పాత్రికేయులు కేవలం వార్తాహరులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కాపలాదారులు. అయితే, నిజాలు రాసినందుకు వారు వేధింపులు, హత్యలకు గురవుతుంటే.. అది కేవలం అక్షరంపై జరిగిన దాడి కాదు, పౌరసమాజం గొంతు నొక్కే కుట్ర! నేరస్తులకు శిక్ష పడకుండా తప్పించే రాజకీయ కుతంత్రాలు మరింత భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ అరాచకత్వాన్ని రూపుమాపి పత్రికాస్వేచ్ఛను పునరుద్ధరించడమే లక్ష్యంగా ‘జర్నలిస్టులపై దాడుల నిరోధక అంతర్జాతీయ దినోత్సవం’ పిలుపునిస్తోంది. ప్రశ్నించే గొంతుకలకు భద్రత కల్పించడం, న్యాయస్థానాల ద్వారా బాధ్యులను బోనెక్కించడమే దీని ప్రాథమిక కర్తవ్యం. నవంబర్ 2 ‘జర్నలిస్టులపై దాడుల నిరోధక అంతర్జాతీయ దినోత్సవం’ వేళ.. పాత్రికేయుల భద్రతపై ప్రపంచాన్ని భయపెడుతున్న నిజాలు !
నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది.. ముఖ్యంగా పాలకులకి! అందుకే, సమాజంలో అవినీతిని, అక్రమాలను, ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు అధికార దురహంకారం ఏ నీచానికైనా దిగజారుతోంది. పత్రికాస్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. దాన్ని ప్రాణప్రదంగా శ్వాసించే జర్నలిస్టుల ఊపిరి తీయడం, తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేయడం, భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురిచేయడం నేడు నిత్యకృత్యమైంది.
ఇటీవల అక్టోబర్ 10, 11 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై జరిగిన దాడులు, పోలీసుల అక్రమ నిర్బంధాలు భారత ప్రజాస్వామ్యవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. జర్నలిస్టు సంఘాల నివేదికల ప్రకారం.. కనీసం 30 మందికి పైగా జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారు. కొందరు తీవ్ర భౌతిక దాడులు, వేధింపులను ఎదుర్కొన్నారు. దేశ రాజధాని వీధుల్లోనే వార్తలు సేకరించే జర్నలిస్టులకు భద్రత లేకపోతే, ఇక క్షేత్రస్థాయిలో నిజాన్ని నిర్భయంగా రాసే పాత్రికేయుల ప్రాణాలకు గ్యారెంటీ ఏమిటి? ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన సుదీర్ఘ రైతు ఉద్యమం నుంచి నేటి వీధిపోరాటాల వరకు- సరిహద్దుల్లో ముళ్లకంచెలు వేసి, ఇంటర్నెట్ నిలిపివేసి, నిజాలు రాసేవారిపై ‘దేశద్రోహం’ ముద్రవేసి జైలుకు పంపేంతగా అణచివేత రాజ్యమేలుతోంది.
ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను బలితీసుకుంటున్న నేరస్తుల్లో 90 శాతం మందికి పైగా ఎలాంటి శిక్ష పడకుండా స్వేచ్ఛగా తిరుగుతుండటం, అక్షరంపై వేధింపులకు మరింత బలమిస్తోంది. అందుకే, నవంబర్ 2 అనేది కేవలం హత్యకు గురైన జర్నలిస్టుల స్మారకదినం కాదు.. జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, నేరస్తులను ఉరికంబం ఎక్కించాలని, పౌరుల సమాచార హక్కును కాపాడాలని ప్రపంచ పాలకులను నిలదీసే ఒక పోరాటదినం! ఐక్యరాజ్య సమితి (యుఎన్ఎ) ఆధ్వర్యంలో ‘జర్నలిస్టులపై దాడుల నిరోధక అంతర్జాతీయ దినోత్సవం’ జరుపుకుంటున్న వేళ.. అక్షరం అనుభవిస్తున్న నరకయాతనపై ప్రత్యేక విశ్లేషణ.
హత్యల వెనుక మిగిలిపోతున్న ప్రశ్న - న్యాయం ఎప్పుడు ?
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం.. 2006 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా 1,800 మందికి పైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ హత్యల్లో దాదాపు 10 కేసులకు గాను 9 కేసుల్లో హంతకులకు ఎలాంటి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. అంటే హత్యకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు న్యాయం అందకపోవడమే కాకుండా, నేరస్తులకు శిక్ష పడుతుందనే నమ్మకం కూడా బలహీనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దోషులకు దక్కతున్న ఈ ‘అపరాధ రక్షణ’ (Impunity) సంస్కృతి నేరస్తులకు మరింత ధైర్యాన్నిస్తోంది. ఇది కేవలం న్యాయవ్యవస్థ వైఫల్యం కాదు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను రక్షించడంలో సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం.
