం బలహీనంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు దేశ పరిస్థితులను పరిశీలిస్తే అంబేద్కర్ హెచ్చరికల ప్రాసంగికత మరింత స్పష్టమవుతుంది.
నిరుద్యోగం : యువతలో పెరుగుతున్న అసంతృప్తి
మనదేశం ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఈ యువశక్తి దేశ అభివృద్ధికి గొప్ప వనరు. అయితే యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి, జీవన భద్రత కల్పించలేకపోతే అదే జనాభా ప్రయోజనం లేని భారంగా మారే ప్రమాదం ఉంది. డిజిటల్ సాంకేతికత, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల మధ్య పెరిగిన జెన్‌జెడ్ తరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తోంది. తమ భవిష్యత్తు పట్ల స్పష్టమైన హామీలను కోరుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నారు. ఇంజినీరింగ్, వైద్యం, మేనేజ్మెంట్, సాంకేతిక విద్య, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో పట్టాలు పొందుతున్నారు. కానీ వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ప్రభుత్వ రంగంలో ఖాళీలు భర్తీ కాకపోవడం, నియామక ప్రక్రియలో జాప్యం, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, నియామకాలపై న్యాయపరమైన వివాదాలు నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ భద్రత కొరవడుతోంది. కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జులై–సెప్టెంబరు త్రైమాసికంలో 15 సంవత్సరాలు పైబడిన వారిలో మొత్తం నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.8 శాతంగా ఉంది. అదే సమయంలో 15–29 సంవత్సరాల యువతలో నిరుద్యోగ రేటు 15.3 శాతంగా నమోదైంది. పట్టణ యువతలో ఈ రేటు 18.9 శాతంగా ఉండగా, పట్టణ యువతుల్లో 26.1 శాతంగా ఉంది. ఇవి నిరుద్యోగ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే గణాంకాలు. గిగ్ ఎకానమీ పేరుతో ఆన్లైన్ డెలివరీ, రవాణా, ఇతర సేవా రంగాల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనం, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, సామాజిక భద్రత వంటి హక్కులు అమలుకు నోచుకోవటం లేదు. ఏఐ, ఆటోమేషన్ విస్తరణతో అనేక ఉద్యోగాల స్వరూపం మారుతోంది. ఒకవైపు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ మరోవైపు సంప్రదాయ ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగంలో ఖాళీల భర్తీ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, తయారీ రంగంలో ఉపాధి కల్పన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, పరిశోధనలకు పెట్టుబడులు అవసరం. మరోవైపు పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాల్లో జాప్యం యువతలో నిరాశను పెంచుతున్నాయి. ఏళ్ల తరబడి పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు చివరికి పరీక్షలు రద్దు కావడం లేదా నియామకాలు నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. విద్య ఖరీదైన సరుకుగా మారడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో యువత ఆందోళనకు దిగితే వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారిని రాజకీయ ప్రత్యర్థులుగా చూడటం సరికాదు. నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. యువత ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ప్రభుత్వాలను నిలదీయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులే ప్రజల అసంతృప్తికి బాధ్యత వహించాలి.యువత ప్రశ్నలను దేశద్రోహంగా చూడటం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా గుర్తించాలి.
మతతత్వ రాజకీయాలు : లౌకిక వ్యవస్థకు సవాలు
భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉంది. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. ఈ వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత. మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. రాజ్యం మాత్రం ఏ ఒక్క మతానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇదే లౌకికతత్వం. కానీ గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో మతపరమైన గుర్తింపులకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో మతం, కులం ఆధారంగా విభజనాత్మక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే తప్పుడు ప్రచారాలు విస్తరిస్తున్నాయి. మైనార్టీ వర్గాలపై దాడులు, మూకహత్యలు, ఆహారపు అలవాట్ల ఆధారంగా అనుమానాలు వ్యక్తం చేయడం, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు సమాజంలో అభద్రతను పెంచుతున్నాయి.
