తూర్పు తీరంలోని అందమైన నగరం విశాఖ. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా గుర్తింపు పొందిన ఈ నగరం సహజసిద్ధమైన ప్రకృతి అందాలను కాపాడుకుంటూనే ఆధునిక అభివృద్ధిని అందిపుచ్చుకుంటోంది. బీచ్ కారిడార్, క్రూయిజ్ టూరిజం, స్మార్ట్ టూరిజం, ఎకో టూరిజం, సాహస పర్యాటకం వంటి ప్రాజెక్టులు పర్యాటకానికి కొత్తరూపు తీసుకొచ్చాయి.
సముద్రతీరాలే అసలు చిరునామా
విశాఖపట్నం అంటే ముందుగా గుర్తుకొచ్చేది సముద్రతీరాలే. నగరంలోని రామకృష్ణ బీచ్ ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులతో కళకళలాడుతుంటుంది. కుటుంబాలతో వచ్చే పర్యాటకులు, వ్యాయామం చేసే యువత, సూర్యోదయాన్ని ఆస్వాదించే ప్రకృతి ప్రేమికులు, సాయంత్రం వేళ చల్లని గాలిని ఆస్వాదించే సందర్శకులతో బీచ్ సందడిగా ఉంటుంది. ఈ బీచ్ వద్ద ఏర్పాటైన ఐఎన్‌ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం దేశంలోనే అరుదైన సముద్ర యుద్ధ మ్యూజియంగా గుర్తింపు పొందింది. దానికి సమీపంలో ఉన్న టియు–142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం , యుహెచ్3హెచ్ హెలికాప్టర్ భారత నౌకాదళ వైభవాన్ని చాటిచెబుతున్నాయి.
కైలాసగిరి
సముద్ర మట్టానికి సుమారు 360 అడుగుల ఎత్తులో ఉన్న కైలాసగిరి కొండ ప్రత్యేక ఆకర్షణ. ఇది నగర సహజ వీక్షణ స్థలం. ఇక్కడి నుంచి చూస్తే ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు నగర విస్తరణ, దూరంగా తూర్పు కనుమల పచ్చని దృశ్యాలు కనువిందు చేస్తాయి. భారీ శివపార్వతుల విగ్రహం, రోప్‌వే, టాయ్ ట్రైన్, వ్యూ పాయింట్లు, పిల్లల వినోద కేంద్రాలు, ఉద్యానవనాలు, రాత్రివేళ వెలుగులతో మెరిసే నగర దృశ్యాలు ప్రతి సందర్శకుడినీ ఆకట్టుకుంటాయి. ఇటీవల ఏర్పాటైన త్రిశూలం, డమరుకం కొత్త ఆకర్షణను సంతరించుకుని, కైలాసగిరిని మరింత సందర్శనీయంగా మార్చాయి.
రుషికొండ
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఈ బీచ్‌లో వాటర్ స్పోర్ట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్కూబా డైవింగ్, కయాకింగ్, జెట్ స్కీయింగ్, స్పీడ్ బోటింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు విదేశీ పర్యాటకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
భీమిలి.. చరిత్ర, ప్రకృతి కలిసిన తీరప్రాంతం
విశాఖ నుంచి భీమిలి వరకు సాగే బీచ్ రోడ్డు దేశంలోనే అత్యంత అందమైన తీరప్రాంత రహదారుల్లో ఒకటిగా పేరుపొందింది. ప్రయాణం సాగించేంతసేపూ ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని కొండలు కనువిందు చేస్తాయి. భీమిలిలోని డచ్ సమాధులు, చారిత్రక చర్చిలు, పాత లైట్‌హౌస్, సముద్రతీరం శతాబ్దాల చరిత్రను గుర్తు చేస్తాయి.
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం.. సింహాచలం
సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. చందనోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి యాత్రీకులు తరలి వస్తుంటారు. ఏటా నిర్వహించే సింహగిరి ప్రదక్షిణ లక్షలాది మంది యాత్రీకుల మేలి కలయికగా గుర్తింపు పొందింది. విశాఖ - భీమిలి తీరంలోని తొట్లకొండ, బావికొండ బౌద్ధ క్షేత్రాలు విశాఖకు మరో ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. క్రీస్తుపూర్వం కాలం నాటి బౌద్ధ నాగరికతకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
క్రూయిజ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం పోర్టును అంతర్జాతీయ క్రూయిజ్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆధునిక క్రూయిజ్ టెర్మినల్, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా విలాసవంతమైన కార్దిలియ క్రూయిజ్ షిప్ ఇక్కడి పర్యాటకులకు అందుబాటులో ఉంది.
ఎంఐసిఇ టూరిజం వైపు అడుగులు
కేవలం వినోద పర్యాటకానికే కాకుండా వ్యాపార, సమావేశాలు, అంతర్జాతీయ సదస్సుల కేంద్రంగా కూడా విశాఖ ఎదుగుతోంది. పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, బీచ్ రిసార్టులు, అంతర్జాతీయ స్థాయి సమావేశాల నిర్వహణకు అనువైన మౌలిక సదుపాయాలు నగరాన్ని కార్పొరేట్ టూరిజం కేంద్రంగా నిలబెడుతున్నాయి.
ఎకో టూరిజం : ప్రకృతితో మమేకం
కంబాలకొండ అభయారణ్యం, ముదసర్లోవ పార్కు, తూర్పు కనుమల అటవీ ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. జంగిల్ ట్రెక్కింగ్, ప్రకృతి విహారం, పక్షుల వీక్షణం, అడ్వెంచర్ యాక్టివిటీలు, జిప్ లైనింగ్ వంటి కార్యక్రమాలను యువతను ఆకర్షించేలా రూపకల్పన చేస్తున్నారు.
స్మార్ట్ టూరిజం వైపు అడుగులు
డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో విశాఖ ముందంజలో నిలుస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా సమాచారాన్ని అందించే విధానం, ఆన్‌లైన్ టికెటింగ్, డిజిటల్ మ్యాపింగ్, స్మార్ట్ పార్కింగ్, ఉచిత వైఫై, డిజిటల్ సైనేజ్‌లు, ఎల్‌ఇడి లైటింగ్, సిసి టీవీ నిఘా వంటి సౌకర్యాలు పర్యాటకులకు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తున్నాయి.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ఊతం
పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, క్యాబ్ సేవలు, వాటర్ స్పోర్ట్స్, హస్తకళలు, షాపింగ్ కేంద్రాలు, స్థానిక వ్యాపారాల ఆదాయం పెరుగుతోంది. అరకు గిరిజన ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, హస్తకళలు, స్థానిక ఆహార పదార్థాలు దేశ విదేశాలకు చేరుతున్నాయి. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.








కామెంట్‌లు (0)