జర్నలిస్టుపై దాడి అంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమే..
జర్నలిస్టు పని కేవలం వార్తలు రాయడం, ప్రసారం చేయడం మాత్రమే కాదు. ప్రజలకు తెలియని విషయాలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల నిర్ణయాలను పరిశీలించడం, ప్రజాధనం ఎలా ఖర్చవుతోందో వెల్లడించడం, అన్యాయానికి గురైనవారి గొంతుకగా నిలవడం కూడా జర్నలిస్టుల బాధ్యత. ఒక జర్నలిస్టు హత్యకు గురైనపుడు ఒక వ్యక్తి ప్రాణం మాత్రమే పోదు., అతను వెలికితీసే అవకాశం ఉన్న నిజాలు, బయటపడాల్సిన అక్రమాలు, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల గొంతులపై కూడా కత్తులు వేలాడతాయి. అందుకే జర్నలిస్టుల భద్రత అనేది జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్య మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సమాచార హక్కుకు సంబంధించిన ప్రజాస్వామ్య సమస్య.

హత్యలకు దారితీస్తున్న కారణాలేమిటి ?
అవినీతి, రాజకీయ అక్రమాలు, వ్యవస్థీకృత నేరాలు, మాఫియా కార్యకలాపాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం, యుద్ధనేరాలు వంటి అంశాలపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురించే జర్నలిస్టులు అనేక సందర్భాల్లో దాడులకు లక్ష్యంగా మారుతున్నారు. తమ అక్రమాలు బయటపడతాయనే భయంతో కొందరు నేరస్తులు జర్నలిస్టులను బెదిరిస్తారు. మరికొందరు దాడులకు పాల్పడతారు. ప్రజాప్రయోజనాల కంటే వ్యక్తిగత, ఆర్థిక లేదా రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే శక్తులు స్వతంత్ర జర్నలిజాన్ని తమకు అడ్డంకిగా భావిస్తాయి. నిజాల్ని ఎదుర్కొనే బదులు, వాటిని బయటపెట్టిన వ్యక్తిని మౌనిగా మార్చాలనుకోవడమే ఈ హింస లక్ష్యం.
యుద్ధ ప్రాంతాల్లో జర్నలిస్టుల ప్రాణాలకు తీవ్ర ముప్పు
సాయుధ ఘర్షణలు జర్నలిస్టుల భద్రతను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. యుద్ధభూముల్లో జరుగుతున్న దాడులు, పౌరుల మరణాలు, నిర్బంధాలు, నిరాశ్రయుల బాధలు, మానవహక్కుల ఉల్లంఘనలను ప్రపంచానికి తెలియజేయడం జర్నలిస్టుల విధుల్లో భాగం. కానీ అదే బాధ్యత వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. యుఎన్ఎ నివేదికల ప్రకారం.. 2023-24లో విధినిర్వహణలో 162 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ మరణాల్లో దాదాపు సగం సాయుధ ఘర్షణలు జరుగుతున్న దేశాల్లో నమోదయ్యాయి. గాజా వంటి యుద్ధ ప్రాంతాల్లో జర్నలిస్టుల మరణాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. యుద్ధక్షేత్రంలో జర్నలిస్టులు సైనిక లక్ష్యాలు కాదు, వారు ప్రజలకు సమాచారం అందించే కలంవీరులు. వారి భద్రతను నిర్ధారించడం అంతర్జాతీయ మానవతా చట్టం పట్ల గౌరవానికి కూడా సంబంధించిన అంశం.
హత్యల భయం.. బెదిరింపుల ఒత్తిడి
జర్నలిస్టులపై జరిగే ప్రతి దాడి ప్రాణాంతకంగా ఉండదు. కొట్టడం, కిడ్నాప్ చేయడం, అక్రమ నిర్బంధం, వేధింపులు, ఫోన్ల ద్వారా బెదిరింపులు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం, నిఘా పెట్టడం, కార్యాలయాలపై దాడులు చేయడం వంటి అనేక రూపాల్లో హింస కొనసాగుతోంది. ఒక జర్నలిస్టును బహిరంగంగా హత్య చేయడం ఎంతటి నేరమో, మరో జర్నలిస్టు తన కుటుంబ భద్రత గురించి భయపడి నిజం రాయకుండా ఉండే పరిస్థితి కల్పించడం కూడా అంతే ప్రమాదకరం. ఎందుకంటే, భయంతో ఆగిపోయిన వార్త బయటకు రాదు. బయటకు రాని నిజం ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేయలేదు. స్వేచ్ఛగా రాయడానికి, ప్రశ్నించడానికి, పరిశోధించడానికి వీలులేని వాతావరణం ఏర్పడితే పత్రికాస్వేచ్ఛ కాగితాలకే పరిమితమై మరణించినట్టే !