2002 గుజరాత్ హింసాకాండ భారత ప్రజాస్వామ్య చరిత్రలో తీవ్ర విషాదకరమైన అధ్యాయం. ఆ ఘటనలో అధికారికంగా నమోదైన మరణాల సంఖ్య 1,044. బెస్ట్ బేకరీ, గుల్బర్గ్ సొసైటీ, నరోడా పాటియా, బిల్కిస్ బానో కేసు వంటి ఘటనలు మానవ హక్కుల పరిరక్షణ, న్యాయవ్యవస్థ బాధ్యత, బాధితులకు న్యాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. మత ఘర్షణలు ఏ ప్రాంతంలో జరిగినా బాధితులకు న్యాయం చేయడం, దోషులను చట్టప్రకారం శిక్షించడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ బిజెపి పాలకుల ఏలుబడిలో ఇది జరగటం లేదు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC) చుట్టూ గతంలో దేశవ్యాప్తంగా జరిగిన చర్చలు, నిరసనలు మతపరమైన సమానత్వం, పౌరసత్వ భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. ఢిల్లీలో 2020లో జరిగిన హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యంలో చట్టాలను ప్రశ్నించే హక్కు, శాంతియుత నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉన్నాయి. అదే సమయంలో హింసకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే చట్ట అమలులో మతం, కులం, రాజకీయ అనుబంధం ఆధారంగా వివక్ష ఉండకూడదు.
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ చర్యలు, వివిధ రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో చేపడుతున్న చర్యలపై న్యాయపరమైన చర్చ కొనసాగుతోంది. ఏ నిర్మాణమైనా చట్టవిరుద్ధమని తేలితే నిర్ణీత న్యాయ ప్రక్రియను అనుసరించాలి. నోటీసు, విచారణ, అప్పీల్‌కు అవకాశం ఇవ్వకుండా శిక్షాత్మకంగా ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగం కల్పించిన జీవన హక్కు, చట్టం ముందు సమానత్వం వంటి విలువలకు విరుద్ధమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాలన అనేది ప్రతీకారానికి వేదిక కాకూడదు.
మణిపూర్‌లో 2023లో ప్రారంభమైన జాతి ఘర్షణలు, మహిళలపై జరిగిన అమానుష దాడులు దేశాన్ని కలచివేశాయి. ఆ రాష్ట్రంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం, బాధితులకు పునరావాసం కల్పించడం, న్యాయం అందించడం ఇంకా అత్యంత కీలకమైన బాధ్యతగా ఉంది. ఈ ఘటనలు దేశ సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదని గుర్తుచేస్తున్నాయి.
రాజ్యాంగ సంస్థల స్వతంత్రత : ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
భారత రాజ్యాంగం దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఆర్టికల్ 324 ప్రకారం జాతీయ ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పనిచేయాలి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నట్లుగా మారిపోయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్.ఐ.ఆర్) అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కోల్పోయిన వారిలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారు. 2026 సెప్టెంబరు నాటికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన SIR ముసాయిదా జాబితాల పరిశీలనలో 13 కోట్లకు పైగా పేర్లు తొలగింపునకు గురైనట్లుగా వెల్లడైంది. వలస కార్మికులు, నిరాశ్రయులు, పేదలు, మహిళలు, వృద్ధులు, పత్రాలు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ప్రత్యేక సహాయం అందించాలి. ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో పాల్గొనే అవకాశం మాత్రమే కాదు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ప్రశ్నించే, అవసరమైతే మార్చే ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. అందువల్ల ఎన్నికల జాబితాలపై అనుమానాలు తలెత్తకుండా ఎన్నికల సంఘం తన చర్యలను బహిరంగంగా వివరించాలి.
