రాష్ట్రీయ పోషణ మాసం 2026 పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి, పిల్లల సంపూర్ణ ఆరోగ్యం,పోషణను ప్రోత్సహించడానికి అంకితమైన ఒక దేశవ్యాప్త కార్యక్రమం.సెప్టెంబర్ నెల మొత్తం పోషణ మాసోత్సవ ప్రచార కార్యక్రమాలుకొనసాగుతాయి. పిల్లలు,కౌమారదశలో ఉన్నవారు,మహిళలకు మెరుగైన పోషణను అందించే ప్రయత్నాలను ముమ్మరం చేయడమే ఈ నెల రోజుల కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే.. ఇంట్లో ఆరోగ్యానికి చోటుంటుంది. ఆమె బలంగా ఉంటేనే.. కుటుంబం బలంగా నిలుస్తుంది. ఆమె చిరునవ్వులోనే ఇంటి సంతోషం ఉంటుంది. మహిళ ఆరోగ్యం కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. సమాజ ఆరోగ్యానికి సంబంధించిన అంశం. అందుకే రాష్ట్రీయ పోషణ్ మాసం–2026 సందర్భంగా మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళకు మంచి ఆహారం, తగిన విశ్రాంతి, శారీరక చురుకుదనం, మానసిక ప్రశాంతత, అవసరమైన వైద్య పరీక్షలు అందేలా కుటుంబం అండగా నిలవాలి.
ఆహారం కేవలం ఆకలి తీర్చడానికి కాదు.. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి, అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగాలను ఎదుర్కొనే శక్తిని పెంచడానికి అవసరం. మహిళ జీవితంలోని ప్రతి దశలో పోషకాహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. బాల్యం నుంచే సరైన ఆహారం తీసుకున్న బాలిక ఆరోగ్యంగా ఎదుగుతుంది. యుక్తవయస్సులో శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా పోషకాలు అందాలి. వివాహానంతరం కూడా ఆమె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భధారణ సమయంలో తల్లికి అందే పోషకాహారం ఆమె ఆరోగ్యానికే కాకుండా గర్భంలోని శిశువు ఎదుగుదలకూ కీలకం. ప్రసవం తరువాత బాలింతకు సరైన ఆహారం, విశ్రాంతి లభిస్తే ఆమె త్వరగా కోలుకోవడంతో పాటు శిశువుకు తగినంత తల్లిపాలు అందించగలుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలను నివారించేందుకు తగిన పోషకాలు అవసరం. అందుకే మహిళ జీవితంలోని ప్రతి దశలోనూ పోషకాహారం ఒక అవసరం. విలాసం కాదు.
తినే ఆహారంపై శ్రద్ధ అవసరం..
కుటుంబంలో అందరి ఆహారం గురించి శ్రద్ధ తీసుకునే మహిళ.. తాను ఏమి తింటున్నాననే విషయాన్ని చాలాసార్లు పట్టించుకోదు. ఉదయం అల్పాహారం తీసుకోకుండానే ఇంటిపనుల్లో మునిగిపోవడం, మధ్యాహ్న భోజనాన్ని ఆలస్యం చేయడం, పిల్లలు తినగా మిగిలినదానితో సరిపెట్టుకోవడం, పనుల ఒత్తిడిలో తగినంత నీరూ తాగకపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మహిళ ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అన్నిరకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అన్నం లేదా ఇతర ధాన్యాలతో పాటు పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటి ఆహారపదార్థాలను అవసరానికి అనుగుణంగా తీసుకోవాలి. చిరుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలూ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. శాకాహారం తీసుకునేవారు పప్పులు, శనగలు, పెసలు, మినుములు, సోయా వంటి వాటిని తగినంతగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందొచ్చు. ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉండాలి. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్, బీరకాయ, సొరకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడు వంటి స్థానికంగా లభించే కూరగాయలను తరచుగా మార్చి మార్చి తీసుకోవాలి. అరటి, జామ, బొప్పాయి, నారింజ, సీతాఫలం, దానిమ్మ వంటి కాలానుగుణ పండ్లను తగిన పరిమాణంలో తీసుకోవడం మంచిది. పండ్ల రసాల కంటే పండ్లను సహజ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
రక్తహీనతపై నిర్లక్ష్యం వద్దు
మహిళల ఆరోగ్యానికి రక్తహీనత ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న బాలికలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంటుంది. తరచూ అలసట, నీరసం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇనుము అధికంగా ఉండే ఆకుకూరలు, పప్పులు, శనగలు, పెసలు, నువ్వులు, బెల్లం వంటి ఆహారపదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. అయితే రక్తహీనత ఉన్నట్లు అనుమానం ఉంటే స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహాతో రక్తపరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే వైద్యుల సూచన మేరకు ఇనుము, ఇతర పోషక మాత్రలు తీసుకోవాలి.