తప్పుడు కేసులు, కోర్టు వ్యాజ్యాలు కూడా ఒత్తిడి సాధనాలే
ప్రభావశీల వ్యక్తులు లేదా సంస్థలపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను భారీ నష్టపరిహారం కోరుతూ దావాలు వేయడం, నిరాధారమైన క్రిమినల్ కేసుల్లో ఇరికించడం, పదేపదే విచారణలకు హాజరయ్యేలా ఒత్తిడి పెట్టడం వంటి చర్యలు జర్నలిజాన్ని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తాయి. ఈ ఎత్తుగడలను ప్రజా భాగస్వామ్యాన్ని అడ్డుకునే, ప్రజల గొంతు నొక్కే వ్యూహాత్మక వ్యాజ్యాలని అంటారు. ఇలాంటి చర్యల ఉద్దేశం ప్రతి సందర్భంలో న్యాయం పొందడమే కాకపోవచ్చు, విమర్శకులను అలసిపోయేలా చేయడం, వారి వనరులను ఖర్చు చేయించడం, ఇతరులకు హెచ్చరిక పంపడం కూడా కావచ్చు. చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రశ్నించే గొంతులను అణచివేస్తే, కోర్టులను ఆశ్రయించడమే భారంగా మారుతుంది. నిజాయతీగా పనిచేసే జర్నలిస్టుకు చట్టపరమైన రక్షణ, న్యాయ సహాయం అందుబాటులో ఉండాలి.
విశ్వసనీయతను దెబ్బతీసే కొత్త రూపాలు
సాంకేతిక పరిజ్ఞానం సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ, జర్నలిస్టులపై దాడులకు కూడా కొత్త మార్గాలు తెరిచింది. సోషల్ మీడియాలో సమన్వయంతో దూషణలు చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, ఖాతాలను హ్యాక్ చేయడం, నిఘా పెట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, కృత్రిమ మేధస్సుతో నకిలీ చిత్రాలు, వీడియోలు సృష్టించడం వంటి చర్యలు జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీసే నీచ సంస్కృతిగా మారింది. ముఖ్యంగా పరిశోధనాత్మక కథనాలు రాసేవారిని లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో వేధించడం, వారిపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల వారి వృత్తి, వ్యక్తిగత జీవితమూ ప్రభావితమవుతున్నాయి. సాంకేతికత మారుతున్నకొద్దీ జర్నలిస్టుల రక్షణ వ్యవస్థలు కూడా బలపడాలి.
మహిళా జర్నలిస్టులపై ద్వంద్వ దాడి
మహిళా జర్నలిస్టులు వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు లింగవివక్షతో కూడిన దూషణలు, లైంగిక వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత చిత్రాల దుర్వినియోగం వంటి ప్రత్యేకమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. యునెస్కో 2021 అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాల్గొన్న మహిళా జర్నలిస్టుల్లో 73 శాతం మంది తమ వృత్తికి సంబంధించి ఆన్లైన్ హింసను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ బెదిరింపులు వాస్తవ ప్రపంచంలో శారీరక దాడులకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. కృత్రిమ మేధస్సుతో నకిలీ చిత్రాలు, వీడియోలు రూపొందించి వేధించడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మహిళా జర్నలిస్టులను మౌనంగా ఉండేలా చేయడం ద్వారా వారి గొంతుక మాత్రమే కాదు, సమాజంలో మహిళల అనుభవాలు, సమస్యలు, హక్కులపై వెలువడాల్సిన సమాచారం కూడా అణచివేతకు గురవుతోంది.

లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు ఆందోళనకర పరిస్థితి
జర్నలిస్టుల హత్యలు, బెదిరింపులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. యునెస్కో గణాంకాల ప్రకారం.. లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలు జర్నలిస్టుల హత్యలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్నాయి. మెక్సికో వంటి దేశాల్లో నేర ముఠాలు, అవినీతి, స్థానిక అధికార వ్యవస్థలపై వార్తలు రాసే జర్నలిస్టులు తీవ్ర ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు యూరప్‌లో కూడా భౌతిక దాడులు, నిర్బంధాలు, ఆన్లైన్ వేధింపులు, న్యాయపరమైన ఒత్తిళ్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూరప్ కౌన్సిల్‌కు చెందిన జర్నలిస్టుల భద్రతా వేదిక ఏర్పాటైన పదేళ్లలో మీడియా స్వేచ్ఛకు సంబంధించిన 2,000కు పైగా తీవ్రమైన ముప్పులను నమోదు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో జర్నలిస్టులు సురక్షితంగా ఉన్నారని భావించలేం. వాటి పనితీరును నిరంతరం పరిశీలించాలి.