సమాఖ్య వ్యవస్థ – రాష్ట్రాల హక్కులు, కేంద్రం బాధ్యతలు
భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల ద్వారా అధికారాల పంపిణీని నిర్దేశించింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం భారత సమాఖ్య వ్యవస్థలో అంతర్భాగం. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతీయ ఆకాంక్షలు కలిగిన దేశంలో అధికారాల వికేంద్రీకరణ అత్యంత అవసరం. అయితే ఇటీవలి కాలంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. గవర్నర్ల వ్యవహార శైలి, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, నిధుల పంపిణీ, జీఎస్టీ ఆదాయాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు వంటి అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం వ్యవహరించాలి. ఆమోదం, పునఃపరిశీలనకు పంపడం, రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయడం వంటి రాజ్యాంగపరమైన మార్గాలు ఉన్నాయి. అయితే ఈ అధికారాలను నిరవధికంగా నిర్ణయాలు వాయిదా వేయడానికి ఉపయోగించరాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 నవంబరులో రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగపరమైన అభిప్రాయం ప్రకారం, గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం ఇవ్వకముందే న్యాయస్థానం ఒక బిల్లును చట్టంగా పరిగణించలేదని, ఆర్టికల్ 142 కింద 'డీమ్డ్ అసెంట్' విధానాన్ని ప్రవేశపెట్టలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామం రాజ్యాంగంలోని వివిధ వ్యవస్థల మధ్య అధికారాల సమతుల్యతపై చర్చను మరింత ప్రాధాన్యత కలిగించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా నిధులు, పథకాలు, పరిపాలనా సహకారం అందాలి. రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి బలపడాలి. రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో పారదర్శకత ఉండాలి.
జీఎస్టీ అమలు ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పరోక్ష పన్ను వ్యవస్థ ఏర్పడినప్పటికీ, రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛపై చర్చ కొనసాగుతోంది. జీఎస్టీ మండలి సహకార సమాఖ్య వ్యవస్థకు ఒక వేదికగా పనిచేయాలి. రాష్ట్రాల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విశ్వాసంతో వ్యవహరించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి బలపడుతుంది.
ఆర్థిక సార్వభౌమత్వం : అభివృద్ధి ఎవరి కోసం ?
ఆర్థిక వ్యవస్థలో జీడీపీ పెరుగుదల ఒక్కటే ప్రజల జీవన ప్రమాణాలను నిర్ణయించదు. ధరల పెరుగుదల సామాన్య ప్రజల కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహార పదార్థాలు, వంట నూనెలు, పప్పులు, కూరగాయలు, విద్య, వైద్యం, రవాణా ఖర్చులు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో ఎక్కువ భాగం నిత్యావసరాలకే ఖర్చవుతోంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ బ్యాం కులు, బీమా రంగం, రైల్వేలు, విమానయానం, విద్యుత్, గనులు వంటి రంగాలు ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లిపోతున్నాయి. కానీ కీలకమైన ప్రజా సేవలు కేవలం లాభాపేక్షకు పరిమితమైతే సామాన్య ప్రజలకు సేవలు ఖరీదైనవిగా మారే ప్రమాదం ఉంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, రుణ సదుపాయాలు, భూముల కేటాయింపులు కల్పింస్తున్న పాలకులు సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే చర్యలు తీసుకోవటం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు, కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విదేశీ మార్కెట్లు రావటంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్ధిక సంక్షోభాలతో పనుల్లేక అసంఘటిత కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. బిజెపి పాలకులు సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇలా కేంద్రీకృతమవుతున్న పరిస్థితులను తగ్గించడానికి ప్రగతిశీల పన్నుల విధానం, ప్రజా సంక్షేమ వ్యయం, నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్య సేవలు అవసరం.

భావప్రకటన స్వేచ్ఛ : *ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంది. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడం, శాంతియుత నిరసనలు నిర్వహించడం రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగం. పాత్రికేయులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలగాలి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందే అవకాశం కల్పించారు. అయితే సమాచార కమిషన్లలో ఖాళీలు, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, సమాచార హక్కు కార్యకర్తలపై దాడులు వంటి సమస్యలు ఈ చట్టం ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే సమాచార హక్కును మరింత బలోపేతం చేయాలి. డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు భావప్రకటనకు విస్తృత అవకాశాలు కల్పించాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టే పేరుతో ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, నిరసనలు అణచివేయకూడదు.