ఎముకల బలానికి కాల్షియం
మహిళ జీవితంలో ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చిన్న వయస్సు నుంచే తగినంత కాల్షియం, విటమిన్–డి లభించేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ, నువ్వులు, ఆకుకూరలు వంటి ఆహారపదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సూర్యరశ్మి కూడా శరీరానికి అవసరమైన విటమిన్–డి ఏర్పడటానికి సహాయపడుతుంది. అందువల్ల వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన సమయం సూర్యరశ్మిలో ఉండడం, నడక వంటి శారీరక చురుకుదనాన్ని అలవాటు చేసుకోవడం అవసరం.
గర్భిణి ఆరోగ్యం.. శిశువు భవిష్యత్తు
గర్భధారణ సమయంలో మహిళ ఆరోగ్యం అత్యంత కీలకం. తల్లి తీసుకునే ఆహారం, ఆమె శారీరక, మానసిక ఆరోగ్యం గర్భంలోని శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల గర్భిణి ‘ఇద్దరి కోసం రెండింతలు తినాలి’ అనే అపోహను నమ్మకుండా.. వైద్యుల సూచనల ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు వంటి పోషక ఆహారాలను తగిన పరిమాణంలో తీసుకోవాలి. గర్భధారణ సమయంలో అవసరమైన ఇనుము, కాల్షియం, ఫోలిక్ ఆమ్లం తదితర పోషకాలను వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గర్భిణికి పోషకాహారం అందించడం కుటుంబం మొత్తం బాధ్యత. ఆమెకు విశ్రాంతి కల్పించడం, ఇంటి పనుల్లో సహకరించడం కూడా అంతే అవసరం.
బాలింతకు విశ్రాంతి.. పోషకాహారం ప్రసవం తరువాత మహిళ శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈ దశలో బాలింతకు తగినంత ఆహారం, నీరు, విశ్రాంతి అవసరం. శిశువుకు తల్లిపాలు అందించే తల్లి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఆమెపైనా, శిశువుపైనా ప్రభావం చూపుతుంది. ‘బిడ్డ పుట్టిన తరువాత తల్లి ఎక్కువగా తినకూడదు’, ‘కొన్ని ఆహారాలు తినకూడదు’ వంటి ఆధారరహిత ఆంక్షలను పాటించకుండా వైద్యులు, పోషకాహార నిపుణుల సూచనలు పాటించాలి. ఇంట్లో తయారుచేసిన తాజా, పోషకమైన ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలి.