పోలీసు, దర్యాప్తు, న్యాయవ్యవస్థల పాత్ర కీలకం
జర్నలిస్టులపై దాడుల కేసుల్లో మొదటి నుంచే సాక్ష్యాలను భద్రపరచడం, దాడి వెనుక ఉద్దేశాలను పరిశీలించడం, బెదిరింపుల చరిత్రను గుర్తించడం, సాక్షులకు రక్షణ కల్పించడం అత్యంత అవసరం. దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ జరపాలి. నేరస్తుల స్థాయి, రాజకీయ సంబంధాలు, ఆర్థిక శక్తి యుక్తులు దర్యాప్తును ప్రభావితం చేయకూడదు. కేసుల పురోగతిపై బాధిత కుటుంబాలకు సమాచారం అందించాలి. విచారణలు అనవసరంగా సాగకుండా, న్యాయ ప్రక్రియ సమర్థంగా కొనసాగాలి. జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కేసుల్లో శిక్ష పడినపుడు.. అది బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది.
ఐక్యరాజ్య సమితి కార్యాచరణ ప్రణాళిక ఎందుకు ముఖ్యం ?
జర్నలిస్టుల భద్రత, వారిపై నేరాలకు శిక్షార్హత సమస్యను పరిష్కరించడానికి‘జర్నలిస్టుల భద్రత, నేరస్తులకు శిక్ష పడకపోవడం’ వంటి సమస్యలపై ఐక్యరాజ్య సమితి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి సంస్థలు, ప్రభుత్వాలు, మీడియా సంస్థలు, పౌరసమాజాలు కలిసి పనిచేసే విధానానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది. జర్నలిస్టులపై దాడులను నివారించడం, ప్రమాదంలో ఉన్నవారికి రక్షణ కల్పించడం, నేరస్తులపై విచారణ జరిపి శిక్షలు పడేలా చూడటం దీని ప్రధాన లక్ష్యాలు. అనేక దేశాల్లో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడటానికి ఈ ప్రయత్నాలు తోడ్పడ్డాయి. అయితే ప్రణాళికలు రూపొందించడం మాత్రమే సరిపోదు. వాటికి అవసరమైన నిధులు, సిబ్బంది, రాజకీయ సంకల్పం, నిరంతర పర్యవేక్షణ కూడా అవసరం.
మీడియా సంస్థలూ తమ బాధ్యతను గుర్తించాలి
జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వాల చర్యలతో పాటు మీడియా సంస్థల బాధ్యత కూడా కీలకం. ప్రమాదకర ప్రాంతాలకు పంపే జర్నలిస్టులకు తగిన శిక్షణ, రక్షణ పరికరాలు, భద్రతా మార్గదర్శకాలు, న్యాయ సహాయం, అవసరమైన బీమా కల్పించాలి. బెదిరింపులు ఎదురైనపుడు వారిని ఒంటరిగా వదిలేయకూడదు. వార్త ప్రచురించిన తర్వాత వివాదం తలెత్తితే సంస్థాగత మద్దతు అందించాలి. ముఖ్యంగా చిన్న పత్రికలు, స్థానిక మీడియా సంస్థలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఆర్థిక వనరుల కొరతతో మరింత ప్రమాదంలో ఉండవచ్చు. వారి భద్రతను కూడా సమానంగా పరిగణించాలి. వార్తా సంస్థలు తమ సిబ్బంది ప్రాణాల కంటే వార్తా ప్రచురణలో పోటీకి ప్రాధాన్యమిస్తే, స్వతంత్ర జర్నలిజం నిలదొక్కుకోవడం కష్టమవుతుంది.
ప్రజల మద్దతు లేకుండా పత్రికాస్వేచ్ఛను కాపాడలేం !
