mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాన్నే మన హీరో ..

3 గంటల క్రితం

naanne mana hero
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 03:07 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే... ఇంట్లో నాన్న అడుగు పెట్టగానే అప్పటి వరకూ అల్లరి చేసిన పిల్లలు సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోయేవారు. జనరేషన్ మారింది. నాన్న అంటే అమ్మలాగా, స్నేహితుడిలా మారుతున్నారు. నాన్న అంటే ఒక కనిపించని భయం, క్రమశిక్షణకు మారుపేరు. ఇంట్లో క్రమశిక్షణను, నైతిక విలువలను నేర్పే గురువు తండ్రి. ఇప్పుడు కుటుంబంలో కేవలం ఆర్థిక అవసరాలు తీర్చడమే తండ్రి బాధ్యత అనుకునే రోజులు తగ్గుతున్నాయి. వేగవంతమైన నేటి ప్రపంచంలో పిల్లల మానసిక ఎదుగుదలలో, వారి నమ్మకానికి వెన్నుదన్నుగా నిలవడంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం. ఒక తండ్రి వేసే అడుగులే, రేపటి సమాజంలో పిల్లలు నడిచే దారిని నిర్ణయిస్తాయి. అందుకే 'ఇష్టమైన హీరోఎవరు?` అని అడిగితే 'మా నాన్నే నా హీరో` అని చాలా మంది పిల్లలు గర్వంగా చెప్పుకుంటారు. బాధ్యతను భుజాన మోస్తూ, సమాజానికి ఆదర్శవంతమైన తరం కోసం తపించే నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.


పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని గుండెలకు హత్తుకునే నాన్న, వారు పెరుగుతున్న కొద్దీ తన వయస్సుతో పాటు ఒక రకమైన మానసిక ఘర్షణకు లోనవుతూ ఉంటాడు. ఆ ఘర్షణ చాలా నిశ్శబ్దమైనది. బిడ్డ చిన్నప్పుడు చేయి పట్టి, నడిపించిన నాన్నకు ఆ బిడ్డ పెద్దయ్యాక తన చేయి వదిలేసి సొంతంగా అడుగులు వేస్తుంటే ఒక పక్క గర్వంగా ఉంటుంది. మరోపక్క భయంగా ఉంటుంది. ఈ సమాజంలో 'నా పిల్లలు ఎలా ఎదుగుతారో?` అనే ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది. నాన్న వయస్సు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి తగ్గుతూ ఉంటుంది. అయినా పిల్లల భవిష్యత్తును ఇంకాస్త మెరుగ్గా తీర్చిదిద్దాలనే తపన మాత్రం తగ్గదు. అంత త్వరగా భావప్రకటన చేయలేని తత్వం తండ్రిలో ఎక్కువగా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లల్ని చూసి గర్వంగా అనిపిస్తుంది. కొడుకునో, కూతురినో గట్టిగా కౌగిలించుకుని "నాకు మీరంటే ప్రాణం" అని చెప్పాలని నాన్న మనసుకు ఉంటుంది. కానీ గంభీరత్వం దాటి ఆయన తన ప్రేమను అంత సులభంగా వ్యక్తపరచలేరు. ఆ వయసులో వచ్చే ఘర్షణ అంతా లోలోపల దాచుకుని, పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారు. అదే నాన్న గొప్పతనం.


పెంపకంలోనూ..

ఒకప్పుడు అమ్మ ఇంట్లో ఉండి, పిల్లల పెంపకం బాధ్యత చూసుకుంటే, కుటుంబ పోషణ నాన్నబాధ్యత తీసుకునేవారు. కానీ నేటి ఆధునిక జనరేషన్‌లో మహిళలు కెరీర్ పరంగా ముందుకెళుతున్నారు. దాంతో పురుషుల ఆలోచనా విధానంలోనూ మార్పు వస్తోంది. చాలా ఇళ్లల్లో తండ్రులు అమ్మలుగా బాధ్యత వహిస్తున్నారు. చంటి పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఐటీ, ఇతర రంగాలలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైంది. షిఫ్టుల వారీగా ఉద్యోగాలు చేయడం, 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యాలు పెరగడంతో పిల్లల పెంపకంలో నాన్నల పాత్రా పెరిగింది. ఇతర దేశాల్లోనే కాకుండా, మన దేశంలోనూ 'స్టే-ఎట్-హోమ్ డాడ్స్' (ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునే తండ్రులు) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భార్య ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడు.. వంటింట్లోకి వెళ్లి పిల్లలు తినే వంటలు చేయడం, పాలు పట్టించడం, వారికి స్నానాలు చేయించి రెడీ చేయడం, హోంవర్క్ చేయించడం వంటి పనులను నేటి నాన్నలు ఎంతో నైపుణ్యంతో చేస్తున్నారు. దీన్ని అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి.


స్నేహితుడులా..