రాజ్యాంగ నైతికత : *పాలకులకు, పౌరులకు మార్గదర్శకం
రాజ్యాంగం కేవలం ప్రభుత్వ అధికారాలను నిర్వచించే పత్రం కాదు. అధికార దుర్వినియోగాన్ని నిరోధించే వ్యవస్థ కూడా. పాలకులు తమకు లభించిన అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదు. ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతను ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత అవసరమైన విలువగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎన్ని మంచి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేసే వ్యక్తులు, సంస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు. అందువల్ల రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే కేవలం దాని ప్రతికి నమస్కరించడం కాదు. అందులోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను ఆచరణలో పెట్టడం. భారతదేశంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను గౌరవించాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి. పార్లమెంటు, శాసనసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి. మీడియాకు స్వతంత్ర ఉండాలి. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పౌర సమాజ సంస్థలు, విద్యాసంస్థలు, శాస్త్రవేత్తలు, మేధావులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలి.
రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, కుల వివక్ష, మత విద్వేషం, మహిళలపై హింస, రైతాంగ సంక్షోభం, పర్యావరణ విధ్వంసం వంటి సమస్యలకు పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనే ఉంది. అధికార కేంద్రీకరణ, విభజన రాజకీయాలు, సామాజిక అసమానతలు ఈ సమస్యలకు పరిష్కారం చూపలేవు. ప్రజల భాగస్వామ్యం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం, శాస్త్రీయ దృక్పథం, ఆర్థిక సమానత్వం ద్వారా మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
భారత రాజ్యాంగం మనకు అందించిన అత్యంత గొప్ప హామీ ప్రతి పౌరుడికి సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించడం. పేదవాడు, ధనవంతుడు; మెజారిటీ, మైనార్టీ; ఉన్నత కులం, అణగారిన కులం; పురుషుడు, మహిళ; గ్రామీణుడు, పట్టణవాసి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ముందు సమానులే. ఈ సమానత్వాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. దాన్ని సాధించేందుకు పోరాడటం ప్రజల హక్కు.
రాజ్యాంగాన్ని మార్చాలనే చర్చకన్నా ముందు దాని ఆశయాలను పూర్తిగా అమలు చేయడంపై నిస్వార్ధంగా పాలకులు దృష్టి పెట్టాలి. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యంగా విస్తరించాలి. ప్రజల ఓటు విలువను, భావప్రకటన స్వేచ్ఛను, మత స్వేచ్ఛను, జీవన గౌరవాన్ని కాపాడాలి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలి. కార్పొరేట్ ప్రయోజనాలకన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్రీయ ఆలోచన, మానవతావాదం, లౌకికతత్వం, సౌభ్రాతృత్వం దేశ రాజకీయ, సామాజిక జీవితంలో అంతర్భాగం కావాలి.
రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇచ్చింది. సమానత్వాన్ని హామీ ఇచ్చింది. సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఆ లక్ష్యాలు వాటంతట అవే నెరవేరవు. ప్రజల చైతన్యం, నిరంతర ప్రజాస్వామ్య పోరాటం, బాధ్యతాయుత పాలన ద్వారానే అవి సాధ్యమవుతాయి. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన సంకల్పం ఇదే.
రాజ్యాంగ పరిరక్షణ అంటే ప్రజల హక్కుల పరిరక్షణ. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే సామాజిక న్యాయం కోసం నిలబడటం. లౌకికతత్వ పరిరక్షణ అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడం. సమానత్వం సాధించడం అంటే ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం. ఈ విలువలే భారతదేశ భవిష్యత్తుకు పునాదులు.
రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికతత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా సమాజాన్ని నిర్మించుకుందాం. అదే రాజ్యాంగ నిర్మాతలకు మనం అర్పించే నిజమైన నివాళి.

కె.ఎస్. లక్ష్మణరావు
మాజీ శాసనమండలి సభ్యులు,
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు
సెల్ : 9701995551








కామెంట్లు (0)