జర్నలిస్టులపై దాడి జరిగినపుడు దాన్ని ఒక వృత్తి సంఘం సమస్యగా మాత్రమే చూడకూడదు. ప్రజలు కూడా స్పందించాలి. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేయాలి. విశ్వసనీయ సమాచారం పంచుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని గుర్తించి ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో జర్నలిస్టులపై జరిగే వేధింపులను వినోదంగా తీసుకోకూడదు. విమర్శనాత్మక వార్త నచ్చలేదని జర్నలిస్టును దూషించడం, బెదిరించడం, వ్యక్తిగత దాడులకు దిగడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధం. వార్తలో తప్పు ఉంటే ఆధారాలతో ఖండించవచ్చు. చట్టబద్ధంగా ఫిర్యాదు చేయవచ్చు. కానీ ప్రశ్నించే హక్కును హింసతో అణచివేయడం ఏ పరిస్థితిలోనూ సమర్థనీయం కాదు. ప్రజలు జర్నలిస్టుల భద్రత కోసం నిలబడినపుడే ప్రజల సమాచార హక్కు బలపడుతుంది.
జర్నలిస్టుల స్వేచ్ఛే.. ప్రజాస్వామ్యానికి ఊపిరి !
జర్నలిజం అంటే అధికారాన్ని సమర్థించడం మాత్రమే కాదు, అధికారాన్ని ప్రశ్నించడం కూడా. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, నేర ముఠాలు, ఇతర ప్రభావశీల శక్తులు ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని వెలుగులోకి తీసుకురావడం స్వతంత్ర మీడియా బాధ్యత. అదే సమయంలో జర్నలిస్టులు కూడా వాస్తవ నిర్ధారణ, ఆధారాల పరిశీలన, నిష్పాక్షికత, వృత్తి నైతికతను పాటించాలి. స్వేచ్ఛతో పాటు జవాబుదారీతనం ముఖ్యం. అయితే జర్నలిస్టు తప్పుచేస్తే దానికి చట్టబద్ధమైన పరిష్కారం ఉండాలి. దాడి, బెదిరింపు, హత్య ఎప్పటికీ పరిష్కారం కావు. నిజాన్ని నిర్ధారించే స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉన్నపుడే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుంది.
జర్నలిస్టులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగకూడదు
నవంబర్ 2 మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని స్తోంది. జర్నలిస్టుల హత్యలను మరిచిపోవడం అంటే నేరస్తులకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించ డమే. ప్రతి హత్యపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. ప్రతి నేరస్తుడిని చట్టం ముందు నిలబెట్టాలి. ప్రతి బెదిరింపును తీవ్రంగా పరిగణించాలి. ప్రమాదంలో ఉన్న జర్నలిస్టులకు తక్షణ రక్షణ కల్పించాలి. మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్, ఆఫ్‌లైన్ హింసను అరికట్టాలి. ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, మీడియా సంస్థలు, పౌరసమాజం, ప్రజలు కలసికట్టుగా పనిచేయాలి. హత్యకు గురైన జర్నలిస్టును తిరిగి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయగలం. మరో జర్నలిస్టు అదే పరిస్థితిని ఎదుర్కోకుండా నిరోధించగలం. జర్నలిస్టు ప్రాణానికి రక్షణ, కలానికి స్వేచ్ఛ, నేరస్తుడికి శిక్ష- ఇవి జర్నలిస్టులకు చేసే ఉపకారాలు కావు, ప్రజాస్వామ్యం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతలు.
జర్నలిస్టుల రక్షణకు యుఎన్ఒ ప్రత్యేక దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఖండించడం, హత్యలకు బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టడం, పత్రికాస్వేచ్ఛను పరిరక్షించడం లక్ష్యంగా నవంబర్ 2ను ‘జర్నలిస్టులపై దాడుల నిరోధక అంతర్జాతీయ దినోత్సవం’గా పాటిస్తున్నారు. 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ ఏడాది నవంబర్ 2న మాలిలో ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు హత్యకు గురైన ఘటనను స్మరించుకుంటూ, ఈ తేదీని ఎంచుకున్నారు. జర్నలిస్టుల భద్రత ప్రభుత్వాల బాధ్యత అని, దాడులకు పాల్పడేవారికి శిక్ష పడాలని ప్రపంచ దేశాలకు ఈ తీర్మానం స్పష్టం చేసింది.

ప్రభుత్వాల బాధ్యత.. ప్రకటనలకే పరిమితం కాకూడదు !
జర్నలిస్టుల భద్రత ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. దాడులు జరిగిన తర్వాత ఖండన మండనలు జారీ చేయడం మాత్రమే సరిపోదు. ముందస్తు రక్షణ, ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పాక్షిక దర్యాప్తు, నిందితులపై చట్టబద్ధ చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి చర్యలు అమలులో కనిపించాలి. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించినందుకు జర్నలిస్టులను శత్రువులుగా చూడకూడదు. ప్రభుత్వ విధానాలపై విమర్శను ప్రజాస్వామ్యంలో సహజమైన భాగంగా గుర్తించాలి. పోలీసు, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కల్పించాలి. జర్నలిస్టులపై నేరాలు చేసినవారు ఎంత ప్రభావశీలురైనా చట్టం ముందు సమానంగా జవాబుదారీ కావాలి. ఇదే చట్టపాలనకు నిజమైన పరీక్ష.