'పిల్లల మనసు ఒక తల్లికి మాత్రమే త్వరగా అర్థమవుతుంది` అని చాలామంది అనుకుంటారు. కానీ తండ్రికీ అర్థమవుతుంది. కానీ పిల్లలను ఎక్కువ గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతారో అన్న భయం తండ్రిని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. అందుకే లోపల ప్రేమ ఉన్నా.. బయటికి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తారు. ఒకప్పుడు తండ్రికి, పిల్లలు తమ మనసులో మాట ఏదైనా చెప్పాలనుకుంటే అమ్మను రాయబారిగా పంపించేవారు. కానీ నేటి తరం తండ్రులు పిల్లల పట్ల మంచి స్నేహితుడిలా మారారు. పిల్లల పట్ల చొరవ చూపిస్తూ, పరీక్షల్లో మార్కులు తగ్గినా, క్లాస్‌లో ఎవరితోనైనా గొడవపడినా... మొదట కోప్పడకుండా "ఏమైందిరా? నాతో చెప్పు" అంటూ వారిని దగ్గరకు తీసుకొని అడుగుతున్నారు. ఈ చొరవ వల్ల పిల్లలు తమ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా తండ్రితో పంచుకోవడానికి వెనుకాడటం లేదు. నాన్నలు, పిల్లల్ని కేవలం సండే ట్రిప్పులకో, హోటళ్లకు తీసుకెళ్లడానికో పరిమితం కావడం లేదు. వారితో కలిసి వీడియో గేమ్స్ ఆడటం, క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం, పిల్లలతో కలిసి సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి హాబీలను పంచుకుంటున్నారు. పిల్లల ప్రపంచంలోకి తనే ఒక చిన్నపిల్లవాడిలా మారిపోతున్నారు. ఈ రకమైన చొరవ వల్ల నాన్నకూ, పిల్లలకూ మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ తగ్గింది.


naanne mana hero 033


భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ

ఒకప్పుడు నాన్నలతో తమ బాధను బయటపెట్టాలన్నా భయపడేవారు. కానీ నేటి తండ్రి పిల్లల ముందు తన బలహీనతలను, తన జీవితంలో తను చేసిన తప్పులను, పొరపాట్లను దాచడం లేదు. "నేనూ మీ వయసులో ఇలాంటి తప్పులే చేశాను, కానీ ఇలా సరిదిద్దుకున్నాను" అని ఫ్రెండ్‌లా షేర్ చేసుకుంటున్నారు. ఈ చొరవ వల్ల పిల్లలకు నాన్నలపై గౌరవంతో ఆయనను ఒక రియల్ హీరోలాగా అనిపిస్తున్నారు.

‘నాన్నే అంత కష్టాన్ని ఎదుర్కొన్నారు అంటే నేనూ ఏ కష్టం, సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొవాలి` అని పిల్లలు నిర్ణయిటున్నా టున్నారు. ‘నాన్నే నా హీరో` అని అభిప్రాయపడతారు. అంతే కాదు.. చదువులోనూ"నేను చెప్పిందే నువ్వు చదవాలి" అనే పాత పద్ధతికి స్వస్తి పలికారు నేటితరం తండ్రులు. పిల్లల ఆసక్తులు ఏమిటి?, వారికి దేనిపై పట్టు ఉంది? అనేది గమనించి, ఒక కెరీర్ కౌన్సిలర్ లాగా ఆప్షన్స్ చూపిస్తున్నారు. వారు చెప్పిన చదువులు కాకుండా ఆర్ట్స్, స్పోర్ట్స్, లేదా వైవిధ్యమైన రంగాలను ఎంచుకుంటామన్నా... "నువ్వు వెళ్ళు, నీ వెనుక నేనున్నాను" అని భరోసా ఇచ్చే స్నేహితుడిలా నిలబడుతున్నారు.


naanne mana hero 0444


కూతురుపై ప్రత్యేకమైన ప్రేమ

ఒక ఆడపిల్లకు తన జీవితంలో నాన్నే ప్రత్యేకం. ఎందుకంటే.. చిన్నతనం నుండి ఆమెను ఒక యువరాణిలా చూసుకోవడం, ఆమె ఏది అడిగినా తెచ్చివ్వడం వల్ల 'నాన్నను అడిగితే ఏదైనా తెచ్చి ఇస్తారు. ఏదైనా చేస్తారు` అనే గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ఆమె దృష్టిలో నాన్న ఒక రక్షకుడు, సూపర్ హీరో. ఈ నమ్మకమే కాలక్రమేణా బలమైన మానసిక బంధంగా మారుతుంది. కూతురు ఎంత ఎదిగినా నాన్న దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లే. స్వచ్ఛమైన ఆ ప్రేమే చివరి వరకూ ఉంటుంది. నాన్న ఇచ్చే సపోర్ట్ కూతురిలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. "నా వెనుక నాన్న ఉన్నాడు` అనే నమ్మకం పిల్లల్ని విజయానికి దగ్గర చేస్తుంది. అదే ఆమె సమాజంలో ధైర్యంగా అడుగులు వేయడానికి సహాయపడుతుంది.


ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు తెచ్చిన బ్యాడ్మింటన్ పి.వి. సింధు తండ్రి పి.వి. రమణ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు.అర్జున అవార్డు గ్రహీత. తండ్రి క్రీడా నేపథ్యం, ఆయన ఇచ్చిన క్రమశిక్షణ, ప్రోత్సాహంతోనే సింధు బ్యాడ్మింటన్ వైపు అడుగులు వేసి, ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగారు. మహిళా రెజ్లింగ్ (కుస్తీ) అనగానే గీతా ఫోగట్, బబితా ఫోగట్ - మహావీర్ సింగ్ ఫోగట్ గుర్తొస్తారు. తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్ సమాజంలోని మూస పద్ధతులను ఎదిరించి, తన కూతుళ్లకు స్వయంగా కోచ్‌గా మారి శిక్షణ ఇచ్చారు. తండ్రి కష్టాన్ని సార్థకం చేస్తూ గీత, బబితా ఇద్దరూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించి, దేశ కీర్తిని పెంచారు.

కొందరు తండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇస్తారు. కానీ గొప్ప తండ్రులు తమ పిల్లలకు ఆదర్శాలను, ఆశయాలను కూడా ఇస్తారు. ఆ ఆశయాలే ఆ పిల్లలను రేపటి ప్రపంచాన్ని నడిపించే నాయకులుగా మారుస్తాయి. పిల్లల సంతోషం కోసం తమ కోరికలనూ పక్కన పెట్టే గొప్ప మనసు నాన్నది. నాన్నల దినోత్సవం రోజున మనం వారికి శుభాకాంక్షలు చెప్పడం గొప్పకాదు. వారి సేవలను గుర్తించి, గౌరవించాలి. వారితో సమయం గడపడం, వారి మనసు తెలుసుకొని ప్రేమగా మాట్లాడడం, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ద్వారానే నిజమైన కృతజ్ఞతలు తెలిపినట్లు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమను పంచే ప్రతి నాన్నకూ కృతజ్ఞతలు తెలుపుకుందాం.

naanna mana hero


ఈ రోజు ఇలా...

అమెరికాకు చెందిన సొనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ-తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్, ఒక సైనిక విలేకరి. సొనోరా చిన్న వయసులోనే ఆమె తల్లి ప్రసవ సమయంలో మరణించింది. దాంతో ఆమెను తండ్రి విలియం పెంచారు. సొనోరాతో పాటు ఆమె ఐదుగురు తమ్ముళ్లను (మొత్తం ఆరుగురు పిల్లలను) ఒంటరిగానే ఎంతో క్రమశిక్షణతో, ప్రేమగా పెంచి పెద్దచేశారు. 1909లో ఒక చర్చిలో మదర్స్ డే గురించిన ప్రసంగం వింటున్నప్పుడు సొనోరాకు తన తండ్రి గుర్తొచ్చారు. "నలుగురు పిల్లల్ని పెంచడానికే తల్లులు అంత కష్టపడితే, ఆరుగురు పిల్లలకు అమ్మగా, నాన్నగా మారి పెంచిన నా తండ్రి లాంటి వారికోకోసమూ ఒక రోజు ఉండాలి కదా!" అని ఆమె ఆలోచించారు. తన తండ్రి పుట్టినరోజైన జూన్ 5నే 'ఫాదర్స్ డే'గా ప్రకటించాలని ఆమె స్థానిక చర్చిల అసోసియేషన్‌ను కోరారు. కానీ, ఏర్పాట్లకు సమయం సరిపోకపోవడంతో ఆ రోజును జూన్ మూడవ ఆదివారానికి మార్చారు. అలా ప్రపంచంలోనే మొదటి ఫాదర్స్ డే వేడుక 1910, జూన్ 19న వాషింగ్టన్‌లోని స్పోకేన్ నగరంలో జరిగింది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ప్రపంచమంతా దీనిని అంగీకరించలేదు. దీనికి అధికారిక గుర్తింపు రావడానికి దశాబ్దాల సమయం పట్టింది. ఆ తర్వాత 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ వేడుకల ప్రాధాన్యతను గుర్తించి, స్పోకేన్ నగరంలో జరిగిన ఉత్సవాలకు టెలిగ్రామ్ ద్వారా తన మద్దతును ప్రకటించారు. 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ దీనిపై పూర్తిస్థాయి చట్టంపై సంతకం చేసి, ప్రతి ఏటా జూన్ మూడవ ఆదివారాన్ని నాన్నల కోసం అమెరికాలో అధికారిక జాతీయ పండుగగా మార్చారు.

వీర

94905 59477

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్