ఇంటి వంట.. ఆరోగ్యానికి తొలి మెట్టు
ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఖరీదైన పదార్థాలే అవసరం లేదు. మన ఇళ్లలో తరతరాలుగా వాడుతున్న స్థానిక ఆహారపదార్థాల్లోనే అనేక పోషక విలువలు ఉన్నాయి. అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, చిరుధాన్యాలు, పండ్లు, గుడ్లు వంటి సాధారణ పదార్థాలను సరైన పరిమాణంలో తీసుకుంటే మంచి ఆహారాన్ని రూపొందించుకోవచ్చు. అధికంగా వేయించిన పదార్థాలు, అధిక చక్కెర కలిగిన తీపి పదార్థాలు, తీపి పానీయాలు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ నూనెను తగ్గించడం అవసరం. ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుచికంటే పోషణకు.. పరిమాణం కంటే సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
చిన్న మార్పులు.. పెద్ద ఆరోగ్యం
ఆరోగ్యం కోసం ఒకేసారి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చు. ప్రతి రోజు అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు, ఆకుకూరలకు స్థానం కల్పించాలి. పప్పులు, ఇతర ప్రోటీన్ ఆహారాలను తగినంతగా తీసుకోవాలి. కాలానుగుణ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. తగినంత నీరు తాగాలి. అధిక ఉప్పు, చక్కెర, నూనెను తగ్గించాలి. అదే సమయంలో ప్రతిరోజూ కొంత సమయం నడక, వ్యాయామం లేదా ఇతర శారీరక చురుకుదనానికి కేటాయించాలి. రాత్రివేళ తగినంత నిద్రపోవాలి. నిరంతర ఒత్తిడికి లోనుకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, విశ్రాంతి తీసుకోవడం, తనకు ఇష్టమైన పనులకు కొంత సమయం కేటాయించడం కూడా అవసరం.
మహిళ ఆరోగ్యం.. కుటుంబ బాధ్యత
మహిళ ఆరోగ్యాన్ని కేవలం మహిళ వ్యక్తిగత బాధ్యతగా చూడకూడదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమె ఆరోగ్యాన్ని గౌరవించాలి. అందరికీ భోజనం పెట్టే ముందు ఆమె తినేలా చూడాలి. ఇంటి పనులను పంచుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలి. వైద్య పరీక్షలు అవసరమైనప్పుడు ఆమెను ప్రోత్సహించాలి. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. అందుకే మహిళ ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ.. కుటుంబ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి.
నెలసరిపై అవగాహన
బాలికలు, యువతుల్లో నెలసరి ఆరోగ్యంపై సరైన అవగాహన అవసరం. నెలసరి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూడాలి. పరిశుభ్రత పాటించాలి. తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, నెలసరి క్రమంలో తరచూ మార్పులు వంటి సమస్యలు ఉంటే వాటిని దాచిపెట్టకుండా వైద్యులను సంప్రదించాలి.
నెలసరి అనేది సహజమైన శారీరక ప్రక్రియ. దానిపై సిగ్గు, భయం, అపోహలకు తావివ్వకుండా బాలికలకు చిన్న వయస్సు నుంచే సరైన అవగాహన కల్పించాలి.
మహిళ జీవితంలో మెనోపాజ్.. మరో ముఖ్యమైన దశ. రుతుచక్రం ముగిసే దశ కూడా ప్రత్యేక శ్రద్ధ కోరుతుంది. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా వేడి అనిపించడం, నిద్రలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావొచ్చు. ఈ మార్పులను వృద్ధాప్యానికి సంకేతాలుగా మాత్రమే చూడకుండా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన దశగా గుర్తించాలి. పోషకాహారం, శారీరక చురుకుదనం, తగిన నిద్ర, వైద్యుల సలహా మహిళ ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి.
ఈ మాసం కోసం .. ఒక సంకల్పం
రాష్ట్రీయ పోషణ్ మాసం–2026 సందర్భంగా ప్రతి మహిళ తన ఆరోగ్యానికి తానే ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రతి కుటుంబం మహిళ ఆరోగ్యానికి అండగా నిలవాలి. ప్రతి ఇంట్లో పోషకాహారానికి గౌరవం పెరగాలి.
‘నా ఆరోగ్యం నా ప్రాధాన్యత.. నా కుటుంబ ఆరోగ్యం నా బాధ్యత..
పోషకాహారం నా హక్కు.. ఆరోగ్యకరమైన జీవనశైలి నా సంకల్పం..
ఆరోగ్యవంతమైన మహిళే.. ఆరోగ్యకరమైన కుటుంబానికి పునాది.’
కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం బలపడుతుంది.
సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి దిశగా మరింత బలంగా అడుగులు వేస్తుంది.
అందుకే ఈ రాష్ట్రీయ పోషణ్ మాసం సందేశం ప్రతి ఇంటికీ చేరాలి.

వసుధ జి.
క్లినికల్ పోషకాహార నిపుణులు
98865 93215







కామెంట్‌లు (0)