హత్యలపై మౌనం.. మరో హత్యకు మార్గం !
జర్నలిస్టును హత్య చేసినవారికి శిక్ష పడకపోతే, ఆ నేరం ఒక వ్యక్తితో ముగిసిపోదు. అదే పద్ధతిలో నేరం చేసే ఇతరులకు అది పరోక్షంగా ధైర్యాన్నిస్తుంది. బాధిత కుటుంబాలు న్యాయం కోసం పోలీసులు, కోర్టులు, అధికారులు, నాయకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, నేరస్తులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితిని అవినీతి వ్యవస్థ కల్పిస్తోంది. కేసులు నమోదు చేయకపోవడం, దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, సాక్ష్యాలను సేకరించడంలో నిర్లక్ష్యం, సాక్షులపై ఒత్తిళ్లు, రాజకీయ లేదా ఆర్థిక ప్రభావాలు దర్యాప్తును బలహీనపరచవచ్చు. న్యాయం అందకపోవడం వల్ల జర్నలిస్టుల్లో భయం పెరుగుతుంది. సమాజంలో నిజాలు వెలికితీసే ప్రయత్నాలు సన్నగిల్లుతాయి. అందుకే జర్నలిస్టులపై జరిగిన హత్యలకు నేరస్తులను శిక్షించడం గతానికి న్యాయం చేయడమే కాదు.. మరో జర్నలిస్టు ప్రాణం బలికాకుండా కాపాడటం, భవిష్యత్తులో జరిగే దాడులకు నేరస్తులు వెనుకాడేలా చేయడం కూడా!.
మహిళా విలేకరులపై రాజ్యహింస
భారతదేశంలో నిజం చెప్పడమే నేరమైనట్లు స్వతంత్ర మహిళా విలేకరులపై రాజ్యహింస, భౌతిక దాడులు, ఆన్లైన్ వేధింపులు విరుచుకుపడుతున్నాయి. సమాజంలోని అక్రమాలను, పాలకుల వైఫల్యాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే మహిళా పాత్రికేయుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర అవమానకరం. ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్లో ‘4PM న్యూస్ నెట్వర్క్’ జర్నలిస్టులు షాహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌లను పోలీసులు లాఠీలతో కొట్టి, మతం పేరుతో దూషించడం అక్షరంపై జరిగిన అమానుష దాడికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక జంతర్ మంతర్ వద్ద నిరసనలను కవర్ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు, అసభ్య ప్రవర్తనకు పాల్పడటం యావత్ పౌరసమాజం తలదించుకునేలా చేసింది. యూపీలో మసీదు కూల్చివేతను రిపోర్ట్ చేసినందుకు పూజా మాధుర్‌పై అక్రమ కేసులు బనాయించడం, ప్రెస్ మీట్లో సీఎంను ప్రశ్నించినందుకు దివ్య శ్రీవాస్తవపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, బెదిరింపులకు పాల్పడటం పత్రికాస్వేచ్ఛను బహిరంగంగా దెబ్బతీసే ప్రయత్నమే! భౌతిక దాడులతో పాటు డిజిటల్ వేదికలపై మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ దాడి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రముఖ కాలమిస్ట్ రాణా అయ్యూబ్‌ను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను లీక్ చేయడం, డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీని సృష్టించి వైరల్ చేయడం, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి వేధించడం పాలకవర్గాల అణచివేత ధోరణికి అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో పసిపిల్లల మరణాలపై గ్రౌండ్ రిపోర్టింగ్ చేసిన స్వతంత్ర జర్నలిస్టులు బిందు రోమి గుజ్జర్, మోనికా సింగ్‌లను అర్ధరాత్రి హోటల్ గదుల వరకు పోలీసులు వెంబడించి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ అరాచకత్వాన్ని రూపుమాపి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయకపోతే.. ప్రశ్నంచే గొంతు లేకుండాపోయి సమాజం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే, భయపడకుండా నిజాన్ని వెలికితీసే అక్షరయోధులకు పౌరసమాజమే అజేయమైన రక్షాకవచమై నిలవాలి.
దౌర్జన్యానికి దిగిన రక్షకుడికి ప్రమోషన్ బహుమతి!
జంతర్ మంతర్ వద్ద మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ ఉదంతం.. రక్షక భటుల జవాబుదారీతనంపై నిలదీస్తోంది. అక్షర యోధులపై అరాచకానికి ఒడిగట్టిన సదరు అధికారిపై కనీస చర్యలు తీసుకోవాల్సింది పోగా, ఏకంగా 'అడిషనల్ డిప్యూటీ కమిషనర్'గా పదోన్నతి కట్టబెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అయితే, ఈ నిర్ణయంపై ప్రజాసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగివచ్చి ఆ పదోన్నతిని ఎట్టకేలకు నిలిపివేసింది. నేరం చేసిన వారికి రక్షణ కల్పిస్తూ పదోన్నతిని బహుమతిగా అందించే ఈ అరాచకం.. భారత ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంతటి దుర్భర స్థితిలో ఉందో కళ్లకు కడుతోంది.
కప్పన్ జైలు జీవితం.. దేశ పత్రికా స్వేచ్ఛకు హెచ్చరిక !
సిద్ధిఖ్ కప్పన్ కేసులో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్న భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తుంది: ‘బాధితురాలికి న్యాయం కావాలని గళమెత్తడం నేరమా?’ హత్రాస్ దళిత యువతి అత్యాచారం, మరణం ఘటనపై రిపోర్టింగ్ చేసేందుకు వెళ్తున్న కప్పన్‌ను 2020 అక్టోబర్ 5న ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి, ఉగ్రవాద నిరోధక చట్టం సహా తీవ్రమైన అభియోగాలు మోపారు. సుమారు 28 నెలలు జైల్లో గడిపిన ఆయనకు 2022 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, 2023 ఫిబ్రవరి 2న విడుదలయ్యారు. అయితే, కప్పన్ విడుదలతోనే సమస్య ముగిసిపోలేదు. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు, అరెస్టులు, బెదిరింపులు, భౌతిక దాడులు, ఆన్లైన్ వేధింపులు కొనసాగుతున్నాయి. 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానానికి దిగజారింది. అధికారాన్ని ప్రశ్నించడం, బాధితులకు న్యాయం కోరడం, ప్రజా ప్రయోజనాల కోసం నిజాలను వెలికితీయడం జర్నలిస్టుల నేరం కాదు—ప్రజాస్వామ్యానికి వారు నిర్వర్తించే బాధ్యత. ఆ బాధ్యతను నేరంగా చిత్రీకరించే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే, సంకెళ్లు కప్పన్ చేతులకే కాదు.. దేశంలో నిజం రాయాలనుకునే ప్రతి కలానికీ పడతాయి !
ఢిల్లీ సరిహద్దుల్లో అంతులేని అణచివేత !
మన దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ఢిల్లీలో సాగిన రైతుల ఉద్యమంలో భారత స్వతంత్ర జర్నలిజం ఎంతటి భయానక వాతావరణాన్ని ఎదుర్కొందో ప్రపంచమంతా దిగ్భ్రాంతితో చూసింది. సింఘు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో లక్షలాది మంది రైతులు హక్కుల కోసం పోరాడుతుంటే, ప్రధాన స్రవంతి మీడియా కార్పొరేట్ శక్తుల ప్రాపకం కోసం ఆ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ స్వతంత్ర జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు సరిహద్దుల్లోనే డేరాలు వేసి సత్యాన్ని లోకానికి చాటారు. ఆ నిజాలు పాలకులకు కంటగింపై రాజ్యహింసగా విరుచుకుపడ్డాయి. వాస్తవాలను రిపోర్ట్ చేసిన మన్దీప్ పునియా, ధర్మేందర్ సింగ్ వంటి జర్నలిస్టులను రాత్రికి రాత్రే ఈడ్చుకెళ్లి అక్రమంగా అరెస్టు చేశారు. శశి థరూర్, రాజ్ దీప్ సర్దేశాయ్, మృణాళ్ పాండే, వినోద్ కె జోస్ వంటి సీనియర్ ఎడిటర్లపై ‘రైతుల మరణాల వెనుక ఏం జరిగింది?’ అని ప్రశ్నించినందుకు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. పాత్రికేయుల సంచారాన్ని అడ్డుకోడానికి రోడ్లపై పదునైన మేకులు కొట్టి, కాంక్రీట్ గోడలుకట్టి, వారాల తరబడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆఖరికి ‘ట్విట్టర్ (X)’ ఖాతాలను బ్లాక్ చేయిస్తూ, నిజాలు రాసేవారిపై ‘ఖలిస్తానీ’లు, ‘దేశద్రోహులు’ అని ముద్రవేసి ఆన్లైన్ వేధింపులతో మానసికంగా దెబ్బతీశారు. నిజం మాట్లాడటమే నేరమై, సరిహద్దుల్లో అక్షరం ముళ్లకంచెల మధ్య బంధీ అయిన ఆ క్షణాలు- భారత ప్రజాస్వామ్య చరిత్రలో పత్రికాస్వేచ్ఛపై పడిన చెరగని మచ్చగా మిగిలిపోయాయి.
జమ్మూ కాశ్మీర్, మణిపూర్..
సమర ప్రాంతాల్లో బందీ అయిన సత్యం !
యుద్ధ ప్రాంతాల్లో, సరిహద్దు ఘర్షణల్లో ప్రాణాలకు తెగించి వార్తలను అందించే జర్నలిస్టులపై పాలకపక్షం ప్రయోగించిన ఉక్కుపాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం క్రూరమైన యుఏపిఏ (UAPA), పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) వంటి కఠిన చట్టాలను అస్త్రాలుగా మలచుకుని ఫహద్ షా, సజాద్ గుల్, ఆసిఫ్ సుల్తాన్, ఇర్ఫాన్ మేరాజ్ వంటి స్వతంత్ర జర్నలిస్టులను అక్రమంగా జైలుపాలు చేశారు. ఉగ్రదాడులు, సైనిక మరణాలు, భద్రతా వైఫల్యాలపై లోతైన నిజాలు రాసేవారిని 'దేశద్రోహులు', 'ఉగ్రవాద ప్రోత్సాహకులు' అని ముద్రవేసి, పాస్‌పోర్టులు రద్దు చేస్తూ తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. ఇక హింసాత్మక ఘటనలతో రగిలిపోయిన మణిపూర్‌లో వందలాది రోజులు ఇంటర్నెట్ నిలిపివేసి సమాచార దిగ్బంధం విధిస్తే.. అక్కడి క్షేత్రస్థాయి వాస్తవాలను వెలికితీసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) సీనియర్ పాత్రికేయులపైనే పాలకపక్షం క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అణచివేతకు పరాకాష్ట! సరిహద్దుల్లో ఉగ్రవాదులు, అల్లరిమూకల కాల్పుల మధ్య సైనికులు, పౌరుల మరణాల వెనుక ఉన్న నిజాలను ప్రపంచానికి చెప్పడమే ఆ జర్నలిస్టులు చేసిన నేరమైంది. నిజాన్ని సమాజానికి అందించకుండా డిజిటల్ ఛానెళ్లను బ్లాక్ చేస్తూ, స్వతంత్ర అక్షరానికి తాళాలు వేస్తూ పాలకులు సాగిస్తున్న ఈ దమనకాండ—ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ ఉనికికే పెను ప్రమాదంగా మారింది !

రాజ్యాంగాన్ని మించిన అధికారం లేదు
ప్రబీర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ !
అరెస్టు కారణాలు చెప్పకుండా నిర్బంధం.. చట్టవిరుద్ధమని తేల్చిన అత్యున్నత న్యాయస్థానం! స్వతంత్ర మీడియా గొంతు నొక్కేందుకు పాలకుల అణచివేత ఏ స్థాయికి చేరినా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ముందు రాజ్యహింస తలవంచక తప్పదని 'న్యూస్‌క్లిక్' వ్యవస్థాపకులు, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో 2024 మే 15న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పత్రికా స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛకు కీలక రక్షణగా నిలిచింది. ఉపా కింద అరెస్టు చేసినప్పుడు, అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా అందించకుండా, ఆయన న్యాయవాదికి రిమాండ్ విచారణకు ముందు అవసరమైన పత్రాలు ఇవ్వకుండా నిర్బంధంలోకి పంపడాన్ని కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించి విడుదలకు ఆదేశించింది. అరెస్టు కారణాలను రాతపూర్వకంగా తెలియజేయడం రాజ్యాంగ హక్కు. దాన్ని ఉల్లంఘిస్తే నిర్బంధమే చట్టవిరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేసులోని ఆరోపణలపై తుది నిర్ణయం కాకపోయినా, జాతీయ భద్రత పేరుతోనైనా రాజ్యాంగ హక్కులను తొక్కిపెట్టలేరనే గట్టి సందేశాన్ని ఇచ్చింది. జర్నలిస్టు తప్పు చేశాడని ప్రభుత్వం ఆరోపించవచ్చు. కానీ చట్టాన్ని ఉల్లంఘించి శిక్షించలేరు. అధికారాన్ని ప్రశ్నించే కలానికి రక్షణ, అరెస్టయిన వ్యక్తికి న్యాయమైన ప్రక్రియ—ఇవే ప్రజాస్వామ్యానికి పునాదులు.

కృష్ణ కానూరి
సీనియర్ జర్నలిస్టు
7981305779








కామెంట్లు (0)